పెరటి చెట్టు

గరిడీలు + గారడీలు = చమత్కార విలాసం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ధరాధరము వెన్ను తన్ని పుట్టిన చాయ నున్నదీ బింబాధరోష్ఠి వేణి/ జక్కవ కవ రొమ్ము త్రొక్కి నిల్చిన జాడ నున్నవీ నవలా పయోధరములు/ చిన్నిప్రాయపు లేడి చెవులు పట్టాడించు గతినున్న దీ రామ కన్నుదోయి/ నల్ల చీమల బారు నడుము తాకినవీక నున్నదీ చెలువంపు కనె్నయారు/ విపుల పులినంబు వెన్కకు వీగ నొత్తు నందమున నున్నదీ మందయాన పిరుదు/ దీని కెనయైన లతకూన కాన మ మనోజ వజ్రాంగి ఈ జగన్మోహనాంగి’ - ఈ పద్యంలో ప్రతి పాదానికి ఓ జాతీయాన్నో, పలుకుబడినో తీసుకుని చమత్కరించడం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. కవి సమయాలకు తగిన రీతిలో ఈ అంగాంగ వర్ణన సాగింది. సుభద్ర జడ మేఘం ‘వెన్ను తన్ని పుట్టిన చాయ’నున్నదట! ఆమె స్తనద్వయం చక్రవాక పక్షుల జంటను ‘రొమ్ము తొక్కి నిల్చిన జాడ’ నున్నదట! ఆమె కన్నుల జంట ‘చిన్నిప్రాయపు లేడిని చెవులుపట్టి ఆడించు గతి’న ఉన్నదట. ఆమె కనె్ననూగు ‘నల్ల చీమల బారు నడుము తాకినవీక నున్న’దట! ఆ మందయాన నితంబం విస్తృతమయిన ఇసుక తినె్నని ‘వెన్కకు వీగనొ’త్తేలా ఉందట! లేత తీగెలాంటి ఆ జగన్మోహనాంగి మన్మథుడి చేతిలోని వజ్రాంగిలా ఉందంటున్నాడు కవి. ఇది చేమకూర వెంకట కవి రాసిన ‘విజయ విలాసం’ కావ్యంలోని, అత్యంత సరళమయిన చమత్కారాలివి. ఒక్క పద్యం ఎడమిచ్చి ‘ఇత్తరళాక్షి మేనిజిగి..’ అనే పద్యం ఎత్తుకున్నాడు వెంకట కవి. అందులోనూ పోలికల సాయంతో చేసిన చమత్కారమే కనిపిస్తుంది. ‘అమ్మకచెల్ల, వీనికి నా మనసమ్మక చెల్ల’దనీ, ‘మన సుభద్ర మనసు భద్ర’మనే మాటలాటలతో పోలిస్తే ఇవి కాస్త క్లిష్టంగా అనిపించవచ్చు. నిజానికి, ఈ కావ్యంలో అడుగడుగునా - అంటే, దాదాపు ప్రతి పద్య పాదంలోనూ - ఇంతకు పది రెట్లు క్లిష్టమయిన చమత్కారం కనిపిస్తుంది. పాఠకుల మీదున్న గౌరవాదరాలతో వాటన్నిటినీ ఇక్కడ ఏకరువు పెట్టడం లేదని గమనించ ప్రార్థన. కావ్యం కోసం చమత్కారం కాకుండా, చమత్కారం కోసమే కావ్యమనిపిస్తుంది ‘విజయ విలాసం’ చదివితే. మనుచరిత్ర, వసుచరిత్రలతో మొదలయిన వేలంవెర్రి ధోరణికి పరాకాష్ట లాంటి మానసికత ఈ కావ్యంలో కనిపిస్తుంది. చేమకూర వెంకట కవి చేసిన చమత్కారాలన్నీ పాఠకులకి చక్కగా బోధపడే రీతిలో ‘ఆంధ్ర విశారద’ తాపీ ధర్మారావు రాసిన ‘హృదయోల్లాస వ్యాఖ్య’ సాహిత్యాభిమానులందరూ చదివి తీరవలసిన పుస్తకం.
