రాజమండ్రి

శిక్ష (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనివాస్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఓ మహా పుణ్యక్షేత్రానికి బయల్దేరాడు. శ్రీనివాస్ తన భార్య శ్రీవాణి, చెల్లెలు సుగుణ బైకు మీద, మిగతా కుటుంబ సభ్యులు గుడికి చేరుకున్నారు ఓ గంట తరువాత.
ఆ గంట ప్రయాణంలో గుడి రోడ్డు ఇరువైపులా చెత్తతో నిండిపోయింది. శ్రీవాణికి దాహం వేయడంతో గుడి ఎదురుగా ఉన్న షాపులో డ్రింకు తాగారు శ్రీవాణి, శ్రీనివాసు.
అప్పుడే అక్కడకు చేరుకున్న రౌడీమూకలు తాగుతూ శ్రీవాణి వైపు దూసుకొస్తూ ‘చాలా అందంగా ఉన్నావని’ కామెంటు చేశారు. ఇది గమనించిన శ్రీనివాసు వాళ్లకి చివాట్లు పెట్టడంతో పాటు అక్కడున్న అధికారులు, పెద్దలు జోక్యం చేసుకుని అల్లరిమూకలను అక్కడ నుండి పంపించివేశారు.
శ్రీనివాసు కుటుంబం అమ్మవారి దర్శనం చేసుకున్న తరువాత అక్కడ ఉన్న తాటిపాకలో మధ్యాహ్నం భోజనం వండుకున్నారు. సాయంత్రం వరకు కుటుంబ సభ్యులు నవ్వుతూ మాట్లాడుకున్నారు. మళ్లీ సాయంత్రం మరోసారి దర్శనం చేసుకుని ఇంటికి బయల్దేరారు.
వాళ్లని ఉదయం నుండి గమనిస్తూ ఉన్న రౌడీమూకలు ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నారు. బైకు, జీపు మీద ఇంటికి బయల్దేరిన వారికి ఆ రౌడీలు కారులో వచ్చి మాటిమాటికీ అడ్డు తగిలారు. పైగా ఆ నలుగురు రౌడీమూకలు తాగేసి ఉన్నారు. ఇంతలో కారు వేగంగా బైక్‌ను ఢీకొట్టడంతో శ్రీవాణి పైకి ఎగిరి రోడ్డు మీద విగతజీవిలా పడింది. ఆ రౌడీ మూకలకు భయం వేసి వేగంగా వెళ్లిపోయారు.
శ్రీనివాస్, కుటుంబసభ్యులు ఒక్కసారిగా షాక్ తిన్నారు. ఒక్క క్షణం వారికి ఏం జరిగిందో అర్థం కాలేదు. గాయాలతో శ్రీనివాస్, సుగుణ పడిపోయిన శ్రీవాణిని చూడలేకపోయారు. అక్కడ రోదనలు మిన్నంటాయ. జనం గుమిగూడారు. క్షణాల్లో అంబులెన్స్ వచ్చి శ్రీవాణిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈ విషయం మీడియాకి తెలియడంతో ముందు రోడ్డు ప్రమాదంగా భావించిన తరువాత ప్రమాదం గురించి విస్తృతంగా ప్రచారం చేశారు. ముందు పోలీసులు రోడ్డు ప్రమాదంగా భావించినా ఆసలు విషయం తెలియడంతో స్పందించి ఈ ప్రమాదానికి కారణమైన వారిని వదిలిపెట్టేది లేదని ప్రజలు వారికి మరణశిక్ష పడే అవకాశం కూడ ఉందని భావించారు.
కమిషనర్ ప్రకటనతో అలర్టయిన ఆ రౌడీమూకలు రాజకీయ నాయకులను కలిశాయి. ఒక్కసారిగా ఇది కూడ మీడియాకు తెలియడంతో ఈ కేసు రాష్టవ్య్రాప్తంగా తెలిసింది.
రాజకీయ నాయకుల ప్రోద్బలంతో మృతి చెందిన శ్రీవాణి కుటుంబ సభ్యులకు పది లక్షలు, మీడియా వారికి పది లక్షలు, రాజీ కుదిర్చిన వారికి పది లక్షలు ఇవ్వడానికి సిద్ధమయ్యారు.
కాని శ్రీవాణి భర్త ఇందుకు ఒప్పుకోలేదు. నిందితులకు శిక్ష పడాల్సిందేనని కరాఖండిగా చెప్పాడు. ఓ రాజకీయ నాయకుడు ‘ఇద్దరు పిల్లలున్నారు కదా! వాళ్ల పేరుమీద ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తామని’ బతిమిలాడినా దానికి శ్రీవాణి భర్త ‘దయచేసి అలాంటి రౌడీలకు దూరంగా ఉండండి, రేపు మీ తరఫు వాళ్లకి ఇలా జరిగితే డబ్బు తీసుకుని సర్దుకుపోతారా’ అని ప్రశ్నిస్తే రాజకీయ నాయకుడు తలవంచుకున్నాడు. శ్రీవాణి భర్త ఎంతకూ లొంగలేదు.
మహిళా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజా సంఘాలు కేసు తప్పుదోవ పడుతోందని ధర్నాలు చేశారు.
కమిషనర్ ఇదంతా చూసి కేసు వివరాల కోసం ఆలయంలో ఉన్న కెమెరాలను పరిశీలించి అక్కడున్న వారిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. తరువాత ప్రమాదం జరిగిన ప్రాంతంలో అణువణువూ గాలించారు. ఆ తరువాత నిందితులను పట్టుకుని రహస్య ప్రాంతంలో విచారించి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
ఆలయం వద్ద జరిగిన ప్రమాదంలో ఎలాంటి కుట్ర జరగలేదని, శ్రీవాణి భర్త బండి మీద ముగ్గురు ఉండడం వల్ల అదుపు చేసుకోలేక ప్రయాణిస్తున్న కారును ఢీకొని శ్రీవాణి మృతి చెందిందని చెప్పారు. సిసి కెమెరాలను పరిశీలించినా ఎలాంటి ఆధారం దొరకలేదన్నారు. ఎవరైనా ఆధారాలుంటే ఇస్తే కేసు పునఃపరిశీలిస్తామని కమిషనర్ ప్రకటించారు. కారులో ప్రయాణిస్తున్న వారు భయపడి పారిపోయారు తప్ప ప్రమాదం చేసి కాదు అని కమిషనర్ ఇచ్చిన వివరణతో శ్రీవాణి కుటుంబ సభ్యులు భోరున విలపించారు.
ఆ తరువాత ఎవరి వాటా వారు తీసుకున్నారు. శిక్ష అనుభవించాల్సిన వారు యథేచ్ఛగా తిరుగుతున్నారు. ఆనందంగా గడపాల్సిన వారు జీవితాంతం ‘శిక్ష’ పడినట్లు బాధ అనుభవిస్తున్నారు.

