రచ్చ బండ

పార్టీల్లో ‘ఆకర్ష్’ గుబులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ రాష్ట్ర సమితి ప్రయోగించిన ఆపరేషన్ ఆకర్ష్‌తో విపక్షాలు భీతిల్లుతున్నాయి. స్థానిక సంస్ధల కోటా నుంచి రాష్ట్ర శాసనమండలికి (కౌన్సిల్) జరగబోతున్న ఎన్నికల్లో కాంగ్రెస్-టిడిపిలకు చెందిన అభ్యర్థులే అధికార పార్టీలోకి ఫిరాయించడంతో విపక్షాల నేతలను ఆందోళనకు గురి చేస్తున్నది. అంతేకాకుండా వచ్చే నెలలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జిహెచ్‌ఎంసి) పాలక మండలికి జరగబోయే ఎన్నికల్లో అభ్యర్థులను కాపాడుకోవడం ఎలా? అనే సందిగ్ధత నెలకొంది. గ్రేటర్ హైదరాబాద్ పరిథిలో 150 సీట్లు ఉండగా, అందులో 40 స్థానాలు ఏకగ్రీవం అవుతాయన్న ప్రచారం జోరుగా సాగుతోంది.
ఈ నేపథ్యంలో విపక్షాల నేతలు అప్రమత్తమై జాగ్రత్త చర్యలు చేపట్టారు. తాజాగా ఈ నెల 13న బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి అధ్యక్షతన పార్టీ ముఖ్య నేతలు సమావేశమై మంతనాలు జరిపారు. కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ, బిజెపి శాసనసభాపక్షం నాయకుడు డాక్టర్ కె. లక్ష్మణ్, ఎమ్మెల్సీ ఎన్. రామచందర్‌రావు, ఎమ్మెల్యేలు, ఎన్‌వివిఎస్ ప్రభాకర్, చింతల రామచంద్రారెడ్డి, బిజెపి నగర అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి ప్రభృతులు సమావేశమై చర్చించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిథిలోని పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులకు, పార్టీ శ్రేణులకు భరోసా కల్పించే చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే తొలుత పార్టీ సంస్థాపరంగా కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించి, దీనికి చైర్మన్‌గా డాక్టర్ కె. లక్ష్మణ్‌ను నియమించి బాధ్యత అప్పగించారు. సభ్యులుగా ప్రేంసింగ్ రాథోడ్, బి. జనార్థన్ రెడ్డిని నియమించారు. ఆర్థిక కమిటీ చైర్మన్‌గా ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డిని, మీడియా చైర్మన్‌గా ఎమ్మెల్యే ఎన్‌విఎస్‌ఎస్ ప్రభాకర్‌ను నియమించారు. రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహాయ, సహకారాలను ప్రజల్లోకి తీసుకెళ్ళడంలో విఫలమవుతున్నామన్న భావన ఈ సమావేశంలో వ్యక్తమైంది. కేంద్రం అందిస్తున్న ఆర్థిక సహాయం, విద్యుత్తు ఇతరత్రా పథకాల గురించి ప్రజలకు తెలియజేయాలని నిర్ణయించారు. తెలుగు దేశం పార్టీతో ‘దోస్తీ’ కొనసాగించాలని, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని, సీట్ల సర్దుబాటు విషయంలో అరమరికలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని భావించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిథిలో టిడిపితో సమానంగా బిజెపికి బలం ఉన్నందున సీట్ల సర్దుబాటు విషయంలో సమానంగా సీట్లు కోరాలన్న అభిప్రాయాన్ని నేతలు వ్యక్తం చేశారు. త్వరలో టిడిపి ముఖ్య నేతలతో భేటీ కావాలని నిర్ణయించారు. పార్టీ అభ్యర్థుల ఎంపిక విషయంలో పార్టీకి మొదటి నుంచి అంకితమైన భావంతో పని చేసే వారినే ఎంపిక చేయాలని, వత్తిళ్ళకు లొంగి టిక్కెట్లు ఖరారు చేస్తే, నామినేషన్ల దాఖలుకు గడువు ముగియగానే పార్టీ ఫిరాయిస్తే చాలా ఇబ్బంది అవుతుందని వారు భావించారు.
