రివ్యూ

పెళ్లిచూపుల ప్రేమకథ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చి.ల.సౌ ** ఫర్వాలేదు

తారాగణం:
సుశాంత్, రుహాని శర్మ, జయప్రకాష్, వెనె్నల కిషోర్, రోహిణి, అనుహాసన్, సంజయ్ స్వరూప్, రాహుల్ రామకృష్ణ
విద్యుల్లేఖ రామన్ తదితరులు.
సినిమాటోగ్రఫీ : ఎం.సుకుమార్
ఆర్ట్ : వినోద్‌వర్మ
కూర్పు : చోటా కె. ప్రసాద్
సంగీతం : ప్రశాంత్ ఆర్. విహారి
నిర్మాణం : సిరుని సినీ కార్పొరేషన్, అన్నపూర్ణ స్టూడియోస్
నిర్మాతలు : నాగార్జున అక్కినేని జస్వంత్ నడిపల్లి, భరత్‌కుమార్ మలశల హరి పులిజల
రచన, దర్శకత్వం: రాహుల్ రవీంద్రన్

*** *** ***************

గత ఎంతో కాలంగా ఒక్కటంటే ఒక్క హిట్ కోసం హీరో సుశాంత్ ఎంతగానో ఎదురు చూస్తున్నాడు. అతడు నటించిన గత చిత్రాలు సగటు కమర్షియల్ ఫార్మాట్‌లోనే తెరకెక్కేవి. ఆ సినిమాల్లోకి కథలు సుశాంత్‌కు నప్పేవి కావు. ఇప్పుడు అందుకు భిన్నంగా ఓ సున్నితమైన కథతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. అందాలరాక్షసి సినిమాతో హీరోగా తెరంగేట్రం చేసిన రాహుల్ రవీంద్రన్ తరువాత నటుడిగా కొనసాగుతూనే దర్శకుడిగానూ తన ప్రతిభను పరీక్షించుకుంటున్నాడు. ఆయన దర్శకత్వంలో వచ్చిన తొలి చిత్రమే ‘చి.ల.సౌ’. మనసుకు నచ్చే ఓ సెన్సిబుల్ ప్రేమకథను ఈ చిత్రానికి ఇతివృత్తంగా ఎంచుకున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రచార చిత్రాలు బయటికి రావ డం.. అన్నపూర్ణ బ్యానర్‌పై అక్కినేని నాగార్జున విడుదల చేస్తుండటంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. మరి ఈ సినిమాలో నాగ్‌ను అంతగా ఆకట్టుకున్న అంశాలేమిటి? యువ హీరో సుశాంత్‌కు ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందించింది? ఈ చిత్రంతోనైనా అతడు హిట్‌బాట పట్టాడా? దర్శకుడిగా తొలి ప్రయత్నంలో రాహుల్ రవీంద్రన్ ఎలాంటి పేరు తెచ్చుకున్నాడు తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే..
పెళ్లి..పెళ్లి అని ఇంట్లో వాళ్లు తెగ ఇబ్బంది పెడుతుంటే మరో ఐదేళ్లవరకు ససేమిరా అంటూ మొండికేస్తుంటాడు అర్జున్ (సుశాంత్). బాగా డబ్బు సంపాదించి యూరప్ టూర్ వెళ్లి ఎంజాయ్ చేయాలనుకుంటాడు. అయితే అతడి తల్లిదండ్రులు (అనుహాసన్ - సంజయ్ స్వరూప్) వయసు మీద పడుతుంటే పెళ్లి సంబంధాలు రావడం చాలా కష్టమని భావించి ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేస్తుంటారు. అమ్మానాన్నల పోరుతో పాటు, తన బెస్ట్‌ఫ్రెండ్ సుజిత్ (వెనె్నల కిషోర్) కూడా అర్జున్‌ను పెళ్లి చేసుకోమని బలవంతపెడుతుంటాడు. ఇలా వీళ్ల పోరుపడలేక ఇక చేసేదేమీ లేక ఎలాగో అలా బలవంతంగానే పెళ్లిచూపులకు సిద్ధమవుతాడు. అంజలి (రుహాని శర్మ)తో పెళ్లిచూపులు ఏర్పాటు చేస్తారు. తన కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉంటూ ఉద్యోగం చేస్తున్న అంజలి ఎన్నో బాధ్యతలు ఉన్న మధ్యతరగతి అమ్మాయి. చిన్నతనంలోనే తండ్రి చనిపోవడంతో కుటుంబానికి తానే పెద్ద దిక్కు అవుతుంది. కుటుంబ పరిస్థితుల దృష్టా ఆమెకు పెళ్లి ఎంతో అవసరం. అలాంటి అమ్మాయిని చూసిన అర్జున్ పెళ్లికి ఒప్పుకున్నాడా? పెళ్లి బారినుంచి మళ్లీ తప్పించుకున్నాడా? అసలు ఆ పెళ్లిచూపులు ఎలా జరిగాయి? అయిష్టంగానే పెళ్లి చూపులకి ఒప్పుకున్న అర్జున్‌కి అంజలి నచ్చిందా? అనేది విషయాలు తెరపై చూడాల్సిందే.