- నల్లపాటి సురేంద్ర
9490792553

పుస్తక సమీక్ష

వాస్తవికతకు అద్దం
పోలుమాటి ‘కట్టుబాట్లు’
ప్రతులకు:
పోలుమాటి రాంబాబు
బొమ్మూరు,
రాజమహేంద్రవరం(రూ)
తూర్పుగోదావరి జిల్లా
సెల్: 8897372121

కులం మీద కొన్ని కట్టుబాట్లు ఉంటాయి. మతంలో కొన్ని కట్టుబాట్లు ఉంటుంటాయి. అయితే సాంస్కృతిక కట్టుబాట్లు చాలా ముఖ్యమైనవి. ఇవే మతాన్ని, కులాన్ని ప్రభావితం చేస్తాయి. సమానత్వపు విలువలకు ప్రతీకలు సాంస్కృతిక సోపానాలు అయ్యే కట్టుబాట్లు మీదే తన తిరుగుబాటు బావుటాను ఎగరేశారు. అనుభవసారంలోనివి తన అనుభూతి కారకమైనవి కవిత్వంగా అల్లారు. వివిధ సందర్భాల్లో వివిధ సంఘటనల నేపథ్యంలో వచ్చిన ప్రతిస్పందనల సార ఫలితమే ‘కట్టుబాట్లు’ కవితా సంపుటి.
తాను చెప్పదలుచుకొన్న విషయాన్ని స్పష్టంగా ప్రకటించ పూనుకొన్నారు. ఇందులో ఏ ప్రలోభాలకు ప్రభావితం కాలేదు. కవి మంచి చదువరి. అలాగే అనేక విషయాల పట్ల పూర్తి అవగాహన ఉన్నవారు. తనకు తెలిసిన దానిని పదుగురికి చెప్పాలనే తపనగలవారు. ఏది రుజువర్తనమో ఏది చెడు వర్తనమో తెలిసినవారు. బాల్యం నుంచి కష్టనష్టాల రుచి బాగా అనుభవించినవారు. పుస్తకంలో నా మాటగా కవి చెప్పుకున్న కబుర్లలో రచయితగా ఎదగమన్న వారి దీవెనలు, తనను స్ఫూర్తివంతం చేసిన వారి పేర్లు ప్రకటించారు. బహుజన రచయితగా తన ప్రేరణ పొందే విషయాలు వివరించారు. సమాజంలో దగాపడుతున్న వారిని దగ్గరగా గమనించినవారు. పత్రికల విషయంలో శ్రీశ్రీ విషపుత్రికలంటారు. దేశ జర్నలిజం గురించి రాంబాబు ఓమాట అంటారు. ఒక పత్రిక వార్తకు మరొక పత్రిక వార్తకు పొంతన కుదరదని. నిజమే అది. పెట్టుబడిదారుల నీతిసూత్రం, తమకు అనుకూలంగా వార్తను మలచుకోవడం పాత్రికేయ విలువలకు కొత్త అర్థాన్ని బోధిస్తున్నాయి. ఏ వార్తను ఎందుకు ప్రముఖం చేయాలో యాజమాన్యాలు నిర్దేశిస్తాయి. సామాన్యుడి అవసరత తన కష్టనష్టాలు తన బతుకు దృగ్యోచరతను పత్రికా యాజమాన్యం నిర్ణయిస్తేనే వార్తగా వస్తుంది. ప్రతి పార్టీకో ఓ పత్రిక కొమ్ము కాస్తుందనే పనిలేదు. పార్టీయే పత్రికను పెట్టి కాపు కాయించుకుంటున్నారు.