అర్జున, ఫల్గుణ, పార్థ, కిరీటి, శే్వతవాహన, బీభత్స, కృష్ణ, సవ్యసాచి, ధనంజయ లాంటి పేర్లున్న వీరుడికి విజయుడనేది పదో పేరు. ఈ వీరుణ్ణే పాండవ మధ్యముడని కూడా అంటారు. కుంతి కోరిక మేరకి, పాండవులు అయిదుగురినీ వరించింది ద్రౌపది. ఆమెతో కాపురం విషయంలో అన్నదమ్ముల మధ్య గొడవలు రాకుండా ఓ ఏర్పాటు చేసుకుంటారు. ఒకరితో ద్రౌపది కాపురం చేసే సమయంలో వారిద్దరినీ కలిపి మరే సోదరుడు చూడకూడదు. అలా చూడడమే తటస్థిస్తే, ఓ సంవత్సర కాలం అతగాడు తీర్థయాత్రలు చేయవలసి వుంటుంది. ఇదీ వాళ్లు పెట్టుకున్న నియమం. గోబ్రాహ్మణుల్ని కాపాడే నిమిత్తం అర్జునుడు ఒకసారి, ద్రౌపది - ధర్మరాజు ఉన్న గదిలోకి వెళ్లాల్సి వస్తుంది. దాంతో, నియమం ప్రకారం అతగాడు తీర్థయాత్రలు చెయ్యాల్సి వస్తుంది. ఈ తీర్థ యాత్రల వల్ల విజయుడికి పుణ్యమెంత వచ్చిందో తెలియదు కానీ పురుషార్థం బాగానే కిట్టింది. ఉలూచినీ, చిత్రాంగదనూ, సుభద్రనూ పెళ్లాడి తిరుగు ప్రయాణం పెట్టుకుంటాడు. ఈ మూడు పెళ్లిళ్లు చేసుకోవడానే్న చేమకూర వెంకన్న ‘విలాసం’గా అభివర్ణించాడు. (‘విజయ విలాసం’ కావ్యానికి ‘ఆధునిక భాషలో, సరళమయిన శైలి’లో లఘు టీక రాసిన సి.రామానుజాచార్యులు ‘విలాసం’ అనే మాట తనను బాధిస్తోందన్నారు. కానీ, వ్యాఖ్యాతలందరూ అర్జునుని కేళీ విలాసాన్ని - మామూలు మాటల్లో - విపులంగా వర్ణించినవారే!) ఈ మూడు కథలనూ కలిపి, మూడు ఆశ్వాసాలుగా రాశాడు కవి. చమత్కార ప్రధానమయిన కావ్యం రాయదల్చుకున్న ఏ కవయినా, సరళమయిన ఇతివృత్తానే్న ఎంచుకోవడం కద్దు. చేమకూర కూడా అదే చేశాడు.
ఇతివృత్తంలోనే వున్న శృంగార స్వభావం కావ్యంలో అణువణువునా ప్రతిఫలించడం సహజమే. ప్రబంధాల విషయంలో ఇది మరింత నిజం. ఉదాహరణకి, గంగా తీరంలో నాగకుమారి ఉలూచి అర్జునుణ్ణి చూసి ‘మరులుగొని’నట్లు రాస్తూ ‘రాకొమరు నెరులు నీలపు రాకొమరు నిరాకరించు’ననుకుంటుంది. రాకొమరుడంటే రాజకుమారుడని అందరికీ తెలిసిందే. ‘(నీలపు)ఱా కొమరు’ అంటే నీలపు రాయి తాలూకు మనోజ్ఞత అని కవిగారి చమత్కారం. ‘అర్జును డులూచిని సుఖ సాగరమున తేల్చుట’ అనే భాగంలో ‘శయ్యకు తార్పగా తురుము జారె..’ అనే పద్యం సుప్రసిద్ధం. ఇందులోని ‘జారుపాటు’ క్రమం ఆధారంగా చేసిన చమత్కారం పరమ వాస్తవికంగా ఉండి అన్ని రకాల పాఠకులనూ ఆకట్టుకుంటుంది. ఇలాంటి చమత్కారాలకి ఈ కావ్యంలో లోటేం లేదు. ‘చిత్రాంగదార్జునుల పడకటింటి ముచ్చటలు’ అనే భాగంలోని ‘కానుక కాగ నిత్తు..’ పద్యంలోని యమకం శబ్దాలంకారాల మీద చేమకూర వెంకన్నకున్న పట్టును స్థాపిస్తోంది.
