రాజమండ్రి

డాక్టర్ మిత్ర (కథానిక)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘సూర్యుడు తూర్పున బంగారు బంతిలా ధగధగలాడుతున్నాడు’’. కిటికీలోంచి సూర్యకిరణాలు వేగంగా వచ్చి - బెడ్‌రూమ్‌లో పరచుకుంటున్నాయి.
‘‘సకల మానవాళి - మేల్కొని వారి వారి పనుల్లో బిజి అయిపోతున్నారు.’’
‘‘రాత్రి వచ్చిన వర్షం, తెల్లవారి సూర్యుడి ప్రతాపం, జన జీవనంలో మార్పు తెచ్చింది.’’ అదే జూన్ నెల, అంటే ఇహ చెప్పక్కర్లేదు. డాక్టరు మిత్ర వాకింగ్‌కి వెళ్లి వచ్చాడు. పల్లెటూళ్లో అందరికీ చక్కని వైద్యం అందిస్తారు. ఫీజు ఆశించడు.
‘‘దేముడి గదిలోంచి, కౌసల్యా సుప్రజా రామ - సుప్రభాతం వినిపిస్తోంది’’
వంట గది నుంచి కాఫీ డికాక్షన్ - పొగలు కక్కుతూ కమ్మని రుచి ముక్కుపుటాలను సోకుతోంది. నిద్రమత్తు వదిలించేసింది.
దొడ్లో వాషింగ్ మిషన్ చప్పుడు వినిపిస్తోంది. అప్పుడే ఇంట్లో దిన చర్యలు మొదలైపోయాయి. గదిలోనే ఉండి అన్విత ఇంటి పనులు వింటోంది. దుప్పటి తీసి మడతపెట్టి ఫ్యాన్ ఆపుచేసి హాల్లోకి వచ్చింది.
లేచావా! అన్విత. తొందరగా రెడీ అవ్వు - బామ్మగారి పూజ పూర్తయ్యే టైముకి స్నానం చేసిరా, కవిత చెప్పింది.
సూర్యుడితోపాటు ఇంటి పనులు మొదలయ్యాయి. వంట ఏంచెయ్యమంటారని కవిత అత్తగార్ని అడిగింది. ప్రతిరోజు ఆవిడకి నచ్చినవి వండిపెడుతుంది. అందరూ కవిత లాగా డాక్టరు మిత్రలాగా తల్లిదండ్రుల్ని చూస్తే ఈ సమస్యలుండవు. దోసకాయలున్నాయి కదా, అవి ఉడుకు పచ్చడి చెయ్యి. నిల్వ ఉంటుంది. ఇవ్వాళ శనివారం. రాత్రి ఇడ్లీలకు పచ్చడిగా ఉంటుంది. తోటకూర కొబ్బరి వేసి వండితే కూర ఎంత బాగుంటుందీ! మామిడికాయ, పప్పు రాత్రికి ఉండేలా చెయ్యకు. అంతగా మిగిలితే సాంబారు చేస్తే ఇడ్లీకి రెండో ఆధరవుగా ఉంటాయి. ఏమిటో, తినడానికి ఎన్ని రుచులో. ఆధరవులు ఎక్కువ కావాలి, అంటు జపమాల తిప్పడంలో మునిగిపోయింది. కవిత ఇంట్లో వంటలన్నీ ఒక పద్ధతిలో వండుతుంది. మర్నాటికి మిగలకుండా వండాలి. ఆ ఇంటి పద్ధతి - పచ్చడి మిగిలినా సరే ఫ్రిజ్‌లో పెట్టరు. ఇది ఒకరకమైన హైజీన్. మిగిలినవన్నీ ముందే విడదీసి సాయంత్రం పని అమ్మాయికి ఇచ్చేస్తుంది. వాళ్లకి పాపం మిగులు, తగులు, చద్దిపొద్ది పెట్టరు. వాళ్లు మాత్రం ఆరోగ్యాలు జాగ్రత్తగా చూసుకోవద్దా. ఆరోగ్యం అందరికీ ఐశ్వర్యమే అంటుంది. కూరగాయలు, పాలు, పెరుగు తప్ప మిగిలినవి ఫ్రిజ్‌లో పెట్టరు. ఇక్కడ కవిత అత్తగారి గొప్పతనం చెప్పుకోవాలి. నలుగురు పిల్లల్నీ పెద్ద చదువులు చదివించింది. పల్లెలో పెద్ద మేడ, గొడ్లశాల, నాలుగు గేదెలు, రెండు ఆవులు. నెయ్యి, పెరుగు, పాలు, అన్నీ ఇంట్లోనే వాడుకుంటారు. మిగతా పాలు డిపోకి పంపిస్తారు. ఇంటి వాడకం తర్వాతే అమ్మకం. ఈ పెంపకం పంపకం రెండింటిలో ఆనందముంది. ఉదయం ఇంట్లో ఇడ్లీ, ఉండ్రాళ్లు. దేశీ వంట స్టీమ్ వంటలే చేస్తారు. నూనె వంటకాలు తినరు. 