పెరటి చెట్టు

సంస్కరణ సేనాని!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎవరో అన్నట్లుగా, ‘యుద్ధాలు మొదలయ్యేది మెదళ్లలోనే’. కుసంస్కారం మీద యుద్ధం కూడా - అలాగే - కొందరు మేధావుల మెదళ్లలోనే మొదలయింది. కుసంస్కారం వల్ల సమాజమంతా బాధలు పడినా, దాని మీద యుద్ధం చెయ్యాలని నడుం కట్టే వాళ్ల సంఖ్య- మొదట్లో - అతి పరిమితంగానే ఉంటుంది. ఎక్కడయినా, అన్నిటికీ మించి, ఈ యుద్ధం దశాబ్దాల తరబడి సాగుతుంది. వాటికి నేతృత్వం వహించే పెద్దల స్వభావాలలోని పరిమితీ విస్తృతీ ఆయా యుద్ధాల స్వభావంలో భాగంగా మారిపోవడం కద్దు. తెలుగునాట సంఘ సంస్కరణ ఉద్యమం అనే సుదీర్ఘ యుద్ధం తాలూకు చరిత్రను పరామర్శించే సందర్భంగా దృష్టిలో పెట్టుకోవలసిన ప్రాథమిక విషయాలివి. ఈ సందర్భంగా మనం మనసులో పెట్టుకుని తీరవలసిన మరో ముఖ్యమయిన వాస్తవం ఏమిటంటే, తెలుగునాట సమాజ సంస్కరణ, భాషా సాహిత్యాల సంస్కరణ విడివిడిగా మొదలవనూ లేదూ - వేర్వేరుగా కొనసాగనూ లేదు. ఈ రెండు స్రవంతులలోనూ ఎగసిపడే కెరటాలు ఒకటే కావడానికి కారణం అదే!
పద్దెనిమిదో శతాబ్దం చివర్లో పుట్టి, పందొమ్మిదో శతాబ్దం ప్రథమార్ధంలో మరణించిన ఏనుగుల వీరాస్వామి - 1830 దశకంలోనే - తన ‘కాశీయాత్ర చరిత్ర’లో, వితంతు పునర్వివాహాలు నిషిద్ధం కావని తను నమ్మే శ్రుతులూ స్మృతుల ఆధారంగా నిరూపించారు. ఆయన తర్వాతి తరానికి చెందిన స్వామినీన ముద్దు నరసింహం - తెలుగు భాషలో మొట్టమొదటి సంస్కరణ గ్రంథం ‘హితసూచని’లో - సంఘ సంస్కరణ ఉద్యమం ఎంత ఆవశ్యకమో, ఏయే ప్రాతిపదికలపై ఈ యుద్ధం జరగాలో తెలియజెప్పారు. 1856లో ఆయన కన్నుమూసే నాటికి ఎనిమిదేళ్ల కుర్రాడిగా ఉండి, తర్వాత రోజుల్లో ఈ యుద్ధం ఎక్కడ - ఎప్పుడు - ఎలా మొదలయి కొనసాగాలో ప్రణాళికాబద్ధంగా తీర్చిదిద్దిన వాడు కందుకూరి వీరేశలింగం. మరో పాతికేళ్లకి ఆయన మొట్టమొదటి వితంతు పునర్వివాహాన్ని రాజమండ్రిలో జరిపించి, తెలుగు సామాజిక చరిత్రను మలుపు తిప్పారు! చిలకమర్తి చెప్పినట్లు తన దేహాన్నీ, తన గేహాన్నీ, తన కాలాన్నీ, తన ధనాన్నీ, తన విద్యనీ విజ్ఞానాన్నీ ఈ యుద్ధానికే అంకితం చేసి, ‘సంస్కరణోద్యమ సేనాని’ కాగలిగినవాడు వీరేశలింగం. ఇంతకీ, ఈ సాహిత్య చరిత్రలో, ఇటువంటి సంస్కరణ సేనాన గురించి ప్రస్తావించుకోవలసిన అవసరమేమిటనే ప్రశ్న తలెత్తక ముందే, ఓ విషయం చెప్పుకోవాలి. ఐన్‌స్టెయ్న్ అన్నట్టుగా, కాలంలో పదార్థం ఉండదు - పదార్థంలోనే కాలం ఉంటుంది. సాహిత్యంలో సమాజం లేదు - సమాజంలోనే సాహిత్యం ఉంది. ఆ సమాజాన్ని ప్రభావితం చేసే భౌతిక శక్తులూ, వ్యక్తుల గురించి తెలుసుకోకుండా సాహిత్యం గురించి - ముఖ్యంగా సాహిత్య చరిత్ర గురించి - తెలుసుకోవడం అసాధ్యం. మరీ ముఖ్యంగా, ఈ సంస్కరణ సేనానులు తమ ఉద్యమవ్యాప్తికి సాహిత్యాన్ని వినియోగించి వుంటే, అటువంటి వ్యక్తుల గురించి విశే్లషణ మరింత ప్రాముఖ్యం సంతరించుకుంటుంది. వీరేశలింగం - అక్షరాలా - అదే చేశారు. ముందే చెప్పినట్లు, మన సమాజ సంస్కరణ - భాషా సాహిత్యాల సంస్కరణ చెట్టపట్టాలు వేసుకునే సాగాయి కనక దానితోనూ సంబంధం కలిగి వుండిన వ్యక్తుల చరిత్ర కలిపే చదువుకోవాలి!
కొంతకాలం ప్రభుత్వోద్యోగం చేసినా, అదే లోకంగా వీరేశలింగం ఎన్నడూ లేరు. న్యాయ వ్యవస్థతోనూ, రాజకీయ రంగంతోనూ ఆయన సన్నిహిత సంబంధాలు కలిగివున్నప్పటికీ, ఆయా రంగాల్లో కూడా ఆయన లీనమయిపోలేదు. ముప్పయ్యేళ్లన్నా రాకముందే, ధవళేశ్వరంలో అందరినీ కలుపుకొచ్చి, బాలికల కోసం ఒక పాఠశాల స్థాపించి, అత్యున్నత ప్రమాణాలతో దాన్ని నడిపారు వీరేశలింగం. ఆ తర్వాత కూడా ఆయన అనేక విద్యా సంస్థల్ని స్థాపించినప్పటికీ, తన కృషిని విద్యారంగానికి పరిమితం చేయలేదు. మొదటి నుంచీ వీరేశలింగం జీవన వ్యాకరణంలో ‘కర్మణి ప్రయోగం’ - ప్యాసివ్ వాయిస్ - అనే దానికి స్థానం లేదు. సంస్కరణలను సామాజికులు అందరూ కలిసి, కృషి చేసి, తెచ్చుకోవలసిందే తప్ప అవన్నీ వాటంతటవే వస్తాయని కానీ, వేరెవరో మన కోసం ఈ మార్పుల పిండివంటలు వండి వారుస్తారని కానీ ఆయన నమ్మలేదు. అలాగే, అవినీతికి వ్యతిరేకంగా పోరాటం పౌరులు చెయ్యాల్సిందే తప్ప, ఆ భారం పైవాడి మీద వెయ్యడానికి వీల్లేదనే ఆయన చెప్పేవారు; చేసి చూపించారు కూడా. ఆయన ‘స్వీయ చరిత్ర’లోని చిత్రపు కామరాజు ఉదంతం వీరేశలింగం పట్టుదలనూ, ధర్మనిష్ఠనూ నిరూపిస్తుంది. తన సంస్కరణ కృషిని తీవ్రంగా వ్యతిరేకిస్తూ కొక్కొండ వెంకటరత్నం, ఓగిరాల జగన్నాథం, దంతులూరి నారాయణ గణపతిరావు తదితరులు వ్యాసాల వర్షం కురిపించినప్పుడు వీరేశలింగం వాళ్లందరికీ ఒంటరిగానే సమాధానం చెప్పారు. ఇప్పుడు ఈ పెద్దల పేర్లు ఇలాంటి చరిత్ర రచనల్లో తప్ప మరెక్కడా కనిపించవు; వినిపించవు. కానీ, వీరేశలింగం పేరు ప్రతిష్ఠలు దేశాంతరాలకు సయితం వ్యాపించాయి. అది కాలమిచ్చిన తీర్పు!
