పెరటి చెట్టు

జాతీయ సంస్కర్త!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘భరతఖండంబు చక్కని పాడియావు
హిందువులు లేగదూడలై యేడ్చుచుండ
తెల్లవారను గడుసరి గొల్లవారు
పితుకుచున్నారు మూతులు బిగియగట్టి’ - ఈ పద్యం తెలియని తెలుగు సాహిత్య జీవులు ఉండరు. ఇరవయ్యో శతాబ్ది తొలినాళ్లలో, గోదావరి తీరంలో జరిగిన ఓ బహిరంగ సభలో చిలకమర్తి లక్ష్మీనరసింహం ఆశువుగా చెప్పిన ఈ చరిత్రాత్మక పద్యాన్ని, కృషాణ బరాజ్ గోడల మీద కెక్కించారు ఆనాటి దేశభక్తులు. ఒక దేశభక్తి గీతానికి అంతకుమించిన సమ్మానం, సత్కారం ఏముంటాయి? అందుకే, ఆ విషయాన్ని చిలకమర్తి తన ‘స్వీయచరిత్రము’లో సగర్వంగా నమోదు చేసుకున్నారు. కందుకూరి వీరేశలింగం కన్నా దాదాపు రెండు దశాబ్దాలు - గురజాడ కన్నా అర్ధ దశాబ్దం చిన్నవాడయిన చిలకమర్తి పద్యం, ప్రహసనం, నాటకం, నవల, కథానిక, స్వీయ చరిత్ర తదితర ప్రక్రియల్లో రాణించిన బహుముఖ ప్రజ్ఞావంతుడు. గోదావరికి ఎడాపెడా గట్లపై వర్థిల్లిన నడిమితరగతి జీవనాన్ని - ఆనాటికి అంకురప్రాయంగానే ఉండిన సమకాలీన చరిత్రని - అన్నివర్గాల పాఠకుల హృదయాలకూ పట్టేలా ‘రామచంద్ర విజయం’ లాంటి నవలల రూపంలో రాసిన విమర్శనాత్మక వాస్తవవాది. ‘కీచక వధ’ మొదలుకుని ‘గయోపాఖ్యానం’ వరకూ, ‘ప్రసన్న యాదవం’ మొదలుకుని ‘పారిజాతాపహరణం’ వరకూ, ‘శ్రీరామ జననం’ మొదలుకుని ‘సీతాకల్యాణం’ వరకూ కళ్లకి కట్టినట్లు నాటకమాడించిన ఆంధ్రా షేక్‌స్పియర్. ‘కర్పూర మంజరి’ మొదలుకుని ‘సుధా శరచ్చంద్రము’ వరకూ కాల్పనిక కథాకావ్యాలను చెప్పి మెప్పించిన ఆంధ్రాస్కాట్. కర్నల్ జేమ్స్ టాడ్ రాసిన చారిత్రిక కథనాల ఆధారంగా ‘రాజస్థాన కథావళి’ వరసగా రాసిన సృజనశీలి. ‘గణపతి’ లాంటి నవలలో ‘శుక్లాంబర ధరం విష్ణుం శశివర్ణం...’ శ్లోకానికి అనూహ్యమయిన, అనిదంపూర్వమయిన హాస్యభాష్యం వినిపించిన చతురుడు. నండూరి సుబ్బారావు, సి.రామమోహనరావు, సీతారత్నమ్మ లాంటి నటశిఖరాలతో రూపొందించిన ‘గణపతి’ శ్రవ్య నాటకం - అర్ధశతాబ్దం కిందట విన్న రేడియో పరికల్పన - ఇప్పటికీ చెవుల్లో మార్మోగుతూనే ఉంది! ‘గణపతి’ పుణ్యమాని చిలకమర్తితో కనీసం అరడజను హాస్య రచనలు చేయించి, అచ్చువేయించి, అమ్ముకున్నారు మన ప్రచురణకర్తలు.
