రచ్చ బండ

తెలంగాణపై కనే్నసిన కమలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ రాష్ట్రంపై భారతీయ జనతా పార్టీ కనే్నసింది. ‘టార్గెట్-2019’గా పెట్టుకుని కమలనాథులు పని చేస్తున్నారు. అందుకే బిజెపి జాతీయ అధ్యక్షుడు అమీత్‌షా పక్షం రోజుల్లో తెలంగాణకు శుక్రవారం మలివిడత వచ్చారు. ఏదైనా సమయం-సందర్భం వచ్చినప్పుడే ఉపయోగించుకోవాలని పెద్దలంటారు. అలాంటి సమ యం-సందర్భం ఇప్పుడు తెలంగాణలో వచ్చిందని బిజెపి నాయకులు భావిస్తున్నారు. ఒకటి కేంద్రంలో బిజెపి నేతృత్వంలో ఎన్డీఏ అధికారంలో ఉండడం, రెండవది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల్లో క్రమేణా ఆశలు సన్నగిల్లుతుండడం, మూడు ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకూ బలహీనపడుతుండడం, నాలుగు తమకు మిత్రపక్షమైన టిడిపి (సైకిల్) తునాతునకలు కావడం, ఐదు వామపక్షాల అడ్రసు గల్లంతు కావ డం, ఆరు వైకాపా మళ్లీ చిగురించే అవకాశం లేకపోవడం, ఏడు మజ్లిస్‌ను ఎదిరించి నిలబడే సత్తా కేవలం భాజపాకే ఉండడం, ఎనిమిది పార్టీకి అంకితమైన భావంతో పని చేసే కార్యకర్తలు ఉండడం వంటి ఎన్నో అంశాలను వారు గుర్తు చేస్తున్నారు.
సార్వత్రిక ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నేతృత్వంలోని యుపిఎ అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రావతరణ నాడు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బిజెపి సహకరించినందు వల్లే సాధ్యమైందన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళలేక పోయామన్న వేదన ఆ పార్టీ నేతల్లో ఉంది. ప్రస్తుతం అన్ని విధాలా అనుకూల వాతావరణం ఉన్నందున అడుగులు ముందుకేయాల్సిందేనన్న పట్టుదలతో అమీత్‌షా వడివడిగా అడుగులేస్తూ, పార్టీని ముందుకు నడిపించేందుకు, కార్యకర్తల్లో ఉత్సాహం నింపేందుకు యత్నిస్తున్నారు. కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ సారధ్యంలో ఎన్డీఏ అధికారంలో ఉన్నందున వివిధ పథకాలతో ప్రజలకు మరింత చేరువ కావడానికి ఉపయోగపడుతుందన్న వ్యూహంతో ఉన్నారు. ఇటువంటి మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు బిజెపి నాయకత్వం తాపత్రయపడుతున్నది.
ఇటీవల అమిత్ షా శంషాబాద్‌లో బిజెపి మండల స్థాయి కార్యకర్తలనుద్ధేశించి ప్రసంగించారు. మళ్లీ పక్షం తిరగకుండానే నల్లగొండ జిల్లా సూర్యాపేటలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు హాజరై కార్యకర్తలను ఉర్రూతలూగించేలా ప్రసంగించారు. ఇందులో అమిత్‌షా ఆంతర్యం లేకపోలేదు. బిజెపి అంటేనే పట్టణ పార్టీ అనే ముద్ర ఉన్నందున దానిని చెరిపి వేసేందుకు జిల్లాల బాట పట్టారు. శంషాబాద్‌లో సమావేశం నిర్వహించడానికి ముందు కూడా బిజెపి రాష్ట్ర నాయకులు హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామన్నా, అమిత్‌షా అంగీకరించలేదు. బలం ఉన్న చోటే ఎన్నిసార్లు బల ప్రదర్శన చేస్తారు? హైదరాబాద్‌లో బిజెపికి ఐదుగురు ఎమ్మెల్యేలు ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. కాబట్టి బహిరంగ సభ ఏర్పాటు చేసి జనాలను తీసుకుని రావడం కష్టం కాకపోవచ్చు. కానీ, కొత్త ప్రాంతాలకు, ముఖ్యంగా గ్రామాల్లోకి పార్టీ శాఖలను విస్తరింపజేయరా? అని ప్రశ్నించారు. గ్రామీణ ప్రజల్లో చాలా మందికీ నేటికీ బిజెపి గుర్తు ఏమిటో తెలియదు. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకునే అమిత్‌షా రంగారెడ్డి జిల్లాలోనే ఆ సమావేశాన్ని నిర్వహించాలని చెప్పారు. శంషాబాద్‌లో జరిగిన సమావేశంలో పాల్గొనేందుకు వచ్చినప్పుడే విమానాశ్రయానికి సమీపంలో ఉన్న ఒక ప్రముఖ హోటల్‌లో అమిత్‌షా పార్టీ ముఖ్యులతో మంత్రాంగం చేశారు. తర్వాత నిర్వహించబోయే సమావేశం కూడా జిల్లాల్లోనే పెట్టాలని కచ్చితంగా చెప్పారు. దీంతో కరీంనగర్ జిల్లా పార్టీ ముఖ్య నాయకులు తమ జిల్లాల్లో బహిరంగ సభ ఏర్పాటు చేస్తామని, ఖర్చులూ తామే భరించుకుంటామని అన్నారు. నల్లగొండ జిల్లా నాయకులూ అదే విధంగా పట్టుబట్టారు. దీంతో ఈ దఫా (శుక్రవారం జరిగిన సభ) నల్లగొండ వారికే అవకాశం ఇద్దామని, వచ్చే సమావేశం కరీంనగర్‌లో నిర్వహించుకోవచ్చన్న నిర్ణయం జరిగింది.
