రాజమండ్రి

అన్నపూర్ణ (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘నీకొచ్చిన ఏదైనా పాఠం అప్పగించవే?’ అని మేస్టారడిగితే ఎప్పుడూ డొక్కా సీతమ్మ కథే చెప్పేది అన్నపూర్ణ. భగవంతుడు కొంతమందికి కొన్ని వరాలు అడగకుండానే ఇస్తాడనడానికి అన్నపూర్ణే సాక్ష్యం. సుబ్రహ్మణ్యం మాస్టారి దగ్గర ప్రైవేటు. ఉదయం ఏడు గంటలకు, తిరిగి సాయంత్రం ఏడున్నర గంటలకు సుబ్బరంగా అన్నం తిని విద్యార్థులంతా అక్కడికి చేరుకునేవారు. బాగా తినేస్తే కునికిపాట్లు. మాస్టారు చూస్తే కర్ర దెబ్బలు. నిద్ర ఎగిరిపోయేది. లుంగీ కట్టుకుని గడపమీద కూర్చున్న సుబ్రహ్మణ్యం మాస్టారు చెరోవైపు గదిలోను అబ్బాయిల్ని, అమ్మాయిల్ని కూర్చోబెట్టేవారు. కర్ర ఆడిస్తూ మధ్యలో జోకులు వేస్తూ పాఠాలు అప్పగించుకునేవారు. దగ్గరగా కూర్చున్న కుర్రాడు కాస్త చొరవ చేసి మాట్లాడితే వాడికే ముందు దెబ్బపడేది. మురపాకోడు (ఇంటి పేరులెండి) ఎక్కువగా దెబ్బలు తినేవాడు. సుబ్రహ్మణ్యంగారి అబ్బాయిని ఎవరూ ఏమీ అనేవారు కాదు. వాడు కొంచెం ఉడుక్కునేవాడు. ఎప్పుడూ ముక్కుపై అరచేయి పెట్టి పైకి లాగేవాడు. ముక్కంతా చీమిడి పట్టి ఎండిపోయేది. మాస్టారు వాడు కనబడితే ముక్కు కడుక్కోమని తిట్టేవారు. వాణ్ణి వాళ్ల నాన్న తిట్టినా వాడు మాతో పేచీ పడేవాడు - అందరూ చూసి నవ్వామని వాడికి నామోషి.
అన్నపూర్ణ వాళ్ల నాన్న కర్రల వ్యాపారం చేసేవాడు. ఎక్కడి నుండి వచ్చాడో తెలీదు. చెరువుగట్టున పాకేసుకుని కాలం వెళ్లబుచ్చేవాడు. కర్రకోత, కొడవలి సానపట్టే వృత్తి చేసేవాడు. ఆ రోజుల్లో కొడవలి కొనాలంటే ఊళ్లో జనం అక్కడికి వెళ్లేవారు. కోతలు పట్టేరంటే అసలు ఖాళీ ఉండేదికాదు. గ్యాస్ బండల్లేని రోజులేమో సర్వే పుల్ల బాగా అమ్మేవాడు అన్నపూర్ణ తండ్రి. పెద్దపెద్ద లోడు లారీలు వచ్చేవి. ఊరంతా ఈ వ్యాపారం బాగానే ఉంది అనుకునేవారు. మా పాఠశాలలో ఏ మాస్టారికి పుల్లలు కావలసినా ఇక్కడి నుండే పట్టుకెళ్లేవాళ్లం. రైలు బోగీల్లా చేతులు చాచి రెండేసి సర్వే పుల్లలు పేర్చి ఓ పది మంది పిల్లలం కలసి రోడ్డుకి ఓ పక్కగా నడుస్తూ ఓ గుండెత్తు పుల్లలు మోసేవాళ్లం. ఇంటికెళ్లాక మరమరాలో, ఏపుడు సెనగలో, జాంకాయలో ఇచ్చి పంపేవారు. సరదాగా ఉండేది.