చిలకమర్తి కేవలం రచయిత మాత్రమే కారు. ‘సరస్వతి’ ‘మనోరమ’ ‘దేశమాత’ తదితర పత్రికల ద్వారా కొత్తతరం పాఠకులను సృష్టించి, కొత్త సంస్కృతిని పరిపోషించడంలో కందుకూరికి వారసుడిగా నిలిచినవాడు చిలకమర్తి. వివేకవర్ధని ప్రెస్‌లో కొంత భాగం కొని, తన రచనలనేకం ప్రచురించిన దక్షకుడు చిలకమర్తి, కందుకూరి ప్రియశిష్యుడిగా ఆయన బాటలో కడదాకా నడిచిన సంస్కర్త చిలకమర్తి. గురుపాదుల బాటలోనే, చిరుద్యోగిగా ఉండే రోజుల్లోనే విద్యావ్యాప్తికి పాఠశాలలు పెట్టిన చొరవ ఆయది. మహాభారతానువాదం మొదలయిన గడ్డ మీద - బ్రాహ్మణ వాడకట్టు నడిబొడ్డున - దళితుల కోసం పాఠశాల స్థాపించి, పదమూడేళ్లు నిర్వహించిన సామర్థ్యం ఆయనది. తన ఎనిమిది పదుల జీవితంలో చిలకమర్తి దాదాపు సగభాగం, కంటిచూపు లేకుండానే మనుగడ సాగించవలసి వచ్చింది. ఆయన చేత ఉద్యోగం మాన్పించిన ‘మహారాజ పోషకులే’, తమ పాటకు తాళం కొట్టలేదని చిలకమర్తికి లీగల్ నోటీసులు ఇప్పించారు. బ్రిటిష్ పాలకులు ‘దేశమాత’ లాంటి పత్రికలపై నిఘా చర్యలు పెంచి, పని చేసుకోలేని వాతావరణం సృష్టించారు. ఆ పత్రిక ఆర్థిక మూలాల మీద దెబ్బతియ్యడానికి తెగబడ్డారు. ఆ దశలో కొందరు, పత్రిక మీద వచ్చే నష్టం తాము భరిస్తామని ముందుకొచ్చినా, తన కార్యకలాపాల కారణంగా మరెవరో నష్టపోవడం నచ్చక చిలకమర్తి ఆ పత్రికను మూసేశారు. అంతకుమించి, బ్రిటిష్ పాలకుల పెత్తందారీతనానికి తలవంచి, పత్రికను కొనసాగించడం అంతరాత్మను తాకట్టుపెట్టడంగా భావించారు చిలకమర్తి. అదీ ఆయన వ్యక్తిత్వంలోని విశేషాంశ!
వాస్తవానికి, మన సాంస్కృతిక పునరుజ్జీవన ఉద్యమానికీ, సంఘ సంస్కరణ కృషికీ జీవితాలు ధారపోసిన మహనీయులు ప్రతి ఒక్కరి చరిత్రలోనూ ఈ విశేషాంశ తళతళ మెరుస్తూ కనిపిస్తుంది. ఇక, అసలు మన చరిత్రలో సాంస్కృతిక పునరుజ్జీవన ఉద్యమమూ, సంఘ సంస్కరణ కృషీ జరగనే లేదని భావించేవారి కళ్లకి ఈ కార్యకలాపాలు ఎలా కనిపిస్తాయో ఒక్కసారి చూద్దాం - ‘్భరతీయుల సామాజిక రూపం ఎంత ఛండాలంగా ఉందో, ఇక్కడి విద్యావిధానం ఎంత అశాస్ర్తియంగా ఉందో, ఇక్కడి వ్యవస్థలు ఎంతగా కుళ్లి కంపు కొడుతున్నాయో వివరిస్తూ భారతీయ సంస్కర్తలు నాటకాలు రాశారు. పాటలు పాడారు. వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కొత్తకొత్త సంస్థలు నెలకొల్పారు. వారి వెనుక రవి అస్తమించని బ్రిటిష్ ప్రభుత్వం ఉంది. వారి ఆశీస్సులున్నాయి. సంస్కర్తలెవరూ జాతీయవాదులు కాకపోవడం మనం గమనించాల్సిన అంశం’ అంటూ ఓ సరికొత్త సిద్ధాంతం ప్రవచించారు పిన్నమనేని మృత్యుంజయరావు అనే సిద్ధాంతి. మనం ‘గమనించాల్సిన అంశ’మేమిటయ్యా అంటే మన సంస్కర్తలెవరూ జాతీయవాదులు కారనీ, వాళ్లందరూ ‘లార్డ్ మెకాలే ప్రణాళిక’ అనే కుట్రను విధేయంగా అమలు చేసేందుకు జీవిత పర్యంతం కృషి చేసిన తైనాతీలనీను! శభాష్, సిద్ధాంతం మోతెక్కిపోయింది!! ఇటీవలి కాలంలో ఇంతకు మించిన వౌలిక సిద్ధాంత కల్పన మరొకటి లేదని ఢంకా బజాయించి చెప్పొచ్చు.
