రాజమండ్రి

సంఘర్షణ (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉదయం 11 గంటలవుతోంది. మే నెల కావడంతో ఎండ తీవ్రంగా మండుతోంది. అయినా ఆంధ్రా యూనివర్సిటీ క్యాంటీన్ సందడిగా ఉంది. ఎక్కువ జనం లేనిచోట, ఒక మూలగా ఉన్న బల్ల దగ్గర రమ, నిర్మల కూర్చుని మాట్లాడుకుంటున్నారు. వాళ్ల ముఖాలను బట్టి చూస్తే వాళ్లేదో సుదీర్ఘ సంభాషణలో మునిగి ఉన్నట్లు అనిపిస్తుంది. వాళ్లు అదే యూనివర్సిటీలో ఎంఏ కలిసి చదివారు. మొదటి పరిచయంలోనే స్నేహితులయ్యారు. అభిరుచులు కూడా కలిశాయి. సాహిత్యం అంటే ఎనలేని అభిమానం. ఇద్దరూ కలిసి పుస్తకాలను గురించి చర్చించుకోవడం మొదలుపెడితే గంటలు గంటలు గడచిపోయేవి. వీళ్లిద్దర్నీ పిచ్చివాళ్ల కింద జమకట్టేవారు మిగతావాళ్లు.
ఎంఏ అయింతర్వాత రమ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పిహెచ్‌డి చేయడానికి వెళ్లింది. నిర్మల ఒక్కతే సంతానం కావడం, తల్లిదండ్రులు అంత దూరం పంపడానికి ఇష్టపడక పోవడం వల్ల ఆంధ్రా యూనివర్సిటీలోనే పిహెచ్‌డిలో చేరింది. దాదాపు రెండేళ్ల తర్వాత స్నేహితులిద్దరూ కలుసుకున్నారు. ఈ మధ్యకాలంలో రమ జీవితంలో చాలా మార్పులొచ్చాయి. ఆర్నెల్ల క్రితమే హైదరాబాద్‌లో రమకు రవితో ప్రేమ వివాహం జరిగింది. ఆ సమయంలో తండ్రి అనారోగ్యం వల్ల రమ పెళ్లికి నిర్మల వెళ్లలేకపోయింది. చాలారోజుల తర్వాత కలవటంతో స్నేహితురాలి విశేషాలన్నీ తెలుసుకోవాలని నిర్మలకి ఉత్సాహంగా ఉంది. ఆలోచనల్లో మునిగి గంభీరంగా ఉన్న రమని చూసి నిర్మల ఆశ్చర్యపోయింది. ప్రేమ వివాహం జరిగిన తర్వాత నవ్వుతూ తుళ్లుతూ ఉంటుందనుకున్న రమ నిరుత్సాహంగా ఉండడం చూసి ఏదో జరిగి ఉంటుందని అనుకుంది లోపలే.
‘రమా! ఏంటీ అలా గంభీరంగా ఉన్నావు? నీ పెళ్లి విశేషాలు, రవి కబుర్లు నాతో చెప్పాలని అనిపించడం లేదా?’ అడిగింది నిర్మల.
‘జీవితంలో అన్నీ మనం అనుకున్నట్లు జరగవు. చాలా కట్టుబాట్లకి మనం రాజీపడవలసి వస్తుందనుకుంటాను’ బదులిచ్చింది రమ.
ప్రేమగా రమ చేతిని తన చేతిలోకి తీసుకుని ‘అలా అనుకుంటున్నావెందుకు రమా?’ అని ఆత్రంగా అడిగింది నిర్మల.
నిర్మల వంక చూస్తూ తన మనస్సులో పడే బాధంతా స్నేహితురాలితో చెప్పకుంటే సాంత్వన లభిస్తుందని రమ చెప్పడం మొదలుపెట్టింది.
* * *
యూనివర్సిటీలో చేరిన కొద్దిరోజుల్లోనే రమకి చాలామంది స్నేహితులయ్యారు. వారిలో రవి ఒకడు. పరిచయమైన రెండు నెలలకే రవి ప్రపోజ్ చేశాడు. తనకా ఉద్దేశ్యం లేదని, అతడ్ని స్నేహితుడిగా కాకుండా మరో దృష్టితో చూడలేదని ఎంతో వినయంగా, అనునయంగా తిరస్కరించింది. దాంతో రవి అభిమానం దెబ్బతిన్నది. ఏదో ఒకరోజు రమ స్వయంగా ‘నువ్వంటే నాకిష్టం’ అంటూ తనకి