పఠనీయం

‘అక్కిరాజు’ భిన్న రచనా వైవిధ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీశ్రీశ్రీ త్రికూటేశ్వర శతకము
-డా.అక్కిరాజు సుందర రామకృష్ణ
ప్రతులకు: రచయిత
1-8-702/1/1, నల్లకుంట
శ్రీచరణ్ పక్కసందు
హైదరాబాద్-500 044

ఇదొక సంప్రదాయ భక్తి శతకము. కవి ఆధునికుడు. ‘శ్రీశ్రీశ్రీ త్రికూటేశ్వరా’ అనే మకుటంగల ఈ శివస్తుతి అధిక్షేపాత్మకమైన రచన. 229 పద్యాల కృతి. అన్నీ శార్దూల మత్త్భాలే! డా.అక్కిరాజు సుందర రామకృష్ణ బహుముఖీన ప్రతిభా సంపన్నుడు. అభినవ ఘంటసాల బిరుదాంకితుడు. పద్య విద్యామణి, పౌరాణిక నాటకరత్న, నాట్య శ్రీనాథ బిరుదాలను సంపాదించుకున్న ఈ కవి అటు ఆంధ్ర నాటక రంగానికీ, తెలుగు సాహిత్య రంగానికీ చిరపరిచితుడు. ‘అధిక్షేప కవితానిధి’ ‘కవితా గాండీవి’ బిరుదాలు ఈ రచన చదివిన వారికి ఈతనికి ఈ రెండు బిరుదాలూ సార్థకములేమోనని అనిపించకమానదు. అలనాడు ‘నేటి కాలపు కవిత్వము’ రచనతో సమకాలీన కవిలోకాన్ని వణికించిన అక్కిరాజు ఉమాకాంత విద్యాశేఖరుల వంశీయుడే ఈ సుందరుడు. ‘సుందర’ శబ్దానికి వేరే అర్థం కూడా ఉంది. ఆ అర్థం ఏమిటో ఈ రచన చదివిన వాళ్లకు బాగా తెలుస్తుంది. వాల్మీకి తన రామాయణంలో చాలా అందంగా చెప్పాడు. ఈ కవికి ఆ ‘సుందర’ లక్షణాలు చాలా ఉన్నాయని ఈ ద్విశతి నిరూపిస్తున్నది. అసలు ‘డార్విన్’ మహాశయుడు కూడా ఆ సుందరుడి నుంచి వచ్చిన వాళ్లకు మనమందరం అని సిద్ధాంతీకరించిన సంగతి కూడా మనకు తెలుసు.
డా.అక్కిరాజు సుందర రామకృష్ణగారి 31వ పద్యరచన ఇది. అన్ని రచనలలో వీరిదైన ఒక విలక్షణ శైలి కనబడుతుంది. అది మణి ప్రవాళశైలి. ఈ రచన కూడా అదే మార్గంలో చాలాచోట్ల నడిచింది. ఇందులో కవిగారు తన బాల్యాన్నీ, విద్యాభ్యాసాన్నీ, గురువులనూ, నెచ్చెలిగాండ్రనూ, తన సమకాలీన నటులనూ, విద్వద్వరేణ్యులనూ, తన జన్మస్థలానికి వనె్న తెచ్చిన మహాపురుషులనూ, యతీంద్రులనూ అందరినీ స్మరించడం గొప్ప విషయం. తన జన్మభూమి పైన అక్కిరాజు వారికున్న మమతానురాగాలు దాదాపు ప్రతి పుస్తకంలో కనబడతాయి. విధిగా తల్లిదండ్రుల ఛాయాచిత్రం, దాని క్రింద వారిని గూర్చిన పద్యాలూ కనబడతాయి. కుర్తాళ పీఠాధిపతుల ఆశీరభినందన ఉండి తీరాల్సిందే! పూర్వాశ్రమంలో స్వామివారు, ఈ సుందర రామకృష్ణునితో అనేక సాహిత్య కార్యక్రమాలలో పాల్గొని ఉండడమే దానికి కారణం. ఈ పుస్తకం వెనుక భాగంలో రచయిత ఫొటోను చూసినప్పుడు.. ఈ కవి ఏదో వ్రతదీక్షలో ఉండి ఈ పద్యకావ్యాన్ని సాగించినట్లు తెలుస్తుంది.