11 గంటలకి భోజనాలు, మళ్లీ 3 గంటలకి టిఫిన్ చెయ్యాలి. పిల్లలు ఉదయం 9 గంటలకి భోజనాలు చేసి టిఫిన్ బాక్స్‌ల్లో పెట్టుకుని వెళ్లిపోతారు. పిల్లలు వచ్చేది 4 గంటలకు. ఆ టైము బజ్జీలుగాని, పకోడీలుగాని చేస్తుంది. డబ్బాల్లో నిల్వ స్వీట్సు మిఠాయి, రవ్వలడ్డు, లడ్డూ, కాజాలు వంటివి నిల్వ ఉంచేది. భర్తకి వ్యవసాయం, ఊరి పనులు తప్ప - ఇంటి పనులు మంగతాయారే చూసేది. తల్లి బాగా చూస్తారని నమ్మకం. ఆలాగే పిల్లల్ని డాక్టర్, ఇంజనీరు చదివించింది. బెంగుళూరులో - కలకత్తాలో స్థిరపడ్డారు. ఒక ప్రశంస మనిషికి గ్లుకోజ్ డోస్ లాంటిది. ఆఖరి కొడుకు ‘మిత్ర’ మాత్రం సొంత ఊరిలో ఆస్తి, అంతస్తు నిలపడానికి ఉన్న ఊళ్లో తల్లిని చూసుకుంటూ నిలబడ్డాడు. సిటీ స్పీడ్ లైఫ్‌కి తట్టుకోలేము. ప్రశాంత జీవితం కావాలని తల్లిని చూస్తూ పిల్లల్ని హాస్టల్లో పెట్టి చదివించారు. డాక్టరుగా మంచి పేరు తెచ్చుకున్నాడు.
ఒక్కొక్క ఇంటికి ఒక్కో పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతిలోనే జీవితాలు గడచిపోతాయి. తరతరాల వ్యవహారాలను కొత్తగా వచ్చిన కోడళ్లు అలవర్చుకోవాలి. ఆర్డర్ వెయ్యగానే సరకులు తెచ్చే కొడుకు, వండిపెట్టే కోడలు, తనకేమిలోటని మంగతాయారు సంతోషపడింది. తనకేమి లోటు. వేడి వెచ్చగా తింటేనే ఆరోగ్యము. అందుకే నిముషాల మీద చేయడానికి ఎలక్ట్రికల్ ఐటమ్స్ పెట్టుకుంది. అత్తగారు కూడా కోడలి పనితనాన్ని మెచ్చుకుంది. మారేకాలంతోపాటు ఆధునిక విధానాలను అలవర్చుకోవాలి అంటుంది. ఉదయం సూర్యుడితోపాటు పరుగులు తప్పవు. గడియారం తొమ్మిది కొట్టింది. ఇంటి పనులు చేయడం తేలిక. కాఫీ మిషన్‌లో కాఫీ పొడి రెడీ అయిపోయింది. ఎలక్ట్రికల్ కుక్కర్‌లో రైస్, పాన్‌లో కూర ఉడుకుతుంది. ఓ అరగంటలో అన్నీ రెడీ చేస్తుంది. ఈలోగ డైనింగ్ టేబుల్‌పై ఇడ్లీ, సాంబారు, పచ్చడి, పొడి, నెయ్యి అన్నీ రెడీగా పెట్టింది. ఇంత బాగా ఇంట్లో పెద్దల్ని చూసుకుంటే వృద్ధాశ్రమాలు అవసరం లేదు. అత్తగారు, ఆయనా తిన్నాక కవిత తింటుంది. ఎడం చేత్తో వడ్డన నచ్చదు. బఫె భోజనాలు, వళ్లో పెట్టుకుని తినడం నచ్చదు. పద్ధతిగా తినడమే ఇష్టము.
