పఠనీయం

అమ్మ ప్రేమను అందంగా చిత్రించిన ‘కుంచె’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమ్మపేరే... నా కవిత్వం!
కవితా సంపుటి పేజీలు: 73 వెల: రూ.150
ప్రతులకు: కుంచె చింతా లక్ష్మీనారాయణ 2-594 సిండికేట్ నగర్ అనంతపురం 9908630447
===========================================================
అమ్మే సర్వస్వం అని తేల్చిచెబుతూ.. ‘అమ్మపేరే... నా కవిత్వం!’ కవితా సంపుటిని వెలువరించిన కుంచె చింతాలక్ష్మీనారాయణ తన కవిత్వంలో.. అమ్మకు అక్షరాభిషేకం చేశారు. అమ్మ ప్రేమను అందంగా చిత్రించిన కవి కుంచె తన ప్రతి కవితలో మానవీయతకు పెద్దపీట వేశారు. అమ్మే విశ్వజీవన సౌందర్యమూర్తిగా భావించే కవి కుంచె... నా లోకం అమ్మ... నా నేస్తం అమ్మ..అంటూ అమ్మను ఉన్నతంగా ఆవిష్కరించారు.. ఈ గ్రంథంలోని కవితలన్నీ కవికుంచెగారికి తమ అమ్మతో ఉన్న అనుబంధాన్ని ఆవిష్కరించినప్పటికీ.. ప్రతి ఒక్కరు తమ అమ్మతో ఉన్న బంధాన్నీ గుర్తుచేసుకునే విధంగా రచనను కొనసాగించడం విశేషం!
అమ్మతో.. నేను ఈ.. లోకంలో కనులు తెరిచానంటూ... ప్రారంభించిన కవి కుంచె ఆకాశ అంతరంగిణి స్వచ్ఛ మనస్వినిగా ఆవిష్కరిస్తూ పాదాభివందనంతో ముగించారు..
కవి కుంచె లక్ష్మీనారాయణ కలంనుండి జాలువారిన కవితాపంక్తులు అడుగడుగునా అమ్మయొక్క గొప్ప మనసును తెలుపుతాయి! ‘అమ్మప్రేమ’ కవితలో.. కవి చిన్నప్పుడు అమ్మ చుంబనాలతో పాలబుగ్గలు తడిసేవని గుర్తుచేసుకున్న తీరు బాగుంది. జ్ఞానిగా అత్యంత ప్రతిభాశాలిగా ఎదగాలన్న ఆకాంక్షతో బడివైపు అడుగులు వేయించిన తీరుతెన్నులను ‘అమ్మమనసు’ కవితలో ఆత్మీయంగా అక్షరీకరించారు. ‘‘కన్నపేగు’’ కవితలో నిశిలో నక్షత్రాలను అమ్మ తన కళ్లుచేసుకుని... ఎదురుచూసిన కన్న పేగుబంధాన్ని అక్షరాల్లో బంధించారు.
మరో కవితలో బాల్యం స్మృతులను నెమరువేసుకున్నారు..
‘చిరిగిన చొక్కా’ కవితలో పసితనంలో కొండలు గుట్టలు తిరుగుతూ రేగిచెట్ల జ్ఞాపకాలను గుర్తుకుతెచ్చుకున్నారు..
చిన్నప్పుడు చినుకులు పడుతుంటే కాగితపు పడవలు చేసి.. ఆనందించిన మధురానుభూతులను ఇంకో కవితలో చక్కగా ఆవిష్కరించారు.
బాల్య స్మృతులను ఏకరువు పెడుతూ.. ‘గోనుపట్ట కొప్పిరి’’ కవితకు తమ అక్షరాలతో ఊపిరిపోశారు. అంతేగాక ‘‘నా...యవ్వనం’’అంటూ మరో కవిత రాసి... మెప్పించారు. పండగొస్తే.. అమ్మతో కలిసి వంట గదిలో దూరిన వైనాన్ని.. మరో కవిత ద్వారా తెలియజెప్పారు.
నా.. తొలి విజయానికి అమ్మేపునాది అంటూ రాసిన కవితలో అమ్మే తన సర్వస్వమని తేల్చిచెప్పారు. చిన్నప్పుడు తాను వీక్షించిన మాగాణి కయ్యాలను ఆకుపచ్చని చీర చుట్టినట్లున్నదని చెప్పడం బాగుంది. అమ్మ ఒడే ఓ ప్రశాంత మందిరం.. అమ్మ జోలపాటే కమ్మని ఓంకార భావమని, సృష్టిలో ఆది స్థానం అమ్మదేనని, ఒక్కమాటలో అమ్మ పేరే... తన కవిత్వమని కవి కుంచె చింతాలక్ష్మీనారాయణ భావించడం విశేషం! నిజమైన నేస్తం అమ్మ అని, తన జోలపాటతో అమ్మ తనను చంద్రమండలానికే రాజును చేసిందనీ, అమ్మ మమతల కోవలె అనీ, విభిన్న కోణాల్లో అమ్మను ఆవిష్కరించిన తీరు అభినందనీయం..
‘‘అమ్మ చేయి అలిగింది’’ కవితలో ముగింపు ఆర్ద్రంగా ఉంది.. అమ్మ నాపై కోపంతోనో నామీద ప్రేమలేకనో... కాదు.. పక్షవాతంతో అమ్మ చేయి అలిగిందని చెప్పిన తీరు బాగుంది.
ఇలా కవి కుంచె చింతా లక్ష్మీనారాయణ అమ్మను నిశ్చలమైన నీటిపైన తేలాడిన పొరవు పువ్వుగా, ఆకాశమంత సహనానికి ప్రతి రూపంగా, భూమంత బాధ్యతకు ప్రతిబింబంగా ఆవిష్కరిస్తూ అమ్మయొక్క ఔన్నత్యాన్ని చాటారు.
అమ్మంటే అలారం కాదనీ, నిరంతరం అలుపెరుగని గడియారమనీ, ఎవ్వరి అంచనాలకు చిక్కని పాదరసం అమ్మ ప్రేమంటేనని తేల్చిచెప్పారు. ఈ గ్రంథంలో అమ్మతోపాటు చివరలో అమ్మానాన్నల ప్రేమ గురించి కూడా రాశారు.
నాన్న చలవతోనే... నేను ఎదిగానని సవినయంగా ప్రకటించుకున్నారు. నాన్నతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ కొన్ని కవితల్ని ఇందులో పొందుపరిచారు.
కవి ఇలా సీదాసాదా పదబంధాలతో అమ్మయొక్క ఔన్నత్యాన్ని చాటి చెప్పారు. ఆలోచనాత్మక ముఖచిత్రం గ్రంథానికి నిండు శోభను కూర్చింది.. అయితే ఈ పుస్తకానికి నిర్ణయించిన వెల కొంచెం ఎక్కువేనని పాఠకులు ముక్కున వేలేసుకునే అవకాశం ఉంది.

- దాస్యం సేనాధిపతి 94405 25544