పెరటి చెట్టు

వ్యక్తినిష్టత అంటే ఏమిటి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆధునిక సాహిత్య పరిభాషలో తరచు వినబడే మాటల్లో వ్యక్తినిష్టత, వస్తునిష్టత అనేవి ముఖ్యమయినవి. పుస్తకాలు చదివే అలవాటున్న వాళ్లకి - కాస్తోకూస్తో తత్వశాస్త్రం గురించి చదువుకున్న వాళ్లకి - వ్యక్తినిష్టత గురించీ, వస్తునిష్టత గురించీ పనిగట్టుకుని చెప్పనక్కర్లేదు. అయినప్పటికీ ఈ విషయాన్ని సరళమయిన ఉదాహరణల సహాయంతో ఒక్కసారి పరిశీలిద్దాం. మనుషులు సాధారణంగా రెండు ప్రపంచాల్లో బతుకుతుంటారు. ఒకటి వాళ్ల మానసిక ప్రపంచం. దాన్లోకి ఇతరులకి ప్రవేశం వుండదు. దానే్న వ్యక్తినిష్టమంటారు. రెండోది, మనందరితోనూ పంచుకునే సామాజికమయిన మనుగడ. దానే్న వస్తునిష్టమంటారు. దాన్ని కూడా ఎవరికి వారుగా బతకాలని ప్రయత్నించిన పక్షంలో అలాంటి వాళ్ల ఆరోగ్యం - ముఖ్యంగా మానసిక ఆరోగ్యం - సవ్యంగా లేదని అర్థం చేసుకోవాలి. ఇలాంటి వారికి వైద్యం చేయిస్తే, కచ్చితంగా ఫలితం ఉంటుంది! ఏదో, మన చర్చ కోసం, వీటిని వేర్వేరుగా చెప్పుకుంటున్నాం కానీ, వాస్తవానికి అవి అలా పరస్పరం పూర్తిగా వేరయిపోయిన లోకాలు కావు. వ్యక్తినిష్టతకి ప్రాతిపదికగా వస్తునిష్టతే ఉంటుంది; వస్తునిష్టతకి వ్యక్తినిష్టమయిన ప్రాతిపదికలూ ఉంటాయి. అయినప్పటికీ, ఒకటి మాత్రం నిజం. ఆ రెండూ ఒకటి కావు!
వస్తునిష్టత - కొంచెం హెచ్చుతగ్గులతోనే అయినప్పటికీ - ఉమ్మడిగా మన అందరి అనుభవాల్లోకి వచ్చే విషయమే. అంచేతనే, దానితో లీనమయిపోవడం తేలిక. దానితో తీవ్రంగా విభేదించడం కూడా తరచు జరుగుతూనే ఉంటుంది. సాధారణంగా ఈ వస్తునిష్టత మనిషి అస్తిత్వానికి ఆవలగా ఉండే విషయాలతోనూ, సంఘటనలతోనూ ముడిపడినదయి ఉంటుంది. ఆ సంఘటనలతోనో, విషయాలతోనో ఆయా వ్యక్తులు ప్రత్యక్షంగా ముడిపడి వుంటే తప్ప వాటిని వాళ్లు ప్రభావితం చెయ్యలేరు. అప్పుడయినా, ఏమేరకి ప్రభావితం చెయ్యగలరనే విషయం వాస్తవ పరిమితులపై ఆధారపడి వుంటుంది. వస్తునిష్టతతో రచయితలు అలీనంగా ఉంటారని, సాహిత్య పరిభాషలో చెప్తారు. సాహిత్యానికి సంబంధించినంతవరకూ, ఈ విషయంలో రచయితలు కేవలం వాహికలుగానే వ్యవహరిస్తారని అంటారు. కానీ, వ్యక్తినిష్టతతోనే పేచీ అంతా. ఎందుకంటే, అది ఒక్కో రచయిత - లేదా పాత్ర - తాలూకు మానసిక వ్యాపారంతో ప్రత్యక్షంగా ముడిపడి వుండే విషయం. వ్యక్తినిష్టమయిన విషయాలకు సంబంధించి, పాత్రల మనోవ్యాపారం రచయితలనూ, రచయితల మనో వ్యాపారం పాత్రలనూ ప్రత్యక్షంగా ప్రభావితం చెయ్యడం కద్దు. ఈ పరిణామం పర్యవసానంగా అత్యద్భుతమయిన కళాఖండాలు పుట్టుకొచ్చాయని విమర్శకులు అంటారు.
