పెరటి చెట్టు

కాలసూచికా? గుణసూచికా??

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంతకీ, ఆధునికత కాల సూచికా? గుణ సూచికా? కాలసూచికే అయితే, దాని ప్రమాణాలేమిటి? ఒకవేళ, ఆధునికత గుణసూచికే అయిన పక్షంలో, ఆ గుణ గణాల రూపరేఖల్ని నిర్ణయించేదీ, నిర్ధారించేదీ ఎవరు? మనమేనా?? (అవునూ - ఎవరీ ‘మనం’? మీరా? నేనా? మనమిద్దరమూనా?) ఆధునికత అనే భూతాన్ని బంధించి వుంచిన కాలనాళిక మూత తెరిస్తే, ఇలాంటి ‘ఇబ్బందికరమయిన’ ప్రశ్నలు బయటపడటం సహజం. కంగారు పడకండి - ఎంత భయంకరమయిన భూతాన్నయినా ఉచ్చాటన చెయ్యగల మంత్రాలుంటాయి! వాటిలో ముందుగా చెప్పుకోవలసింది నిఘంటువుల గురిచి. ఒక్కసారి వాటిని తెరిస్తే, ఎంతటి భూతాలయినా తోకలు ముడవాల్సిందే!
ఆధునికత అనేది కచ్చితంగా కాలసూచే అంటున్నాయి మన నిఘంటువులు. శబ్దరత్నాకరం, ఆంధ్ర శబ్దరత్నాకరం, ఆంధ్ర వాచస్పత్యం, శబ్దార్థ దీపిక, బ్రౌణ్యం, వావిళ్ల నిఘంటువు లాంటి ప్రామాణిక నిఘంటువులన్నీ ‘ఆధునికం’ అంటే ‘ఇప్పటి కాలపుది, కొత్తది’ అనే అర్థాలే చెప్పాయి. తెలుగు నిఘంటువులే కాదు - కేంబ్రిడ్జ్, ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీలు కూడా ఆధునికతకి ‘సమకాలీనత’ అనే అర్థమే చెప్పాయి. అయితే, ఆ నిఘంటువులు చెప్తున్న ‘కాలం’ అనేది కేవలం సమయ గణనకి సంబంధించిన లెక్క మాత్రమేనా? కచ్చితంగా కాదు! ప్రతి పరిణామమూ నిర్దిష్ట స్థల కాలాల్లోనే జరిగి తీరుతుందనే అవగాహన ప్రాతిపదికగా చూస్తే కాలమనేది కేవలం సమయ గణనకి పరిమితం కాదని స్పష్టమవుతుంది. మారే పరిస్థితులకు తగినట్లుగా మారుతున్న జీవితానే్న, సామాజిక సంబంధాలనే మనం కాలం అని పిల్చుకుంటాం. అనగా, ఆధునికమనేది ఏకకాలంలోనే కాలసూచికగానూ, గుణ సూచికగానూ కూడా ఉంటుందన్నమాట. అది ఒక సామాజిక - సాంస్కృతిక అస్తిత్వం. ఏ అస్తిత్వాన్నయినా గుణకాలాలుగా వేరుచేసుకోవడమనేది అధ్యయన సౌలభ్యం కోసం చేసేదే తప్ప, వాస్తవానికి అటువంటి విభజన సాధ్యమయ్యే పనికాదు. సాహిత్యంలో ఆధునికత లాంటి వాటి విషయంలో ఇది మరింత నిజం!