ఎటొచ్చీ, సదరు వౌలిక సిద్ధాంత ప్రవచనం చెవినపడగానే, కొన్ని ప్రశ్నలు గూబ గుయ్యిమనిపిస్తున్నాయి. ‘్భరతఖండంబె ఒక పెద్ద బందిఖాన..’ పద్యం చెప్పిన చిలకమర్తి లక్ష్మీనరసింహం జాతీయవాది అవునా కాదా? గాంధీగారు ‘హరిజనోద్ధరణ’ నినాదం ఇవ్వకముందే, రాజమండ్రి - ఆర్యాపురంలో దళితుల కోసమే ఓ పాఠశాల స్థాపించి, పుష్కరానికి పైగా నడిపిన చిలకమర్తి సంస్కర్త అవుతారా? కారా?? గోదావరి జిల్లాల్లో పర్యటించిన బిపిన్ చంద్ర పాల్ ప్రసంగాలను ఊరూరా తిరిగి అనువదించిన చిలకమర్తి జాతీయవాది అవునా కాదా? వీరేశలింగాని తాను ప్రియశిష్యుడినని చెప్పుకున్న చిలకమర్తి సంస్కర్త అవుతారా? కారా? గోదావరీ మండల కాపుల (రైతుల) మహాసభల్లో ఆశువుగా పద్యధార వినిపించి, తెలుగులో మొట్టమొదటి జాతీయవాద కవి అనిపించుకున్న చిలకమర్తి జాతీయవాది అవునా? కాదా? తన ‘స్వీయ చరిత్రము’లో విద్య - మతం - రాజకీయ రంగాల్లో సంస్కరణలు అవసరమనీ, అవి సంపూర్ణంగా పూర్తి కాకుండా, అన్ని వర్గాలకూ స్వాతంత్య్ర ఫలాలు దక్కవని నొక్కి వక్కాణించిన చిలకమర్తి సంస్కర్త అవుతారా? కారా?? గురుపాదుడయిన వీరేశలింగంతోనే విభేదించి, రాజకీయ స్వాతంత్య్రం రానిదే దేశం విముక్తం కాదని ప్రకటించిన చిలకమర్తి జాతీయవాది అవుతారా? కారా?? తన సొంత అక్కకి బాల్యవివాహం జరిపించిన ఉదంతాన్ని విపులంగా ‘స్వీయ చరిత్రము’లో వివరించి, అలాంటి దురాచారాన్ని నిరసించిన చిలకమర్తి సంస్కర్త అవుతారా? కారా??
అదే విధంగా, ‘హిందూ మహాయుగము’ ‘ముస్లిం మహాయుగము’ ‘శివాజీ చరిత్రము’ తదితర జాతీయ చరిత్ర రచనలు చేసిన కొమర్రాజు వేంకట లక్ష్మణరావు జాతీయవాది అవునా? కాదా? విజ్ఞాన చంద్రికా గ్రంథమాల ద్వారా పాశ్చాత్య వైజ్ఞానిక, సాంకేతిక పరిజ్ఞానం తెలుగువాళ్లకి అందించిన ఈ నడిచే ‘ఆంధ్ర విజ్ఞాన సర్వస్వము’ సంస్కర్త అవుతారా కారా? ‘దేశమును ప్రేమించుమన్నా’ అని ప్రబోధించడమే కాకుండా, చిలకమర్తి చెప్పిన ‘నేల దున్నుదమన్న చాల తరవౌ పన్ను, నీరు కావలెనన్న నీటి పన్ను..’ లాంటి పద్యాలను ఇంగ్లిష్‌లోకి అనువదించిన గురజాడ జాతీయవాది అవునా, కాదా? ‘కన్యాశుల్కం’ నాటక కర్త సంస్కర్త అవుతారా కారా? రఘుపతి వెంకటరత్నం అంతేవాసిగా బ్రహ్మ సమాజంలో కృషి చేసిన ముట్నూరి కృష్ణారావు సంస్కర్త అవుతారా కారా? 38 సంవత్సరాలపాటు ‘కృష్ణాపత్రిక’ను జాతీయ భావాలకు వేదికగా మలచిన ఈ సంపాదక మహాశయుడు జాతీయవాది అవుతారా? కారా? కాశీనాథుని నాగేశ్వరరావు, ఉన్నవ లక్ష్మీనారాయణ, టంగుటూరి ప్రకాశం తదితరులు వీరేశలింగంగారి సంస్కరణోద్యమాన్ని త్రికరణ శుద్ధిగా బలపరిచారు కూడా, వారు జాతీయ వాదులవుతారా? కారా??
సంస్కర్తల జాతీయవాదాన్ని గీటురాళ్ల మీద నిగ్గుతేల్చడానికి తెగబడిన సిద్ధాంత ప్రవక్తలను ఇలాంటి ప్రశ్నలు పెద్దగా బాధించలేదేమో! ఎందుకంటే, వారు ‘చక్కగా ఆచరింపబడిన పరధర్మము కన్న గుణము లేనిదైనను స్వధర్మమే మేలు’ అనే గీతాబోధను ఔదలదాల్చే నిఖార్సయిన జాతీయవాది మరి. ఇంతకీ, ఈ ‘మతబోధ’లో జాతీయ భావం ఎక్కడుందని మాత్రం నన్ను అడక్కండి!

-మందలపర్తి కిషోర్ 81796 91822