బ్యాంక్ పని ఉందని టేబుల్ సర్ది వెళ్లింది. బ్యాంకులో వద్దన్నా కాఫీ ఆఫర్ చేశారు. తాగక తప్పలేదు. రేటు ఎంత? అంటే పది రూపాయలు అన్నారు. ఇవ్వద్దు మేడమ్ అన్నారు. అంటే మేము ఇంట్లో తాగే గ్లాసు ఖరీదు 80 రూపాయలన్నమాట. గ్లాసు నిండా పాలులేందే ఎవరు ఇంట్లో తాగరు. బయటి ప్రపంచంలో కొని తాగడం చాలా కష్టం. అసలు పాలు, పప్పు, బియ్యం రేట్లు పెరగ కూడదు. కాస్మోటిక్స్ రేటు పెంచినా ఫర్వాలేదు. ప్రభుత్వం సామాన్య ప్రజల్ని దృష్టిలో ఉంచుకుని పాలిస్తే రామరాజ్యం కదా. డస్ట్‌బిన్‌లో పదార్థాల రేటు పెంచకుండా వస్తువులు వేస్ట్ చెయ్యకుండా వండుతుంది. వేస్ట్‌కి అలవాటుపడ్డ వారు తగ్గించడం కష్టమే. ఈలోగా ఇల్లు రానే వచ్చింది. ఆలోచనలకి బ్రేక్‌వేసి బండిని షెడ్‌లో పెట్టింది. ‘అన్నీ రెండు వేలు - అయిదు వందల నోట్లే బ్యాంకులో ఇచ్చారు. బ్యాగ్‌ను మళ్లీ సరిచూసుకుంది. ఇవ్వాళ గెస్ట్‌లు వస్తున్నారట. మళ్లీ అన్నం వండాలని అత్తగారు అన్నది. దానికి కవిత వచ్చాక కుక్కర్ పెడతాను. ఎంతండి మాటల్లో ఉండండి చాలు. మీకు వడ్డిస్తా తినండి అంటూ, కాళ్లు చేతులు కడుక్కుంటుంది. బ్యాగ్ బెడ్‌రూమ్‌లో పెట్టి వచ్చింది. అయితే ఈలోగా మిత్ర ఫోన్ చేశాడు. తను అరగంట వరకు భోజనానికి రాను, గెస్ట్‌లు ఇవ్వాళ రారట అని. మిత్ర ఫ్రెండ్‌కి హైదరాబాద్‌లో ప్రొఫెసర్ ఉద్యోగం వచ్చింది. రూ.70 వేలు జీతమిస్తాం అన్నారు. అయితే ఇక్కడ కాలేజీలో రూ.15 వేలు ఇస్తున్నారు. కేవలం జీతం కోసం వెళ్లాలా? సొంత ఇల్లు, బంధువుల్ని వదులుకుని, ట్రాఫిక్ జామ్‌లో జీవితం సగం గడచిపోతుంది. ఓ పక్క నీళ్ల ఎద్దడి. అద్దెలు ఆకాశాన్ని అంటుతాయి. బయటకు వెళ్లాలంటే వెయ్యి కాగితం చాలదు. ఇక్కడ మూడు గంటలు కష్టపడితేనే మంచి జీతం. ఇది చాలు. ఈ విషయమై నన్ను సలహా అడగడానికి వస్తానన్నాడు. మళ్లీ ఎందుకో రావడం లేదని ఫోన్ వచ్చింది అన్నాడు. ఏంటో ఈ జీవితాలు. అన్నీ డబ్బు పరుగులే. వంట ఎక్కువ చేస్తేగాని అత్తగారికి నచ్చదు. గినె్నలు నిండుగా ఉండాలి. సెల్‌ఫోన్ వచ్చాక వంటలు మాడటం తగ్గాయి. ల్యాండ్ లైన్ టైమ్‌లో కూడా మాడు ఎక్కువ. అమ్మకి అన్నం పెట్టెయ్యి. నేను రావడం లేటవుతుందని చెప్పారు. వెర్రికుంక ఎంత ప్రేమో వాడికి అన్నది. మిత్ర అరగంటలో రానే వచ్చాడు. అమ్మ పేరిన హెల్త్ టాక్స్ కట్టి వచ్చాను. నా ఫ్రెండ్ రాఘవని కూడా ఫ్యామిలీ ఇన్సూరెన్సు తీసుకోమంటే మాకు అచ్చిరాదని వాళ్ల ఆవిడ ఒప్పు కోలేదట. నేను అమ్మచేత, మనుమలకి కట్టించాను. అలాగే నా పిల్లలకు కట్టించానని చెప్పాను. పాలేరు రాలేదా! ఆవులు అరుస్తున్నాయి. ఎండాకాలం