పఠనీయం

జిజ్ఞాసులకు కరకమలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆత్మవిద్యాప్రకాశము
గ్రంథకర్త: ఆచార్య శ్యామశాస్ర్తీ,
పేజీలు:432, వెల:రూ.300/-,
ప్రచురణ: యుగాది పబ్లిషర్స్, తార్నాక, ప్రతులకు: నవోదయ, కాచిగూడ, హైదరాబాద్-500027. ఫోన్: 24652387.
====================================================================
గత దశాబ్దం నుండి ఆస్తికులకు మంచి ఆధ్యాత్మిక పుస్తకాలను అందజేస్తున్న శ్రీ శ్యామ శాస్ర్తీగారి రచనలను అన్నింటినీ చదివిన పాఠకులలో నేనొకణ్ణి. ఉగాదినాడు వారి ‘ఆత్మవిద్యాప్రకాశము’ యుగాది పబ్లిషర్సు తరఫున ప్రచురితమైంది.
శ్రీ శాస్ర్తీగారు ఉత్తరాంధ్రకు చెందిన పండిత కుటుంబంలో జన్మించి ఇంగ్లీషు చదువునే చదివి మొదట్లో ప్రణాళికా సంఘంలో చేరి, తదనంతరం ఆకాశవాణికి మారి వివిధ సమాచార ప్రసార విభాగాల్లో రెండు దశాబ్దాలకాలం పనిచేసి, ఫేకల్టీ మెంబరుగా ఎన్‌ఐఎస్‌ఐఇటిలో మొదట చేరి, తరువాత జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ(ఎన్‌ఐఆర్‌డి) కమ్యూనికేషన్ విభాగం సంచాలకులుగా పనిచేసి, అటుపైన ఎడ్యుకేషనల్ మల్టీ మీడియా సెంటర్ డైరెక్టరుగా బాధ్యతలు స్వీకరించి 2002లో పదవీ విరమణ చేశారు. నాలుగు దశాబ్దాలకాలం, పలు ఆర్థిక సామాజికాభివృద్ధి కార్యక్రమాలపై ఎన్నో విమర్శనాత్మక వ్యాసాలు, ఇంగ్లీషు డైలీలలోను, దేశ విదేశీయ కమ్యూనికేషన్స్ జర్నల్సులో ప్రచురించి నాలాంటి సామాన్యులను వారి రచనలతో ఉత్తేజపరిచారు. ఆయన ఆచార్య శ్యామశాస్ర్తీ అనే కలం పేరుతో నేడు పలు ఆధ్యాత్మిక గ్రంథాలు రాస్తున్నా, వారిని డా. బి.ఎస్.ఎన్.రావుగానే పాతకాలం పాత్రికేయులు, యూనివర్సిటీ టీచర్సు గుర్తిస్తారు.
శ్యామశాస్ర్తీ తండ్రిగారు సంస్కృతం, తెలుగు, హిందీ భాషల్లో మంచి పండితులు. .
తండ్రిగారి ప్రోత్సాహంతో రిటైరైన తరువాత సంస్కృత భాషను పట్టుదలతో అభ్యసించి, ప్రస్థానత్రయాన్ని రమారమి పది సంవత్సరాలు నిర్విరామకృషి చేసి గోకర్ణములోను, కాశీలోను గురుముఖంగా అధ్యయనం చేసి కృతకృత్యులయ్యారు. శ్యామశాస్ర్తీగారు సరళమైన తెలుగు భాషలో శంకరాచార్యులవారి సూత్రభాష్యాన్ని అనుసృజన చేసి హైదరాబాద్‌లోనున్న శ్రీరామకృష్ణ మఠంవారికి సమర్పించగా, వారు బ్రహ్మసూత్రములు అనే పేరుతో ఈ విస్తృత గ్రంథాన్ని 2011లో ప్రచురించారు. తరువాత రామకృష్ణ మఠంవారి సలహామేరకు మహానారాయణోపనిషత్తు గ్రంథాన్ని, శంకరాచార్యులవారి అపరోక్షానుభూతి కావ్యాన్ని ప్రతిపదార్థ తాత్పర్య వ్యాఖ్యానాలతోను మరియు దక్షిణామూర్తి స్తోత్రమును చక్కటి పారాయణ గ్రంథంగా రూపొందించి, సంక్షిప్త తాత్పర్యంతోసహా ముముక్షువులకు అందజేశారు.