వివక్ష ఎంత వేళ్లూనుకుందో చెప్పే సాక్ష్యాలు ఆ పత్రికల్లో వచ్చే అనేక చిన్నవార్తలు పెద్ద సంచలన విషయాలై ఉద్యమరూపం ధరించిన సందర్భాలూ ఉన్నాయి. కవి ఆ విషయాల్నే కవితగా మలచిన ప్రస్తావన ఉంది. ‘చిన్నచూపు’ వివిధ ప్రాంతాల్లో వేర్వేరుచోట్ల దళితులకు దక్కిన ‘దయ’ను ప్రస్తావించారు. అవహేళన, అవమానం, అత్యాచారం స్ర్తి మీద జరిగితే ఎంత పెద్ద ఉద్యమం అయిందో తెలిసింది. అలా వారిపై జరిగే అనేక దాడులను ఎదుర్కొనేందుకు అండగా ‘నిర్భయ’ చట్టమై వచ్చింది. అయితే అదే దేశ రాజధానిలో నిర్భయకు జరిగిన చర్యే మరోచోట దళిత బాలికకు జరిగింది. అది వార్తకు నోచుకోలేదు. న్యాయం అందలేదు. సహాయమూ దక్కలేదు. అదీ వివక్ష విషాదం!
మతం మాడు పగలుకొట్టే పని చేపట్టారు రాంబాబు. ‘కోడి-పాస్టరు’ కథ బాగా పేలింది. అలాగే ‘వెల్లులి-ఉల్లిశాస్ర్తీ’ కథను కవితలుగా మార్చి కదిలించారు. మత చరిత్ర మీద మంచి అవగాహన ఉంది. దాన్ని బాగా ఏకరువు పెట్టారు మత చరిత్ర శీర్షికన. కులం పుట్టుక కుల చరిత్రకెళ్లకుండా మార్పుల్ని బాగా ఆకళింపు చేసుకొని ‘కులం’ శీర్షిక కులచెంపను ఛెళ్లుమనిపించారు.
తల్లిదండ్రులు పిల్లల్ని పెంచే విధానంలో తగుజాగ్రత్త వహిస్తేనే భావితరం ఉత్తమత్వాన్ని పొందుతుంది. మన ఆలోచనలు మన పిల్లల్లో ప్రతిబింబిస్తాయి. నైతికతను, నీతిని పిల్లల మనసులో నాటితేనే మంచి సమాజం భవిష్యత్‌కు ఇవ్వగలుగుతుంది. దాని ఆవశ్యకతను గుర్తెరిగి చెప్పిన కవిత ‘పెంపకం’ పద్య అలంకారికంతో చెప్పారు బావుంది. అపశకునాల మీద వంద ఏళ్ల క్రితమే ‘పూలే’ వాటిని కొట్టి పారేశారు. శాస్త్ర సమ్మతం కానివని సైతం నిరూపించారు. ఇలాంటి మూఢనమ్మకాల మీద కందుకూరి పోరాడారు మన తెలుగునేల మీద. ఆ అంశం మీదే పోలుమాటి వారు ‘బల్లి పిల్లి కుక్క’ కవితలో చిన్న కథగా చెప్పారు.
పుస్తకానికి ప్రధాన శీర్షికగా మారి పతాక శీర్షికై ముద్రితమై అలంకరించిన ‘కట్టుబాట్లు’ కవిత ప్రశ్నల వర్షం కురిపిస్తుంది. చాలా చాలా సమస్యలకు సామాజికత కలహాలకు ఏ కట్టుబాట్లు అడ్డువేసి అస్పృశ్యతను ప్రోత్సహిస్తుందోనని కట్టలు తెంచుకుని ఆగ్రహిస్తున్నారు. రాజకీయ అవగాహనతో వాటిని దుయ్యబడుతున్నారు. ‘నీతి అవినీతి’ సవాల్ బావుంది. స్వీయానుభవంతో చక్కగా చూపారు. పధ్నాలుగు పంక్తులతో దుళ్లకొట్టారు. ఇంకా పుస్తకంలో ‘యుద్ధం పోరాటం ఎవరు వీళ్లు’ ‘ఎవరు చెడ్డువాళ్లు’, ‘కట్టె’, ‘గాడిద’, ‘సమైక్యత’ లాంటి కవితలు ఆలోచన చేయటానికి ఆవేశపరుస్తాయి. పుస్తకంలో ఇరవై మూడు కవితలతో అనుబంధంగా రెండు వ్యాసాలున్నాయి.
