రచ్చ బండ

ఓరుగల్లులో నేతల కష్టాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నిక ఉత్కంఠభరితంగా మారింది. అన్ని ప్రధాన పార్టీలకూ ఇదో పరీక్ష. తెలంగాణ రాష్ట్ర సమితి అధికారం చేపట్టిన ఈ ఏడాదిన్నర కాలంలో ప్రభుత్వ పని తీరుకూ ఒక పరీక్ష వంటిదే. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీకి ఇది కఠినమైన పరీక్ష. ప్రభుత్వ పని తీరును ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రధాన ప్రతిపక్షంగా బాధ్యత నిర్వహించగలిగామా? లేదా? ప్రజలు ఏ మేరకు ఆదరించారు అనేది ఈ ఉప ఎన్నిక ఫలితంతో తెలియనున్నది. సార్వత్రిక ఎన్నికలకు ముందు కేంద్రంలోని కాంగ్రెస్ నేతృత్వంలోని యుపిఎ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిందని, ఎఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ దయ వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైందని చెప్పినా, ప్రజలు తెలంగాణ రాష్ట్ర సమితికే పట్టం కట్టారు. టిఆర్‌ఎస్ అధినేత కె. చంద్రశేఖర్ రావు మాయ మాటలతో ప్రజలు మోసపోయారని ఇంత కాలంగా కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. కాంగ్రెస్ నేతల మాటలను ప్రజలు విశ్వసించారా?, లేకపోతే ఎందుకు విశ్వసించడం లేదు?, లోపం ఎక్కడ ఉంది?, నాయకత్వ లోపమా?, సమిష్టిగా లేకపోవడమా?, ఆ పార్టీపై ప్రజలకు నమ్మకం సన్నగిల్లిందా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు ఓటర్లు నేడు తీర్పు చెప్పనున్నారు. అందుకే కాంగ్రెస్ నాయకులు ఈ ఉప ఎన్నికపై బాగా దృష్టి సారించారు. మాజీ ఎంపి సిరిసిల్ల రాజయ్య నివాసంలో జరిగిన దుర్ఘటనతో కొంత పార్టీకి నష్టం వాటిల్లిందన్న భయం వారికి లేకపోలేదు. కాంగ్రెస్ తరఫున కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణను పోటీకి దించారు. మరోవైపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేయడం వల్ల తమ ఓటు బ్యాంకుకు చిల్లు పడుతుందన్న అనుమానం కాంగ్రెస్ నేతలను వెంటాడుతున్నది. కారణం వైకాపా అభ్యర్థి నల్లా సూర్యప్రకాశ్ తరఫున ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రచారంలో వైఎస్ పేరు చెప్పగానే నేటికీ కొంత మంది కేరింతలు కొడుతున్నారు. ఇందిరమ్మ ఇండ్లు, 108 వాహనాలు, ఆరోగ్యశ్రీ, ఉచిత విద్యుత్తు వంటివి వైఎస్సే ఇచ్చిన విషయాన్ని ఆ పార్టీ విస్తృతంగా ప్రచారం చేస్తున్నది. ఇక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఈ ఎన్నికల్లో ఎన్నో స్థానం దక్కుతుంది? భవిష్యత్తులో ఆ పార్టీ ఏ మేరకు ఆదరణ లభిస్తుందనేది కూడా ఈ ఫలితంతో తేటతెల్లం కానున్నది.
తెలుగు దేశం పార్టీ ఈ ఉప ఎన్నికల్లో పోటీ చేయకపోయినా, మిత్రపక్షమైన బిజెపికి బాసటగా నిలిచింది. బిజెపి- టిడిపిల ఉమ్మడి అభ్యర్థి డాక్టర్ దేవయ్యకు రెండు పార్టీల ఓట్లు ఏ మేరకు లభిస్తాయో, ఫలితం ఎలా ఉంటుందో, ఆ రెండు పార్టీల సఖ్యత ఏ మేరకు ఫలించిందో తేలిపోనున్నది. అభ్యర్థిని గెలిపించుకోవడానికి బిజెపి శక్తివంచన లేకుండా కృషి చేసింది. గెలుపొందితే కేంద్ర మంత్రి పదవి దక్కుతుందన్న ప్రచారం కూడా చేసింది. బిజెపి అభ్యర్థి విజయం కోసం టిడిపి ముఖ్య నేతలంతా విస్తృతంగా ప్రచారం చేశారు. భవిష్యత్తులోనూ టిడిపి ఒంటరి కాకుండా బిజెపితో కలిసి ముందుకు సాగాల్సి ఉంది కాబట్టి ఆ పార్టీ అభ్యర్థి విజయం కోసం సీరియస్‌గానే శ్రమించింది. వామపక్షాలూ ఉమ్మడి అభ్యర్థిగా డాక్టర్ వినోద్‌ను బరిలోకి దించాయి. ఇలా అన్ని పార్టీలూ శక్తివంచన లేకుండా గెలుపు కోసం కృషి చేశాయి. ఆ పార్టీల హేమాహేమీలంతా ప్రచారం నిర్వహించారు.
