రంగారెడ్డి

ముసారాంబాగ్‌ను దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సైదాబాద్, జనవరి 19: మలక్‌పేట నియోజకవర్గ పరిధిలోని ముసారాంబాగ్ డివిజన్‌ను దత్తత తీసుకొని సమగ్రాభివృద్ధి చేస్తానని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి కె.లక్ష్మారెడ్డి ప్రకటించారు. మంగళవారం ముసారాంబాగ్ టిఆర్‌ఎస్ అభ్యర్ధి తీగల సనరితారెడ్డితో కలిసి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణలోని పేద బలహీనవర్గాలకు ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా మెరుగైన వైద్య సహాయం అందేలా తగిన చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. హైదరాబాద్‌ను ముఖ్యమంత్రి కెసిఆర్ విశ్వనగరంగా తీర్చిదిద్దటానికి కృషి చేస్తున్నారన్నారు. నగరంలో అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికై ప్రభుత్వం ప్రత్యేక పథకాలు అమలు చేస్తుందన్నారు. బంగారు తెలంగాణ సాధనకు పాటుపడుతున్న టిఆర్‌ఎస్ పార్టీని గ్రేటర్ వాసులు ఆదరిస్తారని, గ్రేటర్ ఎన్నికల్లో తాము ఆశించిన దానికంటే ఎక్కువ స్థానాల్లో విజయం సాధిస్తామన్నారు.
ముసారాంబాగ్ డివిజన్‌లో విద్యావంతురాలైన అభ్యర్ధి తీగల సునరితారెడ్డి గెలుపొందటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ టికెట్ ఆశించి నామినేషన్ వేసిన టిఆర్‌ఎస్ మహిళా నాయకురాళ్ళు సుకన్య, జ్యోతి, అలివేలు, శ్రావణి మంత్రి జోక్యంతో నామినేషన్‌లను విత్‌డ్రా చేసుకొని పార్టీ అభ్యర్ధికి మద్దతు తెలిపారు. ఈసమావేశంలో టిఆర్‌ఎస్ నాయకులు దుగ్గు రఘు, విజయభాస్కర్‌రెడ్డి, డివిజన్ అధ్యక్షుడు దన్వంత్, రాధ తదితరులు పాల్గొన్నారు.
అవగాహనలేమితో మోదీపై విమర్శలు
హయత్‌నగర్, జనవరి 19: ప్రపంచ దేశాలకు ధీటుగా భారతదేశాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్న ప్రధాని నరేంద్రమోడిపై అవగాహణ లేని తెలంగాణ మంత్రి కేటిఆర్, ఎంపి కవిత ఆరోపణలు చేయడం హేయమైన చర్యని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, ఎన్‌ఎంయు గౌరవ అధ్యక్షుడు ఎ.శంకర్‌రెడ్డి ఆరోపించారు. ప్రధాని నరేంద్రమోదీపై చేసిన వాఖ్యలను నిరసిస్తూ మంగళవారం బిజెపి నేతలు గాయత్రినగర్ చౌరస్తాలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అయోధ్యలో రామాలయాన్ని నిర్మించామని, తెలియకపోతే కేటిఆర్, కవిత వెళ్లి చూడాలని అన్నారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం 50వేల కోట్లను విడుదల చేసిందని గుర్తుచేశారు. మతోన్మాద ఎంఐఎంతో పొత్తు పెట్టుకుని గ్రేటర్‌లో మేయర్ పీఠాన్ని చేజిక్కించుకునేందుకు ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని మండిపడ్డారు. టిఆర్‌ఎస్ ఎన్ని కుట్రలు చేసినా.. మేయర్ పీఠాన్ని బిజెపి-టిడిపి మిత్రపక్షాలు కైవసం చేసుకోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. మల్లారెడ్డి, పెత్తుల పుల్లారెడ్డి, సోమేశ్వర్, భాస్కర్‌రెడ్డి, స్తూల ఫ్రభాకర్, జగన్, మహేందర్‌రెడ్డి, నరేందర్‌గౌడ్, శంకర్‌రెడ్డి పాల్గొన్నారు.

