పెరటి చెట్టు

అక్షరాల యథావాక్కు, అన్నమయ్య రుక్కు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చరిత్ర - ముఖ్యంగా, సాహిత్య చరిత్ర - నిజంగానే ఓ మట్టికాళ్ల మహారాక్షసి! తలెత్తుకుని నిలబడేవాళ్లని మట్టి పారేస్తూ పోతూనే ఉంటుంది. అత్యధికుల విశ్వాసాలకు తాళం కొట్టని వాళ్లకీ, గొంతు చించుకుని గోలచేసే వాళ్లని మించి గర్జించని వాళ్లకీ, దర్పం ఒలకబోసే దర్బారీ కవులకు దీటుగా డాబులు కొట్టని వాళ్లకీ సాహిత్య చరిత్ర పుటల్లో స్థానం దక్కం సందేహాస్పదమే. అయినా, ఓ ననె్నచోడుడు, ఓ వేములవాడ భీమకవి, ఓ యథావాక్కుల అన్నమయ్య లాంటి వాళ్లు - వందల సంవత్సరాల అజ్ఞాతవాస క్లేశాన్ని అవలీలగా అధిగమించి - తిరిగి లేచి, నిటారుగా నిలబడగలుగుతారు. వాళ్లని మనం కవివీరులుగానూ, ధీరకవులుగానూ సమ్మానించుకోవాలి.
‘సర్వేశ్వర ప్రాకామ్య స్తవం’ అనే తన శతకాన్ని, శాలివాహన శకం 1164లో - తన గురువు ఆరాధ్య సోమేశ్వర ప్రభువు నివాసస్థలమయిన దూదికొండ గ్రామంలో - రాశానని యథావాక్కుల అన్నమయ్య స్వయంగా చెప్పుకున్నాడు. (దీన్ని క్రీ.శ. లెక్కలోకి మార్చేందుకుగాను దానికి 78 సంవత్సరాలు కలిపితే 1242 అవుతుంది. సర్వేశ్వర శతకం లాంటి భక్తిప్రపూరిత రచన చేసేనాటికి కవిగారు యాభయ్యో పడిలో పడ్డారనుకుంటే, క్రీ.శ. (1242-50)= 1192లో అన్నమయ్య పుట్టాడని మన సాహిత్య చరిత్రకారులు - ఉజ్జాయింపుగా - లెక్క గట్టారు. ఈ లెక్క సరయినదే అయితే, అన్నమయ్య తిక్కనకన్నా పది పనె్నండేళ్లు పెద్దవాడు అయి వుండాలి! తన గురించీ, కృతి గురించీ, రచనా కాలం గురించీ ఈ మాత్రం సమాచారం ఇచ్చిన కవులు మరెవరూ లేరనే చెప్పొచ్చు! తన గురువు ఆరాధ్య సోమేశ్వర ప్రభువు నివాసస్థలమయిన దూదికొండ గ్రామంలో, ఆయన కరుణ అనే పూలకారులో పూసిన పూలతో, సర్వేశ్వరుడి పాదాలను అర్చిస్తానని అన్నమయ్య అన్నాడు. ‘సర్వేశ్వరా’ అనే మకుటంతో అన్నమయ్య ఈ శతకంలో 139 పద్యాలు పొందుపరిచాడని చెప్తారు. కాగా, ఈ సోమేశ్వర ప్రభువే, పాల్కురికి సోమనాథుడని కొందరు అన్నారు కానీ, దానికి బలమయిన ఆధారాలు ఎక్కడా దొరకలేదు. పైగా, సోమన, దూదికొండలో ఎప్పుడూ లేడనేది ఆరుద్రాదులు ప్రముఖంగా చెప్పిన ప్రతివాదం. వీళ్లిద్దరూ సమకాలికులనడంలో సందేహం లేదు కానీ, సోమ - అన్నమయ్యల మధ్య గురుశిష్య సంబంధం ఉన్న విషయం ఇంతవరకూ ఎక్కడా నిరూపితం కాలేదు. పైపెచ్చు, కొందరి లెక్క ప్రకారం, సోమన కన్నా అన్నమయ్య - కించిత్తు - పూర్వికుడే!