బాహ్య పరిణామాలకు సంబంధించి, రచయితలు తమ అభిప్రాయాలనూ, దృక్పథాన్నీ తమ రచనల్లో వ్యక్తీకరించరని కాదు. ఆయా అభిప్రాయాలూ, దృక్పథాలూ ప్రాయికంగా వస్తునిష్టతకు సంబంధించిన విషయాలే కూడా. అయితే, మనుషులు వ్యక్తినిష్టతకు అతీతంగా వ్యవహరించడం సామాన్య రచయితల సాధారణ ప్రవర్తన కాకపోవచ్చు. కానీ, రచయితలు అలా వ్యవహరించజాలరని చెప్పలేం. ఎందరో మహారచయితలు - ముఖ్యంగా మహాకవులు - ఇలా స్పందించిన సందర్భాలు మనకందరికీ తెలుసు. సీతమ్మ మనోభావాల్ని కరుణరసార్ద్ర పూరితంగా వర్ణించిన భవభూతి గానీ, కంకంటి పాపరాజు గానీ ఆడవాళ్లు కాదు గదా! బాలవితంతువుల సమస్యల పట్ల హేతుబద్ధమయిన చర్చను మొదలుపెట్టిన వీరేశలింగం స్ర్తి కాదు కదా! ఆధునిక మహిళ చరిత్రను తిరగరాయాలని ఆశించిన గురజాడ మాత్రం స్ర్తియా? విరుద్ధ భారతం రాసిన మంగిపూడి వెంకటశర్మ దళితుడు కాడు. జైళ్లలాంటి ఇళ్లలో మగ్గిపోయే గృహిణుల వేదనలను అక్షరీకరించిన చలం మహిళ కాదు. అలాగే, కార్మిక వర్గ పక్షపాతం పతాకగా ఎత్తిన శ్రీశ్రీ ఆ వర్గానికి చెందిన కవి కాడు. ఇవన్నీ, మహారచయితలు సామాన్య సూత్రాలకు భిన్నంగా వ్యవహరించగలరని చెప్పడానికి నిదర్శనాలు. వ్యక్తినిష్టత, వస్తునిష్టతల మధ్య మనం గీసే కాల్పనిక సరిహద్దు రేఖలు మహారచయితలూ కవులకు పట్టకపోవచ్చు. లేదా, అలాంటి వాటిని పట్టించుకోని వాళ్లనే లోకం మహానుభావులుగా గుర్తిస్తుందేమో!
రచన ప్రాథమికంగా వ్యక్తినిష్టమయిన కార్యకలాపమే. కానీ, సాహిత్య చరిత్ర చూస్తే, వస్తునిష్టమయిన సాహిత్యమే ముందు పుట్టిందని తెలుస్తుంది. మనం నాగరికత అని పిలిచే జీవనవిధానం బీజప్రాయంగానయినా రూపుదిద్దుకోక ముందే తొలితొలి కవితలు వినిపించాయి. అరుదయిన ఛందస్సులు కచ్చితమయిన రూపం తీసుకునే నాటికి మనిషికి వండుకు తినడం కూడా రాదని చెప్తారు. ఆ దశలో వచ్చిన సాహిత్యంలో వినికిడి ద్వారానూ, చూపుల ద్వారానూ గ్రహించిన విషయాలకే ప్రాముఖ్యమెక్కువ. ఆ విషయాల విశే్లషణ ఆ సాహిత్యంలో కనిపించదు. వాళ్ల జీవనంలో పనిచెయ్యడానికీ, పంచేంద్రియాల ద్వారా విషయగ్రహణం చెయ్యడానికీ వున్న ప్రాధాన్యం ఆ సమాచారాన్ని విశే్లషించడానికి లేదు. బహుశా ఆ కారణంచేతనే, వాళ్ల సాహిత్యంలో కూడా దానికి పెద్ద ప్రాముఖ్యం దక్కలేదు.
ఆధునిక నాగరికత దీనికి పూర్తిగా భిన్నం. ఈ తరహా జీవనం నుంచి పుట్టుకొచ్చే కళ సంక్లిష్టంగా ఉండడం సహజం. ఎందుకంటే, ఆధునిక నాగరికతలో బహుళత్వం, భిన్నత్వం - కొండొకచో వైరుధ్యం - చాలా ఎక్కువ. పదాల ద్వారా వ్యక్తీకరించే విషయంకన్నా వౌనం ద్వారా చెప్పే భావాలే ఎక్కువగా ఉంటాయి. సహజంగానే, ఇలాంటి కళకు విశ్వజనీనత ఉండదు. ఒకరికి ఒకలా అర్థమయింది మరొకరికి అలా అర్థం కాకపోవచ్చు. ఒకవేళ అందరికీ ఒకేలా అర్థమయినా, రచయిత ఉద్దేశం అది కాకపోవచ్చు. మార్మిక కవిత్వం విషయంలో పరస్పర విరుద్ధమయిన వివరణలు మనమందరం విన్నవే. ఆయతుల్లాహ్ రుహల్లాహ్ కుమెరుూ్న లాంటి వాళ్లు రాసిన మార్మిక గజళ్లు ఇంతవరకూ ఏ ఒక్కరికీ సంపూర్ణంగా అర్థం కాలేదంటారు. ‘హైకూ’ల విషయంలోనూ ఇలాంటి అనుభవాలు నమోదయ్యాయి. ఇవన్నీ వస్తునిష్టమయిన కళకు ఉండే లక్షణాలు. వీటిని గుణాలుగానో దోషాలుగానో పరిగణించడంలో పెద్ద పరిణతి కానరాదు.
ఈ చర్చంతా గమనించి, వస్తునిష్టత సరళంగా ఉంటుందనీ, వ్యక్తినిష్టత సంక్లిష్టంగా ఉంటుందనీ తీర్మానాలు చెయ్యడం తొందరపాటే అవుతుంది. ఏది ఎవరికి సరళమవుతుంది, ఎవరికి క్లిష్టమనిపిస్తుంది అనే విషయం ఆయా వ్యక్తుల మీద ఆధారపడి ఉంటుంది. కొందరికి అంకెలు తేలిగ్గా వంటబడతాయి. మరికొందరికి అక్షరాలు మాత్రమే బుర్రకెక్కుతాయి. ఆ రెండింటిలో ఏవి తేలిక, ఏవి కష్టం అని నిర్ణయించడం సాధ్యమా? వస్తునిష్టత, వ్యక్తినిష్టతల విషయంలో కూడా అంతే!

-మందలపర్తి కిషోర్ 81796 91822