పెరటి చెట్టు

తెలుగు సూర్యుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘మనుషుల గుణగణాలను లెక్కగట్టడానికి నిక్కమయిన గీటురాయి ఒకటుంది - తనకి ఎటువంటి ఉపకారం చెయ్యలేని వ్యక్తిని అతను ఎలా చూస్తాడనేదే ఆ గీటురాయి’ అన్నారట డాక్టర్ శామ్యూయెల్ జాన్సన్. ఛార్ల్స్ ఫిలిప్ బ్రౌన్ భారతదేశంలో జన్మించడానికి దశాబ్దంన్నర ముందే లండన్‌లో కన్నుమూసిన జాన్సన్‌కి మన ‘తెలుగు సూర్యుడు’ తెలిసి వుండే అవకాశం లేదు. కానీ, తెలుగు భాషకీ, సాహిత్యానికీ, సంస్కృతికీ - ఒక్కమాటలో చెప్తే సాంస్కృతిక పునరుజ్జీవన ఉద్యమానికంతటికీ - బ్రౌన్ చేసిన సేవను గురించి తల్చుకున్నప్పుడల్లా డాక్టర్ జాన్సన్ మాటలే గుర్తుకొస్తూ వుంటాయి. పద్దెనిమిదో శతాబ్ది కడగొట్టు సంవత్సరాల్లో కలకత్తా (నేటి కోల్‌కతా)లో ఓ క్రైస్తవ మతాధికారి కుమారుడిగా జన్మించాడు బ్రౌన్. అతని తండ్రి డేవిడ్ బ్రౌన్‌కి - సంస్కృతంతో సహా - చాలా భాషలు తెలుసట. అతగాడు తన కొడుక్కి కూడా ఆ భాషలన్నీ నేర్పించడంలో వింతలేదు. బహుశా తండ్రి ఇచ్చిన స్ఫూర్తితో సీపీ బ్రౌన్ - గ్రీక్, లాటిన్, పారశీ, సంస్కృత భాషల్లో ఆరితేరాడు. ఇవన్నీ అప్పటికే అంతర్జాతీయ సువిఖ్యాతమయిన ‘ప్రాచీన’ భాషలు. వాటిల్లోని సాహిత్యం అప్పటికే దేశదేశాల్లో వ్యాపించి వుంది. ఇంగ్లిష్‌తోసహా అనేక అంతర్జాతీయ భాషల్లోకి అప్పటికే ఆ సాహిత్యం అనువాదమయింది కూడా. చిత్రమేమిటంటే, అయిదేళ్లు ఇంగ్లండ్‌లో చదువుకుని, భారతదేశంలో పనిచేయడానికొచ్చిన బ్రౌన్ ఆ భాషల్లో కృషి చేసేందుకు ఆసక్తి చూపించలేదు! తెలుగు భాషలో కృషి చెయ్యాలని బ్రౌన్ చేసిన నిర్ణయం ఆయన విపరీత మనస్తత్వానికి తార్కాణం. (విపరీత మనస్తత్వం అనేది తిట్టు కాదని గ్రహించ ప్రార్థన!) బ్రౌన్ తెలుగు భాషలో కృషి చెయ్యాలని నిర్ణయించుకునే నాటికి, ఆంగ్లేయ అధికారులకి ఆ భాషని నేర్పే మనుషులు కూడా లేరు. అనగా, తెలుగు భాషని నేర్చుకోవడం వల్ల బ్రౌన్‌కి ఉద్యోగ సోపానంలో పైకి పాకిపోయే భాగ్యం దక్కే అవకాశం కూడా లేదు. ఇలాంటి సందర్భాల్లోనే మనుషుల నిజమయిన స్వభావమేమిటో బయటపడుతుందని జాన్సన్ అన్నారు!
