భక్తి కథలు

పూలకుండీలు - 24

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘ఇట్లాంటివి యిప్పుడు లోకం మీద మస్తుగా నడుస్తున్నయిలే ఊకో’’ అంటూ భర్తకు భిన్నంగా మాట్లాడుకొచ్చింది.
భార్య మాటలతో ఒక్కసారిగా విస్తుపోయిన జగ్గయ్య ఆమె వంక నోరెళ్ళబెట్టి చూడసాగాడు.
‘‘నాకెల్లి అట్ల జూస్తున్నావేంది? నేనన్నదాంట్లో తప్పేముంది? మన బిడ్డ ఎవరినితోనో లేసిపొయ్యి తప్పు సెయ్యడం లేదు. ఇయ్యాల రేపు రెండు గదుల ఇల్లున్నోల్లు ఒక్క గదిల సదురుకొని ఇంకో గది కిరాయికిచ్చుకోవడం లేదా? ఇది కూడా అంతే అనుకో. ఎవరికైనా పిల్లలు కలగాలంటే ఆలుమగలిద్దరికి ఒంట్లో మంచిగుండాల. ఇద్దరిలో ఏ ఒక్కల్ల వంట్లో బాగలేకపోయినా పిల్లలు కలగరు.
అట్లాంటోల్లు ఎనకటి రోజుల్లో ఇంగ చేసేదేం లేక ఏ తల్లో కన్నబిడ్డను దెచ్చుకొని సాదుకునేటోల్లు. ఆ బిడ్డను ఎంత ప్రేమతోటి సాదుకున్నా సొంత బిడ్డ కాదుగా? అందుకే అట్లాంటోలిప్పుడు ఏ పేదింటి ఆడమనిషికో నాలుగు పైసలిచ్చి ఆమె కడుపున డాక్టర్ల సాయంతోటి ఏదో పద్ధతిలో సంతానం పొందితే తప్పేంది? పేదింటి ఇల్లాలుకి నీతి తప్పకుండ, మానం సెడకుంట ఇల్లు నిలబెట్టుకునేటందుకు, కన్నబిడ్డలను సల్లగా సాదుకునేటందుకు డబ్బులు సంపాదించుకునే బాటన ముందుకుపోతే అందులో తప్పేం వుండదులే పోనియ్యి. అంతేగాకుండా నాలుగు డబ్బులున్నోల్లకు తమ నెత్తుటితోనే ఈ పద్ధతిన సంతు కలిగితే అది ఇద్దరికీ లాభమే గదా?
బిడ్డ హైదరాబాద్ బొయ్యి ఒక్క పది నెల్లు కండ్లు మూసుకుంటే మూడు లక్షలు చేతికొస్తాయంటుంది గదా. మన్లాంటి పేదోల్లం జీవితమంతా కష్టపడినా ఒక్కసారే మూడు లక్షలు సంపాదించగలుగుతమా?
ఒకల సొమ్ము అక్రమంగా దోసుకోకుండ నాలుగు పైసలు సంపాదించుకొనే పిల్లను చూసీ చూడనట్టు పోనియ్యరాదు’’ చెట్టుమీదనే పండించిన పండు చింతకాయను రాల్చినట్టు పట పట మాట్లాడింది శాంతమ్మ తల్లి జానకమ్మ.
భార్య వాదాన్ని విన్న జగ్గయ్య ‘‘వామ్మో! దీనిలోపల ఇంతకాలం నేనెరుగని ఇంకో మనిషి వున్నదిరా నాయనో! పొట్టగోసినా అక్షరం ముక్కరాని మనిషి, గడపదాటి వంటరిగా ఏనాడూ పక్కూరికి పోవడం ఎరుగని మనిషి ఎంత తెలివిగా, ఎంత తెగింపుగా మాట్లాడుతుంది! ఆడదంటే ఆదిపరాశక్తి అంటారిందుకేనేమో! ఆడది తలచుకుంటే ఎంతకైనా తెగిస్తుంది’’ అటూ లోలోపల ఆశ్చర్యంగా అనుకోసాగాడు.
‘‘ఏంది? ఏం మాట్లాడకుండ అట్లా మోరపైకెత్తి చూడబడితివేంది?’’ అంటూ భర్తను మందలించింది జానకమ్మ.
భార్య ఎత్తిపొడుపు మాటలతో ఆలోచనల సుడుల్లోనుండి బయటకొచ్చిన జగ్గయ్య ‘‘తెలిసినోల్లెవరన్న మీ బిడ్డేదని మన్నడిగితే ఏమని చెబుతాం’’ భార్య తలంటుతో మెత్తబడిపోయిన అతను యుద్ధంలో ఓడిపోతున్నామని తెలిసీ యుద్ధం చేయక తప్పని సిపాయి మాదిరిగా తన వాదాన్ని బలహీనంగా కొనసాగించాడు.