పదునైన భావాలు పదుగురికి అవసరమైన నిజాలు ఆయన వద్ద నిక్షిప్తమై ఉన్నాయి. వీటిని వెలికి తోడటానికి ఒక చక్కని మాధ్యమం కావాలి. సాహితీ ప్రక్రియల్లో ఇష్టమైనది ఎంచుకునే హక్కు రచయితది. అయితే హృద్యంగా ఆర్ద్రంగా చిత్రీకరించే నేర్పు కూడా ఉండాలి. అది కొరవడిందనేది అనుమానం. మూస పద్ధతుల నుంచి బయటపడాలనే ఉద్దేశ్యంతో రాసామంటే అభ్యంతరం లేదు కాని, కవిత్వం పద చిత్రాలుగా ఉంటే అది మరెక్కువ కాలం మనగలుగుతుంది. కవిత కన్నా కథ రాంబాబు కలంలో పదును తేలుతుంది.
కొడవటిగంటి కుటుంబరావు (కొ.కు) రూపొందించిన ‘గల్పిక’కు ఈయన ప్రాణం పోయగలరనిపిస్తుంది. చిన్నచిన్న సెటైర్లతో అద్భుతంగా పేల్చగలరు. అతి చిన్న కథ లాంటి గల్పిక ఈనాటి పాఠకులకు అవసరనీయమైన ప్రక్రియ. వివిధ సాహితీ సంస్థలు తమ సాహిత్య పాఠశాలల్లో కొత్త ప్రక్రియలతోపాటు వీటిని తమ శిక్షణా తరగతుల్లోకి చేర్చుకొంటే మంచిది. రాసేస్తే పోయేదేమి లేనట్టు రాసినా, చదివితే తెలిసేది ఏమి ఉండదు. ఎవరి దృక్పథంతో ఎవరి వాదంతో వారు రచనలు చేస్తే పుస్తకాలుగానే అవి ఉండిపోతాయి. ఎవరి మెదళ్లు కదిలించాలనుకుంటున్నామో ఎవర్ని చైతన్యపరచాలనుకుంటున్నామో ఎవరి అవగాహనకు రచనలు నిర్దేశించుకుంటున్నామో ఆ బహుజనుల చెంతకు చేరడంతోపాటు ఎంచుకున్న ప్రక్రియతో చేరువ కావాలి. పాట, కవిత, నాటకం, ఉపన్యాసం తదితర ప్రక్రియలు మరింత ఆకట్టుకునే సాహిత్య ప్రక్రియలు. వాటితో వారి మనసు చెంత నిలిస్తేనే, అందించే భావజాలం అందంగా చేరుతుంది.
పుస్తకాన్ని హడావుడిగా తెచ్చినట్టు కన్పిస్తోంది. శ్రద్ధ తీసుకుంటే కాస్త ఆకర్షణీయంగా అందంగా వచ్చేది. కాస్త కటువుగా చెప్పకుంటే ‘బరవే’ ప్రచారం కోసం ప్రచురించారనిపిస్తుంది. లేదంటే చాలా మంచి పుస్తకంగా రూపుదాల్చేది. ఒకట్రెండుసార్లు వడపోత, తిరిగిరాత జరుగుండదు. శ్రద్ధతోపాటు దృష్టి నిలిపితే పుస్తకం మెరుగ్గా వచ్చేది. గతంలో రెండు పుస్తకాలు తీసుకొచ్చిన అనుభవాన్ని పరిగణలోకి తెచుకొన్నట్టు లేదు. ఉద్యమక్షేత్రంలో పనిచేసిన అనుభవం పోరాట శీలత పక్కాగా రచయితలో ఉన్నాయి. వాటితో బహుజన ఉద్యమానికి అవసరమైన రచనలు చేస్తారని ఆశిద్దాం.