రెండున్నర వేల సంవత్సరాల నాటి గ్రీకు తాత్వికుడు హెరాక్లిటస్ ‘అనుక్షణం మారే స్వభావమే విశ్వం తాలూకు సారభూతమయిన అస్తిత్వ’మన్నాడు. అంటే, మార్పే కాలమని అంటున్నాడు ఈ పెద్దమనిషి. ఎన్నటికీ మారనిది మార్పేనన్నాడు ఈ తాత్వికుడు. మార్పు తప్ప మిగిలినవన్నీ, ఈ విశ్వంలో అశాశ్వతాలేనని హెరాక్లిటస్ తేల్చిచెప్పేశాడు. ఏ ఒక్కరూ ఒకే నదిలో రెండుసార్లు కాలు పెట్టలేరని హెరాక్లిటస్ సూత్రీకరించాడని చెప్తారు. నది అంటే నీరు కాదు, దాని ప్రవాహశీల గుణం. ఒకచోట క్షణకాలం కూడా కాలు నిలపని నదిలో రెండుసార్లు కాలుపెట్టడం అసాధ్యమేగా మరి! దాన్నిబట్టి, ఆధునికత అనేది - లేదా మార్పు చెందడమనేది కాలం తాలూకు అసాధారణ పరిణామం కాదనీ, అదే దాని సర్వసాధారణ స్వభావమనీ అర్థమవుతుంది. ఇరవయ్యొయ్యో శతాబ్దపు మహామేధావి ఐన్‌స్టెయ్న్ కాలం గురించి ఎన్నో గొప్ప విషయాలు చెప్పిన సంగతి అందరికీ తెలిసిందే. పదార్థానికి ఉండే నాలుగో కొలతే కాలమన్నాడు ఐన్‌స్టెయ్న్. ఆయన చెప్పిందీ, హెరాక్లిటస్ చెప్పింది ఒకటే! పొడుగూ వెడల్పూ లోతూ (లేదా మందం) అనేవి ఎలాగయితే పదార్థానికి సహజమయిన కొలతలో, మార్పనేది కూడా దాని సహజగుణంగా ఉంటుందనే ఐన్‌స్టెయ్న్ అంటున్నాడు. ఈ మార్పును కాలం ద్వారా సూచించాడాయన. దాని మీద వందల సంఖ్యలో ప్రశ్నలు గుప్పించిన ఔత్సాహికులకు ఐన్‌స్టెయ్న్ ఓ ప్రశ్న సంధించాడు. ‘కాలంలో పదార్థం ఉందనుకుంటున్నారా? పదార్థంలో కాలం ఇమిడి వుందనుకుంటున్నారా?’ అని అడిగేవాడట ఐన్‌స్టెయ్న్. పదార్థంలేని కాలం అనూహ్యమనేది ఆ మహామేధావి అభిప్రాయమట. అంచేత, కాలం అంటే, దానికేదో స్వతంత్ర అస్తిత్వం ఉందనుకోవడానికి వీల్లేదు. మనుషులూ, మానవ సంబంధాలతో రూపుదిద్దుకునే సమాజానికే కాలం ఉంటుంది. అది, మార్పును ప్రతిఫలించడం సహజం, అనివార్యం కూడా. అంచేత ఆధునికత కేవలం సమయ గణనకు పరిమితమయిన కాల సూచిక కాదు. అంతకు మించిన భావం ఆ మాటకి కచ్చితంగా ఉంది! అస్తిత్వానికి ఉండే పరిణామశీలతనే మనం కాల పరిభాషలో చెప్పుకుంటాం.
ఇంతకీ, ఈ చర్చకూ సాహిత్యానికీ సంబంధమేమిటని మీరడిగే లోగానే, సమాధానం చెప్పేస్తాను. సాహిత్యం కూడా ఓ సామాజిక సంబంధమే. సమాజంతో పాటుగా మారడం దాని స్వభావం కూడా. మన కళ్ల ముందు అనునిత్యం మారుతున్న అనేక సంబంధాల్లో సాహిత్య సంబంధాలు కూడా ఉండడం కద్దు. ఈ మార్పులు సాహిత్య స్వరూప స్వభావాల్లో మార్పులకు దారితీయడం మనకందరికీ అనుభవంలోకి వచ్చిన విషయమే. 