సంస్కరణ ఉద్యమ ప్రవక్తగా ఆవిర్భవించడానికి ముందే వీరేశలింగం కవి, పండితుడిగా ప్రసిద్ధులయ్యారు. కాలం చెల్లిన పాతకాలపు మూసల్లోనే పోసి తీసిన గోపాల శతకం - మార్కండేయ శతకం - శుద్ధాంధ్ర నిరోష్ఠ్య, నిర్వచన నైషధం - శుద్ధాంధ్రోత్తర రామాయణం - శుద్ధాంధ్ర భారత సంగ్రహం - రసికజన మనోరంజనం లాంటివి ఆయనకి కవిగానూ, గరిడీలూ గారడీలూ గడసాములూ తెలిసిన పండితుడిగానూ పేరు తెచ్చిపెట్టాయి. కానీ, ఆ పేరును సొమ్ము చేసుకోవాలని వీరేశలింగం తాపత్రయపడలేదు. ఆయన నడుం కట్టి రూపొందించిన ‘ఆంధ్ర కవుల చరిత్ర’ తర్వాతి కాలంలో ఒక ప్రత్యేక అధ్యయన రంగంగా రాణించింది. పంచతంత్రంలోని ‘సంధి’ ‘విగ్రహం’ అనువదించిన వీరేశలింగం, చిన్నయసూరి వారసత్వం కోసం కొక్కొండ వేంకటరత్న ‘శర్మ’తో ఒక దశలో పోటీపడిన మాట నిజమే. కానీ, త్వరలోనే తన వ్యక్తిత్వానికి తగిన రంగం ఏమిటో గుర్తించి, అందులోనే ఆయన కేంద్రీకరించి పనిచేశారు. నలభయ్యో పడిలో పడ్డ తర్వాత మొదలుపెట్టిన పత్రికల నిర్వహణలో ఎంత చురుకయిన పాత్ర పోషించినప్పటికీ, వీరేశలింగం ఆ రంగానికి కూడా పరిమితమయి పోలేదు. తన సాహిత్య సేద్యాన్ని, సంస్కరణ కృషికి అనుబంధంగా మార్చినందువల్లనే, వీరేశలింగం సమకాలీన సాహిత్య ధోరణుల వైపు క్రమంగా మొగ్గు చూపిస్తూ వచ్చారు. రాజమండ్రికి మకాం మార్చిన గిడుగు రామమూర్తితో స్నేహం భాష విషయంలో వీరేశలింగం వైఖరికి చాలా మేరకి మార్చింది. అదే ఆయన్ని చివరికి వ్యావహారిక వాదిగానూ మార్చింది.
వీరేశలింగం వ్యక్తిత్వంలో ముఖ్యమయింది, ఆయన విమర్శనాత్మక వైఖరి. వాస్తవానికి, ఈ విమర్శనాత్మక వైఖరే వీరేశలింగం గారిని సంఘ సంస్కర్తగా మార్చింది. ఇది ఆయన సామాజిక రచనలన్నింట్లోనూ కొద్దోగొప్పో ప్రతిఫలిస్తూనే వుంటుంది. ఇందుకు ఓ ఉదాహరణ చెప్పుకుందాం. తన ‘స్వీయ చరిత్ర’లో వీరేశలింగం కాకినాడ నుంచి రాజమండ్రికి ప్రయాణమయి వచ్చే సందర్భంలో ఓ వూళ్లో ఎదురయిన అనుభవాన్ని విపులంగా వర్ణించారు. నదిలో నీళ్లు లేక పడవ నడక వేగంలో సాగుతున్నందువల్ల కొద్ది దూరం వచ్చేసరికే పొద్దెక్కిపోయిందట. దారిలోనే మధ్యాహ్న భోజనం టైమైపోయిందట. కళాసీలని బతిమాలుకుని, పడవను పక్కన ఆపించారట కానీ, గారాబంగా పెరిగిన వీరేశలింగం గారికి వంటా వార్పూ రావట. తనకూ ఓ ముద్ద పెడితే వంటచేసి పెడతానని ఓ బ్రాహ్మడు ముందుకొచ్చాడట. అతన్ని వెంటపెట్టుకుని, సంభారాలు