పిల్లల్ని పెంచుకుంటూ కాలం గడిపేస్తుంటే అన్నపూర్ణ చదువుకుంటానంటే ఆరోతరగతిలో చేర్చాడు వాళ్ల నాన్న. అన్నపూర్ణ ఎప్పుడూ తెలుగు పుస్తకం ఒక్కటే తెచ్చేది. అందరి అమ్మాయిలతోపాటు ప్రైవేటుకొచ్చి తిరిగి వెడుతూండేది. మాస్టారు దగ్గర కూర్చోబెట్టుకుని లెక్కలు చేయించేవారు. అయినా ఎప్పుడూ పైకి చదివేదికాదు. ఒకవేళ చదివితే డొక్కా సీతమ్మ కథే. అయ్ బాబోయ్ ఇది పైకి చదివేస్తుందని అందరూ ఒక్కసారి నిశ్శబ్దంగా ఉంటే ‘డొక్కా సీతమ్మ తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం’ అని నిశ్శబ్దాన్ని ఛేదించేలా చదువుతూ ఆగేది. అందరూ నవ్వుకునేవారం. పరీక్షలు పూర్తయి ఫలితాలొస్తే ఒక్క తెలుగు మాత్రమే పాసయ్యేది. తెలుగంటే దీనికి మమకారం ఎక్కువని సుబ్రహ్మణ్యం మాస్టారు అనేవారు. పెద్దపిల్ల పెళ్లిచేసి, కొడుకుని ఎక్కడో ఉద్యోగంలో జాయిన్ చేసిన అన్నపూర్ణ తండ్రి మిగిలిన కుటుంబంతో సడెన్‌గా ఊరు వదిలి వెళ్లిపోయాడు.
పి.గన్నవరం అక్విడెక్టుకు డొక్కా సీతమ్మ పేరు పెట్టడం ఈ జిల్లా వాసులకు ఎంతో ఆనందాన్ని కలిగించింది. ఓసారి చూసి రావాలని డిగ్రీ చదువయ్యాక ఫ్రెండ్స్ అంతా కలసి బయలుదేరాం! రావులపాలెం, ఈతకోట మీదుగా వెళ్లాల్సి వచ్చింది. అక్విడెక్టు కట్టాక సాగునీరుతో ఈ ప్రాంతం మరింత సస్యశ్యామలమయ్యింది.
ఊళ్లో దిగాక ఆకలిగా ఉంది ‘ఏమైనా హోటలుందా’ చూడమని అందరూ అనుకుంటుండగానే... ఓ కుర్రాడు రోడ్డు దాటుతూ ఓ చిన్నకారుకు అడ్డం పడ్డాడు. ఓ ఆరేళ్లుంటాయి. తొందరగా పక్కకు లాగబట్టి సరిపోయింది. లేదంటే వాళ్ల తల్లిదండ్రులకు లోటు కనబడేది. వాణ్ణి పట్టుకుని వివరాలు అడిగితే రండంటూ నేరుగా ఆడింటికే తీసుకుపోయాడు. పెద్ద మండువా లోగిలిలా ఉంది. లోపల ఎవరో వృద్ధుల జంట ఉంది. వాళ్లకు సేవలు చేస్తూ ఒకావిడ కనబడింది. నమస్కారమండి అని వెళ్లినవారంతా అరుగులపై కూలబడ్డాం! ఓ పెద్దావిడ వచ్చి మంచినీళ్లిచ్చింది. ఎక్కడి నుండి వచ్చామో అడిగి లోపలికి వెళ్లింది. వెంటనే లోపలి నుండి ఒకామె బయటకు వచ్చి తలుపెనకాల నిలబడి మమ్మల్నంతా చూసింది. ‘మీరంతా ఆ వూరి వారేనా’ అనడిగింది. అవునన్నాము. ‘సుబ్రహ్మణ్యం మాస్టారు ఎలా ఉన్నారు’ అని అడిగింది. ఇప్పుడు వాళ్లూరు దొడ్డంపేట వెళ్లిపోయారు అని చెప్పాం. ‘చెరువుగట్టు చుట్టూ ఎలా ఉంది’ అనడిగితే పంచాయతీ ఆఫీసు, కాఫీ హోటలు, మాంసం దుకాణం వచ్చాయని చెబుతూ, ‘ఇవన్నీ మీకెలా తెలుసు. మీదీ ఆ ఊరేనా?’ అని అడిగాం! ‘కాళ్లు కడుక్కోండి! భోజనాలయ్యాక మాట్లాడదామ’ని ఆమె లోపలికి వెళ్లింది. ఎవరై ఉంటారబ్బా అని మేమంతా బుర్రలు పీక్కున్నాం.
