రంగారెడ్డి

పశువైద్య విద్యార్థులపై దాడి చేసిన టిఆర్‌ఎస్ నేతలను అరెస్ట్ చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వనస్థలిపురం, మే 26: వెటర్నరీ విద్యార్థులపై దాడికి పాల్పడిన టిఆర్‌ఎస్ నేతలతో పాటు, బాధ్యత వహిస్తూ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌పై కేసు నమోదు చేసి మంత్రి వర్గం నుండి తొలగించాలని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సర్వే సత్యనారాయణ డిమాండ్ చేశారు. టిఆర్‌ఎస్ కార్యకర్తల దాడిలో గాయపడ్డ విద్యార్థి దయాకర్‌ను శుక్రవారం ఎల్బీనగర్ ఆరెంజ్ ఆసుపత్రిలో చేర్పించారు. దయాకర్‌ను కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ, రాష్ట్ర మాజీ మంత్రి మంత్రి సబితా ఇంద్రారెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, ఎల్బీనగర్ మాజీ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు క్యామ మల్లేశం పరామర్శించారు. సర్వే సత్యనారాయణ, సబితారెడ్డి మాట్లాడుతూ నిరసన తెలిపుతున్న విద్యార్థుల పట్ల అమానుషంగా టిఆర్‌ఎస్ నేతలు దాడులకు పాల్పడటం దారుణమని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కేవలం నలుగురు వ్యక్తులకు మాత్రమే ఉద్యోగాలు వచ్చాయని, అవి కెసిఆర్ కుటుంబ సభ్యులకు మాత్రమేనని ఆరోపించారు.
విద్యార్థిని పరామార్శించిన కోదండరామ్, కిషన్‌రెడ్డి
టిఆర్‌ఎస్ నాయకుల చేతిలో గాయపడి ఎల్బీనగర్‌లోని ఆరెంజ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వెటర్నరీ పాలిటెక్నిక్ విద్యార్థి దయాకర్‌ను శుక్రవారం తెలంగాణ పొలిటికల్ జెఎసి కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరామ్, రాష్ట్ర బిజెపి శాసనసభా పక్షనాయకుడు జి.కిషన్ రెడ్డి, జస్టిస్ చంద్రకుమార్ పరమార్శించారు. రాష్ట్రంలో దొరల పాలన కొనసాగుతుందని ఆరోపించారు. ఖాళీగా ఉన్న వెటర్నరీ వైద్యుల ఉద్యోగాలను శాశ్వత ప్రాతిపదికన వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. దాడికి పాల్పడిన వారిని గుర్తించి చట్టపరమైన కేసులు నమోదు చేయించి, దయాకర్ వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షుడు కొప్పుల నర్సింహరెడ్డి పాల్గొన్నారు.

