రంగారెడ్డి

ప్రజల శ్రేయస్సే ప్రభుత్వ ధ్యేయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాండూరు, జూన్ 4: రాష్ట్ర ప్రజల శ్రేయస్సు ధ్యేయంగా వారి ఆశలు తీర్చేలా టిఆర్‌ఎస్ ప్రభుత్వం పనిచేస్తున్నదని రవాణా శాఖ మంత్రి పి.మహేందర్‌రెడ్డి అన్నారు. మండలంలోని నారాయణపూర్‌లో కాగ్నానదిపై రూ.9.50 కోట్ల విలువతో నిర్మించనున్న వంతెన నిర్మాణానికి మంత్రి శంకుస్తాపన చేసారు. బంగారు తెలంగాణకు ప్రతిరూపంగా తాండూరు నియోజకవర్గాన్ని తీర్చిదిద్దడం నా ఆశయమని అన్నారు. రూ.500 కోట్లతో నియోజకవర్గ అభివృద్ధి కొనసాగుతుందన్నారు. తెలంగాణ -కర్నాటక మధ్య రవాణా సదుపాయం మెరుగు పరుస్తామని మంత్రి వివరించారు. రూ.10 కోట్లతో తాండూరులో తాగునీటి శాశ్వత పరిష్కారానికి కాగ్నా నదిలో మరో బావిని తవ్వడం, పంప్‌హౌస్ నిర్మాణ పనులు ప్రారంభించామన్నారు. నిరంతరం విద్యుత్ సరఫరా చేస్తున్న ఘనత ప్రభుత్వ అధినేత సిఎం కెసిఆర్‌కు దక్కుతుందని మంత్రి తెలిపారు. రైతులకు ఖరీఫ్‌కు విత్తనాలు, ఎరువులు సబ్సిడీపై పంపిణీ చేస్తామన్నారు.
నిజమైన పేదలకే
డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు నిజమైన పేదలకు మాత్రమే అందుతాయన్నారు. జిల్లా కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు, అధికారులు కసరత్తు ప్రారంభించారని మంత్రి వివరించారు. మధ్యదళారుల వద్దకు వెళ్లి మోసపోవద్దని మంత్రి అన్నారు. కార్యక్రమంలో ఎంపిపి లక్ష్మమ్మ, జడ్పీటిసి రవిగౌడ్ అధికారులు నేతలు పాల్గొన్నారు.
భారత్‌ను అగ్రభాగాన నిలిపేందుకు మోదీ కృషి
ఘట్‌కేసర్, జూన్ 4: భారతదేశాన్ని ప్రపంచదేశాలలో అగ్రరాజ్యంగా నిలిపేందుకు ప్రధాని మోదీ చేస్తున్న కృషి అమోఘమని తెలంగాణ బిజెపి అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్ అన్నారు. మండల పరిధి ఇస్మాయిల్‌ఖాన్‌గూడ గ్రామానికి చెందిన జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు అచ్చిన నర్సింహ్మ మండల బిజెపి అధ్యక్షుడు కంభం లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో డాక్టర్ లక్ష్మణ్ సమక్షంలో బిజెపిలో చేరారు. అన్ని రాష్ట్రాల అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వ నిధులే అధికంగా ఉన్నాయన్నారు. బిజెపి ప్రతిష్టతను మరింత పెంచి రానున్న రోజులలో తెలంగాణలో బలమైన ఏకైక పార్టీగా బిజెపిని నిలపాలని సూచించారు.
ప్రతి నాయకుడు, కార్యకర్తలు కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించి చైతన్య పర్చాలన్నారు. గతంలో బిజేపి పటిష్టతకు నిరంతరం కృషి చేసిన అచ్చిని నర్సింహ్మ మళ్లీ సొంత పార్టీలో చేరటం సంతోషకరమన్నారు.
