ఆటాపోటీ

చాహల్ ప్రతిభ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* యుజువేంద్ర చాహల్ ఒక్కడే ఈసారి ఐపిఎల్‌లో రాణించిన స్పిన్నర్. అతను అద్వితీయ ప్రతిభ కనబరిచాడు. నిరుడు 23 వికెట్లు పడగొట్టిన అతను ఈసారి 21 వికెట్లు సాధించాడు. అతనిని మినహాయిస్తే, భారత జాతీయ జట్టుకు ఎంపికకాని బౌలర్లు ఎవరూ ఇప్పటి వరకూ ఐపిఎల్‌లో 20కి పైగా వికెట్లను పడగొట్టలేదు. టీమిండియాలో స్థానం కోసం ఎదురుచూస్తున్న చాహల్ రెండుసార్లు 20కి మించి వికెట్లు కూల్చడం విశేషం. కాగా, పవర్ ప్లేలో ధవళ్ కులకర్ణి 14 వికెట్లు పడగొట్టాడు. ఐపిఎల్ చరిత్రలో పవర్ ప్లే సమయంలో ఎక్కువ వికెట్లు సాధించిన బౌలర్ల జాబితాలో అతనికి మూడో స్థానం దక్కింది. మిచెల్ జాన్సన్ 16, మోహిత్ శర్మ 15 చొప్పున వికెట్లతో మొదటి రెండు స్థానాల్లో ఉన్నారు. ఈ రెండు 2013 సీజన్ ఐపిఎల్‌లో నమోదయ్యాయి.
బ్యాటింగ్‌తో పోలిస్తే ఈసారి బౌలింగ్ బలహీనంగా కనిపించింది. అందులోనూ స్పిన్నర్లు మరింత దారుణంగా విఫలమయ్యారు. ఎక్కువ వికెట్లు పడగొట్టిన బౌలర్ల ‘టాప్-5’ జాబితాలో యుజువేంద్ర చాహల్ ఒక్కడికే స్థానం లభించింది. స్పిన్నర్లలో అతనిని మినహాయిస్తే మిగతా వారెవరూ బ్యాట్స్‌మెన్‌పై ప్రభావం చూపలేదు. స్పిన్నర్లు సగటున 40.57 పరుగులు సమర్పించుకున్నారంటే వారి వైఫల్యం ఏ స్థాయిలో కొనసాగిందో ఊహించుకోవచ్చు. మొదటి ఐపిఎల్ లో స్పిన్నర్లు సగటున 35.32 పరుగులిస్తే, ఈసారి వారి పరిస్థితి మరింత దారుణంగా మారింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఎడమ చేతివాటం స్పిన్నర్లు 320 ఓవర్లు బౌల్ చేశారు. వీరిలో అక్షర్ పటేల్ ఒక్కడే 13 వికెట్లు పడగొట్టాడు. మిగతా వారు పది వికెట్ల స్థాయిని అందుకోలేదు. ఈ ఐపిఎల్‌లో ఒకే ఒక హ్యాట్రిక్ అక్షర్ పటేల్ పేరుమీద నమోదైంది.

కోహ్లీ ఒక్కడే..
* ఈసారి ఐపిఎల్‌లో కెప్టెన్లు సగటున 45.18 పరుగులు చేశారు. నిరుడు సగటున 33.93 పరుగులుకాగా, అప్పటి రికార్డును తొమ్మిదో ఐపిఎల్‌లో వివిధ జట్ల కెప్టెన్లు అధిగమించారు. అంతేగాక, స్ట్రయిక్ రేట్ (137.64), అత్యధిక అర్ధ శతకాలు (38), అత్యధిక సిక్సర్లు (124) విభాగాల్లోనూ కెప్టెన్లదే అగ్రస్థానం. మొత్తం మీద నలుగురు ఆటగాళ్లు కలిసి ఈ ఐపిఎల్‌లో ఏడు శతకాలు సాధించారు. వీటిలో కోహ్లీ ఒక్కడే నాలుగు సెంచరీలు చేశాడు. క్వింటన్ డికాక్, స్టీవెన్ స్మిత్, ఎబి డివిలియర్స్ మిగతా మూడు సెంచరీలను పంచుకుంటున్నారు.
* ఐపిఎల్‌లో పోటీపడిన ఎనిమిది జట్ల ఓపెనర్లు సగటున 34.40 పరుగులు నమోదు చేశారు. ఇది కూడా ఒక రికార్డే. గతంలో ఎన్నడూ ఓపెనర్లు ఈ స్థాయిలో రాణించలేదు. నిరుడు 31.40 పరుగుల సగటుతో రికార్డు నెలకొల్పిన ఓపెనర్లు ఈసారి దానిని అధిగమించారు.
* గతంలో ఏ ఐపిఎల్‌లోనూ సగటు రన్‌రేట్ మైనస్‌లో ఉన్న జట్టు పాయింట్ల పట్టికలో నంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించలేదు. ఈసారి గుజరాత్ లయన్స్ జట్టు -0.374 రన్‌రేట్‌ను నమోదు చేసినప్పటికీ, టాప్-4లో స్థానం సంపాదించి ప్లే ఆఫ్‌లో స్థానం సంపాదించింది.

భువీకి ‘పర్పుల్’
* భువనేశ్వర్ కుమార్ మొత్తం 23 వికెట్లు సాధించి, ఐసారి ఐపిఎల్‌లో ఎక్కువ వికెట్లు కూల్చిన బౌలర్‌గా పర్పుల్ క్యాప్‌ను అందుకున్నాడు. యుజువేంద్ర చాహల్ 21 వికెట్లు సాధించగా, షేన్ వాట్సన్ 20 వికెట్లతో మూడో స్థానాన్ని సంపాదించుకున్నాడు. ధవళ్ కులకర్ణి 18 వికెట్లు కూల్చాడు. బంగ్లాదేశ్‌కు చెందిన యువ ఫాస్ట్ బౌలర్ ముస్త్ఫాజుర్ రహ్మాన్ చక్కటి బౌలింగ్‌తో రాణించి 17 వికెట్లు సాధించడం ద్వారా ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డును స్వీకరించాడు.

- సత్య