ఔచిత్య విచార చర్చకిది తగిన సమయం కాదు కానీ, ప్రాబంధిక ధోరణికి బలమూ బలహీనతా ఒకటే. శరీరగతమయిన శృంగారాన్ని విపులంగా వర్ణించే తాపత్రయంలో, మన ప్రబంధ కవులు దేన్నీ ఖాతరు చెయ్యరు. ‘విజయ విలాసం’ కావ్యానికి ప్రధానమయిన కథాంశం సుభద్రాపహరణం. కృష్ణార్జునుల మైత్రి దృష్ట్యా ఈ పరిణామానికి రాజకీయంగా ఎంతో ప్రాముఖ్యం ఉంది. జరగబోయే కురుక్షేత్ర యుద్ధం దృష్ట్యా సుభద్ర పెళ్లికి వున్న సైనిక ప్రాధాన్యం అందరికీ తెలిసిందే. అంతకుమించి, తెలుగు వాళ్ల బాంధవ్యాల్లో మేనరికానికి వున్న ప్రాచుర్యం దృష్ట్యా కూడా ఈ ఘట్టానికి మరెంతో ప్రాముఖ్యం ఉంది. అందుకే, ఈ కావ్యంలో దాదాపు సగభాగం ఈ ఘట్టానికే కేటాయించాడు కవి. బొమ్మలతో ఆడుకునే బాలికగానూ, కపట సన్యాసి అతి చనువు మాటలకు చిరాకు పడినట్లూ సుభద్రను రైవతకాద్రి మీద మనకి పరిచయం చేశాడు కవి. సదరు సన్యాసే తన బావ అని తెలుసుకున్న వెంటనే ఆమె విరహ వేదనకు లోనయినట్లు రాయడానికి గానీ, శిశిరోపచారాలనూ, మన్మథోపలంభనం, మలయానిలోపలంభనం, చంద్రోపాలంభనం, కోకిలాద్యుపాలంభనం వగయిరాలను సుదీర్ఘంగా వర్ణించడానికి గానీ చేమకూర సంకోచించలేదు.
ప్రతి పద్యంలోనూ ఏదో ఓ చమత్కృతి చూపిస్తానని - అచ్చం పిల్లలమర్రి పినవీరభద్రుడి మాదిరిగానే - ప్రతిజ్ఞ చేశాడు చేమకూర కవి. తన మాట నిలబెట్టుకోవడానికి గాను, చమత్కారాన్ని ప్రతి పద్యంలోనూ కూరికూరి పెట్టాడు. ఫలితంగా, ఈ కావ్యం, సర్కస్ ఫీట్లకూ, సాముగరిడీలకూ క్షేత్రమయిందే తప్ప ఔచిత్యానికీ, సారస్యానికీ పాత్రం కాలేకపోయింది. కేవలం పండితుల కోసమే రచనలు చేసే కవులకు ఎంత మాత్రం పనికిరానిది అమాయకత్వం. రాజాస్థానాల్నీ, సంస్థానాల్నీ ఆశ్రయించుకుని బతుకీడ్చే ఈ పండితబ్రువులు దేన్ని ఖండించినా, నెత్తికెత్తుకున్నా దానివెనకాల కులమో - మతమో - అధికారమో - సంపదో మరో కోణమో కచ్చితంగా ఉండి తీరుతుంది. నన్నయ్య - తిక్కనలకే వైదికి నియోగి ముద్రలు కొట్టి ఉపకుల రాజకీయం నెరపిన మన పుణ్యభూమిలో కాలుపెడదామనుకునే ముందే కవులు ఈ విషయాల్లో స్పష్టత కలిగి వుండాలి. లేనట్లయితే, ‘ఏ గతి రచయించిరేని, సమకాలమువారలు మెచ్చరే కదా!’ అని నిస్పృహగా అనుకోక తప్పని పరిస్థితి ఎదురయి తీరుతుంది.

-మందలపర్తి కిషోర్ 81796 91822