అద్వైత వేదాంత ప్రాచుర్యమే లక్ష్యంగా, జగద్గురు ఆదిశంకరాచార్య విరచిత ‘తత్త్వబోధ’, ‘ఆత్మబోధ’ గ్రంథాలను శ్యామశాస్ర్తీగారు అర్థతాత్పర్యాలతోపాటు రచించగా, వాటిని యుగాది పబ్లిషర్సువారు ‘జ్ఞానభారతి’క్రమంలో (సిరీస్)లోమూడు సంవత్సరాల క్రిందట ప్రచురించి శాంకరీయులకు చిరపరిచితులయ్యారు.
అద్వైతమత సిద్ధాంతాలను విశదీకరిస్తూ పలు ఉదాహరణలతో ధర్మరాజాథ్వరి అనే మహాపండితుడు, క్లిష్టమైన సంస్కృతభాషలో వేదాంత పరిభాష అనే ప్రమాణ గ్రంథాన్ని రమారమి 600 సంవత్సరాల క్రిందట రచించాడు. దీనిని తర్కశాస్త్ర (్ఫలాసఫీ) విద్యార్థులకు ఉపయుక్తమని ఎస్.ఎన్.శాస్ర్తీ అనే విద్యావేత్త ఆంగ్లానువాదం చేయగా, డా.సర్వేపల్లి రాధాకృష్ణన్‌గారు వివరంగా ఉపోద్ఘాతం వ్రాశారు.
ఈ గ్రంథాన్ని ఆనాటి మద్రాసులో కనె్నమేరా లైబ్రరీవారు 1942లో ప్రచురించారు. దానిని శ్రీ శ్యామశాస్ర్తీగారు సరళమైన భావానువాదం చేసి ‘అద్వైత వేదాంత పరిభాష’ అనే పేరుతో, విద్వాంసులు డా.వేదాంతం ఆంజనేయ కుమారస్వామిగారు పీఠిక వ్రాయగా, యుగాది పబ్లిషర్సు సహకారంతో 2017లో అందజేశారు.
సురభారతి సమితి అధ్యక్షులు, పాట్నా హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా ఇటీవలే పదవీ విరమణ చేసిన జస్టిస్ ఎల్.నరసింహారెడ్డిగారిచే 2019 శ్రీరామనవమి నాడు ఆవిష్కరింపబడిన ‘ఆత్మవిద్యా ప్రకాశము’ అనే వేదాంత గ్రంథంలో ఆచార్య శ్యామశాస్ర్తీ తైత్తిరి, కఠ, శే్వతాశ్వతర, నారాయణ, ఈశ, గణపతి, మాండూక్య, ముండక, ప్రశ్న, కేన, ఐతరేయ, కైవల్యోపనిషత్తులు పనె్నండింటికీ మూలమంత్రములను పూర్తిగాను, విస్తృతమైన ఛాందోగ్య బృహదారణ్యకములు రెండింటిలో కొన్ని ముఖ్య భాగముల మంత్రములను చేర్చి సంగ్రహంగా చేర్చి, అన్ని మంత్రములకు వాటి ఎదురుగనే అందరికీ అర్థమైన తెలుగు భాషలో తాత్పర్యమును వెలయించారు. ఈ గ్రంథంలో శ్యామశాస్ర్తీగారు సామాన్యుల ఆధ్యాత్మిక దాహాన్ని తృప్తితీర తీర్చి ధన్యులయ్యేరని వ్యక్తం చేయటం అతిశయోక్తి కాదు.
ఉస్మానియా యూనివర్సిటీ విశ్రాంత సంస్కృత శాఖాధ్యక్షులు, రాష్టప్రతి పురస్కార గ్రహీత, ఆచార్య బి.నరసింహాచార్యులవారు తమ ఆముఖంలో ప్రస్తావించినట్లు, స్వయం ఈ అగాధ సంసార సాగరాన్ని దాటివేసి తోటివారికి సైతం మంచి నావను అందజేసి ఆవలిగట్టుకు చేర్పించాలనే శ్యామశాస్ర్తీగారు చేసిన ఈ సత్ప్రయత్నం అత్యంత శ్లాఘనీయం.
ముఖ్య ఉపనిషత్తులు అన్నింటినీ సమకూర్చిన ఇటువంటి గ్రంథం ఇంతవరకు తెలుగులో తనకంటబడలేదని ప్రచురణకర్తలైన డా.శ్రీనివాస శాస్ర్తీగారి అభిప్రాయంతో నేను ఏకీభవిస్తున్నాను. అంతేకాదు, ప్రతి గ్రంథాలయంలో ఇది తప్పక లభ్యమయ్యే చర్య తీసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. తెలుగు లిపిలో పుటకు ఒకవైపు మూలము రెండవ వైపు తెలుగులోనే తాత్పర్యం ఇవ్వటంవలన విద్యార్థులకు అత్యంత సౌకర్యంగా ఉంది.

- ప్రొఫెసర్. ముదిగొండ శివప్రసాద్