కొనుక్కునేందుకు వీరేశలింగం ఓ ఊళ్లోకి వెళ్లారట. ఆ ఊళ్లో ఒక్కటే బ్రాహ్మల ఇల్లు - అదే కరణంగారిల్లు. కరణంగారు వీథి అరుగు మీద చతికిలపడి రామాయణ పఠనం జరిపిస్తున్నారప్పుడు. ఇంతకీ, మహారాజశ్రీ కరణంగారికి డబ్బు తీసుకుని ఇతరులకి భోజనం పెట్టడం నామోషీ - ఉచితంగా అన్నానర్తులకి ఇంత గంజిపోసేటంత ఔదార్యం అతగాడికి లేదు. తనకి కాస్త మడీ తడీ ఎక్కువ కావడం చేత, వంట పాత్రలు కూడా ఇవ్వలేనని తేల్చి చెప్పేశాడా శ్రోత్రియుడు. కాగా, ఊళ్లో మరే బ్రాహ్మణ కొంపా లేదు! అంచేత వేరే వూరు చూసుకోమని ఉచిత సలహా పారేసి, రామాయణ పఠనంలో పడిపోబోయారు కరణంగారు. అక్కడ, రామాయణానికి వ్యాఖ్యానం చెప్తూ వుండిన ఓ పెద్దమనిషి, యథాలాపంగా వీరేశలింగం ఊరూ పేరూ కనుక్కున్నాడట. సదరు పెద్దమనిషి కుటుంబం వీరేశలింగం తాతగారి ఔదార్యానికి గతంలో పాత్రులయినవారట! ఆయన సిఫారసుతో ఆ పూట అన్నార్తులిద్దరికి విందు భోజనం దక్కింది. తన తాతగారి దాతృత్వం గురించి చెప్తూన్నట్లు పైకి కనిపించినా, ఆ రోజుల్లో బ్రాహ్మణ్యం ‘లక్షణం’ ఎంత సుందర ముదనష్టంగా ఉందో మన ముందు ఆవిష్కరించడానికే వీరేశలింగం ఈ కథ చెప్పినట్లు గ్రహించడం కష్టం కాదు. ఇటువంటి మనుషులు మారాలని అనిపించనివాడు, తనను తాను మనిషిగా చెప్పుకోడానికి కూడా అర్హుడు కాడు.
వీరేశలింగం తన తాతని ఆశ్రయించి బాగుపడిన పరాన్నభుక్కుల గురించీ, మూఢనమ్మకాల పుట్ట అయిన తన తల్లి గురించీ, వాలూవీలూ చూసుకుని స్వార్థపరాయణుడిగా రంగుమార్చిన గురు‘బ్రహ్మ’ గురించీ, తన మీదే పుకార్లు పుట్టించిన శిష్య పరమాణువుల గురించీ, కోర్టులకెక్కి తన వ్యక్తిత్వ హననానికి తెగబడిన అనుచర గణాచారుల గురించీ నిర్మొహమాటంగా రాశారు. అదే వీరేశలింగం మార్గం. ఆయన రచనల్ని పరామర్శించే సందర్భంగా మనం కూడా అదే విమర్శనాత్మక వైఖరి ప్రదర్శించడమే వీరేశలింగం గారికి నిజమయిన నివాళి. అందుకే, తన ‘స్వీయ చరిత్ర’లో వీరేశలింగం చెప్పినట్లుగా అనేక ఆధునిక ప్రక్రియలకి ఆయనే ఆద్యుడు కాడనీ, ఏనుగుల వీరాస్వామి - స్వామినీన ముద్దునరసింహం - నరహరి గోపాలకృష్ణమ చెట్టి ఆయనకన్నా ముందే ఎన్నో ఘనకార్యాలు సాధించారనీ ‘పెరటిచెట్టు’లో అన్నిసార్లు చెప్పుకోవడం. దీన్ని ఎవరు మెచ్చినా మెచ్చకపోయినా ‘సంస్కరణ సేనాని’ కందుకూరి వీరేశలింగం మాత్రం కచ్చితంగా మెచ్చుకుంటారు!

-మందలపర్తి కిషోర్ 81796 91822