పెరటి చెట్టు

‘చతుర సాహిత్య లక్షణ చక్రవర్తి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు ‘వాడి’ జాతి లక్షణాలు కనిపెట్టడానికి, మన సాహిత్యం - ముఖ్యంగా మన సంప్రదాయ సాహిత్యం - మంచి ఆకరం! మన కవులు ఏదయినా, ఎన్నయినా రాసివుండొచ్చు గాక - వాటిల్లోంచి, మన పాఠకులు వేటిని మెచ్చుకుని దాచుకున్నారో అవే తర్వాతి తరాల వాళ్లకి దక్కాయి. వాటిని పరిశీలిస్తే, మన వాళ్ల అభిరుచిని పట్టేయొచ్చు. నేను చూసినంతలో, తెలుగు పాఠకులకి బాగా నచ్చే శిల్ప సంవిధానం నాటకీయత! శిల్పంలో పారంగతుడినని చెప్పుకుని, కవిత్వం రాయడం మొదలుపెట్టిన తిక్కన విరాట పర్వంలో ఈ నాటకీయతా శిల్ప సంవిధానంపై సాధించిన ప్రభుతను అడుగడుగునా ప్రదర్శించారు. విరటుడి కొలువులో మారువేషాలతో వున్న పాండవులందరితోనూ మహా నటన ప్రదర్శింపచేశారు తిక్కనగారు. బృహన్నల వేషంలో వున్న అర్జునుడు సరేసరి - సైరంధ్రి వేషంలో వున్న ద్రౌపదినీ వదిలిపెట్టలేదు! ఇదే ప్రభుతని, అటు తర్వాత పధ్నాలుగు పర్వాల పొడవునా ప్రదర్శిస్తూనే పోయారు. అక్కడితో ఆపలేదు - ఆయన ప్రభావం ప్రసరించిన ప్రతి కవి మీదా ఈ నాటకీయతా శిల్ప ప్రభావం కొట్టొచ్చినట్లు కనిపిస్తూనే ఉంటుంది. బహుశా, ఈ శిల్పం తెలుగు పాఠకుల ఆదరణకు అంతగా పాత్రమయిన కారణంగానేమో, తరతరాల కవులు ఈ సంవిధానానే్న మరింత నేర్పుగా ప్రదర్శిస్తూ పోయారు. గోన బుద్ధారెడ్డి రాసిన, రంగనాథ రామాయణం ‘బొమ్మలాట రామాయణం’ కాగలిగిందంటే, అందులోని నాటకీయత వల్లనే. ఇక, నాచన సోమన, కేతల్లోనే కాదు - శ్రీనాథుడిలో కూడా ఈ నాటకీయత ప్రస్ఫుటంగా కనిపిస్తూనే ఉంటుంది. మరీ ముఖ్యంగా ఆయన చాటుధారలో ఈ శిల్ప సంవిధానం ప్రముఖంగానూ, ప్రచురంగానూ కనిపిస్తూ వుంటుంది.
ఇదే నాటకీయత పునాది మీదనే ఒంటి స్తంభం మేడలాంటి అక్షర సౌధం నిర్మించిన చతుర శిల్పి గౌరన. పధ్నాలుగు - పదిహేను శతాబ్దాలకు అంటే తిక్కనగారి తర్వాత మూడు నాలుగు వందల సంవత్సరాల కాలానికి చెందిన చతురుడు గౌరవన. ఆయన ఈ శిల్ప సంవిధానం ఒక కావ్యంలో కాదు - వరసగా రెండు కావ్యాల్లో అద్భుతంగా ప్రదర్శించాడు. గౌరన రాసిన ద్విపద కావ్యాలు, ‘హరిశ్చంద్ర చరిత్ర’ ‘నవనాథ చరిత్ర’ వందల ఏళ్ల తరబడి సామాన్య పాఠకుల హృదయాలను కొల్లగొడుతూనే పోయాయి. ప్రదర్శన కళల్లో కొత్తకొత్త ప్రయోగాలు ఎన్ని జరిగినా, హరిశ్చంద్ర కథ గానీ, మాయా మశ్చీంద్ర కథ గానీ పాతబడలేదు. సెల్యులాయిడ్ మాధ్యమంలో కూడా ఈ రెండు కథలూ పదేపదే జెండా ఎగరేస్తూనే వచ్చాయి. ఈ రెండు కథల్లోనూ కొట్టొచ్చినట్లు కనిపించేది, నాటకీయత అనే శిల్ప సంవిధానమే!
