పెరటి చెట్టు

అక్షరాలా రా(జకీ)య వాచకం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘రాయలకు రాజనీతులు నాయడు అప్పాజి చెప్పినవి అన్నియు తా/ పాయక మనసున ఉనిచిన రాయసములు వ్రాయ చదువ రసికత కలుగున్’ - కాశీ వివ్వనాథ నాయనయ్యవారి స్థానాపతి రాసిన ‘రాయవాచకం’ అవతారికలోనిది ఈ పద్యం. ‘శ్రీమంతు సకల గుణసంపన్నులయిన మసామేరు సమాన ధీరులైన, అఖండిత లక్ష్మీ ప్రసన్నులయిన శ్రీమన్మహామండలేశ్వర, రాజమాన్య, మహారాజ రాజశ్రీ కాశీ విశ్వనాథ నాయనయ్యవారి దివ్యశ్రీ పాద పద్మములకు దేవరవారి స్థానాపతి భక్త పరాధీనుండు సర్వ నయభయభక్తులనున్ను శాయంగల విన్నపం..’ అంటూ మొదలయ్యే రాయ వాచకంలో ‘కర్ణాటక రాజుల దినచర్య’ గురించిన నివేదికే తొలి అధ్యాయం. అక్కణ్ణుంచి, ఏకంగా రెండు వందల ఏళ్లు వెనక్కి గంతేసి, విద్యారణ్యుల ప్రశంస- విద్యానగర శంకుస్థాపన ముహూర్తం - నగర నిర్మాణాలకు దారితీస్తుంది. ఆ తర్వాత దాదాపు ఇరవై అధ్యాయాల పాటు ముందుకీ వెనక్కీ ఊగిసలాడుతూ ‘చారిత్రిక’ కథనం కొనసాగుతుంది. కృష్ణరాయల పట్ట్భాషేకం, రాయలకి రాజనీతి ఉపదేశం, వేగర్ల నియామకం, పట్టణ శోధన, తిమ్మరుసు మందలింపు, సేన వివరాలు, అశ్వపతి - గజపతి - నరపతుల తారతమ్యం లాంటి అంశాలపై నివేదికలు సర్వసాక్షి కథనాల్లాంటివి. వాస్తవాలతో బొత్తిగా సంబంధం లేని కథనాలు కావవి. అలాగని అక్షరాలా వాస్తవిక కథనాలూ కావు! రాయవాచకం ఆద్యంతం ఇలా వాస్తవానికీ కల్పనకూ మధ్య ఈదులాడుతూనే ఉంటుంది.
ఏకామ్రనాథుడి ప్రతాప రుద్ర చరిత్ర తెలుగు భాషలో వచ్చిన తొలి చారిత్రిక గ్రంథం. అంతకు ముందు తెలుగులో చరిత్ర రచన, వచన రచన లేనేలేదని ఈ మాటకి అర్థం చెప్పుకోకూడదు. గ్రామ కరణాలు రూపొందించిన ‘దండకవిలెలు’ వందల సంఖ్యలో దొరికిన సంగతి చరిత్ర విద్యార్థులకు తెలుసు. అవన్నీ ఆయా గ్రామాల ఆర్థిక - సామాజిక - ధార్మిక - సాంస్కృతిక జీవనరంగాలను అక్షరబద్ధం చేసిన ‘స్థానిక చరిత్ర’లే. ఈ కవిలెకట్టల్లో సమకాలీన స్థితిగతుల మీద నివేదికలు సైతం వుండేవి. పద్దెనిమిదో శతాబ్దం చివర్లో ‘కర్నల్’ కాలిన్ మెకంజీ కైఫియత్‌ల సేకరణ మొదలుపెట్టినప్పుడు ఈ కవిలెకట్టలను కూడా పోగుచేశారు. వాటిలో ‘కొండవీటి దండకవిలె’ లాంటివి సుప్రసిద్ధాలు కూడా. ఏకామ్రనాథుడి ‘ప్రతాప రుద్ర చరిత్ర’ వెలువడిన -దాదాపు నూరేళ్ల తర్వాత - ఆనాటి వ్యావహారిక వచనంలో వచ్చిన తొలి చారిత్రిక గ్రంథం ‘రాయవాచకం’. నిజానికి ఇది, పదహారణాల రాజకీయ వాచకం. దాని పేరులోనే వున్నట్లుగా, ఇది రాయల (అంటే తుళువ శ్రీకృష్ణదేవరాయలనే అర్థం!) గురించి రాసినదే. ఈ రచన వెనుక ఉండుకుని వున్న ఉద్దేశాలు సుస్పష్టం. రాయల దగ్గిర మహామంత్రిగానూ, దండనాథుడిగానూ ఉండిన సాళువ తిమ్మరుసుకు సహజంగానే ఈ వాచకంలో అత్యధిక ప్రాధాన్యం ఉంటుంది. అసలు రాయల చేతికి రాజ్యాధికారం అప్పగించిందే తిమ్మరుసు కదా! కుట్రల్లో పుట్టి, పెరిగి, గిట్టిన రాయలు తన కొడుకును తిమ్మరుసే చంపించాడని అనుమానించి, అతగాడి కళ్లు ఒలిపించాడనడం అంత మరీ నమ్మశక్యం కాని విషయమేం కాదు. అయినా, రాజు తల్చుకుంటే దెబ్బలకు కొదవా? అటువంటి వాళ్ల గురించి రాయడమంటే, రాజనీతి (!)ని గురించి రాయడమే. అంచేతనే, రాయ వాచకం, అక్షరాలా రాజకీయ వాచకం అయిందనేది.
