రంగారెడ్డి

గుడిసెపైకి దూసుకెళ్లిన లారీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శేరిలింగంపల్లి, ఆగస్టు 1: ముంబయ జాతీయ రహదారిపై మదీనగూడ వద్ద ఓ లోడ్ లారీ బీభత్సం సృష్టించింది. గుడిసెపైకి దూసుకెళ్లడంతో గాఢనిద్రలో ఉన్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఆసుపత్రికి తీసుకెళ్లిన కొద్ది సేపటికే తండ్రి మరణించగా కొడుకు ప్రాణాపాయం నుంచి బతికి బయటపడ్డాడు. బతుకుదెరువు కోసం ఇక్కడికి వచ్చిన పది రోజులకే ఒకేసారి ముగ్గురు మృత్యువాత పడడంతో వారి కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఈ ఘోర దుర్ఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం తెల్లవారుఝామున జరిగింది. బాలానగర్ జోన్ డిసిపి సాయిశేఖర్, కూకట్‌పల్లి ఎసిపి భుజంగరావు సంఘటనా స్థలాన్ని సందర్శించారు. మియాపూర్ ఇన్‌స్పెక్టర్ రమేశ్ కొత్వాల్, ప్రత్యక్ష సాక్షి శ్రీనివాసరావుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా కపిలేశ్వరిపురం మండలం కొరుమిల్లి గ్రామస్తుడైన చీకట్ల కృష్ణ తన ఇద్దరు కొడుకులైన శ్రీనివాస్, సురేశ్, సమీప బంధువైన ఆదినారాయణతో కలిసి పది రోజుల క్రితం నగరానికి వచ్చారు. మదీనగూడ వద్ద రోడ్డు పక్కన గుడిసె వేసుకుని మొక్కలు, కుండీలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు. కాగా ఆదివారం యథావిధిగా రాత్రి అదే గుడిసెలో నిద్రపోగా సోమవారం తెల్లవారుఝామున నాలుగు గంటల సమయంలో లారీ (ఎటిటి 1517) గుడిసెలోకి దూసుకెళ్లింది. నిద్రిస్తున్న వ్యక్తులపై నుంచి కొంచెం ముందుకు వెళ్లి మట్టిలో దిగిపోయి ఆగింది. గాఢ నిద్రలో ఉన్న చీకట్ల శ్రీనివాస్ (30), వారి బంధువైన ఆదినారాయణ(30) అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. తండ్రీ కొడుకులైన చీకట్ల కృష్ణ (60), చీకట్ల సురేశ్ (25)కు తీవ్ర గాయాలయ్యాయి. పక్క గుడిసెలో నిద్రిస్తున్న శ్రీనివాసరావు ఆ భారీ శబ్దానికి లేచి చూసేసరికి మృతదేహాలు కనిపించాయి. సమీపంలోనే ఉన్న మియాపూర్ పోలీసులకు సమాచారం ఇవ్వగా ఇన్‌స్పెక్టర్ రమేశ్ హుటాహుటిన తన సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వెంటనే క్షతగాత్రులను చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ కొద్ది సేపటికే తండ్రి కృష్ణ మృతిచెందగా చిన్న కొడుకు సురేశ్ స్వల్ప గాయాలతో ప్రాణాపాయం నుంచి బయటపడి లుకుంటున్నాడని వైద్యులు తెలిపారు. డ్రైవర్ నిర్లక్ష్యంగా, అతి వేగంగా లారీని నడపడంతోనే ప్రమాదం జరిగిందని పోలీసులు చెప్పారు. ప్రమాదానికి కారకుడైన డ్రైవర్ షేక్ పాషాను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు తెలిసింది. బ్రేక్ ఫెయిల్ అయినందువల్లనే ఎడమ వైపునకు లాక్కెళ్లిందని డ్రైవర్ చెప్పినట్టు సమాచారం. మియాపూర్ ఇన్‌స్పెక్టర్ రమేశ్ కొత్వాల్ ఆధ్వర్యంలో కేసును ఎస్‌ఐ మహిపాల్‌రెడ్డి దర్యాప్తు జరుపుతున్నారు.