భోజనాలయ్యాక చేతులు తడుచుకుని వక్కపలుకులు వేసుకుని మేము అరుగులపై కూలబడ్డాం! ఇంతలో మోటారుబైకుపై వచ్చిన ఓ ముప్ఫై ఏళ్ల మనిషి - మేమంతా లేచి నిలబడితే ‘కూర్చోండి కూర్చోండి. నేను భోజనం చేసి వస్తాను. అప్పుడు వెళ్లి అక్విడెక్టు చూద్దాం’ అన్నాడు. సేదతీరే లోపు వచ్చాడా పెద్దమనిషి. ‘మీరంతా పామర్రు నుండి వచ్చారట కదా! ఇల్లాలు చెప్పింది. ఎంత మమకారమో ఆ మనిషికి. నేనే అక్కడి నుండి తీసుకొచ్చేసాను. ఓ పదిహేనేళ్ల క్రితం మాట.
అప్పుల పాలైన అన్నపూర్ణ వాళ్ల నాన్న అందరూ చచ్చిపోడానికి సిద్ధంకండని చెబితే, చచ్చి ఎవర్ని సాధిస్తామని, తెల్లారేసరికి ఎక్కడికైనా వెళ్లి తలదాచుకుందామని అర్ధరాత్రి ఇంటి నుండి రోడ్డునబడితే, పనిమీద పామర్రు వెళ్లి తిరిగొస్తూ ఎవరా ఆడ కూతురు అని వివరాలడిగి నేనే తీసుకొచ్చాను. ‘ఆడకూతురు ఎవరికైనా ఒకటే! ఇలా తీసుకురావడమే తప్పు! ఇక్కడ ఉంచితే వివాహం చేసుకుని న్యాయం చెయ్యి! లేదంటే వాళ్లవాళ్లకి అప్పగించు’ అన్న అమ్మానాన్నల మాటలు విని వెంటనే పెళ్లి చేసుకున్నాను. ఆవిడ వచ్చిన నాటినుండి నాలుగెకరాలు నలభై ఎకరాలైంది. పదిమందికి రోజూ భోజనం పెట్టందే ఇంట్లో ఎవ్వరూ భోజనం చెయ్యరు. ఆ సీతమ్మ తల్లే మళ్లీ ఇక్కడికి వచ్చిందని ఊరంతా చెప్పుకుంటారు. మేమేమో కాశీ అన్నపూర్ణ అంటాం! ఏదైతేనేం. అందరూ బాగుండాలబ్బాయ్’ అని ముగించాడు.
ఒక్కసారిగా ఈమాటలు వినేసరికి మాకందరికీ అన్నపూర్ణ గుర్తొచ్చింది. మేమంతా లేచి నిలబడగానే తలుపు వెనకాల నిలబడి ‘డొక్కాసీతమ్మ తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం’ అన్న మాటలు మా మధ్య నిశ్శబ్దాన్ని మటుమాయం చేశాయి. అందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని తలుపు చాటు నుంచి చూస్తున్న అన్నపూర్ణ దగ్గరకు వెళ్లాం.
‘అవును.. ఆ... అన్నపూర్ణనే...’ అంటూ నవ్వుకుంది. అందరూ సంతోషించాం. నిజంగా పేరు సార్థకం చేసుకున్న నీ జన్మధన్యమని, ఆ డొక్కా సీతమ్మే మళ్లీ పుట్టిందని, నీ కల నిజమైందని, ఆనందంతో అభినందించి అక్విడెక్ట్ చూడటానికని అక్కడి నుండి బయలుదేరాం!