- రవికాంత్, సెల్: 9642489244

శ్రీగురవేనమః

బోధతరువు.. గురువు
‘కురవబోయే వర్షమేఘం వంటివాడు - ఉపన్యాసకుడు’ అన్నారు ఇంద్రగంటి హనుమచ్ఛాస్ర్తీగారు ఒకప్పుడు. నిజమే. ఉపన్యాసకుడంటే ఇక్కడ ఉత్తమగురువని కూడా చెప్పుకోవచ్చు.
‘చోద్యంబయ్యెడు నింతకాలమరిగెన్ శోధించి యేమేమి సం
వేద్యాంశంబులు చెప్పిరో? గురువులేవెంటం బఠింపించిరో? విద్యాసారమెఱుంగ గోరెద-్భవద్విజ్ఞాత శాస్త్రంబులో;
పద్యంబొక్కటి చెప్పి సార్థముగా తాత్పర్యంబు భాషింపుమా!’
అనే పద్యం ద్వారా ఉత్తమ గురువుల లక్షణాన్ని రాక్షసరాజైన హిరణ్యకశిపునిచే కుమారుడైన ప్రహ్లాదునితో ప్రశ్నారూపంలో పలికించారు- పోతనగారు భాగవతంలో. ఉత్తమ గురువైనవాడు తాను శిష్యులకు చెప్పదలచుకున్న అంశాన్ని కూలంకషంగా పరిశోధించాలి. తనకు తెలిసిందల్లా బలవంతంగా రుద్దినట్లుగా శిష్యులకు చెప్పేయగూడదు గురువు. ఆ విష్యుల స్థాయి, తరగతిని బట్టి వారు తెలుసుకోదగిన అంశాలనే ఆసక్తికరంగా బోధించాలి. కేవలం పాఠాలను చెప్పి, ఒళ్లు దులిపేసుకొని వెళ్లిపోగూడదు గురువు. వెంట ఉండి మరీ చదివించాలి. వల్లె వేయించాలి. అంటే ‘ట్యుటోరియల్ మెథడ్’ అన్నమాట. ఈ పద్ధతిని పాటిస్తే శిష్యులందరూ ప్రహ్లాదులే అవుతారని చెబుతోంది భాగవతం. గురువులు కేవలం చండామార్కులు కాకూడదు. అపరకీచకులు అసలు కాకూడదు. సాందీపనులూ, వసిష్ఠులూ, విశ్వామిత్రులు కావాలి. అప్పుడే సమాజంలో శిష్యులు బలరామకృష్ణరామచంద్రులుగా తయారవుతారు. ఉత్తమగురువు అర్హత కలిగిన శిష్యుణ్ణి అనే్వషిస్తాడు. రామకృష్ణ పరమహంస అటువంటి గురువు. కాబట్టే స్వామి వివేకానంద వంటి శిష్యుణ్ణి లోకానికి అందించగలిగాడు. కేవలం మార్కులపై ఇష్టము కలిగిన ‘మార్క్సిష్టులు’గా విద్యార్థుల్ని తయారు చేయరాదు గురువు. జీవితాన్ని చెప్పాలి గురువు.
మరో విశేషమేమంటే, వ్యక్తి ఏ ఉద్యోగ పదవిలో ఉన్నా రిటైర్డు కానంతవరకే అడతు గౌరవం పొందుతాడు. కానీ గురువృత్తి అటువంటిది కాదు. గురువు రిటైర్డ్ అయినాసరే కనిపిస్తే చాలు శిష్యులెవరైనా తప్పక నమస్కరిస్తారు. అటువంటి గౌరవాన్ని పొందేవాడు గురువొక్కడే. అలాగని ఉపాధ్యాయ వృత్తి నిర్వహణం అంత తేలికైనదని అనుకోకండి. అందులోనూ శ్రమ ఉంది. బరువూ బాధ్యతలున్నాయి. అసలు సంఘంలో గురువుకున్న స్థానం ఎటువంటిదో సాధారణ పాఠకులు కూడా అర్థం చేసుకునేలా కవి నలిమెల భాస్కర్ ‘బోధివృక్షం’ అనే వచన కవితలో ఇలా తెలియజేశారు.
‘పిల్లలకు పాఠాలు చెప్పిచెప్పి
పెళ్లలు పెళ్లలుగా రాలిపోతావు
ఏ పుట్టలో ఏ శేషుడున్నాడో
అన్న అచంచల విశ్వాసంతో
అదేపనిగా అజ్ఞాన వస్త్రాలు ఉతికిన
నీగొంతు సబ్బుబిళ్ల
క్షణక్షీణమానమై హరించుకుపోతుంది
ఎత్తి నమస్కరించిన రెండు చిన్న చేతులు
రీచార్జి చేసి నిన్ను మళ్లీ
నిటారుగా నిలబెడతాయి
నీ చేతి పొత్తిళ్లలో సుద్దముక్క
పసిపాపై ఒదిగి కొవ్వొత్తిలా కరిగిపోతుంది
రాత్రి ఆలుబిడ్డల్ని వదిలివెళ్లిన గౌతముని
బుద్ధుణ్ణి చేసినట్టు
పగలు తల్లిదండ్రుల్ని
విడిచి వచ్చిన విద్యార్థిని
సిద్ధార్థుని చేసిన నువ్వు
బోధివృక్షానివి
నువ్వొక బోధవృక్షానివి’!