చేరువ కావాలని అతను కోరుకున్నాడు. రమకి ఇష్టమైన పనులన్నీ చేసేవాడు. ఒకటి రెండుసార్లు రమ ఆరోగ్యం దెబ్బతిన్నప్పుడు సేవలు అందించాడు. ఆమె పట్ల ఎంతో గౌరవం, ప్రేమ చూపేవాడు. చివరికి రమ కూడా అతని పట్ల ఆకర్షితురాయింది. ప్రేమించడం మొదలుపెట్టింది. తనంతట తనే వెళ్లి ‘నువ్వంటే నాకిష్టం’ అని చెప్పేసింది ఒకరోజు. అలా ప్రారంభమైన వాళ్ల ప్రేమ కథ ‘పెళ్లి చేసుకుందాం’.. అనుకునేంత వరకు వచ్చింది.
‘ముందు నీ తల్లిదండ్రులకు చెప్పు’ అని రమని ఒప్పించాడు రవి. రమ నిర్భయంగా వాళ్ల నాన్నగారికి ఉత్తరం రాసింది. చిన్నప్పటి నుంచి రమలో ఆశయాలు, ఆవేశాలు ఎక్కువ పాళ్లలో ఉండేవి. బాగా చదువుకుని ఉద్యోగం చేయాలని, స్వతంత్రంగా జీవించాలని కోరుకునేది. కట్నం తీసుకునేవాడిని కాకుండా, తనే కావాలని కోరుకునేవాడినే పెళ్లి చేసుకోవాలని అనుకునేది. రమ ఉత్తరం అందిన వెంటనే రవిని కలుసుకుందామని హైదరాబాద్ వచ్చారు రమ నాన్నగారు.
రవి అంటే ఆయనకి మంచి అభిప్రాయం ఏర్పడింది. అప్పటికే ఉద్యోగంలో స్థిరపడిన రవిని తిరస్కరించడానికి ఆయనకి కారణాలేమీ కనిపించలేదు. కాని స్వేచ్ఛగా పెరిగిన రమ కులాంతర వివాహం చేసుకుని ఒక మధ్యతరగతి కుటుంబంలో ఇమడగలదా! అనే ఆలోచనలో పడ్డారాయన. ‘రమా! నువ్వు బాగా ఆలోచించుకుని నిర్ణయం తీసుకో. నువ్వు వెళ్లబోయే కుటుంబంలో వాళ్లు నిన్ను విశాల హృదయంతో ఆహ్వానించి, వ్యక్తిగా నీకు గౌరవాన్ని ఇవ్వలేకపోవచ్చు. అన్నివిధాలా నువ్వే అడ్జస్టు అవ్వాలని కోరవచ్చేమో’ అని సున్నితంగా హెచ్చరించారు. దానికి రమ ‘నాన్నా! నేను అన్నీ ఆలోచించుకునే నిర్ణయానికి వచ్చాను. రవి నన్ను అన్నివిధాలా సపోర్ట్ చేస్తాడని నా నమ్మకం’ అంది. ఇక రమ దృఢ నిశ్చయంతో ఉందని గ్రహించి తన అంగీకారం తెలుపుతూ రవి తన తల్లిదండ్రులని ఒప్పిస్తే వీలయినంత తొందరలో పెళ్లి ఏర్పాట్లు చేస్తానని చెప్పి వెళ్లిపోయారాయన.
రమ, రవి యూనివర్సిటీలో కలుసుకుంటూనే ఉన్నారు. రవి తన తండ్రికి ఉత్తరం రాశానని మాటల సందర్భంలో రమకి చెప్పాడు. రోజులు గడచిపోతున్నాయి. రవి తన తండ్రి దగ్గర నుంచి రావలసిన ఉత్తరం గురించి కాని, పెళ్లి గురించి కానీ ఏమీ మాట్లాడటం లేదు. తనకేమీ పట్టనట్లు ప్రవర్తిస్తున్నాడు. చివరికి రమ ఒకసారి రవిని అడిగింది ‘ఏమిటి విషయం?’ అని. ‘వాళ్లకి మరికొంత టైమిద్దాం’ అని ముక్తసరిగా బదులిచ్చాడు. రమ ఇక ఆ విషయం ఎత్తలేదు. ఆర్నెల్లు గడిచాయి. రమ నాన్నగారు రమని పెళ్లి విషయం అడగటం మొదలెట్టారు. రమ రవిని చాలాసార్లు అడిగింది. రవి దానికి సరిగ్గా సమాధానం చెప్పడం లేదు. రమలో అనుమానం మొదలయింది. ‘రవి నిజంగా తనని ప్రేమిస్తున్నాడా? ఎందుకు తన ప్రశ్నలకి సమాధానం చెప్పడు?’ అని మనసులో మథనపడేది. చివరికి విసుగనిపించి విశాఖపట్నంలో లెక్చరర్ ఉద్యోగానికి దరఖాస్తు పెట్టుకుంది. వెంటనే ఇంటర్వ్యూకి పిలిచారు. వెళ్లవద్దని రవి బతిమాలాడు. రమ వినిపించుకోకుండా వెళ్లింది. ఉద్యోగం రమకే వచ్చింది. రమ ఉద్యోగంలో చేరడానికి కొంత సమయం అడిగి హైదరాబాద్ వచ్చింది. ఉద్యోగం వచ్చింది కదా వెళ్లిపోతున్నానని రవికి చెప్పింది. రవికి విషయం తెలిసివచ్చింది. పెళ్లి విషయమై తన తల్లిదండ్రులు వౌనం వహిస్తున్నారని చెప్పాడు. వాళ్లు అంగీకరించేవరకు తాను పెళ్లాడనని అన్నాడు. రమ చాలా బాధపడింది. ‘నేనే రవి స్థానంలో ఉంటే ఎదిరించి పెళ్లి చేసుకునేదాన్ని. రవి ఇంత పిరికివాడేమిటి?’ అని చాలాసార్లు అనుకుంది. తనదంటూ ఒక నిర్ణయం తీసుకోమని రవిని కోరింది. అలా కాని పక్షంలో తాను విశాఖపట్నం వెళ్లిపోతానని చెప్పింది. రమ ఇక తన మాట వినదని రవికి అర్థమైంది. వెంటనే రమ ఎదురుగానే తన తండ్రికి ఉత్తరం రాశాడు. కానీ దాన్ని రమకి చూపించకుండానే పోస్ట్ చేశాడు. రమకి బాధనిపించింది. ఎందుకంటే ధైర్యంగా తను నాన్నగారికి రాసిన ఉత్తరం రవికి చదివి వినిపించాకే పోస్ట్ చేసింది. ‘మరి రవి ఎందుకు అంత గుంభనంగా ఉంటాడు?’ అనుకుంది.
రవి తన ఉత్తరంలో ఏమి రాశాడో గాని, అతని తల్లిదండ్రులు వెంటనే రమని, రమ తండ్రిని హైదరాబాద్ వచ్చి కలుసుకుంటామని జవాబిచ్చారు. తర్వాత అందరూ కలుసుకోవడం, పెళ్లి ముహూర్తం నిర్ణయించడం జరిగిపోయాయి. తమ వివాహం చాలా నిరాడంబరంగా జరగాలని, వీలైతే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందామని రమ ఎప్పుడూ రవితో అనేది. రవి ‘అలాగే.. అలాగే’ అనేవాడు. చివరకి రవి తన తల్లిదండ్రుల ఇష్టప్రకారం వివాహం వైభవంగా జరగాలని చెప్పాడు. ఇంకా చాలాచాలా విషయాల్లో రవి తల్లిదండ్రుల ఇష్టప్రకారమే పనులు జరిగాయి. రమకి తీవ్ర ఆశాభంగం కలిగింది. ముందుముందు చాలా విషయాల్లో రాజీ పడవలసి వస్తుందేమోనని ఆమె మథనపడింది.
పెళ్లి అయిన తర్వాత బంధువులంతా వెళ్లిపోయారు. రమ, రవి తమ రొటీన్ జీవితంలో పడిపోయారు. రోజులు గడిచేకొద్దీ రవిలోని ఒక గుణం రమని కలత పెట్టసాగింది. తన స్నేహితురాళ్లతో రవి చాలా ఫ్రీగా మాట్లాడతాడు. జోక్స్ వెయ్యడం, వాళ్లని విపరీతంగా మెచ్చుకోవడం లాంటివి చేస్తాడు. రవి ప్రవర్తన రమకు అతిగా అనిపిస్తోంది. అంతేకాదు, ఒక్కోసారి రవి స్నేహితుడు మహేష్ ఇంటికి వచ్చేవాడు. మహేష్‌కి ఇంకా పెళ్లికాలేదు. హాస్టల్లో ఉండి పిహెచ్‌డి చేస్తున్నాడు. ఇద్దరూ కలుసుకున్నప్పుడల్లా యూనివర్సిటీలోని అమ్మాయిల గురించి, వాళ్ల అందచందాల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. తను