మెయన్ ఫీచర్

అందరూ ఆచంట మల్లన్నలే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన రాజకీయ పార్టీల నటన చూసి ఆస్కా ర్ అవార్డు కూడా చిన్నబోయి చిన్నదవుతుందేమో?! ప్రత్యేక హోదా బిల్లుపై నవరసాలు పండించిన పార్టీల చిత్తశుద్ధి ఏమిటన్నది జీఎస్‌టి బిల్లు సందర్భంలో తేలిపోయింది. ప్రత్యేక హోదా కోసం ఎంతవరకయినా తెగిస్తామని తెదేపా కనె్నర్ర చేసింది. అవసరమైతే కేంద్రం నుంచి బయటకు రావడానికీ సిద్ధమని ప్రకటించింది. అటు తెలుగు తమ్ముళ్లూ కమలంపై కనె్నర్ర చేశారు. అసలు బిజెపి నేతలను ఏపిలో అడుపెట్టనీయ వద్దని పిలుపునిచ్చారు. రాజ్యసభ, ఆ తర్వాత లోక్‌సభ రంగస్థలంపై హోదా నాటకాన్ని రక్తికట్టించింది. ఈ విషయంలో వైసీపీ కూడా తక్కువేమీ తినలేదు. పోడియం వద్దకు వెళ్లి నినాదాలు చేస్తే, అంతకుముందు హోదాపై హుంకరించిన తెదేపా సభ్యులు తమ సీట్లో నిలబడి చోద్యం చూశా రు. నిజంగా హోదాపై అంత ప్రేమ ఉంటే వైకాపాకు పోటీగా తెదేపా కూడా పోడియం వద్దకు వెళ్లి యాగీ చేయాలి కదా? హోదా కోసం వచ్చే ఏ చిన్న అవకాశం జారవిడుచుకునేది లేదని చెప్పిన తెదేపా, మరి లోక్‌సభలో వచ్చిన అవకాశం ఎందుకు వినియోగించుకోలేదన్న ప్రశ్న కు జవాబు అంత కష్టమేమీ కాదు.
సరే.. హోదాపై కెవిపి ఇచ్చిన ప్రైవేటు మెం బరు బిల్లుపై ఓటింగు జరగదన్న విష యం తేలిపోయింది. కనీసం జీఎస్టీ రూపంలో వచ్చిన అవకాశం వినియోగించుకుని హోదాకు ముడిపెడితే, కేంద్రం దిగివస్తుందని తెలిసినా కాంగ్రెస్, తెదేపా, వైకాపా ఎవరూ ఆ పనిచేయలేక పో యాయి. జీఎస్టీ బిల్లు ఆమోదం కోసం ఎన్డీఏ గత రెండేళ్లుగా చేయని ప్రయత్నం లేదు. దాని ఆమోదం కోసం నానా అగచాట్లు పడి, విపక్షాన్ని బుజ్జగించి దారికి తెచ్చుకుంది. టీవీల్లో పార్లమెంటు సమావేశ చర్చలు చూసే వారికి, పత్రికలు చదివేవారికి కొన్ని భ్రమలుంటాయి. అన్ని పార్టీలు నిబద్ధతతో వాదిస్తుంటాయని చాలామంది నమ్మకం. కానీ ఎవరు అధికారంలో ఉన్నా, తెరవెనుక జరిగే చర్చలు, మం తనాలు, మతలబులూ వేరు. దానికి ఎవరూ అతీతులు కాదు. ఒక్కముక్కలో చెప్పాలంటే అదొక మేనేజ్‌మెంట్. ఆ మేనేజ్‌మెంట్‌లో సిద్ధాంతాలు, రాద్ధాంతాలేమీ ఉండవు. అవసరాలే ప్రాతిపదిక. అధికార-ప్రతిపక్ష పార్టీలు ఏ అంశంలోనయినా రాజీపడవచ్చు. మళ్లీ మరొక అంశంలో యుద్ధం చేసుకోవచ్చు. హోదాపై సరిగ్గా అదే జరిగింది.
జీఎస్టీ బిల్లు ఆమోదం అంశాన్ని ఎన్డీఏ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రాజ్యసభలో మెజారిటీకి తెరవు లేని భాజపా చివరకు సచిన్, రేఖను కూడా బతిమిలాడుకోవలసి వచ్చింది. అంత ప్రాధాన్యం ఉన్న జీఎస్టీ బిల్లును అస్త్రంగా సంధించి, హోదా సాధించుకునే మార్గాలను రాజకీయ పార్టీలు ఎందుకు పక్కకుపెట్టాయన్నది ప్రశ్న. నిజంగా కాంగ్రెస్, తెదేపా, వైకాపాలకు హోదాపై చిత్తశుద్ధి ఉంటే, జీఎస్టీ బిల్లును ఆమోదించాలంటే హోదాపై ప్రకటన చేసి తీరాలని పట్టుపట్టి ఉండాల్సింది. అప్పుడు కేంద్రం దిగిరావలసి వచ్చేది. కానీ ఘనత వహించిన మన రాజకీయ పార్టీలు ఆ విషయమే పట్టించుకోలేదు. పైగా జీఎస్టీ బిల్లు ఆమోదం అనేది జాతీయ అవసరమని చెప్పి భక్తి పారవశ్యంతో ఊగిపోయి, ఆమోద ముద్ర వేశాయి.