దొంగల ముఠా కోసం విస్తృత గాలింపు
ప్రత్యేక పోలీస్ బృందం ఏర్పాటు పోలీసుల అదుపులో మరో ఇద్దరు

పరిగి, ఆగస్టు 1: పరిగిలో అర్థరాత్రి పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులపై కాల్పులకు పాల్పడిన గుర్తుతెలియని వ్యక్తులను అంతర్ రాష్ట్ర దొంగల ముఠాగా పోలీసులు భావిస్తున్నారు. అంతర్ రాష్ట్ర దొంగల ముఠాను పట్టుకునేందుకు జిల్లా పోలీసు యంత్రాంగం ఓ ప్రత్యేక పోలీస్ బృందాన్ని ఏర్పాటు చేసినట్లు సమాచారం. దొంగల ముఠాను పట్టుకునేందుకు సిసిఎస్, స్పెషల్ క్రైం పోలీసు బృందాలు రంగంలో దిగినట్లు సమాచారం. ప్రత్యేక పోలీస్ బృందంలో పరిగి సిఐ ప్రసాద్, చేవేళ్ల సిఐ ఉపేందర్, మోమిన్‌పేట్ సిఐ రంగా ప్రధాన భూమిక పోషిస్తున్నారు. శుక్రవారం జరిగిన సంఘటనలో పట్టుబడిన గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు.. పోలీసులకు పొంతన లేని సమాధానం చెప్పినట్లు తెలిసింది. మరుసటి రోజు ముగ్గురు వ్యక్తుల నుంచి విడివిడిగా వచ్చిన సమాచారం మేరకు పోలీస్‌లు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. నలుగురిలో నుంచి పారిపోయిన వ్యక్తిని పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలు గాలింపు చర్యలు చేస్తున్నట్లు సమాచారం. గుల్‌బర్గా, కర్నాటక, మహరాష్టక్రు చెందినవారు అంతర్ రాష్ట్ర దొంగల ముఠాలో ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే అంతర్ రాష్ట్ర దొంగల ముఠా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో దొంగతనాలు చేసినట్లుగా పోలీసులు భావిస్తున్నట్లు సమాచారం. మొదటి రోజు ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న తరువాత మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం ఉన్నప్పటికీ పోలీసులు మాత్రం అధికారికంగా ప్రకటించలేదు.

ఇబిసిలకు
రాజకీయ ప్రాధాన్యత

రాజకీయ జెఎసి చైర్మన్,
ఆచార్య కోదండరాం డిమాండ్
నాచారం, ఆగస్టు 1: ఇబిసిలకు సమాజంలో సామాజిక, ఆర్థిక, రాజకీయ ప్రాధాన్యత కల్పించాలని రాజకీయ జెఎసి చైర్మన్, ఆచార్య కోదండరాం డిమాండ్ చేశారు. ఓయులో ఇబిసిలకు రాజకీయ ప్రాధాన్యత కల్పంచాలని కోరుతూ ఆర్ట్స్ కాలేజీ ఆవరణలో నిర్వహించిన ధర్నాకు ముఖ్యఅతిథిగా ఆచార్య కోదండరాం విచ్చేశారు. ఈ సందర్భంగా విలేఖరుల సమావేశంలో ఆచార్య కోదండరాం మాట్లాడుతూ అటు కేంద్రం, ఇటు రాష్ట్రంలో ఇబిసిలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించడంలో పార్టీలు , నేతలు విఫలమయ్యారని విమర్శించారు. సమాజంలో ఇబిసిల పట్ల సామాజిక, ఆర్థిక, రాజకీయ అసమానతలు తొలిగించేందుకు ప్రభుత్వాలు కృషి చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఇబిసి నాయకులు శ్రీనివాస్, రమేష్, కృష్ణ పాల్గొన్నారు.