ఎక్కువ నీరు పెట్టాలి. పావురాల గూడులో కూడా మేత, నీరు పెట్టమను. పెరట్లో పాదులు మొక్కలు ఎండాకాలమే బాగా చూసుకోవాలి. ఇంటికి కావల్సినవి వాడుకుని మిగతావి పంచుతారు. పళ్లు బొట్టు పెట్టి వచ్చిన వాళ్లకి ఇస్తారు. ఈ అలవాటు అందరికీ ఉండదు. మిత్ర భోజనం చేసి హాస్పిటల్‌కి వెళ్లాడు. ఆకలి టైముకి ఆకలి వేస్తుంది. కాని అన్నం అందరికీ ఉండదు. అత్తయ్య లేచి టైము అయ్యింది టీపెట్టి బీరకాయ బజ్జీలు, కొత్తిమీర పచ్చడి చెయ్యాలనుకుంది. హాస్పిటల్‌కి ఫోన్ చేసింది. టిఫిన్ పంపనా, మీరు వస్తారా? పెళ్లిళ్ల సీజన్ కదా పేషెంట్స్ తక్కువ ఉన్నారు. నేను వస్తాను అన్నాడు. టిఫిన్ పూర్తి అయ్యేలోగా వీణ మాస్టారు వచ్చారు. కొత్తపాఠం వచ్చిందా అన్నారు. లేదు సార్! ఏవో పనులు. పాత పాఠమే చెప్పండి. ఈలోగా అత్తగారు హాల్లోకి వచ్చారు. వెళ్లేటప్పుడే చక్కెరకేళి పళ్లు, మామిడిపళ్లు ఇస్తుంది. మర్చిపోకుండా తీసుకెళ్లండి మాస్టారూ! అంది.
కవిత వీణ తెచ్చి పెట్టుకుని వర్గం వాయించి కొత్తపాఠం వాయించింది. ఈలోగా డాక్టర్ మిత్రవచ్చి క్షేమ సమాచారాలు అడిగి పిల్లలు ఫీజులకి వాటికి డబ్బు ఇస్తానన్నారు. ‘మనిషిగా పుట్టినందుకు, సాటి మనిషికి సాయం చేయాలి. మాట సాయం, ఆర్థిక సాయం, పాజిటివ్‌గా ఆలోచించాలి. నవ్వ గలిగిన, ఆలోచించ గలిగిన, మాట్లాడగల్గిన వ్యక్తి ఒక్క మనిషి మాత్రమే. మనిషి పుట్టడానికి 9 నెలలు కావాలి. నెగెటివ్ థింకింగ్‌తో సమస్యలు తెచ్చుకోకూడదు. మనిషే పట్టెడు మెతుకులు న్యాయంగా తినాలంటే ఎంతో కష్టపడాలి. నానాటికి బ్రతుకు నాటకంలో మంచి వ్యక్తిగా ఆలోచించాలి. ఆస్తుల పెంపకంలో మోసాలు.
అమెరికన్లు ఇన్సూరెన్స్‌కి ప్రాముఖ్యతనిస్తారు. అమెరికాలో 400 కంపెనీలు ఉన్నాయి. మన ఇండియాలో ఇన్సూరెన్సు అంటే ఇష్టత తక్కువ. వంద ప్రశ్నలు వేస్తారు. అవగాహన లేదు. ఆమధ్య ఓ డాక్టర్ పెళ్లికొడుకు అమెరికా నుంచి వచ్చి ఇండియాలో పెళ్లి కూతురికి రూ.20 లక్షలు పాలసీ సెక్యూరిటీ ఇస్తానన్నాడే. అయినా వాళ్లు పిల్లని అమెరికా చెయ్యనివ్వలేదు. మాకున్న డబ్బు మాకు చాలు. మా దేశం పెళ్లికొడుకులు మాకు సరిపోతారన్నారు. ‘న్యాయము, నీతి మనిషికి రెండు కళ్లు’. అందుకే ప్రతిక్షణం భవిష్యత్తు ఆలోచన, మంచి నిర్ణయాలు మనిషి జీవితానికి బంగారుబాట వేస్తాయి. జీవితానికి ప్లాన్ బాగుంటే సక్సెస్ మన అరచేతిలో ఉన్నట్లే కదా! కబుర్లు చెప్పే మనుషులు, గొప్పలు చెప్పే మనుషులు కాదు. మంచి మార్గం చూపే స్నేహితులు కావాలి. సర్వేజనా సుఖినోభవంతు కదా!