నిజానికి రాజకీయ పార్టీలకు హోదాపై చిత్తశుద్ధి ఉండి ఉంటే, హోదాకు జీఎస్టీ బిల్లుకు ముడిపెట్టి ఉండాల్సింది. కానీ అదేమీ చేయలే దు. పైగా తమ రాష్ట్రాలకు జీఎస్టీ ఆమోదం వల్ల నాలుగువేల కోట్ల నష్టమని తెలిసినా, జాతీయ స్ఫూర్తితో ఆమోదించాలన్న కొత్త వాదన తెదేపా నేతల నుంచి మొదలయింది. జీఎస్టీ వల్ల ప్రతి ఏటా 4,700 కోట్లు నష్టం వస్తుందని గొంతెత్తింది. జీఎస్టీ కౌన్సిల్‌లో అన్ని రాష్ట్రాలు, కేంద్రం ఉన్నప్పటికీ కేంద్ర అధికారాన్ని వీటో చేసే అధికారం రాష్ట్రాలకు ఉండదు. సేవపై పన్నుభారం పెరగడంతోపాటు, ఆహారధాన్యాల ధరలు కూడా పెరుగుతాయి. ఇవన్నీ ఏకరవుపెడుతున్న తెదేపా రాజ్యసభలో దానిని ఆమోదించే సమయంలో, హోదా ఇస్తేనే తాము జీఎస్టీ బిల్లు ఆమోదిస్తామని లంకె పెట్టి ఉంటే, సీను మరోలా ఉండేది. ఇక్కడ ఆశ్చర్యం ఏమిటంటే వివిధ అంశాల్లో పరస్పర విరుద్ధంగా వ్యవహరించే తెదేపా-వైకాపా జీఎస్టీపై మాత్రం ఒకే గొంతు వినిపించడం! దీన్నిబట్టి అతనికంటే ఘనులు ఆచంటమల్లన్నలు మనలోనే ఉన్నారని తెలియడం లేదూ?!
* * *
తెలంగాణలో ప్రతిపక్షాలకు కొద్దిగా ఊరట. భూసేకరణ చట్టానికి సంబంధించిన జీఓ నెంబరు 123ను హైకోర్టు కొట్టివేయడం చెల్లాచెదరయిన విపక్షాలకు మానసిక స్థైర్యం ఇచ్చేదే. మల్లన్నసాగర్‌పై యుద్ధం చేస్తున్న విపక్షాలకు ఎనర్జీ టానిక్. ఎప్పుడూ వ్యతిరేకత అనేది ఒకేసారి మొదలుకాదు. ఇల్లు కూడా ఎప్పుడూ ఒకేసారి అంటుకోదు. ముందు పొగతోనే మొదలవుతుంది. తెలంగాణలో పరిస్థితులు అలాగే మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. మల్లన్నసాగర్ భూసేకరణ అడ్డుకునేందుకు ప్రతిపక్షాలు చేస్తున్న ఉద్యమానికి మీడియాలో పెద్ద ప్రాధాన్యం కనిపించడం లేదు. దానికి కారణాలు బహిరంగ రహస్యం. ఇప్పుడు తెలంగాణ గడ్డమీద కేసీఆర్ కత్తికి ఎదురులేదు. ఆయన పట్టుకున్నదంతా బంగారమే అవుతోంది. కాబట్టి ఎవరూ ఏటికి ఎదురీదేందుకు సాహసించడం లేదు. నిజానికి ఇప్పుడు తెలంగాణలో అమలవుతోన్న ప్రాజెక్టుల్లో 80శాతం పనులన్నీ, గత ప్రభుత్వాల్లో చక్రం తిప్పిన ఆంధ్రా కాంట్రాక్టర్ల చేతుల్లోనే ఉన్నాయి. ఇంకో గమ్మతేమిటంటే రెండు తెలుగు రాష్ట్రాలకూ ఒకటే ఆత్మ ఇరిగేషన్ సలహాదారుగా ఉంది. తెదేపా నేత రేవంత్‌రెడ్డి ఓ సందర్భంలో వైఎస్ ఆత్మ కేసీఆర్‌ను ఆవహించిందని తీవ్రమైన ఆరోపణ చేశారు. కానీ ఆయనకు తెలిసినా చెప్పలేకపోయిన మరో వాస్తవమేమిటంటే అదే ఆత్మ అమరావతి ప్రభువునూ ఆవహించిందని! ఇన్ని ప్రతికూల పరిస్థితుల మధ్య విపక్షం జీఓ నెంబరు 123కి వ్యతిరేకంగా పోరాడటం సాహసమే. హైకోర్టు కూడా ఆ జీఓను కొట్టివేస్తూ నిర్ణయం తీసుకోవడం ప్రజాస్వామ్యప్రియులకు సహజంగా ఆనందం కలిగించేదే. కోదండరామ్ వంటి తెలంగాణ ఉద్యమ నేత కూడా మల్లన్నసాగర్ డిపిఆర్ ఎందుకు విడుదల చేయడం లేదని ప్రశ్నకు పాలకుల వద్ద జవాబు లేదు. అయితే, న్యాయస్థానాల్లో కింది న్యాయస్థానమో, సింగిల్‌బెంచి తీర్పు ఒక్కటే అంతి మం కాదు. డివిజన్ బెంచికి అపీలుకు వెళితే సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు అక్కడ నిలవలేకపోవచ్చు. అది వేరే విషయం. కానీ, ఆ జీఓ చెల్లదని చెప్పే సమయంలో హైకోర్టు జడ్జి చేసిన వ్యాఖ్యలు గమనంలోకి తీసుకోవలసిన బాధ్య త పాలకులపై ఉంది. రైతుకు- భూమికి అవినాభావ సంబంధం ఉంది. వారి మనోభావాలను గౌరవించాల్సి ఉంది.