అచ్చినితో పాటు మరో యాబై మంది నాయకులు, కార్యకర్తలు పార్టీలో చేరారు. రాష్ట్ర బిజెపి నాయకులు నానావత్ బిక్కునాయక్, రామోజీ, శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ కోసం జీవితాన్ని అంకితం చేసిన జయశంకర్
కెపిహెచ్‌బి కాలనీ, జూన్ 4: తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం తన జీవితాన్ని సైతం త్యాగం చేసిన మహనీయుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ అన్నారు. శనివారం ఆల్విన్‌కాలనీ డివిజన్ జలకన్య చౌరస్తావద్ద ఏర్పాటు చేసిన జయశంకర్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ చరిత్రలోనే అత్యంత ముఖ్య పాత్ర పోషించిన మహావ్యక్తి జయశంకర్ అని కొనియాడారు.
తెలంగాణ జాతికే ఆయన ఆదర్శప్రాయుడని, ఆయన జీవితాన్ని తెలంగాణ కోసమే అంకితం చేశారని గుర్తు చేశారు. జయశంకర్ లాంటి మహనీయులను ఆదర్శంగా తీసుకొని ముఖ్యమంత్రి కెసిఆర్ సారధ్యంలో బంగారు తెలంగాణ కలను సాకారం చేసుకుందామన్నారు.
కార్యక్రమంలో ఆల్విన్‌కాలనీ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్‌గౌడ్, బాలకృష్ణ, వాసుదేవరావు, శ్రీకాంత్, సంజీవరెడ్డి, రామకృష్ణ, ఆంజనేయులు, నరేందర్‌రెడ్డి, అస్లాం, సంపత్‌రెడ్డి, శివరాజ్, మల్లేష్ పాల్గొన్నారు.

విద్యార్థులు సమాజాన్ని అధ్యయనం చేయాలి
ఇబ్రహీంపట్నం, జూన్ 4: విద్యార్థులు సమాజాన్ని అధ్యయనం చేసి సమాజంలో పెరుగుతున్న అసమానతలు, రుగ్మతలకు వ్యతిరేకంగా పోరాడాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సూచించారు. భారత విద్యార్థి సమాఖ్య (ఎస్‌ఎఫ్‌ఐ) రాష్ట్ర వైజ్ఞానిక శిక్షణ తరగతులకు హాజరైన ఆయన విద్యార్థులు-రాజకీయాలు అనే అంశంపై నిర్వహించిన సదస్సులో ప్రసంగించారు. గ్రామాల్లో నేటికీ కులం, మతం పేరుతో దళితులపై అనేక దాడులు జరుగుతున్నాయన్నారు. బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ వంటి కొన్నిశక్తులు కులాలు, మతాల మధ్యన ఘర్షణలు సృష్టిస్తూ రాజకీయ పబ్బం గడుపుకుంటున్నాయని విమర్శించారు. కులమతాలకతీతంగా మనమంతా సమానమేనని ప్రతి ఒక్కరూ గ్రహించాలన్నారు. విద్యార్థులు పట్టాల కోసం చదువునభ్యసించకుండా సంస్కారాన్ని, సమాజానికి ఉపయోగపడే విధంగా చదువును అభ్యసించాలన్నారు. ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థులు సమాజంపై శాస్ర్తియ అవగాహనతో ఉండాలని, ప్రతి ఒక్కరూ అభ్యుదయవాదులుగా తయారు కావాలని సూచించారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఆర్భాటంగా జూన్ 2న ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించింది కానీ, రెండేళ్ళ పాలనలో సాధించింది మాత్రం శూన్యమేనని ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 99 శాతం హామీలు నెరవేర్చినట్లు ప్రభుత్వం చెప్పుకోవడం సిగ్గుచేటని దుయ్యబట్టారు. విద్య, వైద్యం, సామాజిక భద్రత, సంక్షేమాన్ని అందరికీ అందించాలని, హామీలు అమలుపర్చకుండా కాలం వెళ్ళదీస్తే ప్రభుత్వానికి ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు కోట రమేష్, గర్ల్స్ కన్వీనర్ రజనీ పాల్గొన్నారు.