ఈ కవితలోని ‘అదేపనిగా అజ్ఞాన వస్త్రాలు ఉతికిన నీ గొంతు సబ్బుబిళ్ల’ అనే వాక్యంలో గురువు గొంతును సబ్బుబిళ్లతో అభేదంగా పోల్చిచెప్పడం వినూతనాంశం. ఆ గొంతు అనే సబ్బుబిళ్లతో శిష్యుల అజ్ఞాన వస్త్రాలను అదేపనిగా గురువు ఉతుకుతాడట.
అదేపనిగా ఉతకడం వల్ల ఆ గొంతు అనే సబ్బుబిళ్ల క్షణక్షణ క్షీణమానమై హరించుకుపోతుందని అనడంలో ఆ గురుని ఆర్ద్రస్థితిపరమైన అనుభూతిని కళ్లకు కట్టించారు కవి. అలాగే ‘నీ చేతి పొత్తిళ్లలో సుద్దముక్క పసిపాపై ఒదిగి కొవ్వొత్తిలా కరిగిపోతుంది’ అనే పోలిక భావన అమోఘంగా, వినూతనంగా ఉంది. బోధకుడు తన బోధనతో విద్యార్థిని సిద్ధార్థుణ్ణి చేస్తాడు గదా! ఆనాడు గౌతముని బోధివృక్షం బుద్ధుణ్ణి చేసింది. కాబట్టి గురువును ‘నువ్వు బోధివృక్షానివి, నువ్వొక బోధవృక్షానివి’ అంటాడీ కవి. ఆనాడు గౌతముడు ఆలుబిడ్డల్ని విడిచి వచ్చాడు. ఈనాడు విద్యార్థి పగటిపూట తన తల్లదండ్రుల్ని విడిచి వస్తాడు పాఠశాలకు. చూశారా! ఎంతటి సమగ్ర సమన్వయాత్మక వినూతనమైన పోలిక కలిగిన కవితా వాక్యమో ఇది! ఇటువంటి రూపకాలంకార రూపమైన పోలిక- గురువర్ణన పరంగా మరెక్కడా కానం.ఇలా అంకితభావంతో పాఠ్యబోధన చేసి శిష్యుల బతుకుల్ని తీర్చిదిద్దిన గురువులెందరో ఉన్నారు. సాహిత్యరంగంలో ఆ గురువుల గొప్పదనాన్ని కీర్తిస్తూ అక్షర దక్షిణల్ని సమర్పించిన శిష్యులు కూడా ఎందరో ఉన్నారు. అటువంటి వారిలో ‘కవిసమ్రాట్’ విశ్వనాథ సత్యనారాయణగారొకరు. తమ రామాయణ కల్పవృక్షంలో..
‘అలనన్నయ్యకు లేదు, తిక్కనకు లేదాభాగ్యమస్మాదృశుం
డలఘుస్వాదు రసావతార ధిషణాహంకార సంభార దో
హల బ్రాహ్మీమయమూర్తి శిష్యుడయినాఁడట్టి దావ్యోమపే
శల చాంద్రీమృదుకీర్తి చెళ్లపిళవంశ స్వామికున్నట్లుగన్’
అని తమ గురువైన చెళ్లపిళ్ల వేంకటశాస్ర్తీగారిని ప్రశంసించారు. ఇది మామూలు ప్రశంసకాదు. తమవంటి సరస్వతీమూర్తి శిష్యుడైనాడన్న అదృష్టం- చెళ్లపిళ్లవారికి కలిగినట్లుగా అలనాటి నన్నయకు గానీ, తిక్కనకు గానీ కలుగలేదన్నారు. ఈ పద్యంలో ఎక్కువ భాగం తమ గొప్పతనాన్ని తాము పొగడుకున్నట్లుగా పైకి కనిపిస్తుంది. కానీ ఈ గొప్పదనాన్ని అంతా గురువైన చెళ్లపిళ్ల వారికి ఆపాదించారు. తమ గురువుగారికి దక్కిన ఇటువంటి అదృష్టం- నన్నయ, తిక్కనలకు గూడా లేదుపొమ్మన్నారు. అభివక్తీకరణలో ఇదొక గడుసుదనంతో గూడిన చమత్కారం. పైకి తమ గొప్పదనాన్ని తామే చాటుకొని విశ్వనాథవారు అహంకారాన్ని ప్రదర్శించారని అనుకుంటారు. ఇది అహంకారం కాదు, ఆత్మవిశ్వాస ప్రకటనం!
చివరగా ఒకమాట! ఏ యుగంలో ఎప్పుడు చూసినా శిష్యునికంటే గురవే గొప్పవాడు. ఎలాగంటారా? పోరెడ్డి రంగయ్యగారు చమత్కారంగా చెప్పినట్లుగా.. ‘గురువు’కు మూడు కొమ్ములు. ‘శిష్యుడు’కు రెండే కొమ్ములు - అక్షరాల్లో. ఇక్కడ ‘కొమ్ములు’- ‘కొమ్ములొచ్చాయ్’ అనే అర్థంలో వాడలేదండోయ్! శబ్ద స్వరూపంలో వున్న కొమ్ములవి! అవి వాళ్ల గొప్పదనానికి గుర్తులనుకోవచ్చు. అందుకే ‘శ్రీగురవేనమః’ అని అందరం అనాలి. ‘కోరిన విద్యలకెల్ల నొజ్జయైయుండెడి’ గణపతి చవితి పండుగనాడే ఈసారి ఉపాధ్యాయ దినోత్సవం. ఆ వినాయకుని కృపతో గురువులందరూ బోధతరువులు కావాలి. అప్పుడే డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆత్మ నిజంగా ఆనందాన్ని పొందుతుంది.

