పెరటి చెట్టు

సంస్కృతాంధ్ర కవితావళికెల్ల పితామహుడు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘వసుమతీనాథ, ఈతడీశ్వరుడుగాని, మనుజమాత్రుండు కాడు - పల్మారు నితని, అనుమతంబున నీవు రాజ్యంబు నెమ్మి నేలుము’- ఇది, శివదేవయ్య గురించి, తిక్కన గణపతి దేవుడితో అన్నమాట. అలాగని ‘సోమరాజీయం’ చెప్తోంది. కాకతీయ సామ్రాజ్యాన్ని ఏలిన - నాలుగు తరాలకు చెందిన - ముగ్గురు పాలకుల దగ్గిర మహామంత్రిగా పని చేసిన ప్రముఖుడు శివదేవయ్య, గణపతి దేవుడు, అతని కూతురు రుద్రమ, ఆమె మనవడు ప్రతాపరుద్రుడి దగ్గిర మంత్రిగా పని చేసిన శివదేవయ్య నూరేళ్లు బతికాడని ‘సాహిత్య చరిత్ర’ గ్రంథాలు చాటి చెప్తున్నాయి. కాగా, శివదేవయ్యనే ‘దేశికుడు’ అనే బిరుద నామంతో కూడా ప్రస్తావించేవారని అంటారు. (అడివి బాపిరాజు నవల ‘గోన గన్నారెడ్డి’లో ఆయన ఆలాగే చిత్రించడం చూసి నాటకాలూ సినిమాల్లోనూ అదే చిత్రణ చేశారు) దేశికుడు అనే మాటకి గురువన్నదే సామాన్యార్థం. అటు వైష్ణవంలోనూ, ఇటు శైవంలోనూ కూడా దేశిక శబ్దం శ్రేష్ఠ వాచకంగా ఉపయోగించడం చూస్తాం. పదమూడో శతాబ్దంలో ఏకశిలా నగరంలో శివదేవయ్య దేశికుడు. అదే కాలంలో కాంచీపురంలో వేదాంత దేశికన్ ఇద్దరూ శైవ - వైష్ణవ మతగురువులుగా ఓ వెలుగు వెలిగారంటారు. ఇదిలా వుండగా, శివదేవయ్యను దేశికుడు అనే మాట వాస్తవం కాదని ఓ వర్గం పరిశోధకులు వాదించారు. ఆ గౌరవం విశే్వశ్వరుడనే మరో మలయాళీ మత గురువుకు దక్కిందన్నది ఈ వర్గం వాదన. ఇతగాడు గణపతి దేవుడికి దీక్షా గురువు కూడానట. కాగా, విశే్వశ్వర దేశికుడు కూడా కవేనని చెప్తారు కానీ, ఆయన రచనగా ప్రసిద్ధమయిన ‘శివతత్త్వ రసాయనం’ ఇంతవరకూ బయటపడలేదు. అయితే, ఈ దేశికుడు రాశాడని నమ్మే మల్కాపురం, త్రిపురాంతకం, కాళేశ్వరం, చంద్రవల్లి శాసనాలు కవితాత్మకంగా ఉన్నమాటయితే వాస్తవం. ముఖ్యంగా, మల్కాపురం శాసనంలో రుద్రమాంబ కీర్తిని శ్లాఘిస్తూ రాసిన శ్లోకం ప్రచురం. ఆ పొగడ్తలను బట్టి చూస్తే, ఈ దేశికుడు కచ్చితంగా కవి అయ్యేవుంటాడనిపిస్తోంది.
దేశికుడయినా కాకపోయినా, శివదేవయ్య మంత్రిగా కాకతీయ సామ్రాజ్య చరిత్రలో కీలక ప్రాముఖ్యం వహించిన మాటయితే ఎవరూ కాదనలేరు. అంతకు మించి, ‘సంస్కృతాంధ్ర కవితావళికెల్ల పితామహు’డిగా ఆరతులందుకున్నవాడు శివదేవయ్య. నిడదవోలు వెంకటావుగారి లెక్క ప్రకారం, ఆంధ్ర కవితా పితామహుడనే బిరుదు ప్రప్రథమంగా పొందినవాడు ఆయనే. శివదేవయ్య రచనల్లో రెండింటి నుంచి - ‘పురుషార్థ సారం’ ‘శివదేవ శతకం’ అనే గ్రంథాల నుంచి - పద్యాలు దొరుకుతున్నాయి. పధ్నాలుగో శతాబ్దానికి చెందిన మడికి సింగన్న కూర్చిన ‘సకల నీతి సమ్మతం’లోనూ, పదహారో శతాబ్దానికి చెందిన లింగమగుంట తిమ్మన సంకలించిన ‘బాలబోధచ్ఛందం’లోనూ, అదే శతాబ్దానికి చెందిన పొత్తపి వెంకటరమణ కవి కూర్చిన ‘లక్షణ శిరోమణి’లోనూ శివదేవయ్య పద్యాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా, మడికి సింగన ‘సకలనీతి సమ్మతం’లో శివదేవయ్య రాసిన ‘పురుషార్థ సారం’ నుంచి తొంభయ్ పద్యాలు - పందొమ్మిది శీర్షికల కింద - ఉటంకించాడు. అయితే, ఎక్కడా కవి పేరు చెప్పకపోవడానికి ఆరుద్ర ఓ కారణం ఊహించారు - ‘బహుశా అతని కాలం నాటికి అది (పురుషార్థ సారం) చాలా ప్రసిద్ధమయి ఉంటుంది.’