1970 దశకంలో బాంగ్లాదేశ్ యుద్ధం నేపథ్యంలో న్యూస్ ప్రింట్ కొరత ఏర్పడిన విషయంలో చరిత్రలో నమోదయిందే. ‘షుందొర్ బొన్స్’ (అంటే మరేం లేదు, సుందర్ బన్స్ ప్రాంతం) నుంచి కాయితం కర్మాగారాలకి అందే కొయ్య గుజ్జు నుంచే న్యూస్‌ప్రింట్ తయారయ్యేది. బాంగ్లా యుద్ధం కారణంగా కొయ్య గుజ్జు సరఫరా నిలిచిపోయింది. దాంతో న్యూస్ ప్రింట్ ఉత్పత్తి ఆగిపోయింది. పర్యవసానంగా, పత్రికలకి న్యూస్ ప్రింట్ కోత విధించిన సంగతి చాలామంది తెలిసిన విషయమే. ఇప్పుడు యాభయ్యో - అరవయ్యో పడిలో పడిన వాళ్లలో చాలామందికి అప్పట్లో వార - మాస పత్రికల సైజు సగానికి సగం తగ్గిన విషయం గుర్తుండే వుండాలి. ఆ మార్పుకు పర్యవసానంగా పుట్టుకొచ్చిన ప్రక్రియే మినీ కవిత. కార్డు కథలు కూడా. కొందరు అత్యుత్సాహులు దాన్ని ‘విప్లవం’తో పోల్చారు. ఉరుకులు పరుగులు తీసే ఆధునిక నాగరికత తాలూకు అనేక పరిమితులకు - ముఖ్యంగా టైమ్ లేకపోవడాని - ఈ ప్రక్రియ అతికినట్లు సరిపోయింది. ఆ కారణంచేతనే మినీ కవిత రకరకాల పేర్లతో - ‘అప్‌డేట్’ అయిన రూపాలతో - ఇప్పటికీ మనుగడ కొనసాగిస్తోంది. మారుతున్న భౌతిక పరిస్థితులు మన అస్తిత్వంలో భాగమయిపోవడం అంటే ఇదే! ఇది ఒక్క ఉదాహరణ మత్రమే. చూడగలిగితే, అడుగడుగునా ఇలాంటి పరిణామాలు కనిపిస్తాయి.
అరవయ్యేళ్ల కిందట అనాథాశ్రమాలు ఎక్కడో ఒకటీ అరా వుండేవి. ‘దోస్తీ’ ‘కళత్తూరు కణ్ణమ్మ’ (తెలుగులో ‘మూగనోము’) లాంటి సినిమాలు అప్పుడే వచ్చాయి. ఇరవయ్యేళ్ల కిందట వృద్ధాశ్రమాలు అనూహ్యాలు. పది పదిహేను కోట్ల మంది వృద్ధులతో వర్థిల్లుతున్న మన దేశంలో వాడవాడనా వృద్ధాశ్రమాలు పుట్టుకొచ్చాయిప్పుడు. వృద్ధుల జీవితాలు ఇతివృత్తాలుగా ఏటేటా వందలాది నవలలూ వేలాది కథలూ వెలువడుతూనే ఉన్నాయి. పదిహేనేళ్ల కిందట హిందీలో వచ్చిన ‘బాగ్‌బాన్’ (తోటమాలి) అనే సినిమా అందరికీ తెలిసిందే. అరవయ్యేళ్ల కిందట కన్నడంలో వచ్చిన ‘స్కూల్ మాస్టర్’ అనే సినిమా ఈ చిత్రానికి మూలమనే సంగతి ఎందరికి తెలుసు? నాలుగున్నర దశాబ్దాల కిందట విడుదలయిన తెలుగు ‘బడిపంతులు’ కూడా ఈ కన్నడ ‘స్కూల్ మాస్టర్’కి అనుకృతేనని చాలామందికి తెలిసి వుండదు. దీన్నిబట్టి మన కళాకారులు, సామాజిక వాస్తవాలు బీజప్రాయంగా ఉండిన దశలోనే వాటి రూపరేఖల్ని పసిగడతారని గ్రహించవచ్చు. ఇలాంటి సందర్భాల్లో ‘ఆధునికత’ కేవలం కాలసూచిక కాదు - అది, ఆయా కళాకారుల ఆలోచన ధోరణిని అభివర్ణించే విశేషణమే!
అయితే, ఆధునికతకు, కాల సంబంధమయిన అర్థం లేనేలేదని ఎంత మాత్రం కాదు. శబ్దరత్నాకరం చెప్పిన మాటను కాదనడానికి ఎవరికయినా ఎన్ని గుండెలుండాలి? ఎటొచ్చీ మారిన నేపథ్యంలో, ఈ మాట సంతరించుకున్న విస్తృతమయిన భావాన్ని కూడా మనసులో పెట్టుకోమని మనవి. అంతియ!

-మందలపర్తి కిషోర్ 81796 91822