‘‘నున్నట్టు ఎవరన్నా అడిగితే హైదరాబాద్ పనికి పోయిందని చెబుదాంలే నువ్వేం భయపడకు’’ కొన్ని విషయాల్లో మగవాడికన్నా ఆడదే చొరవగానూ తెలివిగానూ నిర్ణయాలు తీసుకోగలుగుతుందన్న వాస్తవాన్ని ఓ పల్లెటూరు ఇల్లాలైన జానకమ్మ తనకు తెలియకుండానే బల్లెం నాటినంత సూటిగా తెలియజేస్తూ మాట్లాడింది.
ఆ రాత్రి శాంతమ్మ తల్లి ముగ్గురికీ ఆలోచనలోనే తెల్లవారిపోయింది.
పది గంటలకల్లా భోజనం చేసి పిల్లలను తల్లి దగ్గర వుంచి తండ్రిని వెంటబెట్టుకొని పనె్నండు గంటలకల్లా తిరిగి మంచికంటినగర్ ఇంటికి చేరింది శాంతమ్మ.
తను అన్నట్టే పిల్లలను భద్రాచలంలో వదిలిపెట్టి తండ్రిని వెంట పెట్టుకొని తిరిగి వచ్చిన కోడలిని చూసిన కమలమ్మ, మల్లయ్యలు ‘‘ఇది మొదట్నించీ గుండెలుదీసిన బంటే. దానికి తోచిందే తప్ప ఎదుటోళ్ళు చెప్పింది ఎంత మంచిమాటైనా చెవున పెట్టదు. ఆనాడు మేం చెప్పిన మాట వినకనే ఇంటిని ఈ కాడికి తెచ్చింది?’’ తమలో తాము గొణుక్కున్నారు. కాని బైటకు మాత్రం ‘‘ఇంటికాడ అంతా బాగున్నారా?’’ అంటూ వియ్యంకుణ్ణి పలుకరించారు.
‘‘ఆఁ ఆ బాగనే వున్నారు’’ అంటూ బదులిచ్చాడు జగ్గయ్య.
అంతలోనే
శాంతమ్మ ఇంటికొచ్చిన విషయాన్ని చేపల వాసన పట్టి పిల్లిలా పసిగట్టిన ఆర్‌ఎంపి లింగయ్య కాలి నడకన వాళ్ళింటికొచ్చి వాకిట్లోనుండే ఆమెను పిలిచాడు.
అతని పిలుపు వింటూనే బయటకొచ్చిన శాంతమ్మ ‘‘ఏందన్నా!’’ అంటూ అతని దగ్గరకెళ్ళింది.
శాంతమ్మతో గుసగుసగా కాసేపు ఏదో మాట్లాడిన ఆర్‌ఎంపి లింగయ్య ఆవిడ చేతికేదో కాగితంతోపాటు ఓ సెల్‌ఫోన్ కూడా ఇచ్చి ‘నేనొస్తా’ అనుకుంటూ వెనుదిరిగి వెళ్లిపోయాడు. ‘‘ఏమంటున్నాడు?’’ ఇతణ్ణి పంపించి లోపలికొచ్చిన శాంతమ్మ చేతిలోని కాగితాన్ని గుచ్చి గుచ్చి చూస్తూ అడిగారు అత్తమామలు.
‘‘ఆ ఏముంది తను కూడా హైదరాబాద్ వద్దామనుకుంటే ఆ పాలకొయ్య తండాలో ఎవరో పేషెంట్‌కి బాగాలేదట. పేషెంట్‌ను తీసుకొని అర్జంట్‌గా ఖమ్మం పోవాలంట. అందుకే రాలేకపోతున్నానని చెప్పాడు. ఇగో అక్కడి అడ్రస్ కాయితం, ఈ ఫోనూ ఇచ్చిపోయాడు’’ అంటూ చేతిలోని కాగితాన్ని ఫోన్నీ వాళ్ళకి చూపించింది.
అంతలోనే ఏదో గుర్తుకొచ్చినట్టు గుడిశెలోకి వెళ్లిన శాంతమ్మ రెండు వేలు తెచ్చి అత్తచేతిలో పెట్టి ‘‘మీకేదన్నా అవసరమైతే ఆ ఆర్‌ఎంపి లింగయ్య దగ్గరికి బొయ్యి ఒక ఫోన్ కొట్టిచ్చండి’’ అంటుండగానే ఏ అనుభూతి శకలం దూసుకొచ్చి ఆమె మనసును కలసివేసిందో గాని ఆమె కనురెప్పల వెనుక అప్పటిదాకా బలవంతంగా అదిమి పట్టివుంచిన కన్నీరు ఇక ఆగలేనన్నట్టు కనుకొలుకుల కట్టలు తెంచుకొని జల జలమని పారిజాత పువ్వుల మాదిరిగా రాలిపడుతుంటే అత్తను గుచ్చి కౌగిలించుకొని కుళ్లి కుళ్లి ఏడ్చింది.
- ఇంకా ఉంది

-శిరంశెట్టి కాంతారావు