- డా. ర్యాలి శ్రీనివాసు
రామచంద్రపురం, తూర్పుగోదావరి జిల్లా
సెల్: 9949131716

ఆర్డినరీ బస్సు

అవనిగడ్డ బస్టాండులోంచి విజయవాడ వెళ్లే ఆర్డినరీ బస్సు బయల్దేరింది. రాత్రికి మా బంధువు పెళ్లి. నింపాదిగా వెళ్లొచ్చునని నేను కూడా బస్సే ఎక్కాను. కిటికీ దగ్గర సీటు దొరికింది. హమ్మయ్య! అనుకుంటూ కూర్చున్నాను. బస్సులోని ప్రయాణికుల మాటామంతిని, శరీర భాషను వౌనంగా పరిశీలిస్తున్నాను.
దూర ప్రయాణాలు చేసేటప్పుడు ఎక్స్‌ప్రెస్సులే ఎక్కుతాను. ఇప్పుడు ఆర్డినరీ బస్సు ఎక్కటంలో కించిత్తు నా వ్యక్తిగత స్వార్థం వుంది. నేను కథకుడ్ని. ప్యాసింజరు బస్సులో రకరకాల వ్యక్తులు ప్రయాణంలో తారసపడుతుంటారు. వారి వైఖరి, మానసిక ప్రవర్తనల్లోంచి నా కొత్త కథకు ముడిసరుకు దొరుకుతుందని నా ఆశ!
***
అప్పటికే బస్సులోని సీట్లు నిండిపోయాయి. నాలాగ ఒంటరిగా కూర్చొన్నవారు దీర్ఘాలోచనలో పడ్డారు. కొత్త జంటలు, యువకులు, కుటుంబ సభ్యులు ఆరోజు బస్సులో కూర్చొని వుండటం నేను గమనించాను.
బస్సులో ఎక్కిన ఓ పడుచు జంట దగ్గరిగా అంటుక్కూర్చొని లోకం మరచి మాట్లాడుకుంటున్నారు. మరో జంటను పరికించాను. వారి మొహాల్లో ఏదో ఆందోళన స్పష్టంగా కన్పిస్తోంది. ఓ కుటుంబ సభ్యులు ఇంటిల్లిపాదీ తినుబండారాలు తింటూ నిక్షేపంగా కాలక్షేపం చేస్తున్నారు. బస్సు వూరి పొలిమేరలు దాటింది. స్పీడందుకుంది. డ్రైవరు బస్సును చాకచక్యంగా నడుపుతున్నాడు. కండక్టరు తనలోని ఓర్పు, నేర్పును ప్రదర్శిస్తూ లౌక్యంగా టిక్కెట్లను టిమ్స్ మిషను ద్వారా కొడుతున్నాడు. తొలివిడత టిక్కెట్లు పూర్తికాగానే తన స్థానంలో కూర్చున్నాడు. కిటికీ పక్కన కూర్చున్న నన్ను పిల్లతెమ్మెర లీలగా స్పృశించింది. ఆ హాయి నా మేనంతా పాకింది. బస్సులోని కొందరు ప్రయాణికులు మెల్లగా నిద్రలోకి జారుకున్నారు.
మా దగ్గరి బంధువు ఇంట్లో పెళ్లికి వెళుతున్నాను. మా ఆవిడ, పిల్లలను ఉదయానే్న పంపాను. రాత్రి తొమ్మిది గంటలకు పెళ్లి. టయానికి వేదిక వద్దకు చేరొచ్చునని ప్యాసింజరు బస్సు ఎక్కాను.
***
స్టేజీ రాగానే కొందరు ప్రయాణికులు దిగారు. కొందరు బస్సులోకి ఎక్కారు. సీట్లు దొరకని వారు రాడ్‌ని పట్టుకొని, సీటును ఆనుకొని ఓరగా నిలబడి వున్నారు. ప్రతి స్టేజీ వచ్చినప్పుడల్లా కండక్టరు సాలాభంజికలా పైకి లేచి టిక్కెట్లు కొడుతున్నాడు. చిల్లర ఇవ్వని ప్రయాణికులకు ‘మీ చిల్లరను దిగేటప్పుడు తీసుకోండి’ అని మర్యాదగా చెబుతున్నాడు. కండక్టరు వైఖరి చూసి నాకు ముచ్చటేసింది.