ముందుగా ‘హరిశ్చంద్ర చరిత్ర’ చూద్దాం. రుగ్వేదంలోనూ ఓ హరిశ్చంద్రుడున్నాడు. కానీ, అతగాడు ‘సత్య’ హరిశ్చంద్రుడు కాడు. వరుణుడి కరుణతో అనారోగ్యం నుంచి విముక్తి పొంది ఓ బిడ్డను కంటాడు. అతగాణ్ణి దేవుడికి బలిస్తానని మొక్కుకుని, దాన్ని ఎగ్గొడతాడు. దాంతో వరుణుడు, అతని జలోదరం అతనికి వడ్డీతో సహా ముట్టచెప్తాడు. దేవుణ్ణి మెప్పించడం మన హరిశ్చంద్రుడికి వెన్నుతో పుట్టిన విద్య! దాంతో, తన కొడుక్కి తీసిపోనివాణ్ణి బలిస్తానని చెప్పి రుష్యాశ్రమాలు వెతుక్కుంటూ బయల్దేరుతాడు. అజీగర్తుడనే మహానుభావుడి కొడుకు శునశే్శపుడనే వాణ్ణి కొనుక్కొచ్చి యాగశాలకి తెస్తాడు. విశ్వామిత్రుడు - వంద మంది కొడుకుల్ని తీసుకుని - ఆ యాగానికి వస్తాడు. హరిశ్చంద్రుణ్ణీ అతగాడి రాజగురువు వశిష్ణుణ్ణే కాదు, సాక్షాత్తూ ఆ వరుణుడినే బెదరగొట్టి శునశే్శపుణ్ణి రక్షిస్తాడు. అనగా, వేద కథలో హరిశ్చంద్రుడు విలనూ, విశ్వామిత్రుడు హీరో! కానీ, కావ్యాల్లో ఇదంతా తారుమారయింది. వివ్వామిత్రుడు - నక్షత్రకుడు - కాలకౌశికుడు వగయిరాలు దుర్మార్గులు! ఇచ్చిన మాట నిలబెట్టుకోడానికి తాను కాటికాపరిగా మారి, తాళికట్టిన అర్ధాంగిని దాసిగా నడిబజారులో అమ్మేసిన హరిశ్చంద్రుడు త్యాగశీలి అయి కూర్చున్నాడు. కథలదేముంది - కాలానుగుణంగా వాటికి కాళ్లూ చేతులే కాదు, కొమ్ములు కూడా వస్తాయి. జనరంజకంగా వాటిని చెప్పగలగడమే కవిగారి ముందుండే సవాలు. నాటకీయ శిల్ప సంవిధానం అనే పరశువేది సహాయంతో గౌరవ హరిశ్చంద్రుడి సినిమా కష్టాలన్నింటినీ సునాయాసంగా పరిష్కరించాడు; పాఠక హృదయాల్ని అనాయాసంగా గెల్చుకున్నాడు. పాడుకోడానికి వీలయ్యే ద్విపద ఛందస్సు గౌరన పని మరింత సులువుగా పూర్తవడానికి సహకరించింది!