- నారుమంచి వాణీప్రభాకరి
ప.గో.జిల్లా

తేనెలొలుకు...

తడబడుతున్న
తెలుగుదనం

21న మాతృ భాషా
దినోత్సవం సందర్భంగా...

అసలు భాష ఎలా మరణిస్తుంది..? అందుకు కారణాలుగా ఆ భాషీయులు లేకపోవడం, ఆ భాషీయులు మాట్లాడటం మానివేయడం, పాలనలో సాంస్కృతిక అంశాల్ని అణచివేయడం, భాషీయుల్లోనే అధిక శాతం, సొంత భాష పట్ల కనపరిచే ప్రతికూల ధోరణి. ప్రపంచీకరణ నేపథ్యంలో మితిమీరిన వలసలు, పట్టణీకరణ, పాశ్చాత్య భాషా వ్యామోహం, ఇతర ప్రాంతాల్లో ఉద్యోగావకాశాలు ఇత్యాదులు.
తెలుగు భాష మాత్రమే కాదు - వివిధ సంస్కృతుల సమ్మేళనం. దురదృష్టవశాత్తు నేటితరం పూర్తిగా విస్మరిస్తున్నారు. ఈ విషయంలో వారి వైఖరిలో మార్పురావాలి. ఆంగ్లం అవసరమే. ఎక్కువ అవసరం తెలుగుతోనే. గ్రామాలకు వెళ్లినప్పుడు భాషా సంస్కృతి సంప్రదాయాలు తెలుస్తాయి. నేటితరం కనీసం గ్రామాల్లోని వారి బంధువుల ఇంటికి కూడా వెళ్లడంలేదు. వారికి పాత సంస్కృతుల పట్ల పూర్తిగా అవగాహన లేకుండాపోతుంది.
మనదేశంలో సుమారు 179 భాషలు, 544 మాండలీకాలు విభిన్న సంస్కృతులతో నిండి ఉంది. చివరకు వాటి నుంచి 14 అభివృద్ధి చెందిన భాషలను ఆయా ప్రాంత ప్రజలు మాతృ భాషలుగా గుర్తించారు. మాతృభాషపై మమకారాన్ని పెంపొందించుకుని, అమ్మ భాష పట్ల పునరంకితం కావాలి. మాతృభాషా పరిరక్షణ కోసం ప్రతిఒక్కరూ కృషిచేయాలి. మన సంస్కృతి సంప్రదాయాలు, మన భాష పట్ల ఉన్న అభిమానంతో అనుక్షణం శ్వాసించాలి.
గడిచిన 500 సంవత్సరాల్లో ఐరోపా, ఆసియాలలో మొత్తం 75 మాతృభాషలు మరణించాయి. అమెరికాలో 280 భాషలుండగా, ఇప్పుడు 115 భాషలకు సంబంధించి చివరి వ్యక్తులు కూడా మరణించారని యునెస్కో సవివర జాబితా ఈ మధ్య విడుదల చేసింది. నేడు భాషా పరిజ్ఞానం పెరిగి భాష అనేది అందరికీ అవసరమనే ధోరణిలో ఆధునికులు కొందరు ప్రవర్తిసుండటం కొంతలో కొంత మెచ్చుకోదగ్గది. కానీ - ఈనాడు బాల్య దశ నుండి ఇంగ్లీషు మాధ్యమంలో బోధిస్తున్న గ్లోబల్ స్కూళ్లూ, కానె్సప్ట్ స్కూళ్లూ, కానె్వంటులూ పబ్లిక్ స్కూళ్లు తామర తంపరగా పుట్టుకొస్తున్నాయి. నిజానికి ప్రాధమిక విద్య అంటే 5వ తరగతి వరకూ మాతృభాషలోనే బోధనా మాధ్యమం ఉంటేనే బాలల గ్రహణశక్తి, వ్యక్తీకరణ శక్తి, సృజనాత్మక శక్తి వికసిస్తాయని విద్యా మానసిక శాస్తజ్ఞ్రులు ప్రపంచ వ్యాప్తంగా అంగీకరిస్తున్న వాస్తవం. మన పాఠశాలల్లో ప్రాథమిక స్థాయిలోనే ఇంగ్లీషు మీడియం పెట్టి పిల్లల మానసిక వికాసం మొద్దుబారేట్లు చేస్తున్నారు.
పండితుడు రాసినా, పామరుడు రాసినా, తన భావాలను, తన భాషను ఒకేవిధంగా రాయలేరు. అలా రాయక పోవడానే్న నాగరికత అంటారు. అంటే భాష ఒకే సమయంలో సహజత్వం, నాగరికత అనే రెండు ప్రయోజనాలను సాధించడానికి మాతృభాష ఉపయోగకారి అవుతుంది. ఒక భాషకు విలువను పెంచడం అంటే - ఇంకో భాషను తూల నాడడం కాదు. అన్ని భాషల్ని అంతో కొంతో నేర్చుకుంటే మన తెలుగు భాషకున్న విలువ పెరుగుతుంది. మనలో మాండలికాలను చూసి కించపరచకూడదు. వీలైతే ఆ మాండలికం ఆ ప్రాంతంలో ఎలా వచ్చిందనేది తెలుసుకోవాలి. నిజానికి మాతృభాష మీద ప్రతివాడికి సులువుగానే అధికారం లభించవచ్చు. కాని మన దేశంలో ఇది సులభ సాధ్యంకాని పని అయి కూర్చున్నది. దీనికి కారణమేమంటే - మనకు మనోవికాసం చేకూరుస్తూ వచ్చిన భాషలు ఇతర భాషలే. ముఖ్యంగా ఇంగ్లీషు తర్వాత హిందీ, ఈనాడు కూడా మనిషి విద్యావంతుడు కావటమంటే ఇంగ్లీషు సంస్కృతిని అలవరుచుకోవటమే అవుతుంది. ఈ శతాబ్దంలో వచ్చిన రచయితలు దాదాపు అందరూ ఆంగ్ల భాషలో తమకు అందిన సాహిత్యాన్ని చదివి దాని ప్రభావానికి గురి అయిన వారే.