* * *
మొన్నామధ్య తమిళనాటలో జరిగిన ఓ ఘటన హిందూ పీఠాధిపతుల వైపు వేళ్లు చూపేలా కనిపించింది. తమిళ నెల ఆది సందర్భంగా నాగపట్నం భద్రకాళియమ్మాన్ దేవాలయంలోకి వెళ్లేందుకు దళితులు ప్రయత్నించారు. వారికి దేవాలయ ప్రవేశం కుదరదని చెప్పడంతో, ఆగ్రహోదగ్ధులయిన దళితులు, మూకుమ్మడిగా ఇస్లాంలో చేరాలని నిర్ణయించుకున్నారట. గుజరాత్‌లో కూడా దాదాపు ఇలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకున్నట్లు వార్తల్లో చూశాం. దీనికి కారణాలేమిటని విశే్లషించుకుంటే, హిందూ పీఠాథిపతుల అలసత్వం. ధనాపేక్ష. లక్షలు తీసుకుని పాదపూజలకు, ఏసిల్లో తిరగడానికి, రాజకీయ పార్టీలతో అంటకాగడానికి అలవాటుపడిన స్వాములు దళిత వాడలకు ఎప్పుడైనా వెళ్లారా? బలహీనవర్గాల కులాల భుజం తట్టారా? దళితులను ఆలయ ప్రవేశం చేయించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేదా? కొన్ని కోట్లమంది ప్రశ్న ఇది. జవాబు చెప్పే ధైర్యం ఏ స్వామికి ఉంది?! దేశంలో లక్షలాది మంది దళిత, గిరిజనులకు ఈనాటికీ ఆలయ ప్రవేశాలు లేవు. ఏజెన్సీ ప్రాంతాల్లో మరీ దారుణం. అందుకే ఆయా కులాలు ప్రత్యామ్నాయంగా ఇస్లాం, క్రైస్తవం వైపు చూ స్తున్నాయి. ప్రపంచంలో హిందువుల సంఖ్య దారుణంగా పడిపోతున్నదన్న సర్వేలు చూ స్తున్న స్వాముల్లో సామాజికమార్పు రావలసిన అవసరం ఉంది. ఒకరిని వద్దంటే మరొకరు అక్కున చేర్చుకునేందుకు సిద్ధంగా ఉన్న కాలమిది.
హిందూ పీఠాథిపతులు, మఠాథిపతులు అహంకారం, ధనాపేక్ష త్యజించి దళిత, బడుగువాడల్లో కాలుపెట్టాలి. ఈ దేశానికి బడుగులే బలమైన ఆస్తి. బలహీనవర్గాలను దూరం చేసుకుంటే బలహీనమయ్యేది హిందూమతమే. దళితులు, బీసీలకు.. స్వాములు, దేవాలయాలు దూరంగా ఉంటే ఆయా వర్గాలు ప్రత్యామ్నా యం వైపు చూస్తాయి. అదే జరిగితే పీఠాలు, మఠాలు, వారి వ్యక్తిగత ప్రతిష్ఠ పెంచే సంస్థానాలవుతాయే తప్ప, మత మనుగడను పరిరక్షిం చలేవు. దళిత, బీసీవాడల్లో దేవాలయ నిర్మాణాలు చేయనంత కాలం ప్రజలు హిందూ దేవుళ్లకు దూరంగా, ఇతర మతాలకు దగ్గరగానే ఉంటారు.

మార్తి సుబ్రహ్మణ్యం సెల్: 9705311144