అక్కడ ఉన్నా తన ఉనికినే గమనించనట్లు ఇద్దరూ అలా మాట్లాడుకోవడం రమలో చెప్పరాని విసుగు, బాధ కలిగించేది. మహేష్‌కి బుద్ధిలేకపోతే పోయింది, కనీసం పెళ్లయిన రవైనా అతన్ని వారించకపోగా, ఆ సంభాషణల్లో ఇష్టంగా పాల్గొనడం రమలో అసహనాన్ని కలిగించేది. అలాంటి రవి అబ్బాయిలతో రమ ఫ్రీగా మాట్లాడటం ఇష్టం లేనట్లు ప్రవర్తిస్తాడు. ఒకసారి స్నేహితుడు గౌతమ్ కోల్‌కత్తా నుంచి రమని చూద్దామని వచ్చాడు. అతను కథలు రాయడమే కాకుండా పాటలు కూడా చక్కగా పాడేవాడు. ముఖ్యంగా ముఖేష్ పాటలు అతను పాడుతుంటే రమకి మళ్లీమళ్లీ వినాలనిపించేది. రమకి పెళ్లయిందని తెలిసి వెతుక్కుంటూ ఇంటికే వచ్చేశాడు. ముగ్గురూ కలిసి కూర్చున్నారు. ఎంతసేపూ రమ, గౌతమ్ మాట్లాడుకోవడమే కాని రవి వాళ్ల సంభాషణల్లో పాలుపంచుకోవడం లేదు. అసలు అక్కడ కూర్చోవడమే ఇష్టం లేనట్టు ముఖం పెట్టాడు. రమకి చాలా బాధనిపించింది. ఎలాగో సర్దుకుని టీ తెస్తానంటూ వంటింట్లోకి వెళ్లింది. ట్రేలో మూడు కప్పుల నిండా టీ తెచ్చిన రమకి గౌతమ్ కనిపించలేదు. ‘గౌతమ్ ఏడీ?’ అని రవిని అడిగింది. ‘ఏదో పని ఉందట, వెళ్లిపోయాడు’ అని చెప్పి ఇంకేమీ అడగొద్దన్నట్లు అక్కడి ఉంచి వెళ్లిపోయాడు. రమ నివ్వెరపోయింది. రవి ఏదో అని ఉంటాడని, గౌతమ్ ఉండలేక చెప్పకుండానే వెళ్లిపోయాడని రమకి అర్థమయింది. రవిలోని ఈ ద్వంద్వ వైఖరి రమ సున్నిత మనస్సును గాయపర్చింది.
రవి తల్లిదండ్రులు కొన్నిరోజులు వాళ్లతో ఉండటానికి వచ్చారు. వాళ్లెదురుగా రవి రమతో ఫ్రీగా ఉండవాడుకాదు. వాళ్లుకూడా రమ అణకువగా ఉండాలని, వాళ్లకి కావలసినవన్నీ అందిస్తూ సేవలు చెయ్యాలన్నట్లు ప్రవర్తించేవారు. చాలా స్వేచ్ఛగా పెరిగిన రమకి ఈ వాతావరణం ఇబ్బందిగా, జైలులా అనిపించేది. పోనీలే వాళ్లు కొద్దిరోజులే కదా ఉండేది అని సరిపెట్టుకుని వాళ్లని సంతోష పెట్టడానికి ప్రయత్నించేది. అత్తమామలు ఉన్నప్పుడే రమకి ఉద్యోగం వచ్చింది. రమ ఎంతో సంతోషంతో ఉద్యోగంలో చేరింది. ఒకరోజు సాయంత్రం ఇంటికి వచ్చిన రమ.. రవి, అతని తల్లిదండ్రులు, ఆ కాలనీలో పరిచయమైన మామగారి స్నేహితుడు చంద్రశేఖర్‌గారు కూర్చుని మాట్లాడుకుంటున్నట్లు గ్రహించింది. తన గదిలోకి వెళ్లబోతూ తన పేరు వినబడటంతో ఆగిపోయి వినసాగింది. చంద్రశేఖర్‌గారు ‘మీ కోడలు లేదా’? అని అడిగారు. దానికి రవి తండ్రి ‘ఇంకా ఆఫీసు నుంచి రాలేదు. అయినా ఆడపిల్లలకి ఉద్యోగాలెందుకు? ఇంటిపట్టున ఉండి సంసారం చక్కదిద్దుకోవచ్చు కదా?’ అని అన్నారు. దానికి రవి తనను సమర్థిస్తూ సమాధానం చెప్తాడని ఆశించిన రమకు అతని వౌనం ఆశాభంగం కలిగించింది.
* * *