వేగంగా వెళ్లే వాహనాలపై దృష్టి
సైబరాబాద్ కమిషనర్ సందీప్ శాండిల్య
గచ్చిబౌలి, మే 26: ఔటర్ రింగ్ రోడ్డుపై నిబంధలకు విరుద్ధంగా ప్రయాణించే వాహలనాలపై దృష్టి సారించాలని సైబరాబాద్ పోలీసు కమిషనర్ సందీప్ శాండిల్య సూచించారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఒఆర్‌ఆర్ నానాక్‌రాంగూడ టోల్‌గేట్ వద్ద ఏర్పాటు చేసిన స్పీడ్ లేజర్‌గన్‌లను పరిశీలించారు. స్పీడ్‌గా వాహనాలు నడిపేవారిపై కఠినంగా వ్యవహరించాలని ట్రాఫిక్ అధికారులకు సూచించారు. పగలు రాత్రి తేడా లేకుండా తనిఖీలు నిర్వహించాలని సిబ్బందికి వివరించారు. వాహనాదారులను వేధించేవిధంగా కాకుండా ట్రాఫిక్ నిబంధలనలపై అవగహన కల్పించాలని పేర్కొన్నారు. జరిమానాల కంటే ప్రజల ప్రాణాలు ముఖ్యమని, ఔటర్‌పై ప్రమాదాలు జరగకుండా చూడాలని సిబ్బందికి సూచించారు. లేజర్‌గన్‌లు బ్రీత్ ఎనలైజర్లను పరిశీలించి అవి ఎలా పని చేస్తున్నాయో అడిగి తెలుసుకున్నారు. ట్రాఫిక్ డిసిపి ఎఆర్ శ్రీనివాస్, ఎసిపి పడాల అశోక్, మాదాపూర్ సిఐ నర్సింగ్‌రావు పాల్గొన్నారు.
క్వారీకుంటలో పడి యువకుడి మృతి
జీడిమెట్ల, మే 26: క్వారీ కుంటలో ఈతకని వెళ్లి ఓ యువకుడు మృతి చెందిన సంఘటన జగద్గిరిగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. గాజులరామారం, చంద్రగిరినగర్‌లో నివాసముండే ఓర్సు సాయిలు కుమారుడు యాదగిరి (18) కూలీ పనులు చేస్తుంటాడు. గురువారం ఇంట్లో నుండి యాదగిరి బయటికి వెళ్లాడు. స్నేహితుడు శివకుమార్‌తో కలిసి కైసర్‌నగర్ సర్వేనంబరు 342లోని క్వారీ కుంటలో ఈతకని వెళ్లారు. యాదగిరి కుంటలో దిగడంతో శివకుమార్ భయపడి పోలీసులకు సమాచారాన్ని అందించాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గజ ఈతగాళ్ల సహాయంతో యాదగిరి మృతదేహాన్ని వెలికితీశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
28న బిసి సమర శంఖారావం
ఆత్మగౌరవ పోరు : జాజుల గౌడ్ వెల్లడి
వనస్థలిపురం, మే 26: బిసిల ఆత్మగౌరవం కోసం నిర్వహించనున్న బిసిల సమరశంఖారావం బహిరంగసభను విజయవంతం చేయాలని బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు. ఈనెల 28న సాయంత్రం 4గంటలకు ఎల్బీనగర్ మినీ ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో ఏర్పాటు నిర్వహిస్తున్న సమరశంఖారావానికి సంబంధించిన ఏర్పాట్లను శుక్రవారం బిసి సంఘం నాయకలు పరిశీలించారు. విలేఖరుల సమావేశంలో శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ బిసిలకు రిజర్వేషన్‌లు పెంచాలని, బిసిల ఆత్మగౌరవం కోసం ఏర్పాటు చేసిన బహిరంగసభకు రాష్ట్రంలోని 31 జిల్లాల నుండి బిసి కుల సంఘాల నాయకులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారని వివరించారు. నిరుద్యోగ బిసి విద్యార్థులు అధికసంఖ్యలో హాజరవ్వాలని పిలుపు నిచ్చారు. సభకు ముఖ్యఅతిథులుగా కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్, బిసి సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న, టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, ఎంపి బూర నర్సయ్య గౌడ్, పొన్నాల లక్ష్మయ్య హాజరవుతారని వివరించారు. సమావేశంలో రాష్ట్ర బిసి సమాఖ్య అధ్యక్షుడు దుర్గయ్య గౌడ్, బిసి ఉద్యోగస్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఇ.నిరంజన్, ప్రధాన కార్యదర్శి లక్ష్మినారాయణ, బిసి సంఘం నాయకులు మహేష్ యాదవ్, కుంట్లూర్ వెంకటేష్ గౌడ్, రేపాక రాంబాబు, లక్ష్మణ్ గౌడ్, సుర్గి రాజు గౌడ్ పాల్గొన్నారు.

