మెయన్ ఫీచర్

చేసుకున్న వారికి చేసుకున్నంత...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజెపిని చూసి ప్రత్యర్ధులు కూడా జాలి పడుతున్న పరిస్థితి. అసలు ఇప్పటి రాజకీయ సీజన్‌లో ప్రత్యర్థి పార్టీని ముప్పుతిప్పలు పెట్టి, మూడు చెరువుల నీళ్లు తాగించాల్సిన బిజెపి, ఒక ఏడాది కాలంలో రెండుసార్లు విజయవంతంగా ఆత్మహత్మ చేసుకుంది. కాంగ్రెస్‌లో కొట్లాటలు ముదురుపాకాన పడి, ఎవరు ఏ గూటికి చేరుకోవాలా అని దారులు వెతుక్కుంటున్న సమయంలో, ఉత్తరాఖండ్ అనే రాష్ట్రం కూడా రానున్న ఎన్నికల్లో బిజెపి ఖాతాలో పడే వేళలో..బిజెపి గడ్డం బాసు అమిత్‌షా వేసిన దిక్కుమాలిక వ్యూహం వికటించి, కాంగ్రెస్‌కు సంజీవని అందింది. కాంగ్రెస్ కలహాలు కొంతకాలం ముదిరితే, రానున్న ఎన్నికాంగ్రెస్ పుట్టిమునిగేది.
కానీ, కమలదళాల తెలివి తెల్లారి తిరుగుబాటు ప్రోత్సహించిన ఫలితంగా, అక్కడి సీఎంకు బోలెడంత ఉచిత సానుభూతిని అమిత్‌షా బృందం కాంగ్రెస్‌కు అప్పనంగా అప్పగించింది. అటు సుప్రీంకోర్టు కూడా గవర్నరు నిర్ణయాన్ని కాదని, రంగస్థలాన్ని కోర్టుకు బదలాయించి, చివరకు ఓట్ల లెక్కింపు కూడా కోర్టు హాలులోనే కానిచ్చింది. ఫలితంగా కాంగ్రెస్ బతికి, కమలం వాడిపోయింది. దీన్నిబట్టి కాంగ్రెస్‌కు బిజెపి ఉండగా భయపడాల్సిన పనిలేదని అర్థమయింది.
పోనీ తర్వాతయినా విధం మార్చుకుందా అంటే అదీ లేదు. తాజాగా అరుణాచల్ ప్రదేశ్‌లో కూడా డిటో. నబమ్‌తుకి సర్కారును రద్దు చేస్తూ గవర్నరు తీసుకున్న నిర్ణయాన్ని, సుప్రీంకోర్టు ఐదురోజుల క్రితం కొట్టివేసింది. ఇక్కడ కూడా కమలం మరోసారి రాజకీయంగా ఎవరి సహాయం లేకుండానే ఆత్మహత్య చేసుకుంది. మరో ఏడాదిన్నరలో ఎన్నికల్లో గెలవాల్సి, తొందరపడి ముందే కూసిన కమలానికి సుప్రీంకోర్టులో మాడుపగిలింది. 24 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసి నాయకత్వానికి గుబులు రేపితే, ఆ మంటను అలాగే ఏడాదిపాటు రగిలించేలా చూస్తే, రానున్న ఎన్నికల్లో అరుణాచలప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ సహజ మరణం పొందేది. కానీఘనత వహించిన భాజపేయులు కాంగ్రెస్‌కు అలాంటి అవకాశం ఇవ్వకుండా, తామే గవర్నర్ ద్వారా సంజీవని ఇప్పించి, మరికొన్నాళ్లు బతికించే ఏర్పాట్లు చేశారు. బిజెపి వంటి అనుకూల శత్రువు ఉంటే కాంగ్రెస్‌కు అంతకన్నా కావలసిందేముంది?
పార్టీ పగ్గాలు ఇంకా ప్రయోజకుడో కాదో తెలియని రాహులబ్బాయికి ఇవ్వాలా? ఇందిరమ్మ పోలికలున్నందున ప్రియాంకమ్మకు ఇవ్వాలా? లేక సోనియమ్మనే కంటిన్యూ చేయాలా? అన్న తర్జనభర్జనతో ఏడాది నుంచి నానా పాట్లు పడుతూ.. ఆ మధ్యలో పార్టీకి పెద్దదిక్కులంతా ఎవరి దిక్కు వారు చూసుకుంటున్న వేళ.. ఇలాంటి రెండు ఘటనలు మరో మూడు నాలుగు రాష్ట్రాల్లో జరిగితే, కాంగ్రెస్ పార్టీ మళ్లీ పెత్తనం చేయడానికి పెద్ద కష్టపడాల్సిన పనిలేదేమో? ఆ రకంగా బిజెపికి కాంగ్రెస్ రుణపడాల్సిందే. అయినా.. కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకూ వందసార్లకు పైగా గవర్నర్ల పాలన పెట్టిందని నెల్లూరు నాయుడు లెక్కలు చెప్పడం బాగానే ఉంది. కానీ మన బంగారం కూడా చేస్తుంది కూడా అదే కదా?