హెచ్‌సియూలో విద్యార్థులపై సస్పెన్షన్ ఎత్తివేయాలి: జగన్
ఉప్పల్, జనవరి 19: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఆత్మహత్య చేసుకున్న పిహెచ్‌డి విద్యార్థి రోహిత్ కుటుంబానికి అండగా ఉంటానని వైకాప అధ్యక్షుడు వైఎస్ జగన్ అన్నారు. మంగళవారం సాయంత్రం ఉప్పల్ ఎస్‌బిహెచ్ కాలనీలో నివసిస్తున్న సోదరుడు రాజా ఇంటికి వెళ్లి తల్లి రాధిక, ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించారు. రోహిత్ మృతికి గల కారణాలను తెలుసుకున్నారు. జగన్‌ను చూసి బోరున విలపిస్తూ తల్లి రాధిక కన్నీరుమున్నీరయ్యారు. కుమారుడు రోహిత్ ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని, మృతికి యూనివర్సిటీ వైస్‌చాన్సలరే కారణమని ఆందోళన వ్యక్తం చేశారు. కూలీ నాలీ చేసి కుమారుడిని చదివించానని, ఉన్నత స్థాయిలో చూడాలనుకుంటే దారుణం జరిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రెండో కుమారుడిని ఇక చదివించనని, ఇలాంటి చదువులు మాకొద్దని రోదిస్తూ వాపోయింది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. రాజకీయ ఒత్తిడీలతో విద్యార్థులను సస్పెండ్ చేశారని పేర్కొన్నారు. మానవతా దృక్పధంతో విద్యార్థులపై సస్పెన్షన్ ఎత్తివేయాయాలని డిమాండ్ చేశారు. ఉజ్వల భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన విశ్వవిద్యాలయంలో ఇలాంటి సంఘటనలు చోటుచేసుకోవడం విచారకరమని చెప్పారు.
ఘటనపై యూనివర్సిటీకి వెళ్లి విద్యార్థులతో సమావేశమై వివరాలను తెలుసుకుంటానని పేర్కొన్నారు. జగన్ వెంట వైకాప నేతలు పుత్త ప్రతాప్‌రెడ్డి, పంగ యాదగిరిరెడ్డి ఉన్నారు. జగన్ రావడంతో స్థానిక పోలీసులు భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. జగన్‌ను చూడటానికి స్థానిక ప్రజలు తరలిరావడంతో కాలనీ సందడిగా మారింది.

టిఆర్‌ఎస్ గెలుపును అడ్డుకోలేరు: పట్నం

రాజేంద్రనగర్, జనవరి 19: గ్రేటర్ ఎన్నికల్లో టిఆర్‌ఎస్ గెలుపును అడ్డుకోవడం ఎవరి తరం కాదని, మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవడం తథ్యమని మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి అన్నారు. మంగళవారం మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ పరిధిలోని పద్మశాలిపురం, లక్ష్మిగూడ, రాజీవ్ గృహకల్ప, బాబుల్‌రెడ్డినగర్, మైలార్‌దేవ్‌పల్లి బస్తీల్లో విస్తృతంగా పర్యటిస్తూ టిఆర్‌ఎస్ కార్యాలయాలను ప్రారంభించారు. పేద ప్రజల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసిఆర్ అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రవేశపెట్టారని, వాటిని మరింత పకడ్బందీగా అమలు చేయాలంటే గ్రేటర్‌లో టిఆర్‌ఎస్ అధికారంలోకి వస్తేనే సాధ్యమవుతుందని అన్నారు. మైలార్‌దేవ్‌పల్లి డివిజన్‌లో విద్యావంతులైన తోకల శ్రీనివాస్‌రెడ్డిని గెలిపిస్తే డివిజన్‌ను అన్ని రంగాల్లో సశ్యశ్యామలంగా అభివృద్ధి చెందుతుందని వెల్లడించారు. రాజేంద్రనగర్ నియోజకవర్గం ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉండడంతో అభివృద్ధి కుంటుపడిపోయిందని, అధికార పక్షం ప్రజా ప్రతినిధి ఉంటే అన్ని రంగాల్లో అభివృద్ధి శరవేగంగా జరుగుతుందని చెప్పారు. శ్రీనివాస్‌రెడ్డి.. అమెరికాలో ఉన్నత చదువులు చదివి ఎన్నికల్లో పోటీచేయడం హర్షించదగ్గ విషయమని, ప్రజలు ఎన్నుకొని డివిజన్ అభివృద్ధికి తోడ్పడాలని కోరారు.
కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ పట్నం నరేందర్‌రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే, ఎన్నికల ఇంచార్జ్ కాలె యాదయ్య, రాజేంద్రనగర్ టిఆర్‌ఎస్ ఇన్‌చార్జి స్వర్ణలతా భీమార్జున్‌రెడ్డి, సర్కిల్ జాగృతి కన్వీనర్, మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ అభ్యర్థి తోకల శ్రీనివాస్‌రెడ్డి, చల్ల మాధవరెడ్డి, శీలం తిరుపతిరెడ్డి, చెన్‌రెడ్డి బుచ్చిరెడ్డి, సీతారాం మహిపాల్, టి.శ్రీనివాస్‌రెడ్డి, తలారి అశోక్, అక్కెం కృష్ణయాదవ్, పాండురంగారెడ్డి, కృష్ణారెడ్డి, అడికె మహేందర్, శీలం శ్రీరాములు ఉన్నారు.