ప్రభుత్వాల నిరంకుశాన్ని చెప్పేందుకే ప్రజాగర్జన
వికారాబాద్, మే 26: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిరంకుశత్వాన్ని ప్రజలకు వివరించేందుకే జూన్ 1న సంగారెడ్డిలో కాంగ్రెస్ బహిరంగ సభను నిర్వహిస్తోందని మాజీ మంత్రి, నిజామాబాద్ ఇన్‌చార్జి గడ్డం ప్రసాద్‌కుమార్ తెలిపారు. శుక్రవారం సభకు జనం తరలింపు, ఏర్పాట్లపై నాయకులతో సమావేశమైన అనంతరం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ఏఐసిసి అధినేత రాహుల్‌గాంధీ హాజరయ్యే బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నియంతృత్వ ధోరణితో ప్రజల్లో విశ్వాసాన్ని కోల్పోతున్నాయని చెప్పారు. రెండు ప్రభుత్వాలూ హామీలను నిలబెట్టుకోలేకపోయాయని విమర్శించారు. దేశమంతటా జన్‌ధన్ ఖాతాలను తెరచి 15లక్షల రూపాయల నల్లధనాన్ని ఖాతాలో వేస్తామని చెప్పిన ప్రధాని మోదీ.. మూడేళ్ళయినా ఒక్క రూపాయి వేయలేదని దుయ్యబట్టారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మరచారని పేర్కొన్నారు. ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగా పెద్దనోట్లను రద్దు చేశారని వాపోయారు. ఇప్పటికీ ఎటిఎం, బ్యాంకుల్లో డబ్బులు లేకపోవడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో సిఎం కేసిఆర్ మెనిఫెస్టో హామీలను అమలు చేయడంలో విఫలమయ్యారనది ఎద్దేవా చేశారు. రుణమాఫీ ఏకకాలంలో చేస్తామని నాలుగు విడతలుగా చేయడంతో అసలు వడ్డీకే సరిపోవడంతో పాసుపుస్తకాలు రాక రైతులు అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పత్తి పంట సాగు చేయరాదని రైతులకు సూచించడంతో కంది, మిర్చి సాగు చేసిన రైతులకు ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించలేకపోయిందని, రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి నెలకొందని ధ్వజమెత్తారు. గిట్టుబాటు ధర కోసం ఖమ్మంలో ఆందోళన చేసిన రైతులకు బేడీలు వేయడం దారుణమని అన్నారు. ఏడాదికో లక్ష చొప్పున ఇంటింటికో ఉద్యోగం కల్పిస్తామన్న కేసిఆర్ ఊరికో ఉద్యోగం ఇవ్వలేకపోయారని చెప్పారు. దళితులకు మూడెకరాల భూమి, మైనారిటీలకు రిజర్వేషన్ ఎక్కడని ప్రశ్నించారు. దివంగత సిఎం వైఎస్‌ఆర్ కల్పించిన నాలుగు శాతం రిజర్వేషన్‌తో మైనారిటీలు లాభం జరగ్గా కేసిఆర్ 12 రిజర్వేషన్ పేర ఉన్న రిజర్వేషన్‌కు ఎసరు పెట్టేలా ఉన్నారని అన్నారు. తెలంగాణ తెచ్చించి, ఇచ్చింది కాంగ్రెసేనని, సుపరిపాలన కాంగ్రెస్‌కే సాధ్యమని చెప్పారు.
సమావేశంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎ.సుధాకర్‌రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కె.అనంత్‌రెడ్డి, జడ్పీటిసి రాములు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కృష్ణారెడ్డి, ధారూర్ మండల పార్టీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి, నాయకులు వహీద్, కృష్ణారెడ్డి పాల్గొన్నారు.

నామినేటెడ్ పదవుల్లో
ఆర్యవైశ్యులకు సముచిత స్థానం
సైదాబాద్, మే 26: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.. ఆర్యవైశ్యులకు నామినేటెడ్ పదవులల్లో సముచిత స్థానం కల్పించడం హర్షణీయమని తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణ అన్నారు. ఇప్పటికే ఇద్దరు సేవాతత్పరత కలిగిన ఆర్యవైశ్య నాయకులకు నామినేటెడ్ పదవులు కేటాయించిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు.. రానున్న రోజుల్లో మరికొందరికి అవకాశం కల్పించాలని కోరారు. శుక్రవారం ఐఎస్‌సదన్ డివిజన్ ఆర్‌టిసికాలనీలో ఆర్యవైశ్య మహాసభ నాయకులతో కలిసి విలేఖరుల సమావేశం ఏర్పాటు చేశారు. లక్ష్మీనారాయణ మాట్లాడుతూ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్, హ్యాండీక్రాఫ్ట్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బొల్లం సంపత్‌కుమార్‌కు ఈనెల 28న రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ తరుపున అభినందన సత్కారం నిర్వహిస్తున్నామని తెలిపారు. చంపాపేట సామ నర్సింహారెడ్డి గార్డెన్స్‌లో నిర్వహించే కార్యక్రమానికి శాసనమండలి చైర్మన్ కె.స్వామిగౌడ్, ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, ఈటెల రాజేందర్, టి.హరీష్‌రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, మహేందర్‌రెడ్డి, ఎంపి కవిత, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్, మేయర్ బొంతు రామ్మోహన్ ముఖ్యఅతిథులుగా పాల్గొంటారని తెలిపారు. సమావేశంలో టిఆర్‌ఎస్ నాయకులు కోట్ల శ్రీనివాస్, మహాసభ నాయకులు మిత్తింటి వెంకటేశ్వర్లు, కొండ్లె మల్లికార్జున్, రేణుకుంట్ల గణేష్‌గుప్త, చింతల రవికుమార్, ఆగీర్ వెంకటేష్ పాల్గొన్నారు.

