పఠనీయం

తాత్విక కవితా సంపుటి.. చందనశాఖి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చందనశాఖి తృతీయభాగం
రచన: ఆచార్య ముదిగొండ శివప్రసాద్
వెల:150/- ప్రతులకు:2-2-647-132బి, సెంట్రల్ ఎక్సైజ్‌కాలనీ, హైదరాబాద్ - 500013

=============================================================
చారిత్రక నవలా చక్రవర్తి బిరుదాంకితుడైన ప్రొఫెసర్ ముదిగొండ శివప్రసాద్ రచించిన చందనశాఖి తృతీయ భాగం ఇపుడు ఆవిష్కరింపబడింది. లోగడ ప్రథమ, ద్వితీయ భాగాలు వచ్చాయి.
అందులో విషాద, మార్మిక తాత్విక కవితలున్నాయి. శివప్రసాద్‌గారి ధర్మపత్ని శ్రీమతి ఉమాదేవి అస్తమయంతో ఎలిజీ సంప్రదాయంలో వీరు ఎన్నో వందల కవితలు వెలువరించారు. అవి బాధోపశమనానికి తోడ్పడుతాయని భావించినా ఆ ప్రయోజనం నెరవేరలేదు. ఆ పరంపరలోనే ఈ తృతీయ భాగం వెలువడింది. రఘువంశంలోని అజవిలాపంతో, రతీ విలాపంతో ఈ ఎలిజీ సంప్రదాయ సంస్కృత సాహిత్యంలో దర్శనమిస్తున్నది. మానిషాద శ్లోకం వాల్మీకి శోకమే కదా! సతీ స్మృతి పతీ స్మృతి పుత్ర మిత్ర వియోగాలు ఏవైనా కవితలుగా ఆవిష్కరింపవచ్చు.
ఓసి మనోజ్ఞ మోహన మహోజ్వల కోమల రత్న దీపమా! వంటి సంప్రదాయ ఛందోబంధంతో కూడిన పద్యాలతోబాటు గేయాలు, వచన గేయాలు తాత్విక రచనలు ఇందులో దర్శనమిస్తున్నాయి.
ఈ సృష్టికిమూలం ఏమిటి? జీవునికి ప్రకృతికి ఈశ్వరునికి గల సంబంధం ఏమిటి? ఈ మానవులంతా ఎక్కడినుండి వస్తున్నారు? ఎక్కడికి పోతున్నారు? ఇలా అంతుచిక్కని ఎన్నో విశ్వ రహస్యాల గురించి లోతైన ఆలోచనలు ఈ సంకలనంలో ఉన్నాయి. సమకాలీన సమస్యలు ఉగ్రవాదం, పేదరికం, అజ్ఞానం, అవైదిక జీవనం వంటి ఎనె్నన్నో సమస్యలను రచయిత స్పృశించారు.
తనువుచందనశాఖి / మనసు నందనవాటి
కలము పనిషద్గంగ /గళము హిమనగశృంగ- అని కవి, శ్రీమతి ఉమాదేవి వ్యక్తిత్వాన్ని ఇందులో వర్ణించారు.
రూట్స్ అనే ఒక కవితలో (పుట 39) ప్రపంచ మతాల ఆవిర్భాల వికాసాలను చర్చించారు. కల్పవృక్షమే క్రిస్ట్‌మస్ ట్రీగా మారింది. కృష్ణ శబ్దం కైస్ట్‌గా మహేశ శబ్దం మోసెస్‌గా మారిందని ప్రొఫెసర్ శివప్రసాద్ భాషాశాస్తప్రరంగా ఇందులో అభిప్రాయపడ్డారు.
ఆలస్యం అమృతం విషం (పుట 71) అనే కవితలో జ్ఞానోదయం ఇపుడు కలిగి ఏం ప్రయోజనం? గరికపాటి నరసింహారావు తాను ఉపన్యాస సన్యాసం తీసుకుంటున్నానని ప్రకటించాడు. ఇప్పటికే చాలా శబ్ద కాలుష్యం నీవూ నేనూ సృష్టించాము. ఇపుడు చింతించి వగచిన నేమి ఫలము? అని చమత్కరించారు. మూలస్తంభం మూలపడితే భవనమెక్కడ? భువనమెక్కడ? (పుట 45) అంటూ ఇంటికి దీపం ఇల్లాలే అని గుర్తుచేశారు.
విశ్వామిత్రుడు సత్వం, శ్రీరాముడు రజోగుణం, పౌలస్త్యుడు తమోగుణం అని త్రిగుణాత్మక సృష్టిని నిరూపించారు (పుట 25)
ఏవడీ వ్యాసుడు? ఎక్కడ కాళిదాసు? ఎక్కడికేగెను హోమరు? వర్జిల్ అని గత వైభవ స్మరణం చేశారు (పుట 17)
7వపుటలో ఓ సైనికుడికి ఉత్తరం అనే కవిత ఉంది. కాంకేర్ అడవులల్లో పశువులమధ్య పాముల మధ్య జీవిస్తూ దేశ రక్షణ కోసం నిఘా పెట్టిన సైనికుణ్ణి ఉగ్రవాదులు చంపినందుకు విచారంతో రచించిన ఎలిజీ ఇది. కంట తడి పెట్టించే ఇలాంటి కవితలు ఈ సంకలనంలో చాలా ఉన్నాయి. ప్రొఫెసర్ శివప్రసాద్ పేరు చెప్పగానే మంచి చారిత్రీక నవలలు గుర్తుకువస్తాయి. ఐతే ఇందులో కరుణరస ప్రధానమైన కవితలు పుంఖాను పుంఖంగా వెలువడ్డాయి. ‘‘చిన్నప్పుడు నాకంతా తెలుసుననుకున్నాను. తర్వాత నాకేమీ తెలియదని తెలుసుకున్నాను. ఇపుడు సృష్టి రహస్యం ఎవ్వరికీ తెలియదని తెలుసుకున్నాను’’ అంటారొక కవితలో.
ఆచార్య ముదిగొండ శివప్రసాద్ రచించిన చందనశాఖి మూడు భాగాలు తెలుగు సాహిత్యంలోని స్మృతి కావ్య పరంపరలో శాశ్వతంగా మిగిలిపోతాయి.

-జొన్నాభట్ల నరసింహ ప్రసాద్