విద్యావ్యాప్తికి ఉత్తమ గ్రంథాలు అవసరమైనట్టే, తెలుగు తేట మాట మనం వ్యవహరించే భాషపై ఆధారపడి ఉంటుంది. గత కాలపు సాహితీవేత్తలు ఆ మాటలను సంపాదించి, సాహిత్యానికి చక్కని రీతులు తీర్చిదిద్దారు. అయితే ఇందులో అందరూ శ్రమపడి కొంతయినా సహాయపడితే సాగుతుంది. ఇవన్నీ మామూలు మాటలు కావు. కనుక వీటి వెనుక మన తెలుగువాళ్ల ఆచారం, చదువు, సంప్రదాయం, చరిత, జాతీయత అన్నీ ఇమిడి ఉన్నాయి. కాబట్టి మన శ్రమకు ఫలితం దక్కించుకోవచ్చు.
భాషాభిమానులయిన వారంతా ఎవరికి వారే ఈ విషయంలో కృషిచేస్తే అత్యుత్తమమైన నిఘంటువు తయారవుతుంది. అంతేగాని ఎవరో కారణ జన్ముల పని, మనం పూనుకోతగ్గ పనికాదని మిన్నకుండుట మంచిది కాదు. తెలుగు భాషాభివృద్ధికి సహాయపడదలుచుకున్న యువకులు ఎప్పటికప్పుడే విన్న అర్ధవంతమైన పదాలతో ఆనంద పడక, అంతటితో తృప్తి పడక ఇలాంటి తియ్యని మాటలు ఆ అందచందాలు గ్రంథస్థం చేస్తూంటే, ఆ ఆ ప్రయత్నంగానే అద్భుతమైన ఒక పెద్ద చరిత్ర తయారవుతుంది మన తెలుగు భాషకు. తెలుగు భాషతోపాటు దేశానికి కూడా. భాషల్లో కల్లా తెలుగు భాష తీయనిదంటారు. ఆ మాధుర్యమెట్లాటిదో చవి చూసినట్లవుతుంది. దశలవారీగా ఒక విధానంలో మార్పు జరిగేలా చేయడం ద్వారా కొన్ని నెలల్లోనే తెలుగును అమలు చేయవచ్చు. బోర్డులు, అధికార్ల పేర్లు, కార్యాలయాల పేర్లు, అన్నీ తెలుగులో ఉండేలా చూడాలని అధికారుల ఆదేశాలు అమలు జరిగేటట్టు ఎప్పటికప్పుడు పర్యవేక్షించుకోవాలి. అలాగే దస్త్రాలు మొత్తం కూడా తెలుగులోనే జరగాలని కూడా కచ్చితమైన ఆదేశాలు జారీ అయ్యేటట్టు చూడాలి.
సజీవమైన వ్యవహారిక భాష రాసేటప్పుడు ప్రాంతీయ పదాలు హెచ్చుగా ప్రయోగించబడతాయి. వివిధ ప్రాంతాల ప్రజల్లో వాడుకలో ఉన్న సామెతలను మాటల పొందికను ఉపయోగించితేగాని భాష అభివృద్ధి చెందదు. కానీ ప్రాంతీయ పదాల వాడక అన్ని ప్రాంతాల వారికి అర్ధమయ్యేటట్లు మార్గమేమిటి అని ఆలోచిస్తే- సులభమైన గ్రాంథిక భాష ప్రయోగం అన్ని ప్రాంతాల వారికీ ఒకే రకంగా అర్ధవౌతుందనుకుంటే గత యాభై ఏళ్లలోనూ మన ఆంధ్ర వాజ్మయంలో సాధించిన విజయాల నుండి వెనక్కి పోవడమన్న మాట. ఎందుకంటే - దినదినం మార్పు చెందుతున్న పరిస్థితులను అనుసరించి భాష కూడా అభివృద్ధి చెందుతూ ఉండాలి.
మాట్లాడే భాషకూ, రాసే భాషకూ, ఐక్యమో లేక సాన్నిహిత్యమో అనివార్యం అవుతుంది. ఈ విధమైన మార్పు చేర్పులు తప్పవు. తెలుగు పుట్టిన నాటి నుండి నేటి వరకూ తెలుగు వారు భాష ప్రయోజనాన్ని పక్కింటిని పరభాషల ద్వారానే పొందడం సంభవిస్తూ వచ్చింది. ఆది కాలంలో సంస్కృత ప్రాకృత్యాలు, తర్వాత తురక, ఇంగ్లీషు భాషలు తెలుగు ప్రజల మీద వెల్లివిరిసి తెలుగుకూ రూపం ఏర్పరచి పెంపొందించి భాషా ప్రయోజనాల్ని ఎన్నింటిలో తన మూలాన తెలుగు ప్రజలకు ప్రసాదిస్తూ వచ్చింది. ప్రాచ్య భాషల్లో అన్ని పదాలనూ అజంతాలుగానే పలికే భాష ఒక్క తెలుగు మాత్రమే. పాశ్చాత్య భాషల్లో ఇటాలియన్ భాషకు అలాంటి విలక్షణత ఉందంటారు. అజంత భాషలన్నీ సాధారణంగా శ్రావ్యంగా మృదువుగా ఉంటాయి. ఇవి పాటల్లోకి సులభంగా ఒదిగే పదాలుగల భాషలు. ఇవి మాట్లాడుతున్నప్పుడు అంతర్వాహినిగా సంగీతం ప్రవహిస్తూ ఉంటుంది. అందువల్లనే ఆ భాషలు తెలియనివారికైనా ఆ మాటలు వింటుంటే హాయిగా ఉంటుందని చెప్పక తప్పదు.