తెలుగు నాట బ్రౌన్ విభిన్నమయిన స్థాయిల్లో, వివిధ ప్రాంతాల్లో పదిహేడేళ్లు అధికార బాధ్యతలు నిర్వహించారు. ఎక్కడ పనిచేసినా, అక్కడి సామాన్య ప్రజల సంక్షేమాన్ని పట్టించుకున్న అధికారిగానే బ్రౌన్ పేరు తెచ్చుకున్నారు. ముఖ్యంగా, 1830 దశకంలో గుంటూరు కరువు విరుచుకుపడిన దశలో బ్రౌన్ - పై అధికారులు నొసలు చిట్లిస్తున్నా లెక్క చెయ్యకుండా - బాధితులకు అండదండలందించాడు. మరో ఇరవై ఏళ్ల తర్వాత గోదావరి మండలంలో రైతన్నలని అతివృష్టి - అనావృష్టుల పీడ నుంచి విరగడ చేసిన ఆర్థర్ కాటన్ కూడా ఇదే ధోరణి ప్రదర్శించడం కాకతాళీయం కాదు. మెకెంజీ, మన్రో, బ్రౌన్, కాటన్ లాంటి అధికారులకి తెలుగు ప్రజలు చెయ్యగలిగిన మేలు దాదాపు శూన్యం. కానీ, తెలుగునాట సాంస్కృతిక పునరుజ్జీవనానికీ, ఆర్థిక ఉద్దీపనానికీ ఈ అధికారులు చేసిన సేవ అసమానం. వీరందరిలోకీ, బ్రౌన్ సేవలు విశిష్టమయినవి. న్యాయమూర్తిగానూ, జిల్లా స్థాయి అధికారిగానూ, కరువు నివారణ చర్యల పర్యవేక్షకుడిగానూ ఆయన బాధితులకు ఆలంబనగా నిలిచాడు. ఫలితంగా, పై అధికారుల కనె్నర్రకి గురయి, ఇంగ్లండ్ మరలిపోవలసి వచ్చినప్పుడు బ్రౌన్ చింతించలేదు. వివిధ భాషల్లోనూ, సాహిత్యాల్లోనూ తాను అప్పటికే సాధించిన ప్రావీణ్యాన్ని పదిమందికీ పంచిపెట్టి తరించాడు.
పందొమ్మిదో శతాబ్ది తొలిపాదం చివర్లో తాను తెలుగు సాహిత్యంలో కృషి మొదలుపెట్టేనాటికి నెలకొని వుండిన స్థితిగతులను గురించి బ్రౌన్ స్ఫుటమయిన మాటల్లో అభివర్ణించాడు. ‘అప్పటికి తెలుగు సాహిత్యం కొనప్రాణంతో కొట్టుకులాడుతోంది. 1825 నాటికి ప్రమిదలో దీపం కొడిగట్టిపోతోంది. తెలుగు సాహిత్యం దాదాపు అంతరించిపోతూ ఉండడం నా కళ్లబడింది. నేను 30 ఏళ్లు కృషి చేసి, దాన్ని పునఃప్రతిష్ట చేశాన’న్నాడు బ్రౌన్. నిరలంకారంగా మాట్లాడ్డం బ్రౌన్ శైలి. ఈ మాటల్లో కూడా అందుకే అతిశయోక్తులు కనిపించవు. 1827 నాటికే, బ్రౌన్ ‘ఆంధ్ర గీర్వాణ ఛందము’ అనే పుస్తకం రాసినప్పటికీ, ఆయనకి మంచి గుర్తింపు తెచ్చిన పుస్తకం 1829 నాటి ‘వేమన శతకం’. అప్పటికి బ్రౌన్ అయిదేళ్లుగా వేమన సాహిత్యాన్ని అధ్యయనం చేస్తూ ఉన్నారు. ఇందులో దాదాపు ఏడొందల పద్యాలకి ఆంగ్లానువాదాలతోపాటు విస్తృతమయిన పదకోశం కూడా సమకూర్చారు. మరో పదేళ్ల తర్వాత, 1164 పద్యాల మేరకి విస్తరింపచేసి, తిరిగి ‘వేమన శతకం’ అచ్చువేశారు. ఇదే పుస్తకాన్ని ప్రముఖ ప్రచురణ సంస్థలు యథాతథంగా పునర్ముద్రించినప్పటికీ, తన పేరు ప్రస్తావించక పోవడం గురించి బ్రౌన్ మనసు కష్టపెట్టుకున్నారు. బద్దెన రాసిన ‘సుమతీ శతకం’ పుస్తకాన్ని కూడా బ్రౌన్ సంకలించారు. ఆయన మరణానంతరం - తొమ్మిది దశాబ్దాల తర్వాత - ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ ఆ పుస్తకాన్ని బ్రౌన్ పేరిట ప్రకటించడం నిజంగానే విశేషం!