అభివృద్ధి పథం మాది..
ఆరోపణల పర్వం విపక్షాలది
తాండూరు, మే 26: రాష్ట్రంలో తమ ప్రభుత్వ పాలన ప్రారంభం అయిన నాటి నుండి ప్రజలకు అన్ని విధాల ప్రయోజనం చేకూరుతుందని రవాణా శాఖ మంత్రి పట్నం ఉద్ఘాటించారు. శుక్రవారం తాండూరు మండలంలోని పలు గ్రామాలలో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేపట్టిన అనంతరం మంత్రి తాండూరులోని తమ నివాసానికి చేరుకుని మీడియాతో మాట్లాడారు. అభివృద్ధి పథం మాది.. ఆరోపణల పర్వం విపక్షాలది అని మంత్రి వ్యంగ్యంగా పేర్కొన్నారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం మూడేళ్ళ పాలనలోనే దేశంలోనే ఆదర్శవంతమైన పథకాలు రూపొందించి ప్రజలకు మేలు చేస్తుందని మిగతా రాష్ట్రాల పాలకులు అభినందిస్తుంటే, తెలంగాణలో కాంగ్రెస్, టిడిపి నాయకులకు చూపే మందగించి మాట్లాడుతున్నట్లుగా ఉందని మంత్రి ఎద్దేవా చేశారు. వేల కోట్ల రూపాయలు అభివృద్ధి చేయడాన్ని విపక్షాల నాయకులు జీర్ణించుకోలేక సభలు, సమావేశాలతో తప్పుడు ప్రచారం చేస్తున్నట్లు మంత్రి మండిపడ్డారు. కొత్తజిల్లాలకుభారీ స్థాయిలో నిధులు కేటాయిస్తున్నట్లు మంత్రి తెలిపారు. వికారాబాద్ జిల్లాలో తాండూరు అభివృద్ధికి నిధుల కేటాయింపులో అగ్రభాగం ఉందని అన్నారు. ఈ సంవత్సరం ఆఖరు నాటికి ఇంటింటికి తాగునీరు అందించటం తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పునరుద్ఘాటించారు.

బిజెపి శ్రేణుల సంబరాలు
మేడ్చల్, మే 26: మేడ్చల్‌లో బిజెపి శ్రేణులు శుక్రవారం సంబరాలు జరుపుకున్నారు. కేంద్రంలో నరేంద్ర మోదీ సర్కార్ పగ్గాలు చేపట్టి దిగ్విజయంగా మూడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా బిజెపి శ్రేణులు పట్టణంలోని అంబేద్కర్ విగ్రహాం వద్ద సంబరాలు జరుపుకుని స్వీట్స్ పంపిణీ చేసి విజయోత్సవ దినాన్ని నిర్వహించారు. పలువురు నాయకులు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం ఎలాంటి మచ్చ లేకుండా అవినీతి రహిత పాలనను మూడు సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసుకోవడం హర్షణీయమని అన్నారు. ఎన్నో సంస్కరణలు చేపట్టి ప్రపంచంలో మోదీ.. తానెంటో నిరూపించుకున్నారని, యావత్తు ప్రపంచం మోదీ పాలనదక్షతకు మంత్రముగ్ధులైందని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో ఇటు రాష్ట్రంలో అటూ కేంద్రంలో బిజెపి అధికారంలోకి రావడం ఖాయమని దీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు విక్రంరెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ అమరం మోహన్‌రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు జగన్‌గౌడ్, ఎంపిటిసి విష్ణువర్దన్‌రెడ్డి, నాయకులు దాత్రిక లక్ష్మణ్, ప్రభాకర్‌రెడ్డి, సర్వేశ్వర్‌రెడ్డి, అర్జున్, చీర్లరమేశ్, శ్రీరాములు, ప్రకాశ్, రమేశ్, నరేందర్‌చారి, నర్సింగ్‌రావు, ఆంజనేయులు, వంశీవంజరి, నవీన్, నాగేశ్, యాదగిరి, రాజు పాల్గొన్నారు.