తెలుగు దేశం పార్టీ తెలంగాణ నాయకులు కూడా ఫిరాయింపులతో గాభరా పడుతున్నారు. స్థానిక సంస్ధల కోటా నుంచి ఎమ్మెల్సీ ఎన్నికల్లో జరిగినట్లు కాకుండా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని భావిస్తున్నారు. ఈ మేరకు ఇటీవల టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సమక్షంలో టి.టిడిపి ముఖ్య నాయకులు సమావేశమై మంతనాలు జరిపారు. ప్రతిపక్షాలను లేకుండా చేయాలని తెలంగాణ రాష్ట్ర సమితి చేస్తున్న కుట్రను ఎదుర్కొవాలని లోకేష్ వారికి సూచించారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల అభ్యర్థుల ఎంపిక విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు పార్టీని సమాయత్తం చేసేందుకు తొలుత ఈ నెలాఖరున నిజాం కళాశాల మైదానంలో ఒక బహిరంగ సభ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ బహిరంగ సభకు పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. తెలుగు దేశం-బిజెపి కలిసి పోటీ చేసే విషయంలో తేడాలు రాకుండా చూసుకోవాలని ఈ సమావేశంలో భావించారు. టిఆర్‌ఎస్ ఆపరేషన్ ఆకర్ష్ పట్ల అప్రమత్తంగా ఉండాలని నిర్ణయించారు.
టిఆర్‌ఎస్ ఆపరేషన్ ఆకర్ష్‌తో ఎక్కువగా కాంగ్రెస్ నేతలు ఆందోళన చెందుతున్నారు. ప్రధాన ప్రతిపక్షంగా ఉండి ఆపరేషన్ ఆకర్ష్‌లో బలయ్యామన్న బాధ వారిని వెంటాడుతున్నది. అంతేకాదు తాజాగా టి.పిసిసి అధ్యక్షుడు కెప్టెన్ ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డిని, అసెంబ్లీలో ప్రతిపక్ష నేత కె. జానారెడ్డిని, కౌన్సిల్‌లో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీని అధిష్టానం ఢిల్లీకి పిలిపించి ‘క్లాసు’ తీసుకుంది. గెలుపు-ఓటముల సంగతి ఎలా ఉన్నా, కనీసం అభ్యర్థులను కూడా కాపాడుకోలేకపోతే ఎలా? అని ప్రశ్నించింది. ఇటీవల వరంగల్ లోక్‌సభకు జరిగిన ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా పార్టీ అధిష్టానం టి.పిసిసి ముఖ్య నేతలను ఢిల్లీకి పిలిపించి రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని చెప్పారని, దీంతో లోక్‌సభ మాజీ స్పీకర్‌తో పాటు ఎఐసిసికి చెందిన ముఖ్య నాయకులందరినీ ప్రచారానికి పంపించామని, చివరకు డిపాజిట్ కూడా తేలేకపోవడం ఎవరి వైఫల్యం అని ప్రశ్నించింది. ఆ బాధ నుంచి తేరుకోక ముందే స్థానిక సంస్ధల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులే పలువురు అధికార పార్టీ వైపు వెళ్ళడం వారిని మరింత కలతకు గురి చేసింది. ఈ నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌కు వచ్చే నెలలో ఎన్నికలు జరిగే అవకాశం ఉండడంతో అభ్యర్థుల ఎంపిక వారిని కాపాడుకోవడం, ఎన్నికల్లో గెలిపించుకోవడం వారికి తలకు మించిన భారమైంది. ఆపరేషన్ ఆకర్ష్‌ను ఎదుర్కొని నిలబడేందుకు అన్ని పార్టీలూ కసరత్తు చేస్తున్నాయి.

- వీరన్నగారి ఈశ్వర్ రెడ్డి