ప్రధాని సభకు జన సమీకరణకు ఏర్పాట్లు
నేడు సమావేశం
హాజరు కానున్న పార్టీ పెద్దలు
తరలి రావాలని శ్రేణులకు పిలుపు
ఉప్పల్, ఆగస్టు 1: హైదరబాద్ ఎల్‌బి స్టేడియంలో జరిగే భారతీయ జనతా పార్టీ మహా సమ్మేళనంలో ప్రధాన హోదాలో మొట్ట మొదటి సారిగా హాజరవుతున్న నరేంద్ర మోదీకి ఘన స్వాగతం పలికేందుకు పార్టీ సిద్ధమవుతోంది. సమ్మేళనంలో లక్ష మందిని తరలించడానికి పార్టీ శ్రేణులు సమాయత్తమవుతున్నారు. ఈ క్రమంలో మహా సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని కోరుతూ ఈ నెల 2వ తేదీన మంగళవారం మధ్యాహ్నం 3-30గంటలకు ఉప్పల్ లక్ష్మారెడ్డికాలనీలోని లక్ష్మీ గార్డెన్‌లో నియోజకవర్గ స్థాయి సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు పార్టీ ఉప్పల్ సర్కిల్ కమిటీ పేర్కొంది. సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీనియర్ నేతలు గొరిగె కృష్ణ, యు.బలవంతచారి, చింతోజు శ్రీనివాసచారి, మంకాల లక్ష్మణ్, రావుల బాలకృష్ణ, పర్వేష్‌సింగ్, జి.శ్రీనివాస శర్మ, ఈగ శ్రీనివాస్, దేవసాని బాల్‌చందర్ విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ఉప్పల్, ఎల్‌బినగర్, మల్కాజిగిరి అసెంబ్లీ నియోజవర్గం స్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్, ఎమ్మెల్యే ఎన్‌విఎస్‌ఎస్ ప్రభాకర్, ఎంఎల్‌సి రాంచందర్‌రావు, జిల్లా తూర్పు విభాగం అధ్యక్షుడు మీసాల చంద్రయ్య, ఇతర నేతలు పాల్గొంటారని పేర్కొన్నారు. నియోజకవర్గం స్థాయి నుంచి అధిక సంఖ్యలో పాల్గొని సమావేశాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో బలోపేతమవుతోన్న బిజెపిని రానున్న కాలంలో అధికారాన్ని కైవసం చేసుకోవడానికి సైనికుల్లా పని చేయాలన్నారు.

రాష్ట్ర ప్రభుత్వంచే సమ్మె ఒప్పందాలు అమలు చేయించాలి

అంబేద్కర్ విగ్రహానికి
ఏఎన్‌ఎంల వినతి
వికారాబాద్, ఆగస్టు 1: రాష్ట్ర ప్రభుత్వంచే సమ్మె ఒప్పందాలు అమలు చేయించాలని రెండో ఏఎన్‌ఎంలు కోరారు. సమ్మె చేపట్టి 15 రోజులైనా ప్రభుత్వం స్పందించనందుకు నిరసనగా సోమవారం పట్టణంలోని రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. ఏఎన్‌ఎంల యూనియన్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లారుూస్ యూనియన్, సిఐటియు డివిజన్ నాయకురాలు సుజాత, స్నేహలత మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన రెండు సంవత్సరాల్లో నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు.
ధరల పెరుగుదలతో కాంట్రాక్టు ఉద్యోగులు చాలాచాలని జీతాలతో అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని వాపోయారు. ఏఎన్‌ఎంల పరిస్థితి ఆగమ్యగోచరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. జివో నెంబరు 14 ప్రకారం కనీసవేతనాలు రూ.21300 అమలు చేయాలని, ప్రమాదబీమా అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయాలని, ప్రభుత్వోద్యోగులుగా గుర్తించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, లేనియెడల సమ్మెను ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సిఐటియు డివిజన్ కార్యదర్శి ఆర్.మహిపాల్, ఏఎన్‌ఎంలు రైస, బేగం, సత్య, అన్నపూర్ణ, మాణిక్యమ్మ, నాగమణి పాల్గొన్నారు.