- డా. రామడుగు వేంకటేశ్వరశర్మ, చరవాణి : 9866944287

మనోగీతికలు

స్నేహమే నా పయనం
అలల ప్రయాణం తీరం వరకు
కలల ప్రయాణం మెలకువ వరకు
ప్రేమ ప్రయాణం పెళ్లి వరకు
మన స్నేహం మాత్రం కడవరకు

స్నేహం ఒక భావం
భావం ఒక జీవం
జీవం ఒక ప్రాణం
ప్రాణం ఒక రూపం
ఆ రూపానికి ప్రతిరూపమే మన స్నేహం

మంచు బిందువు క్షణకాలం
తామరపువ్వు దినకాలం
మన స్నేహం కలకాలం
అందుకే నిన్ను తీసుకువెళ్తాను అహోబిలం

చెట్టు వేరు ప్రాణం
చేపకు నీరు ప్రాణం
నువ్వంటే నాకు ప్రాణం
కడవరకు మన ప్రయాణం

- ఎం.రమ్యతేజశ్రీ

చిచ్చర పిడుగంట
మా ఇంటి పక్కన ఉంది ఒక జంట
వాళ్లకి ఉన్నాడు ఒక కలల పంట
వాడికోసం రోజూ గుడిలో కొడతారు గంట
వాడు చేస్తాడు రోజుకో గలాట
ఆమింటగాడి కోసం చేస్తారు వంట
ఆ వంట మాకు పెడతారు
అదే మాకు తంట
అది తింటే మాకు కడుపులో మంట
అలాంటి జంట ప్రతి ఇంట వుంటే
వస్తుంది కంట మంట
అలా కాకూడదు ఏ ఇంట
అందుకే వాడు చిచ్చర పిడుగంట
- జె. అక్షిత

సంజీవిని
నువ్వు కదలవు
స్థిరంగా ఒకచోట నిలబడి చూస్తుంటావు!
ఈ ఆకాశంలోకి నీ రెక్కలను చాచి
అనంతశక్తిని ఆవాహన చేస్తుంటావు!