- ఎస్.ఆర్.్భల్లం, తాడేపల్లిగూడెం,సెల్: 9885442642

మనోగీతికలు

వాస్తవం నేస్తం

అబ్బాయి పుట్టినపుడు ఆనందపడ్డాను
అమ్మాయి పుట్టినపుడు బాధపడ్డాను
వాడు పెరుగుతుంటే సంతోషించాను
ఆమె పెరుగుతుంటే నీరసించాను
వాడు చదువుతానంటే సంబరపడ్డాను
ఆమె చదువుతానంటే దిగులు చెందాను
వాడి పెళ్లంటే పండగలా ఫీలయ్యాను
ఆమె పెళ్లంటే దండగనుకున్నాను
ఉద్యోగం పేరుతో వాడు ఊరు వదలి వెళ్లినపుడు
కాలం ఇచ్చిన తీర్పుతో కళ్లు తెరుచుకున్నాను
కొడుకు అంటే కొరివిపెట్టేవాడని
కూతురంటే కూరిమి పంచేదని.

- హైమవతీ సత్య
వేల్పూరు, తణుకు, సెల్: 9014396007

పోటు
కత్తిపోటు కళ్లకి కన్పిస్తుంది
బాహ్యంగా బాధిస్తుంది!
కొన ఊపిరి మిగిలి ఉంటే
మచ్చ కూడా లేకుండా
శస్తచ్రికిత్సకి లొంగిపోతుంది!
దీనికి తాతలాంటిది
కళ్లకి కన్పించనిది
ఒకటి ఉంది! అది...

