డైలీ సీరియల్

పూలకుండీలు - 8

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎద్దులెద్దులు కుమ్ముకుంటే మధ్యన దూడలు నలిగి చచ్చినట్టు అధికార, ప్రతిపక్ష పార్టీల రాజకీయ చదరంగపు ఆటలో రాష్టమ్రంతటా ఎక్కడి ఇండ్లు అక్కడే ఆగిపొయ్యాయి.
భర్త, అత్తమామలు ‘‘మనకు ఏ డాబా ఇల్లూ వద్దు, ఉన్న గుడిసెలోనే ఏదో విధంగా కాలం ఎల్లదీసుకుందాం’’ అంటూ ఎంత మొత్తుకున్నా చెవున పెట్టక ఉంటున్న గుడిసెను అప్పటికప్పుడు పీకించి పిల్లలను, ముసలివాళ్ళను చెట్ల పాలు చేశానన్న భావం ఒకటి పేగు పూతలా బాధిస్తుంటే సూటిగా వాళ్ళ కళ్ళల్లోకి చూసి మాట్లాడ్డానికి కూడా నానాటికి సిగ్గు పడసాగింది శాంతమ్మ.
అది చాలదన్నట్టు అడపాదడపా వచ్చిపోయే శాంతమ్మ ఆడపడుచులు ‘‘అత్తమామలంటే నీకు మొదట్నుంచి ఎట్లా లెక్కలేదు. ఇపుడు మొగున్ని కూడా గంగిరెద్దును జేసి కూసోబెట్టి సొంత పెత్తనంతో ఇల్లు పీకించి పందిరేసినవ్, ఇంటిల్లిపాదిని బజారుపాలు చేసినవ్. ఇదేపని వాడు చేస్తున్నట్లైతే నీ మాటలతోని వాణ్ణి ఉరిబెట్టుకొని సచ్చేటట్టు చేసేదానివి’’ అంటూ ముఖంమీదనే కాకులు పొడిచినట్టు సూటిపోటి మాటలతో గుండెల్లి తూట్లు పొడవసాగారు.
దాంతో అసలు మొగుడికంటే అర్ధమొగుళ్ళ ఆరడి ఎక్కువవ్వడంతో ఏం చేయాలో తోచక ఒడ్డున పడ్డ చేప మాదిరిగా గిలగిల కొట్టుకోసాగింది శాంతమ్మ. ఎన్ని రకాలుగా ఆలోచించినా ఆమె కళ్ళముందు ఒకే ఒక్క పరిష్కారం కనిపించసాగింది.
ఆ పరిష్కారం పేరు ఆర్.ఎం.పి. డాక్టర్ లింగయ్య.
మంచికంటినగర్‌లో ఎవరికి ఏ అవసరమొచ్చినా, ఏ సలహా కావాల్సి వచ్చినా ఎవరికైనా ముందుగా గుర్తుకువచ్చేది ఆర్‌ఎంపి లింగయ్యే. శాంతమ్మ కూడా అదేవిధంగా అతణ్ణి కలిసి తన సమస్యను వివరించి ఏదో ఒక దారి చూపించమని అడగాలనుకుంది.
అనుకున్నదే తడవు ఆ మరునాడు పొద్దునే్న భర్తను వెంటబెట్టుకుని ఆర్‌ఎంపి లింగయ్య ఇంటికెళ్లింది శాంతమ్మ.
వాళ్ళు వెళ్ళేసరికి అతను ఇంటిముందున్న కూరగాయ మొక్కలకు పాదులు చేస్తున్నాడు.
‘‘ఏందన్నా! నువ్ చెట్లకు పాదులు చేస్తున్నావేంది?’’ అతని వంక చూస్తూ అడిగింది శాంతమ్మ.
‘‘ఏం నేను చెయ్యగూడదా?’’ అదోమాదిరిగా నవ్వుతూ అన్నాడు ఆర్‌ఎంపి లింగయ్య శాంతమ్మ వంక చూస్తూ.
‘‘చెయ్యగూడదని కాదు’’ అంటూ అర్థోక్తిగా ఆగిపోయింది శాంతమ్మ.
‘‘ఏం లేదు, పొద్దునే్న తోట పనిచేస్తే వంటికి మంచిదని వీలు కుదిరినపుడల్లా ఈ మొక్కలకు పాదులు చేసి నీళ్ళు తోడిపోస్తుంటాను’’ అప్పటిదాకా వంగపాడు చుట్టూ తవ్వటం పెట్టిన మట్టిని గుండ్రంగా కట్టతోస్తూ చెప్పుకొచ్చాడు ఆర్.ఎం.పి. లింగయ్య.
‘‘ఆయన పనిచేస్తుంటే మనం నిలబడి మాట్లాడడం భావ్యం కాదు’’ అనుకున్న శాంతమ్మ, ఎల్లయ్యలిద్దరూ చెరో పాదు ముందు కూర్చుని తవ్వకం పెట్టసాగారు.