నీ నడినెత్తి మీద
ప్రచండ భానుడు నిప్పులు కురిపిస్తున్నా
పచ్చగా నవ్వుతుంటావు
నువ్వు మాట్లాడవు
కాని రోళ్లు బద్దలుకొట్టే ఎండలో
నీ దరిచేరితే చల్లని ఊసులు చెప్తుంటావు
గుండెను చల్లబరుస్తావు!

మేము వదులుతున్న
విషవాయువులను పీల్చుకుని
అమృత జీవ వాయువులను
మా కోసం వదులుతుంటావు!
నువ్వు కదలవు
కాని మాలో బతుకు నింపి
కదిలిస్తుంటావు
నువ్వులేని మా జీవనం ఎండమావి!
తోడు నువ్వుంటే మా జీవనం అమృత కలశం!

- డా. మోపిదేవి విజయగోపాల్, సెల్: 9490679570

మాంగల్యం కట్టువేళ
మాంగల్యం కట్టువేళ మరచావా తొలి ప్రేమను
మధురమైన ఘట్టాలవి మరచావా తొలి ప్రేమను
మంచు పూల పుష్పాలను చేసితివా మన ప్రేమను
పంచుకొన్న ఊసులన్ని మరచావా తొలి ప్రేమను
మేఘాలలో నడిపించి మీనాక్షని ముద్దువెట్టి
హఠాత్తుగా మనువు కొఱకు మరచావా తొలి ప్రేమను
ఒక నిముషం గడుచుచుండ ప్రాణమ్మే పోయినట్లు
నీరుగారిపోతున్నా మరచావా తొలి ప్రేమను
సంపదలే నీకు మెరుపు సంస్కృతులే నాకు వలపు
జీవచ్ఛవమైతి నేను మరచావా తొలి ప్రేమను
ఈ ‘రమ’కిక ఏల శిక్ష! ఎందుకు ఈ విషమ పరీక్ష
కోమల హృదిపైన మోది మరచావా తొలిప్రేమను

- బి.హెచ్.వి.రమాదేవి
రాజమహేంద్రవరం, సెల్: 9441599321

గురువు
గురువంటే విలువల బరువు
గురువంటే శిష్యుల కల్పతరువు
గురువంటే మహోన్నత మేరువు
గురువంటే మధుర బోధల వేణువు
ఆది శంకురుని వారసుడు
రామకృష్ణుని అనుచరుడు
రాధాకృష్ణుని మార్గానే్వషకుడు
అబ్దుల్ కలాం ఆశయదీపకుడు
పతనవౌతున్న మానవీయ విలువల్ని
నిటారుగా నిలపాలని పరితపించే బోధకుడు
విజ్ఞానం విశ్వవ్యాప్తవౌతున్న జగాన
శిష్యుల ప్రగతికి మురిసిపోయే మానవుడు
జ్ఞానంతో వివేకాన్ని ఆలోచనలతో వివేచనను
సహనంతో శాంతికాముకతను
విజ్ఞానంతో విశ్వాభివృద్ధిని
మిశ్రమింపజేసి ఆనందించే మహాత్ముడు
జీతంతో జీవితాన్ని గడుపుతూ
నిత్యం శిష్యుల జ్ఞాపకాల్ని నెమరేస్తూ
బోధనావృత్తిలో సంతృప్తతను
అనుభవించే అసలైన అమృతమూర్తి
గురువన్న పదం అమూల్యం
గురువృత్తిలో జీవితం అజరామరం!

- మద్ది పుల్లారావు, చరవాణి: 9951287113

email: merupurjy@andhrabhoomi.net

ఈ శీర్షికకు కవితా, కథా సంపుటాలు ఏవైనా, ఇటీవల అచ్చయిన కొత్త పుస్తకాల సమీక్ష/ పరిచయం కోసం ఈ కింది చిరునామాకు పంపండి. కార్టూన్లు పంపించాలనుకుంటే, ఫొటో, చిరునామాతో ఈ -మెయిల్ అడ్రస్‌కు పంపించండి

మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, నేషనల్ హైవే, ధవళేశ్వరం, తూ.గో.జిల్లా. email: merupurjy@andhrabhoomi.net

- నల్లపాటి సురేంద్ర