ఇలాంటి సంఘటనలే ఇంకా చాలా చెప్పి, ఇక చెప్పడానికి ఏమీలేనట్లు నిట్టూర్చింది రమ. ‘నిర్మలా! నేను ఓడిపోయానని అనిపిస్తుంది అప్పుడప్పుడూ’ అని వౌనంగా ఉండిపోయింది. రమ వంకే చూస్తూ ఆలోచనల్లో పడిపోయింది నిర్మల. ‘స్వేచ్ఛగా, నిర్భయంగా ఉండే రమ ఎంత నిరుత్సాహంగా మారిపోయింది! మనిషిలో మునుపటి చురుకుదనమే లేదు. ప్రేమ మనిషికి మత్తెక్కించి ప్రపంచానే్న మరిపించేలా చేస్తుందని విన్నానే. అలాంటి ప్రేమే సున్నిత మనస్కురాలైన రమని నీరసపరుస్తోందా?’ అనుకుంది నిర్మల. రమ ఓడిపోవడాన్ని నేను సహించలేననుకుంటూ ఒక నిశ్చయానికి వచ్చినదానిలా.. ‘రమా! జీవితమే ఒక సంఘర్షణ. దానికి భయపడి ఎప్పటికప్పుడు రాజీపడటం పిరికివాళ్ల లక్షణం. నువ్వెన్నో ఆశయాలతో, ఆదర్శాలతో పెరిగావు. అవన్నీ సాధించుకుంటూ ముందుకు పోవడానికి ప్రయత్నించు. ఆ ప్రయత్నంలో తోటివారిని ద్వేషించకు. మనుషులను బంధించే కట్టుబాట్లని ద్వేషించి వాటి నుంచి వాళ్లకి విముక్తి కలిగే ప్రయత్నం చెయ్యి’ అని కర్తవ్య బోధ చేసింది. రమ నిర్మల వంక చూసింది. తనలో ధైర్యం, ఆత్మవిశ్వాసాన్ని తిరిగి తేవాలన్న నిర్మల ప్రయత్నం ఆమెకి అర్థమయింది. మనస్సులో ఏమూలో ఉత్సాహం మళ్లీ చిగురించింది. ఏదో నిర్ణయానికి వచ్చినదానిలా.. ‘నిర్మలా! నేనిక వౌనంగా అన్నీ సహించను. నాకు నచ్చని సంఘటనలు జరిగినప్పుడు నా మనస్సులో మెదిలే ఆలోచనలని వ్యక్తం చేస్తాను. జీవితంలో ఎదురయ్యే సమస్యలని ధైర్యంగా పరిష్కరించడానికి ప్రయత్నిస్తాను. నా ఈ పోరాటం ఈరోజు నుంచే మొదలు’ అని దృఢంగా చెప్పింది రమ. నిర్మల నిశ్చింతగా రమ వంక చూసింది.
కొన్నిరోజుల తర్వాత రమ హైదరాబాద్ వెళ్లిపోయింది. ఒకరోజు సాయంత్రం మహేష్ ఇంటికి వచ్చాడు. యథాలాపంగా రవి, మహేష్ యూనివర్సిటీలోని అమ్మాయిల గురించి మాట్లాడుకోవడం మొదలెట్టారు. కొంచెం సేపు విన్న తర్వాత రమ ‘మీ ఇద్దరికీ అమ్మాయిల గురించి తప్ప మాట్లాడుకోడానికి ఇక ఏ విషయాలూ లేవా? నా ఉనికినే మర్చిపోయి ఇలా మాట్లాడుకోవడం అసలు బావుందా? నాకెలా అనిపిస్తోందోననే ఆలోచనే మీకు కలగడం లేదా? నా భావాలకి కూడా విలువనివ్వడం అవసరమని అనిపించడం లేదా? చూడు రవీ! నేను, నా స్నేహితురాలు ఇలాగే యూనివర్సిటీలో అబ్బాయిల గురించి మాట్లాడుకోవడం మొదలుపెడితే నీకెలా ఉంటుంది? అది విని నువ్వు భరించగలవా’ అని ప్రశ్నించింది ఆవేశంగా. రమలో ఊహించని ఈ మార్పుకి వాళ్లిద్దరూ నిర్ఘాంతపోయారు. మహేష్ వెంటనే సారీ చెప్పాడు. రవి ముఖంలో కూడా ఏదో మార్పు వచ్చినట్లు రమకి అనిపించింది. తర్వాత మళ్లీ వాళ్లిద్దరూ రమ ముందు అమ్మాయిల గురించి మాట్లాడుకోలేదు. ఈ సంఘటన రమలో ధైర్యాన్ని నింపింది. ముందుముందు సమస్యలని ఎదుర్కోగలనన్న ఆత్మవిశ్వాసం ఆమెలో కలిగింది.