ఆంధ్రలో ఎలాగైనా టిడిపితో మిత్రపక్షంగా ఉన్నందున ప్రస్తుతం ఆ పార్టీతో కలిసే ఉండాలన్నది ఆలోచన. కేంద్ర మంత్రివర్గంలో టిడిపి చేరడం, ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న టిడిపి మంత్రివర్గంలో బిజెపి చేరినందున, అక్కడి గురించి ఇప్పుడే పెద్దగా ఆలోచన చేయాల్సిన అవసరం లేదన్న భావనతో ఉన్నారు. ఇక తెలంగాణలో టిడిపితో మిత్రపక్షంగా ఉండడం వల్ల పెద్దగా ఉపయోగం లేదన్న అభిప్రాయానికి ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం వచ్చేసింది. ఇదే విషయాన్ని పార్టీ జాతీయ నాయకత్వం చెవిన వేసింది. స్వతహాగా పార్టీ ఎదగాలని కోరుకోవడం మంచిదేనని అమిత్ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పటికిప్పుడే టిడిపితో తెగతెంపులు అనకుండా, ముందుగా పార్టీని గ్రామీణ ప్రాంతాలకు విస్తరించి, గ్రామీణ ప్రజల ఆదరాభిమానాలు చూరగొనేలా చేయాలన్న తపనతో ఉన్నారు. ఇదొక్కటే అమిత్‌షా ఆంతరంగం కాదు. తాను అధ్యక్షునిగా ఉన్నప్పుడే దక్షిణాది రాష్ట్రాల్లో బిజెపిని బలోపేతం చేయాలన్నది ఒక కారణమైతే, రెండవ కారణం 2014లో లోక్‌సభకు జరిగిన ఎన్నికల్లో ఉత్తర భారత దేశంలో నరేంద్ర మోదీ ప్రభంజనం సృష్టించారు. ఉత్తర్ ప్రదేశ్‌లోని 80 లోక్‌సభ నియోజకవర్గాల్లో 73 నియోజకవర్గాలను కమలనాథులు కైవసం చేసుకున్నారు. గుజరాత్‌లో 26 లోక్‌సభ సీట్లు ఉంటే మొత్తం ఆ పార్టీనే విజయం సాధించింది. రాజస్థాన్‌లో 25 సీట్లు ఉంటే అన్నింటిలో బిజెపి గెలుపొందింది. వచ్చే లోక్‌సభ ఎన్నికల నాటికి ఏదైనా తేడా వచ్చి ఉత్తరాది రాష్ట్రాల్లో సుమారు 40-50 సీట్లు తగ్గినా, ఆ భర్తీని దక్షిణాది రాష్ట్రాల నుంచి చేయాలన్న ఆలోచనతో అమిత్‌షా ఉన్నారు. ఉత్తరాదిన తగ్గకుండా పెరిగితే మరీ మంచిదేనని, అయినప్పటికీ దక్షిణాదిన పార్టీని విస్తృత పరచుకోవాలన్నది ఆయన తపన. ఇందులో భాగంగానే తెలంగాణపై కనే్నశారు. తెలంగాణలో బిజెపికి ఒక ఎంపి, ఐదుగురు ఎమ్మెల్యేలే ఉన్నారని దిగులు పడాల్సిన అవసరం లేదని, అస్సాంలో కూడా కేవలం ఏడుగురు ఎమ్మెల్యేలు మాత్రమే ఉండగా ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా 63కు పెరిగామని అమిత్‌షా ఉదహరిస్తూ పార్టీ తెలంగాణ యంత్రాంగానికి ధైర్యాన్ని నూరి పోస్తున్నారు.

- వీరన్నగారి ఈశ్వర్ రెడ్డి