రంగారెడ్డి

హామీలు నెరవేర్చరా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వికారాబాద్, మే 26: దేశంలో అతి పెద్ద అవినీతిపరుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని టీపీసీసీ ఉపాధ్యక్షుడు, మాజీ మంత్రి గడ్డం ప్రసాద్‌కుమార్ ఆరోపించారు. శనివారం జిల్లా కేంద్రంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మండల కాంగ్రెస్ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా ప్రసాద్‌కుమార్ మాట్లాడుతూ ఎక్కువ సమయం ఇవ్వకుండా సర్పంచ్ ఎన్నికలను ముగించాలని ప్రభుత్వం కుట్ర చేస్తోందని విమర్శించారు. సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ శ్రేణులు కష్టపడి పనిచేస్తే సాధారణ ఎన్నికలకు పునాది పడుతుందని సూచించారు. టీఆర్‌ఎస్ ఎన్నికలకు ముందు మెనిఫెస్టోలో పొందుపర్చిన హామీలు ఒక్కటైనా అమలు పర్చలేదని అందుకే టీఆర్‌ఎస్‌కు ఓటు వేయవద్దని ప్రజలకు చెప్పాలని స్పష్టం చేశారు. డబుల్ బెడ్‌రూం ఇళ్ళు మొదలు, మూడెకరాల భూమి, ఇంటికో ఉద్యోగం, మైనారిటి, గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్, లక్ష రూపాయల రుణమాఫీలో ఏ ఒక్కటి అమలు చేయలేదని ఎద్దేవా చేశారు. దేశంలో అబద్దాల సీఎం కేసీఆర్ ఒక్కరు మాత్రమేనని పేర్కొన్నారు. లక్ష రూపాయల రుణ మాఫీ ఎక్కడా జరగలేదని, జరిగిందల్లా కేవలం 50 నుండి 70 వేలు మాత్రమేనని మిగిలిన వాటికి బ్యాంకు వడ్డీ వేస్తోందని, రైతుపై భారం పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల కోసమే రైతుబంధు పేర డబ్బులను పంచారని, నాలుగు సంవత్సరాలుగా కేంద్రం నుండి రాబట్టిన 20 వేల కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీలో రైతులకు రైతుబంధులో పంచింది కేవలం నాలుగువేల కోట్ల రూపాయలు మాత్రమేనని వివరించారు. ఉపాధి హామీ పథకంలో కూలీలకు డబ్బులు ఇవ్వకుండా ఆ డబ్బులను దారి మళ్ళించి వాడుకోవడం సిగ్గుచేటన్నారు. 1.89 లక్షల కోట్ల అప్పులు చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని తెలిపారు. కమీషన్ వచ్చే మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, గొర్రెలు, గేదెల పంపిణీ పథకాలను చేపడుతున్నారు తప్ప కమీషన్ రాదనుకునే డబుల్ బెడ్‌రూం ఇళ్ళు, మూడెకరాల భూమి తదితర పథకాలను అమలు చేయడం లేదని విమర్శించారు. కేసీఆర్ చేస్తున్న అవినీతిని కళ్ళారా చూస్తున్నామని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కేసీఆర్ ఎన్ని పథకాలు ప్రవేశపెట్టినా ఓటుకు ఐదు వేల రూపాయలు ఇచ్చినా, బంగారం పంచినా ప్రజలు టీఆర్‌ఎస్‌కు ఓటు వేయబోరని చెప్పారు. సీఎంను కలిసే పరిస్థితి లేక ఖర్చులు భరించలేక మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం అవినీతికి పాల్పడుతున్నారని, అవినీతిలో కూరుకుపోయారని ఆరోపించారు. కొత్తవారికి పార్టీలో టికెట్ ఇచ్చే పరిస్థితి లేనందున టీఆర్‌ఎస్ ఓటమి ఖాయమని, ఎటుచూసినా కాంగ్రెస్‌కే విజయావకాశాలున్నాయని ధీమా వ్యక్తం చేశారు. లక్షలాది ఐఏవై ఇళ్ళు నిర్మించినట్లు కేంద్రానికి బిల్లులు సమర్పించి డబ్బులు తెచ్చుకున్న సీఎం కేసీఆర్‌పై విచారణ జరిగి జైలుకు వెళ్ళడం ఖాయమని పేర్కొన్నారు. రుణాలివ్వకుండా డ్వాక్రా సంఘాలను నిర్వీర్యం చేసిన పాపం టీఆర్‌ఎస్ ప్రభుత్వానిదేనని ధ్వజమెత్తారు. సీనియర్ సిటిజన్ కింద 60 ఏళ్ళు నిండిన వారందరికీ కేంద్రం పింఛన్ మంజూరు చేస్తుండగా, రాష్ట్రంలో 65 సంవత్సరాలు నిండినవారికి పింఛన్ ఇస్తూ పింఛన్ డబ్బులను దోచేస్తున్నారని, అభయహస్తం పింఛన్ నిలిపివేసారని, ఇంటికి ఒక్కరికే పింఛన్ ఇచ్చి అర్హులకు అన్యాయం చేస్తున్నారని వివరించారు. 65 ఏళ్ళ పేర 23 లక్షల మంది పింఛన్‌లను ప్రభుత్వం కాజేస్తోందని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులను దారి మళ్ళించడమే కాకుండా, ప్రజా వ్యతిరేక విధానాలను ప్రభుత్వం అవలంబిస్తోందని పేర్కొన్నారు. నాలుగేళ్ళుగా ఒక్క రూపాయి నిధులు లేని వికారాబాద్ పురపాలక సంఘంలోకి గ్రామాలను కలిపితే అభివృద్ధి ఎలా సాధ్యమని ప్రశ్నించారు. గ్రామాలను అభివృద్ధి చేసి పురపాలక సంఘంలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. బంగారు తెలంగాణ కావాలంటే ముందు మద్యం నిషేధించాలని, మద్యం అమ్ముకునే వచ్చిన ఆదాయంతో ప్రభుత్వాన్ని నడుపుతున్నారని ఎద్దేవా చేశారు. రైతుబంధుతో రియల్ ఎస్టేటర్లకు డబ్బులు వచ్చాయి తప్ప పేదోళ్ళకు న్యాయం జరగలేదని వాపోయారు. ఎల్‌డీఎంఆర్‌సీ ఓటరు మ్యాపింగ్ ద్వారా వేలాది మంది నాయకులను తయారు చేశామని, తటస్థంగా ఉన్నవారిని కాంగ్రెస్ వైపు మళ్ళిస్తామని అదే ఓటరు మ్యాపింగ్ అని వివరించారు. సమావేశానికి మండల పార్టీ అధ్యక్షుడు సీహెచ్ భాస్కర్ అధ్యక్షతన వహించగా, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కే.అనంత్‌రెడ్డి, డీసీసీ అధికార ప్రతినిధి జే.రత్నారెడ్డి, మండల సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు జాఫర్, పీరంపల్లి సర్పంచ్ గురువారెడ్డి, బీసీ సెల్ అధ్యక్షుడు వెంకటయ్యగౌడ్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు జంగయ్య, ఎస్టీ సెల్ అధ్యక్షుడు తౌర్యానాయక్, ఇతర నాయకులు పాల్గొన్నారు.