టిక్కెట్లు పూర్తయిన తర్వాత కండక్టరు డ్రైవరు దగ్గరకు వెళ్లి వృత్తిపరమైన విషయాలను చర్చకు పెడుతున్నాడు. బస్సును తనదైన శైలిలో నడుపుతూ డ్రైవరు ఆలకిస్తున్నాడు. స్టేజీలు దాటుతుండటంతో బస్సులో ప్రయాణికులు పెరుగుతున్నారు. కొందరు సెల్‌ఫోన్లలో బిగ్గరగా మాట్లాడుతున్నారు. యువతరం స్మార్ట్ ఫోన్లలో మమేకమయ్యారు. కండక్టరు టిక్కెట్లు కొడుతూ దిగిపోతున్న ప్యాసింజరుకు చిల్లర ఇస్తున్నాడు. మరో స్టేజీ రాగానే ఇద్దరు హిజ్రాలు బస్సులోకి ఎక్కారు. ఖాళీ అయిన మగవారి సీటులో వారు కూర్చున్నారు. కండక్టరుతో వారు సరస సల్లాపాలాడి టిక్కెట్లు తీసుకున్నారు. వారి ఆహార్యం, వాచికం వింతగా వుండటంతో బస్సులోని ప్రయాణికులు వారివేపు వింతగా చూస్తున్నారు.
ఇంకో స్టేజీ దాటగానే ఇద్దరు మహిళా కూలీలు ఎక్కారు. వారి చేతిలో కొడవళ్లు, గుడ్డమూటలు వున్నాయి. మహిళలు తమ జాకెట్లోంచి చిత్తడిగా వున్న 10 రూపాయల నోటును కండక్టరుకు ఇచ్చారు.
‘వీటిని ఎక్కడి నుంచి తెచ్చారమ్మ?’ కండక్టరు దాన్ని తడుముడూ అడగటంతో గమనిస్తోన్న అందరూ నవ్వుకున్నారు.
మూడు గంటలు కరిగిపోవటంతో నేనెక్కిన బస్సు విజయవాడ బస్టేషన్‌కి చేరింది. కొత్త జంటలు, యువకులు, ఓ కుటుంబ సభ్యులు నాతోపాటే లగేజీతో బిలబిలమంటూ దిగారు. వారి గమ్యస్థానాలకు వెళ్లారు. ఆర్డినరీ బస్సులో ప్రయాణం నాకు సరదాతో పాటు నాలో నూతనోత్తేజాన్ని నింపిందే కానీ, నా కొత్త కథకు ముడిసరుకు దొరకలేదు!
బస్సు దిగిన కండక్టరు, డ్రైవరు బాత్రూంకి వెళ్లి క్యాంటిన్ దగ్గర టీ తాగటానికి వచ్చారు. నేను కూడా ప్రెషప్ అయి వారికి కాస్త దూరంలో టీ తాగుతూ వారిద్దరినీ గమనిస్తూ వున్నాను. ఈ ట్రిప్పులో ఏ ప్రమాదం జరగకుండా, ప్రయాణికులతో ఏ గొడవలూ లేకుండా వారికి హ్యాపీ జర్నీ ఇచ్చామని కండక్టరు, డ్రైవరు చర్చించుకుంటున్నారు. ‘మనం ఇంత ఓర్పూ, నేర్పుతో సంస్థకు సేవలందిస్తోన్నా.. ఆ సిఐ మన మీద కక్ష కట్టినట్లు ఓటీలు వేస్తాడేమిటి?’ అంటూ వారిద్దరూ అంతర్మథనం చెందుతున్నారు.
ఇంతలో వారికి సిఐ నుంచి ఫోన్ రావటంతో ఒకరి తర్వాత ఒకరు తీసి గౌరవంగా మాట్లాడారు. ‘విజయవాడకు వెళ్లేందుకు మరో ట్రిప్పు వుంది. మానసికంగా సిద్ధంగా వుండండి’ అంటూ ఫోన్‌లో సిఐ ఆదేశం. ఆ మాటలకు కండక్టరు, డ్రైవరు ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. నైరాశ్యంతో ‘ఎవరైనా.. పాలిచ్చే గేదెనే పిండుతారనుకుంటా!’ స్వగతంలా అనుకుంటూ తమ బస్సు వేపు నడిచారు వారిద్దరూ.
ఆ మాటలను స్వయంగా విన్న నేను వారిద్దరి మీద జాలిపడ్డాను. నేను రాసే కథకు మంచి ఇతివృత్తం దొరికిందని అనుకున్నాను. సెల్‌లో టైం చూసుకున్నాను. సాయంత్రం ఆరు దాటింది. పెళ్లి సమయం దగ్గర పడుతుందనే ఆతృతలో నా లగేజీని తీసుకొని మరో బస్సు ఎక్కాను.