***
రాజకీయాలంటే నెంబరాట. ఆ నెంబరుగేములో దేశం మొత్తం మీద అద్భుత పరిపాలకుడని కీర్తిప్రతిష్ఠలు సొంతం చేసుకున్న వారు, ఆనక ప్రజల దృష్టిలో అయోగ్యులు కావచ్చు. అసలు జనంలోకి రాకుండానే సౌధాల నుంచే పాలన సాగించే వారు, ప్రజల దృష్టిలో యోగ్యులూ కావచ్చు. అదే కదా ప్రజాస్వామ్య గొప్పదనం? మోదీజీ దేశంలోని అందరు ముఖ్యమంత్రుల పనితీరుపై సర్వే చేయించారన్నది ఒక వార్త. అందులో బిల్‌క్లింటన్, టోనీబ్లెయిర్ వంటి ఉద్దండులతో కలసి మూడో ప్రపంచం సృష్టించాలని ప్రయత్నించిన, ఏపి సీఎం చంద్రబాబునాయుడుకు అక్కడి ప్రజలు ఇచ్చింది 13వ స్థానమయితే.. ఇప్పటివరకూ ప్రజలను కలవని ముఖ్యమంత్రిగా ముద్రపడి, తన శైలిలో అధికార యంత్రాంగాన్ని పరుగులుపెట్టించి, పనిచేయిస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ప్రజలు ఇచ్చిన స్థానం నెంబర్ వన్!
అసలు ఈ సర్వేలో తనకు ఐదో స్థానం వచ్చిందని, తాను ఇంత కష్టపడుతున్నా ఐదవ స్థానం రావడంపై, బాబుగారు ఐఏఎస్‌ల సమావేశంలో వాపోయారట. దానికి.. అవును పాపం, తాను నిద్రపోకుండా, అధికారులను నిద్రపోనీయకుండా, నిరంతరం సమీక్షలు, సమావేశాలు, దేశంలో ఎక్కడా లేనట్లు నాలుగయిదారేడెనిమిది గంటల పాటు క్యాబినెటు మీటింగులూ పెడుతున్నా, బాబుగారు వంటి పనిమంతుడికి ప్రజలు ఇచ్చిన రేటు 13 ఏమిటి చెప్మా అని తమ్ముళ్లు ఫీలవుతున్నారు. మరి అంతే కదా? హైదరాబాద్‌లోనో, మెదక్ ఫాంహౌసుకే పరిమితమయి, మునుపటి ముఖ్యమంత్రుల మాదిరిగా ప్రజలకు ధర్మదర్శనాలు ఇవ్వకుండా,లీకులతో కాలక్షేపం చేయకుండా, ఏ సమీక్ష సమావేశానికయినా అర్ధగంట మాత్రమే కేటాయించి, అధికారులకు స్వేచ్ఛ ఇచ్చి వారితో ఫలితాలు రాబడుతున్న కేసీఆర్‌కు ఒకటో నెంబరు రావడం అన్యాయమే కదా?!
సరే.. ఇక్కడో విషయం చెప్పాలి. నెంబర్ వన్ స్థానంలో ఉన్నారని భావిస్తున్న కేసీఆర్ అయినా, 13వ స్థానంలో నిలిచారంటున్న ఆయన రాజకీయ గురువు చంద్రబాబయినా.. ఈ నెంబర్లు శాశ్వతం కాదని గుర్తుంచుకోవాలి. అందుకే పెద్ద పెద్ద సినిమా హీరోలు చాలా తెలివిగా మాట్లాడుతుంటారు. నెంబర్ వన్‌లో ఉన్న వాళ్లు కూడా తమకు నెంబర్ల మీద నమ్మకం లేదని చెబుతుంటారు. ఎందుకంటే అది శాశ్వతం కాదని తెలుసుకాబట్టి! రాజకీయాల్లో కూడా అంతే. రేపు కేసీఆర్ స్థానం వసుంధరాజే సింధియాకు దక్కవచ్చు. మన తెలుగు బాబుకూ దక్కవచ్చు. అందువల్ల 13వ స్థానం వచ్చిందని బాబు, ఒకటోనెంబరు కుర్రాడు కేసీఆర్ ఇద్దరూ .. ఈ సర్వే ఫలితాన్ని తమ పనితీరుకు సంబంధించి హెచ్చరిక సంకేతంగా తీసుకుంటే అద్భుతాలు సాధిస్తారు.
