రచ్చ బండ

ఫలించని జగన్ వ్యూహాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కురుక్షేత్ర సంగ్రామంలో అభిమన్యుడు వీరోచితంగా పోరాడాడు. అయితే పద్మవ్యూహంలోకి చొచ్చుకుని పోయిన తర్వాత మళ్లీ వెనక్కి ఎలా రావాలో తెలియదన్నది మహాభారత గాథ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంపై, అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద రావుపై అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాలపై రెండు రోజుల పాటు వేర్వేరుగా, హోరా-హోరిగా చర్చ జరిగింది. అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టేప్పుడే సంఖ్యా బలం లేనందున ఓడిపోతామని ప్రధాన ప్రతిపక్షానికి తెలుసు. కనీసం ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలనుకున్నా, అదీ సాధ్యపడలేదు. అయినా ఎందుకు ప్రవేశపెట్టినట్లు? ఏమి సాధించినట్లు? అని ఇతర పార్టీల నేతలు, చివరకు సొంత పార్టీ ఎమ్మెల్యేలు అనుకున్నా, ఆ మర్మం ఏమిటో వైకాపా అధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తెలుసు. తమ పార్టీ నుంచి టిడిపిలో చేరిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలను ఈ రెండు అవిశ్వాస తీర్మానాల సందర్భంగా జరిగే డివిజన్ (ఓటింగ్)లో పట్టుకోవచ్చని, ఆ వెంటనే పార్టీకి వ్యతిరేకంగా ఓటింగ్‌లో పాల్గొన్న తమ పార్టీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ ముందు పిటీషన్ దాఖలు చేయవచ్చని జగన్ భావించారు. జగన్ వ్యూహాన్ని పసిగట్టిన అధికార తెలుగు దేశం అందుకు ప్రతివ్యూహంతో ముందుకెళ్ళింది. వ్యూహ, ప్రతివ్యూహాలతో రెండు రోజు లు, రెండు అవిశ్వాస తీర్మానాలపై ఘాటైన చర్చ జరిగింది. ఈ రెండు అవిశ్వాస తీర్మానాల్లో అధికార పార్టీ పైచేయి అనిపించుకున్నా, పాలకపక్షాన్ని తిట్టేందుకు ఉపయోగపడిందన్న సంతృప్తి వైకాపాకు, జగన్‌కు మిగిలిందేమో. కానీ పాలకపక్షం ప్రతివూహాలకు జగన్ ‘చిత్తు’ అయ్యారు. అందుకు కారణం వైకాపా ఎమ్మెల్యేలలో సరైన వ్యూహకర్తలు లేరు. అడుగడుగునా పాలకపక్షం వేసే ఎత్తుగడలను చిత్తు చేయగల నైపుణ్యం ఉన్న వారు కరువయ్యారు. జగన్ ‘సైగ’ చేస్తే చిటుక్కున స్పీకర్ పోడియం చుట్టూ చేరి నినాదాలు చేయగల సమర్థత ఉందే తప్ప ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసేంత చాతుర్యం లేదు.
జగన్‌లో ఆవేశం కట్టలు తెంచుకుంటున్నా, ఆలోచనతో అడుగులు వేయడం లేదనేది స్పష్టమయ్యింది. పాలక పక్షానికి మెజారిటీ ఉన్నా, తన చాతుర్యంతో, అసెంబ్లీ రూల్స్, పార్లమెంటరీ సంప్రదాయాల (కౌల్ అండ్ షక్దర్)ను ప్రస్తావిస్తూ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టలేకపోయారు. మరోవైపు అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు ఎదురు‘్ధటి’కి జగన్‌గానీ, ఆ పార్టీ ఎమ్మెల్యేలు గానీ గట్టిగా నిలబడలేకపోయారు. సోమవారం రాష్ట్ర ప్రభుత్వంపై అసెంబ్లీలో చర్చ ప్రారంభమైనప్పటి నుంచే జగన్‌కు ఎదురుదాడి తప్పలేదు. అవిశ్వాస తీర్మానంపై ప్రసంగించేందుకు జగన్ నిలుచోగానే మంత్రి యనమల అభ్యంతరం చెప్పారు. జగన్ అవిశ్వాస తీర్మానం ఇవ్వలేదని, పైగా ఆ పార్టీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై జగన్ సంతకం చేయలేదు కాబట్టి ఆయన్ను మాట్లాడనీయరాదని పార్లమెంటరీ ప్రొసిడీంగ్స్ (కౌల్ అండ్ షక్దర్)ను ప్రస్తావించారు. అవిశ్వాస తీర్మానంపై ఎవరైనా మాట్లాడవచ్చు అంటూ జగన్ చెప్పినా, యనమల కల్పించుకుని, మాట్లాడవచ్చు కానీ చర్చను ప్రారంభించేందుకు వీలులేదని చెప్పడంతో, జగన్ కిమ్మనకుండా కూర్చొన్నారు. వైకాపా పక్షం ఉప నాయకుడు జ్యోతుల నెహ్రూ చర్చను ప్రారంభించారు
