రంగారెడ్డి

అభివృద్ధి పథంలో సిద్ధాపూర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తూరు, సెప్టెంబర్ 14: సిద్ధాపూర్ గ్రామం అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది. ఒకప్పుడు షాద్‌నగర్ నియోజకవర్గంలో మారుమూల గ్రామమై ఎవరికీ తెలియని సిద్ధాపూర్ నేడు సినీ నటుడు మహేష్‌బాబు రాకతో దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. సినీ నటుడు మహేష్‌బాబు సిద్దాపూర్ గ్రామాన్ని దత్తత తీసుకున్న తరువాత ఆయన సతీమణి నమ్రత శిరోద్కర్ పర్యవేక్షణలో గ్రామం అభివృద్ధి దిశగా పరుగులు తీస్తోంది. షాద్‌నగర్ నియోజకవర్గంలోని కొత్తూరు మండలం సిద్ధాపూర్ గ్రామాన్ని 2015 సెప్టెంబర్ 28న సినీనటుడు మహేష్‌బాబు దత్తత తీసుకున్నారు. అప్పటి నుంచి ప్రస్తుతం వరకు మహేష్‌బాబుకు చెందిన ప్రతినిధులు గ్రామంలో అభివృద్ధి పనులు చేపడుతున్నారు. ప్రస్తుతం మహేష్‌బాబు ట్రస్ట్ ఆధ్వర్యంలో గ్రామంలో వివిధ రకాల అభివృద్ధి పనులను చేపడుతున్నారు. సుమారు రూ.1కోటి 50లక్షల వ్యయంతో అత్యాధునిక సౌకర్యాలు, వసతులతో కూడిన పాఠశాల భవనాన్ని నిర్మిస్తున్నారు. ఈ పాఠశాల భవనం నియోజకవర్గంతో పాటు రంగారెడ్డి జిల్లాలోనే ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని గ్రామ సర్పంచ్ వడ్డె తులసమ్మ చెప్పుకొచ్చారు. సిద్ధాపూర్ గ్రామం 44వ జాతీయ రహదారి, కొత్తూరు మండల కేంద్రం నుంచి 14కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ గ్రామానికి చింతగట్టుతండా అనుబంధ గ్రామంగా ఉండి..దాదాపు 2,274మంది జనాభా, 1624 మంది ఓటర్లతో సుమారు 678కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. ఇప్పటికే సిద్ధాపూర్‌తో పాటు పంచాయతీ పరిధిలోని చింతగుట్టతండాలో రూ.6లక్షల వ్యయంతో రెండుచోట్ల బస్‌షెల్టర్లను ఏర్పాటు చేశారు. గ్రామ సమీపంలో సుమారు రూ.కోటి 50లక్షలతో నిర్మిస్తున్న పాఠశాల భవన నిర్మాణ పనులు తుదిదశకు చేరుకున్నాయి. రూ.20లక్షలతో ఇప్పటికే ప్రాథమికోన్నత పాఠశాల భవనాన్ని నిర్మించారు. గ్రామంలోని ప్రజలకు అన్ని రకాల వైద్యసదుపాయాలు అందించడానికి వీలుగా రూ.10లక్షల 80వేలతో ఆరోగ్య ఉపకేంద్రాన్ని నిర్మించారు. డాక్టర్లు ఎప్పటికప్పుడు ప్రజలు, పిల్లలకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. గ్రామంలో ఎక్కువ శాతం మంది ప్రజలు పాడి పరిశ్రమపై ఆధారపడి జీవిస్తుండటంతో పశువైద్యశాల నిర్మించాలనే గ్రామస్థుల అభ్యర్థన మేరకు రూ.13లక్షల వ్యయంతో పశువైద్యశాల భవనాన్ని నిర్మించారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల కోసం రూ.5లక్షలతో కంప్యూటర్ ల్యాబ్‌ను ఏర్పాటు చేశారు.