అరుదయిన తాళపత్ర గ్రంథాలను సేకరించడం, ఎక్కడా దొరక్కుండా పోయిన పుస్తకాలను పునఃపునః ప్రచురించడం, పండిత మండలిని - సొంత ఖర్చుతో - పోషించడం, వేమన - సుమతి శతకాలతోపాటుగా పల్నాటి యుద్ధం లాంటి చారిత్రిక కావ్యాలను ముద్రింపచేయడం బ్రౌన్ దైనందిన కార్యకలాపాల్లో భాగమయిపోయాయి. నన్నయ్య, తిక్కన, గౌరన, శ్రీనాథుడు, పోతన, పెద్దన, రామరాజ భూషణుల కృతుల పరిష్కరణ - ప్రచురణల భారాన్ని బ్రౌన్ తన తలకెత్తుకున్నారు. ఏనుగుల వీరాస్వామి లాంటి ఉన్నతోద్యోగి, తన ‘కాశీయాత్ర చరిత్ర’ను ప్రచురింప చేయమని బ్రౌన్‌ను అభ్యర్థించడం నిజంగానే విశేషం. బ్రౌన్ విశిష్టతలను ఏకరువు పెట్టడం మొదలుపెడితే, తెల్లారిపోవడం ఖాయమనే మాట నిజమే కానీ, అర్థంతరంగా అంత గొప్పవాడి కథను ముగించడం ఎవరికయినా అసాధ్యమే. ముఖ్యంగా, వ్యావహారిక భాష అనే మాటయినా పుట్టకముందే, వాడుక భాషలో రాసిన సంపాదక లేఖల నకళ్లను రాయించి భద్రపరచడం బ్రౌన్ సుదూర దృష్టికి నిదర్శనం. అలనాటి డొక్కల కరువు బీభత్సాన్ని వర్ణిస్తూ, ఒక మాజీ సంపాదకుడు - మండిగల వెంకటశాస్ర్తీ - మరో పత్రికకి రాసిన లేఖను అందులో చేర్చారు బ్రౌన్. సంస్కృతంలో శ్లోకం చెప్పిన బ్రాహ్మణ పండితులకి ఇచ్చిన దక్షిణకి రెట్టింపు మొత్తం తెలుగులో పద్యాలు చెప్పిన ‘సాతాని’ చిన్న యసూరికి ఇవ్వడాన్ని విమర్శించిన లేఖ సయితం ఈ జాబుల్లో ఉంది! మన ముఖం ఎంత సుందర ముదనష్టంగా ఉందో శతాబ్దాల తర్వాత చూసి ఆనందించే భాగ్యం కల్పించినందుకు మనమందరం బ్రౌన్‌కి రుణపడి ఉండాలి. తెలుగు జాతినంతటినీ ఇలా రుణగ్రస్తం చేసినందువల్లనే బంగోరె లాంటి పరిశోధక రాక్షసులు బ్రౌన్ అంటే అంతగా ప్రాణం పెట్టింది! ‘సాంస్కృతిక పునరుజ్జీవన ఉద్యమాలన్నీ ఓ ఆక్రందనతోపాటుగా ఈ లోకాన్ని చేరుకుంటాయి. అది, విముక్తి కోసం అలమటించే మానవాత్మ చేసే ఆక్రందన!’ అంది ఆన్ సలీవెన్. ‘తెలుగు సూర్యుడు’ ఛార్ల్స్ ఫిలిప్ బ్రౌన్ మాటల్లోనూ చేతల్లోనూ ఈ ఆక్రందనే విస్ఫుటంగా వినిపిస్తుంది!

-మందలపర్తి కిషోర్ 81796 91822