ఈ సర్వేలన్నీ ప్రజల సంతృప్తస్థాయి ప్రాతిపదికన జరిగినవని చెబుతున్నారు. అంటే తెలంగాణలో ప్రజలంతా సంతృప్తిగా, ఏపిలో ప్రజలు అసంతృప్తితో ఉన్నారని ఆ సర్వే ఫలితాల అర్థం. కేంద్రం ఇచ్చిన స్థానాలు కూడా ప్రతి మూడు నెలలకూ మారుతుంటాయి. అవి త్రైమాసిక నివేదికలు. కాబట్టి పనితీరు మెరుగుపరుచుకునేందుకు ఇదొక అవకాశంగా భావించాలి. ప్రజలు.. పార్టీలు, నేతల కంటే చాలా తెలివైనవారు. చేతిలో చెప్పినట్లు ఆడే మీడియా ఉందని, ఎన్ని కట్టుకథలు ప్రచారం చేసినా నమ్మే రోజులు పోయాయి. తమ కళ్లెదుట జరిగే అవినీతిని కాదని, రాష్ట్రంలో ఎక్కడా అవినీతి లేదని ప్రచారం చేస్తే, అలాంటి రాతలు, ప్రకటనల వల్ల పాలకులకు సంతోషం దక్కవచ్చు. అలాంటి పనులకు మీడియా విదూషకులే అక్కర్లేదు. చుట్టూ ఉన్న నౌకర్లు చాలు. గతంలో భారత్ వెలిగిపోతుందనే పనికిమాలిన, మతిలేని నినాదాన్ని తలకెత్తుకుని, జనాగ్రహం పొందిన ఎన్డీఏ నిర్వాకాన్ని ప్రస్తుత పాలకులు గుర్తు చేసుకోవాలి. జనం కష్టాలు అనుభవిస్తుంటే, దానికి విరుద్ధంగా తమ పాలనలో జనం బతుకులు దివ్యంగా వెలిగిపోతున్నాయని ప్రచారం చేసుకుంటే, దాని వల్ల నష్టమే తప్ప లాభమేమిటి?
మొగుడు ఏదో అంటే ముష్టికి వచ్చిన వాడూ అదే అన్నాట్ట వెనకటికి. అమరావతి రాజధాని నగర నిర్మాణంపై భారతీయులు అద్భుతమైన మురికివాడలు నిర్మిస్తారే తప్ప, అద్భుత కట్టడాలకు పనికిరాని పనిమంతులని, బాబుగారు సర్ట్ఫికెట్ ఇవ్వడం అన్యాయం. ఇది ఒకరకంగా మనల్ని మనం అవమానించుకోవడమే. హరప్పా, హంపి, అమరావతి నగరాలను అద్భుతంగా నిర్మించింది సింగపూరు, చైనా, జపాను కంపెనీలు కావు. మన శిల్పుల చేతుల్లోనే అద్భుత కట్టడాలు ఊపిరిపోసుకున్నాయి. మనోళ్లు మురికివాడలు తప్ప రాజధానిని నిర్మించలేరన్న బాబు వ్యాఖ్యలు తర్వాత వివాదాస్పదమైనా ఆశ్చర్యపోవలసిన పనిలేదు. ఆప్ఘనిస్తాన్‌లో అద్భుతమైన పార్లమెంటు భవనాన్ని నిర్మించింది మన నెల్లూరు సీనయ్య కంపెనీ అని ఎంతమందికి తెలుసు? దేశం వరకూ ఎందుకు? మన తెలుగు రాష్ట్రాల్లోనే అద్భుతమైన ఆర్కిటెక్టులు, బిల్డర్లు ఉన్నారు కదా? అందాకా ఎందుకు? మన హైదరాబాద్ సుజనామాల్ భూమి కొనుగోలు చేసి, తక్కువ విస్తీర్ణంలో అద్భుమైన మాల్ నిర్మిస్తే, వెలగపూడిలో భూమి ఉచితంగా ఇచ్చినా సుజనా మాల్ కంటే ఎక్కువ ధరలతో నిర్మిస్తున్నారు. అది వేరే విషయం! అప్పుడు అలాంటి అద్భుతమేదో సుజనామాల్ సౌజన్యమూర్తులనే అడిగి తెలుసుకోవచ్చు కదా? మన అసెంబ్లీ భవనాన్ని అద్భుతంగా డిజైన్ చేస్తామని సింగపూర్ కంపెనీ చేస్తున్న హడావిడిలోని డొల్లతనం సోషల్‌మీడియాలో బట్టబయలయింది కదా? చండీగఢ్ అసెంబ్లీ డిజైన్‌నే కాపీ చేసి, సింగపూర్ కంపెనీ మనకు డిజైన్లు అమ్ముకుందని సోషల్‌మీడియాలో వెటకారాలు వినిపించాయి. అయినా.. ఒకవైపు మోదీజీ మేకిన్ ఇండియా, మేడిన్ ఇండియా అని చెబుతుంటే, బాబు గారు మాత్రం మేడిన్ సింగపూర్, మేకిన్ చైనా అనడం వింతగా లేదూ?!

మార్తి సుబ్రహ్మణ్యం సెల్: 9705311144