‘‘నాతో ఏదో పనుండే వచ్చుంటారు. అందుకే చెప్పకముందే కల్పించుకుని పనిచేస్తున్నారు. చెయ్యనియ్యి, చెయ్యనియ్యి’’ అనుకుంటూ వాళ్ళు పాదులు చెయ్యడానికి వంగగానే తనకు వేరే పని వున్నట్టు చేతులు కడుక్కుని లోపలికెళ్లాడు ఆర్‌ఎంపి లింగయ్య.
ఆ విధంగా అతని చేతికి చిక్కిన శాంతమ్మ, ఎల్లయ్య వాళ్ళు ఇంటిముందున్న మొక్కలన్నిటికీ పాదులు చేసేటప్పటికి పక్కా రెండు గంటలు పట్టింది.
పాదులు చెయ్యటం అయిపోయి బావిమీద కాళ్ళు చేతులు కడుక్కుని వచ్చి ఇంటిముందున్న నాపరాళ్ళ అరుగుమీద కూర్చుని వంటికి పట్టిన చెమట ఆరిపోవాలన్నట్టుగా పైమీది బట్టలతో విసురుకోసాగారు.
మొక్కల దగ్గర శాంతమ్మ వాళ్ళను ఇరికించి ఇంటి వెనుకకెళ్ళిన ఆర్.ఎం.పి లింగయ్య స్నానం చేసి, దేవుడికి పూజ చేసి, ఆ పైన కడుపునిండా టిఫిన్ చేసి బ్రేవులు తీసుకుంటూ మెల్లగా బయటకొచ్చి తీరుబాటుగా పాదులన్నిటినీ పరికించి చూశాడు. ఆ తరువాత పక్కనే వున్న ఓ కుర్చీలో కూర్చుని ‘‘ఆ ఇపుడు చెప్పండి! ఏం పనిమీదొచ్చారు?’’ శాంతమ్మ వాళ్ళను ఓరకంట చూస్తూ నింపాదిగా అడిగాడు.
‘‘చెప్పు’’ అన్నట్టు భర్త వంక చూసింది శాంతమ్మ.
‘‘లే లే, నువ్వే చెప్పు’’ అన్నట్టు కళ్ళతోనే భార్యకు బదులిచ్చాడు ఎల్లయ్య.
‘‘విషయమేంటో ఎవరో ఒకళ్ళు చెప్పండయ్యా! అవతల నాకు బోలెడు పనుంది’’ వాళ్ళ వంక నిరాసక్తంగా చూస్తూ అన్నాడు ఆర్‌ఎంపి లింగయ్య పక్కనున్న దినపత్రిక చేతిలోకి తీసుకుంటూ...
‘‘ఏంలేదన్నా! కాసిన్ని పైసలు కావాల’’ నీళ్ళు నములుతూ బదులిచ్చింది శాంతమ్మ.
‘‘నాకాడ పైసలాడున్నాయి!’’ అవసరమేంటి? ఎంత కావాలి? అన్నమాట కనీసంగానైనా విచారించకుండా పేపర్లో ముఖం పేపర్లోనే వుంచి ఠక్కున లేవు అనేశాడు ఆర్‌ఎంపి లింగయ్య.
‘‘అట్లంటే ఎట్లన్నా! ఉండలేక సిండె కోసుకున్నాట్టు ఊకోలేక ఆ ఇందిరమ్మ ఇల్లు బెట్టుకొని నానా పాట్లు పడుతున్నాం. ఆ బిల్లులొచ్చేదెప్పుడో ఇంటిమీద స్లాబు బడేదెప్పుడో అంతుబట్టడంలేదు. ముసలోల్లు, పిల్లగాల్లు ఆ ఇంటిముందల చింతచెట్టు కింద సలికి సచ్చిపోతున్నారు’’ అంటూ ఆవేదనతో చెప్పుకొచ్చింది శాంతమ్మ.
‘‘దానికి నేనేం జెయ్యల! ఇయ్యాల రేపు బస్తీల సగంమంది పరిస్థితి అట్లనే వుంది. ఎంతమందికని ఇస్తం, ఎంతని ఇస్తం, నేనూ మీలెక్కనే్న రెక్కల కష్టంమీద బతుకుతున్నవాణ్ణే గదా!? ప్రతివాళ్ళూ వచ్చి నన్ను గోకుతుంటే నేనేం చెయ్యాల?’’ చేతిలోని పేపర్ మడిచి పక్కన పెడుతూ విసుగ్గా అనుకొచ్చాడు ఆర్.ఎం.పి లింగయ్య శాంతమ్మ ముఖంలోకి సూటిగా చూస్తూ.
అతని మాటలతో కళ్ళల్లో గిర్రున నీళ్ళు తిరుగుతుంటే ‘‘అన్నా! నువ్వట్ల మాట్లాడితే ఇంగ నేనేం జెప్పేది?
- ఇంకా ఉంది

-శిరంశెట్టి కాంతారావు