- జి.సూర్యనారాయణ,
చరవాణి : 9704784744

పుస్తక పరిచయం

పద్యకవిత్వానికి ‘అంజలి’

దేవవరపు నీలకంఠరావు నిజంగా సామాన్యంగా కనిపించే అసామాన్యులు. కంచులా మ్రోగరు బంగారంలా ప్రకాశిస్తారు. పద్యకవితలా? ఎవరికర్థమవుతాయిలే అనే అపప్రదను తొలగించిన కవి పండితులు వీరు. శివుని జటాజూటాన్ని పోల్చాలన్నా, తెలుగు వెలుగును ప్రసరింపజేయాలన్నా, అవినీతి వృక్షపు వ్రేళ్లను పెకలించాలన్నా అది నీలకంఠరావుకే సాధ్యం. ఆయన కవితలన్నీ విశే్లషించటానికి ఇది సిద్ధాంత గ్రంథం అవుతుందేమోనని భయం. అందుకే నేను కొన్ని కవితా పంక్తులు మాత్రమే ఉటంకించదలిచాను. ‘అంజలి’ కవితలో (అగ్రవర్ణజుని ఆవేదన) గతంలో నా సోదరులైన దళితులు ఎన్ని బాధలుపడి శోకించారో వర్తమానంలో అంబేద్కర్, గాంధీలు సంఘ సంస్కరణతో వారిని కాపాడి రక్షించినప్పటికీ నేడు అదే గతి అగ్రవర్ణాలలో ఉన్నవారికి పట్టి అష్టకష్టాలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
వీరికి దళితులెంతోమంది స్నేహితులు, అభిమానులు. వారిపై ఈయనకెటువంటి ద్వేషం లేదు. కాని కొంతమంది అత్యున్నత విద్యను అత్యధిక మార్కులతో ఉత్తీర్ణులై ఆకలితో అలమటించుట జూచి కవి హృదయం నిలువలేక ఈ రచనను ప్రేరేపించింది.
‘తెలుగు వెలుగు’ కవితలో ఎంతో తావి సొగసు ఉన్నా పూలను గుర్తుచేసిన మధురిమ తెలుగు అని, తల్లి జోలపాటలో ఈ కడియంలో కలికితురాయి అని చెప్పటం మనం చూద్దాం.
ప్రియురాలి చిలిపి పలుకుతో పోల్చుట ఇది ఒక నూతన అభివ్యక్తి. చెల్లి ఆనందంతో వేసే ముత్యాల ముగ్గు, వేడివేడి జీడిపప్పు అని ఇంకా ఎన్నో విధాలుగా తెలుగు భాష గొప్పదనాన్ని కవిత్వీకరించారు. నాటి శాస్ర్తియ నృత్యం గురించి ‘నృత్యం’ కవితలో భంగిమా అది కాదు, వర్షాన నెమలితో/పురివిప్పి యాడెడు సరణి గాని! అని శ్లాఘించారు. ఇక ఆధునిక నృత్యాన్ని ఆయన తీవ్రంగా తన కవితలో విమర్శించారు. పక్షవాతం వచ్చినట్లుగా, వ్యాయామం చేసినట్లుగా ఆధునిక నృత్యం ఉండటం మన దుస్థితి అని అభివర్ణించారు. విశ్వకవి నాథునిగా విశ్వనాథుని కొనియాడారు. సెల్‌ఫోన్ ఎన్ని రకాలుగా రూపాంతరం చెందినదో చెబుతూ ఒక్క పాదంలో ఆయన సెల్‌ఫోన్ వాడే జీవితాలెలా ఉన్నాయో చెప్పారు. ‘గుండెలేని మనిషి యుండెనేమోగానీ! సెల్లు మ్రోగనట్టి జేబు కలదె’ అంటూ ఈ కవిత మూడు సీస పద్యాలతో నడిచింది.
వివేకానందుని గూర్చి చెప్పి సంస్కారం, సంస్కృతి నేర్పిస్తే ఉగ్రవాద విష భుజంగం పగను, రాక్షసత్వాన్ని వాక్రుచ్చారు ‘జాషువా’ కవితలో. ఇందులో జాషువా రచనలన్నీ ముత్యాలసరముగా కూర్చి, ఆయన బిరుదులన్నీ పద్యంగా ఇమడ్చడం విశేషం. నటరాజ దర్శనంలో ఆయన కవిత్వం అద్భుత లయ విన్యాసంతో శిఖరాగ్రం చేరుకుంది. మచ్చుకకు
‘జీమూత పటలమ్ము చీల్చు భాస్కరరశ్మి
హర జటాజాట విస్తరము గాగ!
వినువీధి చనుదెంచు విహగాళి మాలిక
గరళ కంఠుని కంఠ కాళమనగ’
ఈ అద్భుత కవిత్వం పద్యకవితా సదస్సులో పలువురి మెప్పులకు, పండితుల ప్రశంసలకు పాత్రమైనది. కృష్ణశాస్ర్తీ కవిత్వం గూర్చి వ్రాసినా ఉపాధ్యాయునిగా ఉపాధ్యాయుడు-నేటి బడిలో
‘టీచింగులో కొత్త టెక్నిక్కులను జేర్చి
బోధనల్ జేసెడు పుణ్యమూర్తి’
ఎంతో అద్భుతంగా చెప్పారు. విద్యార్థుల నాడి తెలుసుకుని పాఠాలు జెప్పకపోతే వినే వాళ్లెవ్వరూ లేరు. ఇక ‘బుద్ధుడు కరుగా రస సిద్ధుడు’ ఈ కవిత బుద్ధునిపై పిహెచ్‌డి చేసిన నీలకంఠరావు తప్ప మరెవరు వ్రాయగలరు? అందుకే ఆ మహామనిషిని, కవి పండితుని అభినందించుట మన కర్తవ్యం.