రెండో రోజూ జగన్ మళ్ళీ అదే తప్పు చేశారు. స్పీకర్ కోడెలపై ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపైనా సంతకం చేయలేదు. సంతకం చేసేందుకు జగన్ ఎందుకు వెనకాడారని పాలకపక్షం ప్రశ్నించినా, సరైన సమాధానం చెప్పలేకపోయారు. ఇరువురు మంత్రులు అవినీతికి పాల్పడ్డారని జగన్ ఆరోపించడంతోనే ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందిస్తూ వాటిని నిరూపిస్తే వారిపై వెంటనే చర్యలు తీసుకుంటామన్నా, జగన్ కిక్కురుమనలేదు. కాగా, సిబిఐ విచారణకు ప్రభుత్వం ఎందుకు వెనకాడుతున్నదని ప్రశ్నించారు. చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేసుకుని కేసుల నుంచి తప్పించుకున్నారని జగన్ ఆరోపించి, ఎదురుదాడికి గురయ్యారు. జగన్ న్యాయ వ్యవస్థను కించపరిచారని, ఆయన సభకు, న్యాయమూర్తులకు క్షమాపణ చెప్పాలని పాలక పక్షం సభ్యులు పట్టుబట్టారు. మంత్రి యనమల అంతటితో ఆగకుండా జగన్ ప్రతి శుక్రవారం కోర్టు బోనులో నిలుచుంటున్నారని విమర్శించారు.
ఇలా రెండు అవిశ్వాస తీర్మానాలపై సోమ, మంగళవారాల్లో జరిగిన చర్చ సందర్భంగా ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలనుకున్న వైకాపా వ్యూహం ఫలించలేదు. కానీ ప్రభుత్వాన్ని, ఏకపక్షంగా వ్యవహారిస్తున్న స్పీకర్‌ను విమర్శించగలిగామన్న సం‘తృప్తి’ ఆ పార్టీ నేతల్లో కనిపించింది. రాష్ట్ర ప్రభుత్వంపై వైకాపా ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంపై చర్చను చేపట్టేందుకు 10 రోజుల గడువు తీసుకోవడానికి వీలున్నా, వైకాపా తమ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు ‘విప్’ జారీ చేసేంత సమయం కూడా ఇవ్వకుండా చర్చను చేపట్టింది. పైగా చర్చ ముగిసాక వైకాపా డివిజన్ (ఓటింగ్) కోరక ముందే స్పీకర్ కోడెల మూజువాణి ఓటుతో తీర్మానం వీగిపోయిందని ప్రకటించారు. ఇది కూడా ప్రభుత్వ ఎత్తుగడలో భాగమే. లాభం లేదనుకున్న జగన్ మంగళవారం స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. స్పీకర్‌పై ప్రవేశపెట్టిన తీర్మానంపై చివరకు ఓటింగ్ జరిగినా, టిడిపిలో చేరిన ఎనిమిది మంది వైకాపా ఎమ్మెల్యేలు ఓటింగ్‌కు గైర్హాజరయ్యారు. దీంతో తమ పార్టీకి చెందిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలు టిడిపిలో చేరినందున, ‘విప్’ జారీ చేసి వారిని నిండు సభలోనే స్పీకర్‌కు ప్రత్యక్షంగా చూపించాలనుకున్న జగన్ ఆలోచన తలకిందులైంది. రెండో రోజున స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం నోటిసు ఇవ్వగానే, ప్రభుత్వం వెంటనే చర్చకు అనుమతించడంతో, వైకాపా హడావుడిగా టిడిపిలో చేరిన తమ పార్టీ ఎనిమిది మంది ఎమ్మెల్యేలకూ ‘విప్’ జారీ చేసింది. దీంతో వారు ‘విప్’ అందుకోవాల్సి వస్తుందని అక్కడి నుంచి బయటకు వెళ్ళి, సెల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకున్నారు. దీంతో ఆ ఎమ్మెల్యేలు తమకు విప్ అందలేదని చెప్పేందుకు అవకాశం ఏర్పడింది. జగన్ వ్యూహాన్ని ఎక్కడికక్కడ పాలకపక్షం ప్రతివ్యూహంతో ఎదుర్కొంది.

- వీరన్నగారి ఈశ్వర్ రెడ్డి