- శాంతిశ్రీ బెనర్జీ,
కొత్త ఢిల్లీ,
చరవాణి : 9871989360

పుస్తక సమీక్ష

‘తరగతి గది’కై
గౌరవ్ అలజడి
వ్యవస్థ నుంచి ఏం నేర్చుకొంటున్నాం, సమాజం ఏమి చెబుతుంది. వ్యవస్థ నుంచి ఏం తెలుసుకొంటున్నాం. సమాజం మనకు ఏం నేర్పుతుంది. తర్కించుకొంటూపోతే ఎదురయ్యే అనేక సమాధానాలు ప్రశ్నలుగా మారి వెక్కిరిస్తుంటాయి.
జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది. జ్ఞానాన్ని ఎలా సంపాదించాలి. విజ్ఞానం ఏమి చేస్తుంది. సంపాదించిన జ్ఞానం జీవిత గమ్యం తీర్చటానికేనా? జ్ఞానమంతా సమాజ శ్రేయస్సుకేనా? వినియోగించేది, ఉపయోగించేది జ్ఞానమేనా?
చదువుకున్నదంతా నిజమైన విద్యేనా, నేర్చుకున్నదంతా చదువుకుంటేనే వస్తుందా, విద్య ద్వారా ఏమి సముపార్జించుకుంటున్నాం. బానిసత్వ పోకడలను మర్యాదల చాటున వినయాన్ని, అణకువగా విధేయతగా నడచుకొమ్మని ప్రబోధించే విద్యను బానిసల బ్రతుకులను బహు బానిసత్వంలోకి ప్రయోజనకారులను చేసే బానిసత్వ వ్యవస్థను తయారు చేస్తుంది ప్రస్తుత విద్యా విధానం.
విద్య ద్వారా ఇప్పటివరకు అనేక సంస్కరణలు, చర్చలు జరిగాయి. ఆ దిశగానే ఒక నూతన పోకడతో ‘తరగతి గది తత్వశాస్త్రం’ చిన్న పుస్తకం సంచలనాలు సృష్టిస్తోంది. దీని రచయత గౌరవ్. ఇప్పటికే అనేక విషయాలపై ఎన్నో చిరుపొత్తాలతోపాటు కొన్ని పుస్తకాలు రచించిన యువ మేధావి. విద్యా విషయాలపై మరింత అవగాహన పెంపొందించటానికే కాకుండా లోతైన చర్చకు తోవ చూపే మార్గాన్ని అనే్వషించటానికి ఆసక్తిని రేపుతుంది. ప్రస్తుత విద్యా విషయంలో తర్కానికన్నా తత్వం మూలం. కటిక చీకట్లోకి జీవితాల్ని హంగులు ఆర్భాటాలతో నెట్టేసుకుంటున్న వేళ ‘తరగతి గది’ ఏం నేర్పుతుంది? తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది. పిల్లల భవితవ్యాన్ని ఇరుకు మనస్తత్వంలోకి జారిపోతున్న సందర్భంలో ఈ చర్చ అవసరీయత పెరిగి ప్రాముఖ్యతను పెంచింది. ఇప్పటికే భావ ఉద్యమకారుల చేతుల్లోకి, విద్యావేత్తల బల్లల పైకి, ఉపాధ్యాయుల పుస్తక చర్చల్లోకి చేరుకుంది.
చిన్నతనం నుంచే మనుషులను బానిసలుగా మార్చడం కొరకు తయారు చేయబడిందే పాఠశాల అంటారు రచయిత గౌరవ్. బడిని ఎంతెలా మార్చేశారంటే సమాజం నుండి డబ్బును లాగే అడ్డాగా బడిని మార్చేశారన్న రచయిత అభియోగానికి ఈనాడు నడుస్తున్న కార్పొరేట్ స్కూళ్లు/కాలేజీలే ఉదాహరణ. అసమానతలు నిండిన సమాజానికి ఒక వర్గం వారికి కాపలా కాసే బానిసల ఉత్పత్తి కేంద్రం అంటారు ఆయన. కాస్తాగి ఆలోచిస్తే కన్పించే నగ్న సత్యం ఇది. సమానత్వ స్థాయి లేని ప్రపంచం. అంతే సమాన స్థాయిలో సమాజమూ లేదు. ఆ తేడాల వడపోతను ఎవరు వేరు చేయకుండా చేస్తున్నవి మతము మొదటిదయితే, రెండోది చదువు. పాఠశాల ఇంత చేస్తుందా? అనే ఆలోచనకు అక్షర రూపం ఇచ్చిన మొదటి వ్యాసం ‘స్కూలు’ పుస్తకం తెరిచీ తెరవగానే బడి ఇంత బరి తెగింపుకు పాలుపడేలా నిర్మించడం వెనుక ఎంత కుట్ర ఉందో వ్యాసం ముగించేలోగా అర్థం అవుతుంది.