- బి.హెచ్.వి. రమాదేవి, సెల్: 9441599321

మనోగీతికలు

ఒక అడుగు
అందమైన జీవితం
అద్భుతమైన సౌరభం
ఆస్వాదిస్తూ పోతే స్వార్థం
పదిమందికి అందిస్తే నిస్వార్థం

ఆటవికులకు తానై
పంతాలకు పోయే అనాగరికులకు శత్రువై
తన ఆశయం-ఆలోచన
పదిమందిని ధైర్యంగా నిలబెట్టే ఆత్మస్థైర్యం
ఆంగ్లేయుల గుండెలలో నిదురించిన వైనం...
భయపెట్టాలనుకునే శత్రువులకు సింహస్వప్నం...
పేదల పాలిట పెన్నిధి
వీరులను అణచాలనుకునేవారికి తుపాకి...
జనజీవన సారధి
అల్లూరి పోరాటాల నిధి...
ఈనాటి యువతకు స్ఫూర్తి
రాబోయే తరాలకు పునాది
అడుగులో అడుగు వేద్దాం...
ఆలోచనల్లో అల్లూరి ఆశయాలను
స్ఫురణ చేద్దాం!
జనజీవన స్రవంతిని
ముందుకు నడిపిద్దాం!
వందేమాతరం... వందేమాతరం...