హోటల్‌లో పేలిన గ్యాస్ సిలిండర్
కుషాయిగూడ, మే 26: ఒక్కసారిగా పేలుడు శబ్ధం రావడంతో ప్రజలు రోడ్డుపైకి పరుగులు తీశారు. కాప్రా ఎఎస్‌రావునగర్ ప్రధాన రోడ్డుపై అంత నిశబ్ధ వాతవరణం నెలకొంది. తీరా చూస్తే స్వాగత్ గ్రాండ్ హోటల్‌లో గ్యాస్ సిలిండర్ పేలి ముగ్గురు గాయపడ్డారు. ప్రత్యేక్ష సాక్షులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎఎస్‌రావునగర్ స్వాగత్ గ్రాండ్ హోటల్‌లో సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఒక్కసారిగా పేలుడు శబ్ధం రావడంతో హోటల్‌లోని వినియోగదారులు బయటకు పరుగులు తీశారు. వంట గదిలోని సిలిండర్ పేలిందని గుర్తించారు. సంఘటన స్థలానికి కుషాయిగూడ పోలీసులు చేరుకొని అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. హోటల్ వంట గదిలో పని చేస్తున్న వంశీ, పాండు, వెంకట్‌రెడ్డికి తీవ్రగాయలైనట్లు, వారిని ఇసిఐఎల్‌లోని జీనియ ఆసుపత్రికి తరలించినట్లు సిఐ వెంకటరమణ తెలిపారు. కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు. స్వాగత్ గ్రాండ్ హోటల్‌లో జరిగిన పేలుడుపై యజమాన్యం గోప్యత పాటించడంతో అనుమనలు కలుగుతున్నాయి. హోటల్ వంట గదిలో గ్యాస్ లీకేజీ కావడంతో తోటి వంట మనుషులకు మంటలు అట్టుకున్నట్లు మిగతావారు తెలిపారు. హోటల్ యజమాన్యం మాత్రం వంట మనుషులపైన వేడి నీళ్లు పడి తీవ్రమైన గాయలైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

తెలంగాణ కోసం కలం పట్టిన దాశరథి

హైదరాబాద్, మే 26: నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా కలంతో సాహిత్య పోరాటం చేసిన దాశరథిని అరెస్టు చేస్తే జైల్లో ఆళ్వార్‌స్వామితో కలిసి లాఠీదెబ్బలు తిని క్షోభపడుతున్న ప్రజల ఘోషకు సాహిత్యం ద్వారా సమాధానమిచ్చిన ‘చైతన్యశరధి దాశరథి’ అంటూ శుక్రవారం ఉదయం రవీంద్రభారతిలో నాట్యాచారిణి ఇందిర పరాశరం ప్రదర్శించిన నృత్యాభినయం ప్రేక్షకులను ఆకట్టుకుంది. పేదరికంలో జన్మించిన దాశరథి తెలంగాణ కోసం తన కలంతో సాహిత్య పోరాటం చేసారని, కదిలొచ్చిన కాలానికి ఎదిగొచ్చిన కవి దాశరథి కృష్ణమాచార్య అంటూ డిఎస్‌వి శాస్ర్తీ సంగీతానికి రమ్యంగా నృత్యం ప్రదర్శించారు. సాంస్కృతిక శాఖ సంచాలకులు ఎం.హరికృష్ణ అధ్యక్షతన, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని కళాకారులను అభినందించారు.
నృత్యంలో ‘అన్నదాత’
రైతు దేశానికి వెనె్నముక. సమాజానికి ఏలిక - గర్వంగా చెప్పుకునే సంస్కృతి సంపద వ్యవసాయం రైతు జీవితం అని ఇందిర పరాశరం ‘అన్నదాత’ నృత్య నాటకాన్ని శుక్రవారం రవీంద్రభారతిలో ప్రదర్శించారు. పండుగలు, వేడుకలు, కట్టుబొట్టు, ఆచారాలు, సంప్రదాయాలు పాటలు అన్నీ వ్యవసాయం నుండే అల్లుకొని వ్యాపించినవే అని నందిని సిధారెడ్డి రాసిన కావ్యానికి కళాకారులు నృత్యం చేసారు. కళాకారులను ప్రభుత్వ సలహాదారు కెవి రమణాచారి, సిఎం కార్యాలయ ఓఎస్‌డి దేశపతి శ్రీనివాస్, ఎమ్మెల్సీ సుధాకర్‌రెడ్డి, సాంస్కృతిక శాఖ సంచాలకులు ఎం.హరికృష్ణ అభినందించారు.