‘రాయవాచకం’ లాంటి రాజకీయ వాచకాలు రాసేవాళ్లెవరు? రాజకీయ ఉద్యోగులే! ఈ వాచకాలు రాస్తేనూ చదివితేనూ ‘రసికత కలుగు’తుందనే మాట కేవలం పొల్లుమాట. ఇలాంటి ఉద్గ్రంథాలు చదివితే, కొద్దో గొప్పో అంతఃపుర కుట్రలూ కుహకాల గురించి తెలిస్తే తెలియొచ్చు. ‘ఈ రాయవాచకం చదివినవార్లకు వింన్నవార్లకుంన్ను బుద్ధివివేక విచక్షణములు గలిగి భాగ్యవంతులై యోగశాలులై ఆచంద్రతారార్కస్థాయిగా సుఖాన వుంద్దురు’ అనే ‘్ఫలశ్రుతి’ లాంఛనప్రాయమయిన మంగళవచనం మాత్రమే! మరి ఈ తరహా చరిత్రలను ఎందుకు రాయిస్తారు? రాజకీయ కారణాలతోనే రాయిస్తారు. ‘రాయవాచకం’ రచయిత, తనను తాను ‘కాశీ విశ్వనాథ నాయనయ్యవారి స్థానాపతి’గా చెప్పుకున్నాడే తప్ప తన నామనక్షత్రాలను ఎక్కడా బయటపెట్టలేదు. ఆ మాటకొస్తే, ‘కాశీ విశ్వనాథ నాయనయ్య వారి’ (అంటే విశ్వనాథ నాయకుడి) వివరాలను కూడా విశేషంగా రాయలేదు. దౌత్యోద్యోగిగా స్థానాపతి నిగ్రహ సామర్థ్యానికిది నిదర్శనం. పెదవి దాటితే పృథివి దాటుతుందనే మాట, దౌత్య వ్యవహారాల్లో నూటపది శాతం నిజం! ఆ నిజమేమిటో ఒక కంట చూద్దాం.
మధుర రాజు చంద్రశేఖర పాడ్యుడు, తంజావూరి రాజు వీరశేఖర చోళుడు ఇద్దరూ కృష్ణరాయలకి సామంతులు. చోళుడు, పాండ్యుడి మీద యుద్ధం చేసి, మధురను ఆక్రమించాడు. తనకి న్యాయం చెయ్యమంటూ పాండ్యుడు నిండు పేరోలగంలో రాయల్ని అభ్యర్థించాడు. ‘దక్షిణ రాజ్యం మొత్తం తోషేఖానా అడమానాలో ఉన్నది కదా, ఈ ఉపద్రవం నువ్వే అణచాలి’ అని చెప్పి రాయలు దండునిచ్చి, నాగమనాయకుణ్ణి మధురకి పంపాడు. అతగాడు చోళుణ్ణి అణిచాడే కానీ, పాండ్యుడికి పట్టం కట్టలేదు. సదరు ‘దుండగాన్ని’ తాను అణుస్తానని నాగమయ్య కొడుకు విశ్వనాథుడు స్వచ్ఛందంగా ముందుకొచ్చాడు. కన్నతండ్రిని ఓడించి, బంధించి రాయలకి అప్పగించాడు. అతగాడి ప్రభుభక్తికి మెచ్చి మధురాపట్టం విశ్వనాథ నాయకుడికే కట్టాడు రాయలు. నాగమ నాయకుడి తరంలో తమ రాజులు తిన్న ఇంటివాసాలు లెక్కపెట్టారనే ‘ఖ్యాతి’ని మాసిపోయేలా చేసేందుకే ‘కాశీ విశ్వనాథ నాయనయ్య’ తన స్థానాపతి చేత రాయవాచకం రాయించాడనేది కొందరు చరిత్రకారుల ఊహ. అనగా, రాయలే స్వయంగా తమ నాయకుడికి రాజ్యం బహూకరించాడనే ‘కూటసాక్ష్యం’ సృష్టించడంలో భాగంగానే స్థానాపతి రాయవాచకం రూపుదిద్దుకుందని ఈ పెద్దలంటున్నారన్నమాట. పెద్దల సుద్దులు చద్దన్నం ముద్దలు కదా!