పెళ్లిచూపులతో మొదలయ్యే ప్రేమకథను ఎంచుకున్న దర్శకుడు రాహుల్ రవీంద్రన్ తన తొలి ప్రయత్నంలో ఆకట్టుకున్నాడు. రొటీన్ ప్రేమకథలకు దూరంగా.. భిన్నంగా తన చిత్రం వుండేలా జాగ్రత్తపడ్డాడు. దర్శకుడిగానే కాకుండా రచయితగానూ అతడు మంచి ప్రతిభను చాటాడు. టేకింగ్‌లోనూ వెరైటీ చూపించాడు. పెళ్లంటే ఇష్టంలేని ఓ అబ్బాయి.. పెళ్లి తప్పనిసరి అయిన ఓ అమ్మాయి చుట్టూ సాగేకథలో దర్శకుడు చూపిన కొత్తదనం బావుంది. ఒకరోజు జరిగే కథలో పెళ్లీడుకొచ్చిన ఓ జంట మధ్య భావోద్వేగాలే కీలకం. సహజత్వానికి పెద్దపీట వేస్తూ కథను తీర్చిదిద్దాడు దర్శకుడు. కథ ఆరంభమే ప్రేక్షకుడి మనసును దోచేస్తుంది. అదే ఫ్లోలో సాగుతూ కథలో లీనమయ్యేలా చేస్తుంది. ఎప్పుడైతో పెళ్లి చూపులు మొదలవుతాయో అప్పట్నుంచి కథపై ఆసక్తి కలుగుతుంది. ప్రథమార్థంలో కొన్ని సన్నివేశాల మూలంగా సాగతీత అనిపించినా రానురాను అది తగ్గి ఆత్రుత కలుగుతుంది. బలవంతంగా పెళ్లి చూపులకు వెళ్లిన అర్జున్ తనకు తెలియకుండానే అంజలి జీవితంతో కనెక్ట్ అయిపోతాడు. ఆమె తన జీవితం గురించి చెప్పడం.. ఆ తర్వాత జరిగే పరిణామాలు..ఒకరి గురించి మరొకరికి తెలిసిపోయేలా చేస్తుంటాయి. దాంతో కథపై ప్రేక్షకుల్లో ఆసక్తికలుగుతుంది. ద్వితీయార్థం కాస్త మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుందా అని అనిపిస్తున్న సమయంలో దర్శకుడు ఎంతో తెలివిగా కథను గాడితప్పకుండా చేశాడు. ఫస్ట్ఫాలో వెనె్నల కిషోర్, సుశాంత్‌ల కాంబినేషన్‌లో వచ్చే కొన్ని సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. సుశాంత్ తన బాడీలాంగ్వేజ్‌కి తగ్గ కథ కావడంతో తన పాత్రను సమర్ధవంతంగా పోషించాడు. అర్జున్ క్యారెక్టర్‌లో ఇమిడిపోయాడు. అతడి హావభావాలు, భావోద్వేగాలు.. అన్నీ సహజంగా అనిపించి ఆకట్టుకుంటాయి. గత చిత్రాలతో పోలిస్తే సుశాంత్ మంచి పరిణతి కనబరిచాడు. చెప్పుకోవటానికి చాలామంది నటులు ఉన్నా హీరో హీరోయిన్లు తప్ప మిగతా అన్ని పాత్రలు దాదాపు అతిథి పాత్రలే. కథ అంతా అర్జున్, అంజలి చుట్టూనే తిరుగుతుంది. కథానాయికగా పరిచయమైన రుహానిశర్మ తొలి చిత్రంలోనే మంచి మార్కుల్ని కొట్టేసింది. అర్జున్ మీద ఇష్టమున్నా కుటుంబ బాధ్యతల కారణంగా అవుననలేక, కాదనలేక మదనపడే క్యారెక్టర్‌లో చక్కటి నటన కనబరిచింది. పెళ్లి చూపుల విషయంలో సంఘర్షణ పడే అమ్మాయిగా పాత్రలో ఇమిడిపోయింది. కళ్లతోనే భావోద్వేగాలు పలికించింది. సుశాంత్ ఫ్రెండ్‌గా వెనె్నల కిషోర్‌కు ఇలాంటి పాత్రలు కొట్టినపిండే. తన కామిడీ టైమింగ్‌తో నవ్వించాడు. హీరోయిన్ తల్లిగా రోహిణి, హీరో తల్లిదండ్రులుగా అనుహాసన్ - సంజయ్ స్వరూప్ చక్కటి అభినయాన్ని ప్రదర్శించారు. ఇతర పాత్రల్లో విద్యుల్లేఖ రామన్, రాహుల్ రామకృష్ణ, జయప్రకాష్ తమ పాత్రల పరిధిమేరకు ఆకట్టుకున్నారు. సాంకేతికంగా సినిమా అన్ని విభాగాల్లో మంచి మార్కుల్ని కొట్టేసింది. సినిమాటోగ్రాఫర్ సుకుమార్ ప్రతి ఫ్రేమ్‌లోనూ తన ప్రతిభను చాటాడు. విహారి సంగీతం ఫర్వాలేదు. ముఖ్యంగా నేపథ్య సంగీతం కొత్త అనుభూతి కలిగిస్తుంది. ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్టే ఉన్నాయి. మొత్తం మీద ఈ ‘చి.ల.సౌ’తో అటు హీరో సుశాంత్, ఇటు దర్శకుడు రాహుల్ రవీంద్రన్ ఫర్వాలేనిపించుకునే స్థాయిలో మార్కుల్ని కొట్టేశారు.

-రతన్