‘శివదేవ ధీమణీ’ అనే మకుటంతో వెలువడిన శివదేవ శతకంలోని పద్యాలను కూడా సంకలన కర్తలు ఉదాహరించిన సంగతి మానవల్లి రామకృష్ణకవి లాంటి పరిశోధక పండితులు వెల్లడించారు.
‘అరయగ పిన్ననాట సిరియాళుడనై, యెలప్రాయమందు సుం/ దరుడను నంబియై, పదను తప్పిన గుండయగారి చందమై/ ధర చరియింపగల్గిన తథాస్తు! వృథా పరిపాక రూప దు/ ష్కర జననం బిదేమిటికి గాలుపనే శివదేవ ధీమణీ’ అనే పద్యం చూస్తే, శివదేవయ్య పద్య రచనలో సిద్ధహస్తుడని స్పష్టమవుతోంది. అంతటి విశిష్టత లేనివాడయితే, ఆయన్ని పట్టుకుని సాక్షాత్తూ శివుడేనని తిక్కన ఎందుకు పొగుడుతాడు?
నూట అరవయ్యేళ్ల కాకతీయ సామ్రాజ్య చరిత్రలో సగానికి సగం కాలం మంత్రిగా వ్యవహరించిన శివదేవయ్య రాజ్య నిర్వహణ తంత్రంలో కచ్చితంగా దిట్టయి ఉంటాడు. తన పరిపాలనానుభవ సారానే్న ఆయన ‘పురుషార్థ సారం’గా రచించి వుంటాడు. అందుకే, ఆ గ్రంథంలోంచి అన్ని పద్యాలు తర్వాతి కాలపు సంకలనాల్లో స్థానం సంపాదించుకో గలిగి ఉంటాయి. అంతకు మించి, ‘పురుషార్థ సారం’లో శివదేవయ్య రాసిన పద్యాల్లో ఎన్నో జాతీయాలూ, నానుడులూ, పలుకుబళ్లూ కనిపిస్తాయి. ప్రజల్ని రక్షించకపోగా, వాళ్లను దోచుకుతినే పాలకులను విమర్శిస్తూ ఆయన ఓ పద్యం చెప్పాడు. ఇలాంటి వాడు, కుప్పల్ని తగలపెట్టి పేలాలు ఏరుకుతినే బాపతని శివదేవయ్య చీత్కరించుకున్నాడు. పాలకుల సుగుణాల జాబితా తయారుచేస్తూ అందులో ‘నాస్తిక ఖల సంగవర్జ’నాన్ని కూడా చేర్చాడు ఈ శివదేవుడు. దానిమాటెలా వున్నా, ఆ రోజుల్లో కూడా నాస్తికులు సామాజిక గౌరవానికి పాత్రులయి ఉండేవారని దీన్నిబట్టి తెలుస్తోంది. అలాంటి పరిస్థితే లేకపోతే ‘నాస్తిక ఖలుల’ సాంగత్యాన్ని వర్ణించమని ఈ ధీమణి ఎందుకు సూచిస్తాడు?
ఓ చేత్తో చాణక్యాన్నీ, మరో చేత్తో సాహిత్యాన్నీ నిర్వహించిన సవ్యసాచి తిక్కనకు, శివదేవయ్యలో తన ప్రతిరూపం కనిపించి వున్నట్లయితే వింత లేదు. పైపెచ్చు, ఆయన ఓరుగల్లుకు వెళ్లింది ఓ రాచకార్యం మీద. గణపతి దేవుడి మద్దతుతో, మనుమసిద్ధిని తిరిగి గద్దెనెక్కించడమనే దౌత్యకార్యం కోసమే ఆయన అక్కడికి వెళ్లాడు. బహుశా అప్పటికే పరిణత సాంస్కృతిక కేంద్రంగా వికసించి వుండిన ఓరుగల్లు తిక్కనను మంత్రిగానే కాదు - కవిబ్రహ్మగానూ ఆదరించే ఉంటుంది. ఆయనకంత ఆదరణ దక్కడంలో శివదేవయ్య పాత్ర కూడా ఉండే వుంటుంది. అపర చాణక్యుడయిన తిక్కన ఆ విషయం గ్రహించినందువల్లనే శివదేవయ్యను ‘ఈతడీశ్వరుడు గాని, మనుజమాత్రుండు కాడు’ అని ప్రశంసించి ఉంటాడు. మాటల విలువ మహాకవులకు మనం చెప్పాలా?

-మందలపర్తి కిషోర్ 81796 91822