ఇంతకీ, సర్వేశ్వర శతకం రచించి, తన అచంచలమయిన శివభక్తినీ - అనన్య సాధ్యమనిపించే కవితా శక్తినీ - ప్రకటించిన యథావాక్కుల అన్నమయ్య ఇన్ని శతాబ్దాలు మరుగున పడిపోవడానికి కారణమేమిటి? ఈ ప్రశ్న గతంలో ఎవరికీ తట్టలేదని కాదు - వాళ్లు తమకు తోచిన సమాధానాలు చెప్పుకుని మనసుకు సర్ది చెప్పుకున్నా రనిపిస్తుంది. జానుతెలుగులో 32 వేల సంకీర్తనలు రచించిన ‘పద కవితా పితామహుడు’ తాళ్లపాక అన్నమాచార్యుడి నీడ యథావాక్కుల అన్నమయ్యపై దట్టంగా కమ్ముకుపోయి నందువల్లనే ఈ కవివీరుడి గురించి చరిత్రకు పెద్దగా తెలియకుండా పోయిందనేది ఒక అభిప్రాయం. కానీ, ఇది అంత నమ్మశక్యంగా కనిపించడంలేదు. యథా వాక్కుల అన్నమయ్య స్వయంగా చెప్పుకున్నదాని ప్రకారం, ఆయన పదమూడో శతాబ్దం ప్రథమార్ధంలో పుట్టినవాడు. తాళ్లపాక అన్నమయ్య దాదాపు 170 సంవత్సరాల తర్వాత జనె్మత్తినవాడు. ఎనిమిది శతాబ్దాల సుదీర్ఘ సాహిత్య చరిత్రలో 170 ఏళ్లు పెద్ద లెక్కలోది కాకపోవచ్చు. కానీ, ఈ ఇద్దరూ వేరువేరు ప్రక్రియల్లో రాణించిన కవులు, యథావాక్కుల అన్నమయ్య శతకకర్తల్లో విశిష్టుడు కాగా, తాళ్లపాక అన్నమయ్య శృంగార పదకవితా పితామహుడు. వాళ్లిద్దరూ అనుసరించిన సాహిత్య రీతులు పరస్పరం పోలికలేనివి. అందుకే, ఆయన ఛాయ ఈయన మీద కమ్ముకుందంటే నమ్మడం కష్టమనేది.
కాగా, యథావాక్కుల అన్నమయ్య శివభక్తి పరాయణుడు కావడం వల్లనే ఆయన సాహిత్య జీవితం గురించి కచ్చితమయిన సమాచారం దొరక్కుండా చేశారనేది మరో ఆరోపణ. కానీ, యథావాక్కుల అన్నమయ్యకు సమకాలికుడే అయిన పాల్కురికి సోమన విషయంలో అలా జరగలేదు కదా! వీరశైవ మత ప్రచారకుడూ, శివకవిత్రయంలో ఒకడూ అయిన సోమనాథుడికి ఆరతులిచ్చిన సాహిత్య చరిత్ర యథావాక్కుల అన్నమయ్య విషయంలో మరోలా ఎందుకు ప్రవర్తిస్తుంది?
నోటికి పట్టే ఛందస్సులతో అన్నమయ్య రాసిన పద్యాలు తత్సమాలూ తద్భవాలతో నిండివున్న మాట నిజమే కానీ, చదువుకునే వాళ్లకి అవి హాయిగానూ చెవికింపుగానూ ఉంటాయి. యథావాక్కుల అన్నమయ్య శివభక్తి సుప్రసిద్ధమే కానీ, మెడకి గండకత్తెర పెట్టుకుని సర్వేశ్వర శతకం రాశాడని చెప్పే కథలో తప్ప, మరెక్కడా అతగాడు వీరశైవ సంప్రదాయానికి చెందిన వాడిగా కనిపించడు. పైపెచ్చు, ‘దుస్తర భవోన్మాదంబు మర్దించి, చిత్తము నీకిచ్చుట పెక్క్భుంగుల మహౌదార్యంబు’ అన్నవాడు అన్నమయ్య. ఈ మాటలు శివాలెత్తి ప్రవర్తించే వీరశైవులను ఉద్దేశించి అన్నవేనని భాగవతుల శంకరశాస్ర్తీ (అదే ఆరుద్ర!) విశ్వాసం. సర్వేశ్వర శతకం ఆసాంతం సాత్విక భక్తి ప్రవహించిందే తప్ప పరమత సహనం లోపించిన సందర్భాలు ఈ శతకంలో కనిపించవు. అది అలా వుంచితే, భక్తశిఖామణులు కొందరు ఈ శివకవికి అంటగట్టిన అద్భుత, మహిమాన్విత గాథలు ఆయన కవితాత్మకు ఏ మాత్రం తగినట్లు లేకపోవడం గమనార్హం. సర్వేశ్వర శతకకర్తకు పట్టిన (పట్టించిన ?) గ్రహణం గురించిన వాదోపవాదాలన్నీ పాక్షిక సత్యాలే కాగా, మన సాహిత్య చరిత్రకారులకు అన్నమయ్య లాంటి యథార్థవాది గొప్పదనం పట్టకపోవడం వల్లనే ఈ దుస్థితి దాపురించిందన్నది మాత్రం పదహారణాల సత్యం.
ననె్నచోడుడూ, మల్లికార్జున పండితారాధ్యుడూ, పాల్కురికి సోమనాథుడూ - ఈ ముగ్గురినీ కలిపి శివకవిత్రయం అంటారని అందరికీ తెలుసు. అయితే ఈ శివకవి త్రయంలో ననె్నచోడుడికి ఎలా స్థానం దక్కిందో ఊహాతీతం. కవిరాజశిఖామణి రాసింది ప్రబంధం లాంటి పౌరాణిక కావ్యం. అందులో భక్తి తత్పరత కన్నా కళాత్మకతకే ప్రాధాన్యమెక్కువ. నిజానికి ఈ త్రయంలో యథావాక్కుల అన్నమయ్యకి స్థానం కల్పించివుండవలసింది. అలా చెయ్యకపోగా, వందల సంవత్సరాలపాటు అతని కవిత్వం గురించి పల్లెత్తు మాటాడకపోవడం కన్నా దారుణం ఉంటుందా?

-మందలపర్తి కిషోర్ 81796 91822