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా 7, 8న క్రీడా పోటీలు
విజేతలకు నగదు బహుమతి
యూత్ విభాగం వెల్లడి
ఉప్పల్, ఆగస్టు 1: యువత సన్మార్గంలో నడిపిస్తూ వారిలో నూతన చైతన్యం తీసుకురావడానికి బోడుప్పల్ పురపాలక సంఘం కాలనీ సంక్షేమ సంఘాల సమాఖ్య యూత్ విభాగం ముందుకు వచ్చింది. ప్రజల సమస్యల పరిష్కారంతో పాటు సమాజ సేవే లక్ష్యంగా నడుంబిగించింది.
యువతలో దాగివున్న సృజనాత్మక శక్తిని వెలికి తీయడానికి క్రీడా పోటీలను నిర్వహిస్తున్నట్లు యూత్ విభాగం చైర్మన్ బొమ్మక్ శివ, అధ్యక్షుడు కె.అశోక్‌గౌడ్, కార్యనిర్వాహక అధ్యక్షుడు తిరుపతి, ప్రధాన కార్యదర్శి ఇండ్ల రాజేష్ పేర్కొన్నారు. సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ 70వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఈ నెల ఆరు, ఏడవ తేదీలలో క్రీడా పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. క్రికెట్, కబడ్డీ, వాలీబాల్ క్రీడల్లో రెండు రోజుల పాటు నిర్వహించే పోటీలను సైబరాబాద్ అల్వాల్ డిసిపి రాంచంద్రారెడ్డి, మల్కాజిగిరి ఏసిపి రవిచంద్రన్‌రెడ్డి, ఇన్‌స్పెక్టర్ నవీన్‌రెడ్డి ప్రారంభిస్తారని పేర్కొన్నారు. పోటీల్లో విజేతలైన వారిలో క్రికెట్‌లో ప్రధమ బహుమతికి రూ. 15వేలు, ద్వితీయ బహుమతికి రూ.7500, కబడ్డీ, వాలీబాల్‌కు ప్రధమ బహుమతికి రూ.10వేలు, ద్వితీయ బహుమతికి రూ.5వేలు నగదు బహుమతి అందజేయనున్నట్లు వివరించారు. పురపాలక సంఘంలోని బోడుప్పల్, చెంగిచర్లలోని ఆసక్తి గల యువజన సంఘాలు, యువకుల్లో ఆసక్తి ఉంటే ఈ నెల ఐదవ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ పోటీలు వెంకట్‌రెడ్డినగర్‌లోని అమ్మసాని పద్మమ్మకు చెందిన ఖాళీ ప్రదేశం, యుపిఎస్ ఎదుట గ్రౌండ్‌లో జరుగుతాయని తెలిపారు. ఇతర వివరాల కోసం 8790851852, 9908999992, 905992240కు సంప్రదించాలని పేర్కొన్నారు. సమావేశంలో యూత్ విభాగం ఉపాధ్యక్షుడు సతీష్, క్రీడల కార్యదర్శి మహేష్, సాంస్కృతిక కార్యదర్శి రిచెర్డ్, కార్యదర్శి పరుశరామ్, కార్యనిర్వాహణ కార్యదర్శి దివాకర్‌రెడ్డి, సమాఖ్య చైర్మన్ రాపోలు రాములు, సలహాదారులు బొమ్మక్ రమేశ్, ప్రధానకార్యదర్శి పులకండ్ల జంగారెడ్డి, అశోక్‌రెడ్డి పాల్గొన్నారు.