మనుషులను చదువక్కర్లేదనేది రెండో శీర్షిక. మరి ఎవరికని ప్రశ్న రేకెత్తించకముందే పేరాలోకి కళ్లు దించేస్తే ఆశ్చర్యం నుంచి హాశ్చర్యాల్లోకి వెళ్లిపోతాం. నిజమే మరి. చదువు లేకుండా నాగరికతను ఊహించగలమా? ఇక్కడ చిన్న తర్కాన్ని పెట్టి చిన్న మెదడును తట్టి లేపారు. మనుషులకు చదువు అవసరం లేదని మాత్రమేనంటారు. మనుషులకు ఏమేం అవసరమో చెప్తారు. విద్య, జ్ఞానం, శీలం, ప్రజ్ఞ ఇవీ మనుషులకు అవసరం అంటారు.
మనిషి మనిషి కాకుండా పోయే చదువెందుకంటారు రచయిత. మర్యాదల ముసుగులో మూర్ఖుడు కావడాన్ని ఆయన బలీయంగా ప్రశ్నించడం సౌందర్య లాసకు గల మక్కువే కారణం. ఈయన కొంత స్వానుభవాన్ని చెప్పడం వల్ల ఉదాహరణకు దగ్గరతనం సమకూరి పుస్తకానికి నిండుదనం చేకూరింది. చదువు మీద గౌరవ్ ఎందుకు చిరాకు పడుతున్నాడో అంటే పరీక్ష విధానం మీదే కాదు పాఠాన్ని రుద్దబడే విధానం, పనిష్‌మెంట్ మీద ఇలా అనేక రూపాల్లో చదువు హింసను ఆయన వ్యతిరేకిస్తున్నారు. ఈ వ్యాసం చాలా ముఖ్యమైంది. విద్యార్థులు, తల్లిదండ్రులు, సమాజ శ్రేయస్సుకోరే హితైషులు తప్పక చదివితే మన విద్యా వ్యవస్థలోని లోటుపాట్లు ఎంత భ్రష్టుపట్టిపోయిందో ఎంత లోపభూయిష్టమయిందో తెలుస్తుంది.
భావి జీవిత స్పృహను విపరీత పోకడలతో మెదళ్లను విషపూరితం చేస్తున్న ‘సంస్కృతి’ని అర్థం చేసుకోవాలి. కోళ్ల పెంపకం ఉత్పత్తి కేంద్రాలుగా స్కూళ్లు మారిపోయాక ఇప్పుడున్న స్కూళ్లను ఏమి చేయాలనే ఆలోచన రావాలి. అందుకు ఏంచెయ్యాలో కూడా తెలియాలి.
దానికొక ప్రత్యామ్నాయాన్ని కూడా రచయిత పేర్కొనడం మంచి పరిణామం. అయితే ఆయన చెప్పిన హోమ్ స్కూల్ విద్యా విధానాన్ని కాస్త వివరించి పరిచయం చేస్తే బావుండేది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ఆ విధానం అమలవుతుండటం వల్ల పాఠకులకు ఆ విధానం తెలుసుకునే వీలు కలిగేది. మనుషులు మహా మనుషులుగా మారే చదువులు గాని, యంత్రాలుగా పనిముట్లుగా చేసే చదువుల అవసరం ఎందుకు?
పుస్తకానికి ఆయువు పట్టులాంటి వ్యాసం తరగతి గది తత్వశాస్త్రం. పిల్లల జీవితం తరగతి గదిలోనే ప్రారంభమవుతుందంటారు. కాని రచయిత గౌరవ్ ధ్వంసమవుతుందన్నారు. ఎందుకో తెలుసా. దానికి కులం, వర్గం, వర్ణం, లింగం, ప్రాంతం లాంటి అడ్డంకులున్నాయంటారు.
కాబట్టే కొందరి పిల్లలకోసమే తరగతి గదిని నిర్మించారని చాలా స్పష్టంగా చెప్తారు. అలాగే ఇక విధ్వంసక విద్య మరో శీర్షిక చివరి వ్యాసం దీనిలో ఉన్నాయి.
చర్చకు లేవనెత్తిన ఈ శీర్షికలు విద్యా విధానంపై సమూల ప్రక్షాళన జరిగేందుకు తోడ్పడుతుందనే అభిప్రాయం ఈసరికే మొదలైంది. చర్చింటానికి పెద్ద ఉద్గ్రంథాల్నే ఉదహరించనవసరం లేదు. ప్రతులకు 8074322748కుగాని సంప్రదించి పొందవచ్చు.