తాండూరులో ఆకస్మిక తనిఖీలు
తాండూరు, మే 26: తాండూరు మున్సిపాలిటీ పరిధిలో గత రెండున్నర ఏళ్ళ కాలం నుంచి కొనసాగుతున్న అక్రమ నిర్మాణాలు, మున్సిపల్ స్థలాలు, రహదారుల ఆక్రమణలతోపాటు పలు వివాదాస్పద అంశాలపై శుక్రవారం రీజినల్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఆర్డీ ఎంఎ అనురాధ దృష్టి సారించారు. ఈమేరకు తాండూరులో అకస్మిక తనిఖీలు నిర్వహించారు. పట్టణంలో కొనసాగుతున్న అక్రమ నిర్మాణాలు, పలు కాలనీలలో మున్సిపల్ అంతర్గత రోడ్లను దురాక్రమించి కొందరు బడాబాబులు, రాజకీయ దళారులు యథేచ్ఛగా నిర్మాణాలు చేపడుతున్న వైనం పట్ల ఆయా కాలనీలకు చెందిన పలువురు యువకులు లోకాయుక్తకు, మరికొందరు కోర్టులను ఆశ్రయించి ఫిర్యాదులు చేసినట్లు సమాచారం. కాగా, ఆయా ఫిర్యాదుల నేపథ్యంలో మున్సిపల్ ఆర్డీ అనురాధ విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. లోకాయుక్తకు అందిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టామన్నారు. కాగా, ఆర్డీ అనురాధ.. అంతకుముందు పట్టణంలో అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నట్లు ఫిర్యాదులు అందిన పలు కాలనీలలో మున్సిపల్ టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్ అధికారులు ఎర్షాద్, జిషాన్, మున్సిపల్ డి. ఈ, సత్యనారాయణ, ఎ. ఇ, శ్రీనివాస్‌లతో కలిసి అక్రమ నిర్మాణాలను పరిశీలించారు. కాగా, పట్టణంలో టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు తమ విధులను సక్రమంగా నిర్వహించటం లేదన్న అసంతృప్తిని ఆర్డీ అనురాధ వ్యక్తం చేశారు.

ప్రతి నెల శాంతి సంఘ సమావేశం
* రంజాన్ ఉపవాసాల
సందర్భంగా రాత్రి 12.30 వరకు దుకాణాలు
* ఎస్పీ అన్నపూర్ణ వెల్లడి
వికారాబాద్, మే 26: శాంతి సంఘం సమావేశాలు చాలా సంవత్సరాలుగా ఆనవాయితీగా నిర్వహిస్తున్నారని వికారాబాద్ జిల్లా ఎస్పీ టి.అన్నపూర్ణ అన్నారు. శుక్రవారం స్థానిక కొండా బాలకిష్టారెడ్డి ఫంక్షన్ హాలులో ఏర్పాటు చేసిన వికారాబాద్ సబ్‌డివిజన్ శాంతి సంఘ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముస్లింల కోరిక మేరకు రంజాన్ ఉపవాస దీక్షల సందర్భంగా అర్థరాత్రి 12.30 గంటల వరకు దుకాణాలు, హోటళ్లు తెరుచుకునేందుకు మినహాయింపు ఇస్తున్నట్లు చెప్పారు. ప్రతి నెలా శాంతి సంఘం సమావేశం నిర్వహించి ఎక్కడైనా సమస్యలుంటే పరిష్కరిస్తామని తెలిపారు. సమావేశమే కాకుండా వాక్, రన్, దుప్పట్లు పంచడం లాంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. అన్ని మతాలవారు సోదరభావం కలిగి ఉంటే ఈప్రాంతం చక్కగా ఉండటమే కాకుండా ఇక్కడ శాంతి నెలకొంటుందని సూచించారు. శాంతియుత వాతావరణం ఉంటే పోలీస్‌స్టేషన్‌కు వచ్చే అవసరమే ఉండదని అభిప్రాయపడ్డారు. శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసు బృందం కష్టపడుతుందని అన్నారు.