ఇక ‘నవనాథ చరిత్ర’ చూద్దాం. శ్రీనాథుడి చేత ‘శివరాత్రి మాహాత్మ్యం’ రాయించిన శాంతభిక్షారాయడే గౌరన చేత ‘నవనాథ చరిత్ర’ రాయించాడట. శైవంలో సిద్ధులకు చాలా ప్రాముఖ్యం ఉంది. వాళ్లనే నాథులనీ అంటారు. ఆదినాథుడు స్వయానా శివుడే. రెండోవాడు ‘మాయా మశ్చీంద్ర’ అనబడే మత్స్యేంద్ర నాథుడు. ఇతనికే మీననాథుడని ఇంకోపేరు. ఇతని ప్రధాన శిష్యుడు గోరక్షకుడు అనే గోరక్ నాథుడు. మరో శిష్యుడు సారంగధరుడనే చౌరంగీ. ఈ నాథ సంప్రదాయంలో మరో అయిదుగురు నాథులు కూడా ఉన్నారు. మొత్తం కలిపితే ‘నవనాథ చరిత్ర’మవుతుంది. ఈ ‘చరిత్ర’లో అద్భుతమయిన కథలెన్నో వున్నాయి. అవన్నీ జానపదాల కోవకి చెందినవే. జనమే సృష్టించుకున్న మహత్తర కళాఖండాలను, అదే జనానికి అందించే సత్సంకల్పంతో పుట్టుకొచ్చిన ద్విపద కావ్యమిది. ‘నవనాథ చరిత్ర’లో తొలిసారి అక్షరబద్ధమయి, తెలుగు సాహిత్యంలో శాశ్వత స్థానం కల్పించుకున్న కథ సారంగధర చరిత్ర. రాజమండ్రిలో సారంధర మెట్ట అనే ‘చారిత్రిక ప్రదేశం’ కూడా పుట్టుకొచ్చింది! అయితే, నవనాథ చరిత్రలోని సారంగధరుడు రాజమండ్రి వాస్తవ్యుడు కాడు. మాళవ దేశ రాజధాని మాంధాతపురాన్ని ఏలే మహేంద్రుడి భార్య రత్నాంగి. వాళ్ల ముద్దుల కొడుకే ఈ సారంగధరుడు. మహేంద్రుడు చిత్రాంగి అనే ఆమెని చేరదీసి వుంటాడు. పెంపుడు పావురం కోసం రాజకుమారుడు చిత్రాంగి ఇంటికి వెళ్లడం, ఆమె సారంధరుణ్ణి మోహించడం, అతను తిరస్కరించడం, ఆమె రాజుతో అబద్ధం చెప్పి సారంగధరుడి కాల్జేతులు నరికించడం గౌరన కావ్యంలో సవివరంగా కథితం. మత్స్యేంద్రుడనే మీననాథుడు సారంగధరుణ్ణి కాపాడి, అతనికి చౌరంగీ అని పేరు పెట్టి నవనాథుల్లో ఒకడిగా మారుస్తాడు. దాని మాటెలా వున్నా, ఈ కావ్యం పుణ్యమాని తెలుగు కవుల - ముఖ్యంగా విషాద నాటక కర్తల - పంట పండింది. ఈ కథ ఇతివృత్తంగా డజన్ల కొద్దీ రచనలు పుట్టుకొచ్చాయి.
గౌరన కేవల కవిప్రాయుడు కాడు. అతను లాక్షణికుడు కూడా. ‘లక్షణ దీపిక’ అనే ‘ప్రామాణిక లక్షణ గ్రంథం’ రాశాడట. దాని మీదట అతనికి ‘చతుర సాహిత్య లక్షణ చక్రవర్తి’ అనే బిరుదు కూడా దక్కిందట. అంతేకాదు - ఈ లక్షణ గ్రంథంలోనూ ఇతరత్రా దుర్లక్షణాలను ఏకిపారేసినందువల్ల గౌరనకి ‘ప్రతివాది మదగజ పంచానన’ బిరుదం కూడా సొంతమయింది. వాటన్నిటి విషయం ఎలా వున్నప్పటికీ, గౌరన తన ద్విపద కావ్యాలు రెండింటి కారణంగానూ సామాన్య పాఠక జనాదరణకే కాక, సురవరం ప్రతాపరెడ్డిగారి లాంటి అసామాన్య పరిశోధక పండితుల మెప్పునకు కూడా పాత్రుడయ్యాడు. అందువల్లనే ఇనే్నళ్ల తర్వాత, ఇప్పుడు కూడా మనం అతన్ని తల్చుకుంటున్నాం!

-మందలపర్తి కిషోర్ 81796 91822