అలాంటప్పుడు, ఇక్కడ మనం ఈ కూటవాచకం గురించి ఎందుకు ఎత్తుకున్నాం? అసలు ఇలాంటి వాటిని ‘సాహిత్యం’లో భాగంగా పరిగణించడం సరయిన పనేనా? రాయల గురించీ, అష్ట దిగ్గజాలనే కల్పిత కవి బృందం గురించీ శతాబ్దాల తరబడి సాగించిన చెక్క్భజన చాలదన్నట్టుగా, ఈ రాయవాచకం గురించి మళ్లీ ప్రస్తావించాల్సిన అక్కర ఏమొచ్చి పడిందిప్పుడు? భాషా సాహిత్యాల విషయంలోనూ, సాహిత్య చరిత్ర విషయంలోనూ ఈ రచనకున్న ప్రాముఖ్యమేమిటి? - ఇలాంటి ప్రశ్నలు తలెత్తడం సహజం; ఆరోగ్యకరం కూడా. ‘లిఖిత సాహిత్యం’ అనే జన్మఎత్తక ముందే నాటుకున్న శాసనాల గురించి మనం ఇదే ‘పెరటిచెట్టు’లో చదువుకున్నామా లేదా? ‘రాయవాచకం’ దినచర్య పుస్తకం లాంటిదే అయినప్పటికీ, ఆ శాసనాల పాటి చెయ్యదా? అయినా, తమకి చెక్క్భజన చెయ్యమని రాయలూ, ‘అష్టదిగ్గజాలూ’(!) మన చరిత్ర రచయితల్ని బతిమాలుకున్నారా? హంపీ శిథిలాల్లోని రాళ్లను ద్రవించి ఏడ్వమని రాయ లడిగాడా? ఆ శిథిలాల్లో చిరంజీవి అయిన ఆంధ్రభోజుడి గురించి అంధులకు సైతం కనిపించేలా వర్ణించమని ఎవరడిగారు? కొన్ని చారిత్రిక, సాంస్కృతిక - బహుశా, మానసిక - అవసరాలే మనల్ని అందుకు పురిగొల్పుతాయి. ప్రపంచంలోని ప్రతి సమూహానికీ ఇలాంటి అవసరాలుంటాయి. ఇదేమంత విడ్డూరమయిన విషయం కాదు. విక్రమార్కుడు - భోజుడు - రాణాప్రతాప్ - గురు గోబింద్ సింగ్ - శివాజీ - కాటమరాజు - కనె్నగంటి హనుమంతు - వీరపాండ్య కట్టబొమ్మన - తదితరుల ‘చరిత్రలు’ ఇలాంటి అవసరాల నుంచి పుట్టుకొచ్చినవే. ఈ అవసరాలు యుగధర్మాలకి అనుగుణంగా మారతాయే కానీ, అలాంటి అవసరమే లేని పరిస్థితి ఇప్పట్లో మనకి రాకపోవచ్చు. రాయవాచకాన్ని, అలాంటి పుస్తకాల్నీ చదవాల్సిన అగత్యాన్ని ఈ పరిస్థితులే కల్పిస్తున్నాయి. అంచేతనే మనకీ రాజకీయ ‘రాయవాచకం’ చదవాల్సి వచ్చింది!

-మందలపర్తి కిషోర్ 81796 91822