- రవికాంత్, సెల్: 9642489244

మనోగీతికలు

నారీ-చీర
(సప్తవర్ణాల చీర)
ప్రకృతి ఒడిలో
శ్రమైక జీవనంలో
దున్నిన నేలలో
వర్షంలో తడిసి
పడరాని పాట్లుతో
వరినాట్లు వేస్తున్న నారి
ఆకాశంలో ఆరేసుకున్న
తన ‘సప్తవర్ణాల’ చీరగా
వర్ణించక
నారి, చీర గొప్పతనాన్ని
చాటించక
కేవలం
‘ఇంద్ర’ ధనస్సుగా
చెప్పడం
పురుషాహంకారమా...?

- పాతగొలుసు యోబు
ముదునూరు
సెల్: 9849349869

విజయం
ఆశల సౌధాన్ని కట్టిస్తావు
కష్టాల మెట్లను ఎక్కిస్తావు
నిరాశ, నిస్పృహలను కల్పిస్తావు
శ్రమ విలువను తెలియజేస్తావు
కొత్త ఆవిష్కారాన్ని చేయిస్తావు
వీర సైనికుడిగా తీర్చిదిద్దుతావు
ప్రతికూల పరిస్థితులను
సానుకూల పరిస్థితులుగా
మార్చే నేర్పుని ఇస్తావు
విజయకాంక్ష నా వశమయితే
నిన్ను చేరడం సాధ్యమని నిరూపిస్తావు

- డి శ్రావణి
కాకినాడ, సెల్: 7731849060

కందుకూరి వీరేశలింగం నమామి

సంఘ సంస్కరణమునకై సంస్తవమగు
ఉద్యమమును నడిపిన మహోన్నతుడవు
పచ్చలారని అతివ జీవచ్ఛవముగ
ఉండుటను నిరసించిన ఉత్తముడవు

తొలి వితంతు వివాహము నిలను జరిపి
ఛాందసముపైన యుద్ధము సలిపినావు
స్ర్తిల విద్య కొరకు పాఠశాల నడిపి
నట్టి, మొట్టమొదటి వాడవైతివీవు

వీరావేశముతోడనే
పారావారమ్ము పొంగి ప్రవహించునటుల్
ధీరోదాత్తత పోరితి
వౌరా వీరేశలింగమన్యాయముపై

తెలుగు భాషకు సరిక్రొత్త శైలి యొకటి
అవసరమని చెప్పిన ఆద్యుడవయ నీవు
మాతృదేశాభివృద్ధికి మార్గమెన్న
సమత మమత లేయని చాటినావు
సంఘ సంస్కర్తవని మనసా స్మరామి
నవ్య యుగకర్తవని అధునా వదామి
ధన్య జీవులు మీరు కద, ప్రణమామి
కందుకూరి వీరేశలింగము! నమామి

- తటవర్తి రాఘవరాజు
రామచంద్రపురం, సెల్: 9963610243

పచ్చ సంతకం
మనుషుల మనస్సు కూడలి చుట్టూరా
విషాదాల కెరటాలు తాకినప్పుడల్లా
గాయాల సమూహాన్ని లేపనంతో మానే్ప
చేతులు కావాలి!
చిరు ఆనందవీచిక కోసం ఎక్కడోనని
కళ్ల ఆరాటం సఫలం చేసే క్షణం కావాలి
బతుక్కి ఒకింత ఊరటనిచ్చే హస్తాల కోసం
సాగే చూపు అనే్వషణాయుధం
ఆశలు తీగలై అల్లుకొని పూలై విరబూసి
పరిమళాలు వెదజల్లే పూలతోటపై
దృష్టి సాగే సన్నివేశం
భావాల దేహాలు ఆవేదానాగ్ని శిఖలతో
దహింపబడుతున్నప్పుడు
జ్ఞాపకాల నెగళ్లతో
దుఃఖపు చలిని కాచుకొనే
సమయం కావాలి!
నిరాశ నిట్టూర్పుల బాధల కణాలను ఈడ్చి
ఒక తన్నుతంతే ఎక్కడో ఎగిరిపడే
మనోధైర్యమయే సందర్భంగా ఉండాలి
మనస్సు అభయరేఖగా నిలవాలి ప్రతినిత్యం
జీవితానికి ఊరటనిచ్చే ఒక చల్లని మాట కోసం
రాత్రీ పగలెరుగక ఎదురుచూసే కళ్లు
తామరపూలు!
ఎన్ని చెడు తలుపులు
గుండె ద్వారాన్ని ఆవహించినా తొలగించి
ఒక మంచితనపు కర్తవ్యానికి
సాగే కాలయాత్రలో గంభీర మనోశక్తిమంతుడుగా
రేపటి భవిష్యత్తు ఉజ్జ్వలత్వానికి
పచ్చ సంతకం చేసి
భరోసా గీతాన్ని ఆలాపన చేయాలి!

- అంజనాశ్రీ,
చరవాణి : 7702537453

ఈ శీర్షికకు కవితా, కథా సంపుటాలు ఏవైనా, ఇటీవల అచ్చయిన కొత్త పుస్తకాల సమీక్ష/ పరిచయం కోసం ఈ కింది చిరునామాకు పంపండి. కార్టూన్లు పంపించాలనుకుంటే, ఫొటో, చిరునామాతో ఈ -మెయిల్ అడ్రస్‌కు పంపించండి

email: merupurjy@andhrabhoomi.net

మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, నేషనల్ హైవే, ధవళేశ్వరం, తూ.గో.జిల్లా. email: merupurjy@andhrabhoomi.net

- శాంతిశ్రీ బెనర్జీ