కాగా ఈ ఎన్నికల ప్రచారానికి టిడిపి జాతీయ అధ్యక్షుడు, ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు లోకేష్, వైకాపా అధ్యక్షుడు జగన్ సోదరి షర్మిల దూరంగా ఉన్నారు. చంద్రబాబును పక్షం రోజుల క్రితం బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్‌రెడ్డి, కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ కలిసి ఎన్నికల ప్రచారానికి రావాల్సిందిగా కోరారు. ఉప ఎన్నికనే కాబట్టి ప్రచారానికి బాబు ఆసక్తి కనబరచలేదు. బాబు తన కుమారుడు లోకేష్‌ను తెలంగాణ రాష్ట్రంలో మంచి నాయకునిగా గుర్తింపు తీసుకుని రావాలని లోగడ అనుకున్నా, ఈ ఉప ఎన్నికల ప్రచారానికి వెళ్ళాల్సిందిగా ఎందుకనో పురమాయించలేదు. ఈ అవకాశాన్ని ఎందుకు ఉపయోగించలేదన్నది పార్టీ నాయకులకు అర్థం కావడం లేదు. రాష్ట్ర విభజన తర్వాత కూడా చంద్రబాబు పలు పర్యాయాలు తన కుమారుడు లోకేష్ తెలంగాణలో పుట్టిన బిడ్డ అని, తెలంగాణ ప్రాంత వాసి అని చెప్పారు. ఆంధ్ర ప్రదేశ్‌లో పార్టీని, ప్రభుత్వాన్ని తాను చూసుకుంటే, తెలంగాణలో లోకేష్‌కే బాధ్యతలు అప్పగించాలని చంద్రబాబు భావించారు. అలా భావించిన బాబు వరంగల్ ఉప ఎన్నిక సమయంలో లోకేష్ బాబును ప్రచారానికి పంపించి ఉంటే బాగుండేదని, పార్టీ శ్రేణుల్లోనూ ఉత్సాహం వచ్చేదని టి.టిడిపి నాయకులు ఆశించారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ కూడా రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణకు తన సోదరి షర్మిలకు ప్రధాన బాధ్యతలు అప్పగించారు. హెలికాప్టర్ ప్రమాదంలో వైఎస్ రాజశేఖర రెడ్డి మృతి చెందడంతో గుండె పోటుతో మరణించిన వారి కుటుంబాలను, ఆత్మహత్యలు చేసుకున్న వారి కుటుంబాలను పరామర్శించే పనిని అప్పగించారు. సోదరి షర్మిల స్టార్ క్యాంపేనియర్ అని జగన్ పొగిడారు. షర్మిల కూడా ‘నేను జగనన్న విడిచిన బాణాన్ని’ అంటూ చెప్పుకున్నారు. పంటలు ఎండిపోయి, బ్యాంకులకు రుణాలు చెల్లించలేక ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలనూ పరామర్శించాల్సిందిగా జగన్ సూచించడంతో షర్మిల మరోసారి తెలంగాణ జిల్లాల్లో పర్యటించి, ఆ కుటుంబాలను పరామర్శించారు. తెలంగాణలో పార్టీ నిలదొక్కుకునేలా చేయాల్సిందిగా షర్మిలపై బాధ్యత మోపిన జగన్, వరంగల్ ఉప ఎన్నిక సమయం వచ్చే సరికి ఆమెను ప్రచారానికి దూరంగా ఎందుకు పెట్టారో ఆ పార్టీ నేతలకే అంతుచిక్కడం లేదు. జగన్ వరంగల్‌లోనే నాలుగు రోజులుగా మకాం పెట్టి విస్తృతంగా ప్రచారంలో పాల్గొన్నారు. అన్ని పార్టీల నేతలు ఎన్నో వెతలు పడ్డారు. ఇప్పుడు అందరి దృష్టి నేడు వరంగల్ ఓటర్లు ఇచ్చే తీర్పుపైనే ఉంది.

- వీరన్నగారి ఈశ్వర్ రెడ్డి