గుండెని గుద్దుతుంది
రక్తాన్ని చిలుకుంది!
నరాలిని మెలిపెడుతుంది
కండలిని నీరుగారుస్తుంది!
ఎముకలిని రోట్లో దంచుతుంది
మానసిక అనారోగ్యం
శారీరక కుంగుబాటు
ప్రసాదిస్తుంది! అది
‘మాట పోటు’2
దీనికి మేలిమి వైద్యం
‘మనోధైర్యం’ చికిత్స2
తగ్గుతుంది కాని మదిలో
మాట మచ్చ మాయదు!

- కృష్ణ మాధవరపు,
కాకినాడ

హెచ్చరిక

అంతవరకూ
అంతా ప్రశాంతంగా వుంటుంది
ఒక్క మచ్చుతునకా కనిపించదు
చల్లని గాలీ వీచదు
కాని అకస్మాత్తుగా
పద్మనయనాలలోంచి కన్నీళ్లు!
వాతావరణం ఒక్కసారిగా గంభీరమైపోతుంది
ఒక్క క్షణం క్రితం
గలగల నవ్వే గొంతులోంచి
అకస్మాత్తుగా ఎక్కిళ్లు!
ఏదో ఎక్కడో
తగలకూడనిచోట
తగిలింది!
ఒక హృదయ తంత్రి తెగి
అపస్వరం పలికింది
ఒక కఠిన పదం
తూటాలా వెలువడి
గుండెని గాయపరిచింది!
మంత్రంగా పనిచేయవలసిన మాట
మందులా గాయాన్ని
మాయం చేయవలసిన మాట
అదుపుతప్పి
అశ్రుధారలు కురిపించింది!
సరిగా ఉపయోగించడం నేర్చుకో నన్ను
అని భాష హెచ్చరించింది!!

- మోపిదేవి విజయగోపాల్
సెల్: 9490679570

మార్మికత

అద్దం ముందు నిలబడితే నీవు
మనసు ముందు పెడితే ప్రేమ
ఒకరి ముందు ఒకరు దొరకరు
ఒకసారి కలల్ని కనిపెడతారు
మరోసారి మది తలుపు పగలగొడతారు
తత్వాన్ని నిద్రపుచ్చుతాయి
కనే కమ్మని ఊహల్ని
తర్కాన్ని జోకొట్టి లేపుతాయి
మరువని మది బాసల్ని
అస్తిత్వ మూలాల మార్మికత
ఎక్కడ దాగునుందో?

- అమృత్, సెల్: 9494842274

గడ్డి పోచ
గడ్డి పోచను
చిన్నచూపు చూడకు
కాలంతో ప్రయాణం
విజయం కోసం
పోరాటానికి సిద్ధం
అలసిపోయినా
లక్ష్యం కోసం చివరి వరకూ యుద్ధం
మట్టి వౌనం ల్లోంచి
చిగురై విత్తు నిలబడటం
వీరుని లక్షణం
మట్టికి చీరై చిగురిస్తూ
కొత్త బాటపై కదులుతూ
బతుకు భయంతో
పచ్చగ నిద్రపోతుంది వౌనంగా
కాళ్లతో త్రొక్కినా
మళ్లీ వీరుడిలా నిలబడుతుంది
ఓటమిని చీలుస్తున్న జ్ఞాపకాలు
మనసులో నింపుకుంటుంది
గాలితో చెట్టపట్టాలుగా
రెపరెపలాడుతుంది
చైతన్యంగా...

- నల్లా నరసింహమూర్తి
కురసాలవీధి
అమలాపురం
సెల్: 9247577501

ఈ శీర్షికకు కవితా, కథా సంపుటాలు ఏవైనా, ఇటీవల అచ్చయిన కొత్త పుస్తకాల సమీక్ష/ పరిచయం కోసం ఈ కింది చిరునామాకు పంపండి. కార్టూన్లు పంపించాలనుకుంటే, ఫొటో, చిరునామాతో ఈ -మెయిల్ అడ్రస్‌కు పంపించండి

మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, నేషనల్ హైవే, ధవళేశ్వరం, తూ.గో.జిల్లా. email: merupurjy@andhrabhoomi.net

email: merupurjy@andhrabhoomi.net

- నారుమంచి వాణీప్రభాకరి