ఈ త్రికూటేశ్వరుడు గుంటూరు జిల్లా, నరసరావుపేటకు ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంటాడు. అదే కోటప్పకొండ క్షేత్రం. ఆంధ్రదేశంలో ఉన్న శైవక్షేత్రాలలో మిక్కిలి పేర్లున్న క్షేత్రం ఇది. దీని పూర్వగాథ చెప్పాలంటే సుదీర్ఘంగా వ్రాయాల్సి ఉంటుంది. మొత్తానికి ఈ పద్యకావ్యంలో అడుగడుగునా కవి వ్యక్తిత్వం, ఆతని భిన్న రచనా వైవిధ్యం గోచరమవుతాయి. ఎవడైనా నాకు జన్మ లేకుండా చెయ్, నన్ను ఉద్ధరించు అంటాడు ఈ కవి చూడండి. ఇలా ఎవరూ అనరు. ఒక్క అక్కిరాజే ఇలా అనగలడు.
వరదా! నన్నొక రావణాసురునిగా - పాపాత్ములన్ మేటి య
క్కూరు వంశాగ్రణి మేటి కుచ్చితుడు భూగోళమ్ము మొత్తాన దు
శ్చరితుండై నుతిగన్న వాని పగిదిన్ సల్పంగ వాంఛింతు - సు
స్థిరవౌ కీర్తిపుడట్టి వారలదె శ్రీశ్రీశ్రీ త్రికూటేశ్వరా! (220 పద్యం)
-అంటాడు. చిత్రంగాలేదూ?! ఇంకా చిత్ర విచిత్రమైన పద్యాలు కనబడతాయి. విద్యా వ్యవస్థను గూర్చి చాలా బాధపడతాడు ఈ కవి.
తీవ్రమైన పదజాలంతో, చక్కనైన తెలంగాణా మాండలికాలతో ఈ ద్విశతి కనబడుతుంది. ఈ కావ్యంలో ఇతడు చేసిన ‘దశావతార వర్ణన’ గూడా వైవిధ్యభరితంగా కనబడుతుంది. అవినీతిపరులైన దేశనాయకులను చాలా నిశితంగానే తూర్పారబట్టాడు ఈ కవి.
శ్రీశ్రీశ్రీ త్రికూటేశ్వరా పద్యకావ్యం భక్తి జ్ఞాన వైరాగ్యాల మేళవింపు. ఒక తీవ్రమైన మానసికాందోళన ఏదో కవిలో శాశ్వతంగా గూడు కట్టుకుని ఉన్నదా? అన్నట్లు కొన్ని పద్యాలు చదువరులకు అనిపిస్తాయి. అంతటి తీవ్ర మనోవేదనకు ‘అక్కిరాజు’ వారు ఎందుకు గురి అయ్యారో ఈ త్రికూటేశ్వరుడికే ఎరుక! ఆయన వామాంగంలో భాసిల్లే ఆర్యామహాదేవికే ఎరుక!
కోటప్ప కొండ వైభవాన్ని కళ్లకు గట్టిజూపిన అక్కిరాజు వారు పద్య నటులు గావడం మూలాననేమో, చాలా తేలిగ్గా ధారాశుద్ధి శోభితంగా నడిచిందీ కావ్యం. 96 పుటలు, 229 పద్యాలుగల ఈ పద్య కావ్యం ఆధునిక శతక పద్య కావ్యాలలో నిస్సంశయంగా ఆణిముత్యమే! పుస్తకంలో వారు నటించిన శ్రీరామ, శ్రీకంఠుని పాత్రలు ముద్రించడంతో ఈ కావ్యానికి మరింత వెలుగుదెచ్చాయి. ఈ పద్యాలు వారి నోటి మీదుగానే, అందునా ‘శంకరాభరణ’ రాగంలో విన్నప్పుడు, మరీ ఆనందకరంగా ఉంటుంది.

-త్రోవగుంట వేంకట సుబ్రహ్మణ్యం