- రాజనాల రాజేశ్వరి
రాజమహేంద్రవరం

తల్లిదండ్రులకు
కావాలి ఇలా

అమ్మలేని బ్రతుకు శూన్యం
ఆ శూన్యంలో జీవించడం శోకం
ఆ శోకం దిగమింగి నవ్వడం శాపం
ఆ శాపాన్ని మోస్తూ గడపాలి
బ్రతుకున్నంత కాలం

అనంతమైన ప్రేమని
అమ్మ పంచుతుంది
నాన్న తన కష్టాన్ని
మన బంగారు భవితగా మారుస్తాడు
అన్న ధైర్యాన్ని కల్పిస్తాడు
నీ స్నేహం నా గమ్యాన్ని చేరుస్తుంది
నీ మాట కొందరికి స్ఫూర్తి కావాలి
నీ నడక కొందరికి మార్గం కావాలి
నీ ప్రతిభకు నింగే హద్దు కావాలి
నీ తల్లిదండ్రులకు
నీవే గర్వకారణం కావాలి

- పి. సుప్రియ, రాజమహేంద్రవరం

నీవెవరివో...
నా కళ్లముందున్న నీవెవరివో...
నా కలలో మెదిలే మానవకాంతవో
నా కనుల కొలనులో విరిసిన కలువవో
నాపై ప్రేమ వర్షాన్ని కురిపించిన చినుకువో
నాపై ముత్యాల మాటలను విసిరిన చిలుకవో
నా మదిలో మెదిలి నన్ను కదిలించే కలతవో
నా మనసును ఆహ్లాదపరిచే వల్లికవో
నా ఎద వలపులో విరిసిన సిరిమల్లెవో
నా హృదయ మందిరంలో నిలిచిన యువతివో
నా జీవితంలోకి అడుగుపెట్టిన
ప్రేమికవో, భామికవో...
ఏమో మరి...

- పి.హారిక

మట్టి చీకటి
వౌనం ప్రమాదకరం
మట్టి వౌనం
జీవితాలను ముంచేస్తుంది
పంట విరామం
రైతు కనురెప్పల కింద దాచిన
ఉప్పెన
ఆకుమడి తడిలేని దృశ్యం ఒకవైపు
రైతు కళ్లల్లో తడి మరోవైపు
జీవనగతి
ఒడ్డున పడిన చేప పిల్ల
మట్టి పరిమళాలు లేని క్షణం
పగుళ్లతో వేడి బీభత్సం
హృదయంలో...
అమ్మ పెట్టిన తొలి ముద్ద ఆనందం
అప్పుల బాధల్లో
చిగురించడం లేదు
అందరికి అన్నం పెట్టె రైతు
పొలం పనిలో
పదవీ విరమణ చేస్తున్నాడు
ఆకలితో ఆవేదనతో
కాలంతో పరిగెడుతున్నాడు
జీవితానికి బాధల కత్తుల వంతెన
ఏకాకిలా జీవన పోరాటంలో
శ్రమ ఆవిరైపోయిందా!
క్షణక్షణం
నరాల్లో శక్తి కోల్పోయి
అప్పుల అడుగు జాడల్లో గమ్యంలేక
నగ్నంగా నడుస్తున్న శరీరం రైతుది

- నల్లా నరసింహమూర్తి
అమలాపురం, చరవాణి: 9247577501

ఈ శీర్షికకు కవితా, కథా సంపుటాలు ఏవైనా, ఇటీవల అచ్చయిన కొత్త పుస్తకాల సమీక్ష/ పరిచయం కోసం ఈ కింది చిరునామాకు పంపండి. కార్టూన్లు పంపించాలనుకుంటే, ఫొటో, చిరునామాతో ఈ -మెయిల్ అడ్రస్‌కు పంపించండి
email: merupurjy@andhrabhoomi.net

మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, నేషనల్ హైవే, ధవళేశ్వరం, తూ.గో.జిల్లా. email: merupurjy@andhrabhoomi.ne

- డా. ర్యాలి శ్రీనివాసు