కాంట్రాక్ట్ పెళ్లికి యత్నం
సోమాలియన్ సహా ముగ్గురి అరెస్టు
సైదాబాద్, జనవరి 19: పాతబస్తీలో కాంట్రాక్టు వివాహాన్ని పోలీసులు భగ్నం చేశారు. పేదరికాన్ని ఆసరాగా చేసుకుని ఒక యువతిని కాంట్రాక్ట్ పెళ్లి చేసుకోవడానికి యత్నించిన సోమాలియన్ దేశస్థుడిని, ఇద్దరు బ్రోకర్లను మాదన్నపేట పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సోమాలియా దేశానికి చెందిన ఇస్మాయిల్ 20 సంవత్సరాల క్రితం నగర యువతిని వివాహం చేసుకొని టోలిచౌక్‌లో నివసిస్తూ దుస్తువుల వ్యాపారం చేస్తున్నాడు. అదే దేశానికి చెందిన అలీమహ్మద్(56) కాంట్రాక్ట్ వివాహం చేసుకునేందుకు ఇస్మాయిల్‌ను సంప్రదించాడు. అతన్ని మాదన్నపేట రాంచంద్రానగర్‌లో నివాసం ఉండే అన్వీ అనే మహిళ ద్వారా తలాబ్‌కట్టకు చెందిన 19సంవత్సరాల యువతితో వివాహం చేయించేందుకు బేరం కుదుర్చుకున్నారు.
ఈక్రమంలో అలీఅహ్మద్, మధ్యవర్తులు ఇస్మాయిల్, అన్వితో మాదన్నపేటలో వివాహ విషయమై మాట్లాడుకుంటున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఇంటిపై దాడిచేసిన మాదన్నపేట పోలీసులు.. పెళ్లికొడుకు అలీఅహ్మద్, బ్రోకర్లు ఇస్మాయిల్, అన్వీని అరెస్టు చేశారు.
ఎన్నికల తనిఖీల్లో
పట్టుబడ్డ రూ.77 లక్షలు
రాజేంద్రనగర్, జనవరి 19: గ్రేటర్ ఎన్నికల తనిఖీల్లో భాగంగా ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీలు రాజేంద్రనగర్‌లో ముమ్మరం చేశారు. మంగళవారం అత్తాపూర్ చౌరస్తాలో ప్రైవేట్ బ్యాంకులో జమ చేయడానికి తీసుకువెళ్తున్న రూ.77 లక్షల నగదు ఉన్న కారును పోలీసులు తనిఖీలో పట్టుకున్నారు. కారులో ఉన్న రూ.77 లక్షలకు ఎలాంటి ఆధారాలు చూపకపోవడంతో డబ్బును, ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారిని రాజేంద్రనగర్ పోలీసులకు అప్పగించారు. పోలీసులు వెరిఫికేషన్ చేసి ఇండియా, కరూర్ వైశ్యబ్యాంక్, కొటక్ మహేంద్రబ్యాంక్‌లకు సంబంధించిన డబ్బులు అని తేల్చారు. ఈ డబ్బులను ఆయా ఏటిఎం మిషన్‌లలో నింపడానికి తీసుకెళ్తున్నామని నిందితులు తెలిపినట్లు సిఐ ఉమేందర్ తెలిపారు. బ్యాంకులకు సంబంధించిన ఎలాంటి ఆధారాలు రాలేదని, ఆధారాలు వచ్చాక అది నిజమైతే వదిలిపెడతామని వివరించారు.

ఇటుకబట్టీలో బాలిక మృతి
ఇబ్రహీంపట్నం, జనవరి 19: పొట్ట చేతపట్టుకొని కూలి పనికోసం రాష్ట్రాన్ని దాటివస్తున్న ఒరిస్సా కార్మికుల జీవితాలు మరింత దుర్భరంగా మారుతున్నాయి. పనిచేసినన్నాళ్ళు జీతాలిచ్చి పోషిస్తున్న యాజమాన్యాలు వారు ప్రమాదవశాత్తూ మరణిస్తే ఈ విషయాన్ని బయటికి పొక్కకుండా జాగ్రత్త పడుతున్నాయి. తాజాగా జరిగిన ఓ ఉదంతం ఇందుకు నిదర్శనం. వివరాల్లోకి వెళితే ఇబ్రహీంపట్నం నియోజకవర్గ పరిధిలోని యాచారం మండల పరిధిలోని ధర్మన్నగూడ- చింతుల్ల గ్రామాల సరిహద్దులో ఉన్న ఓ ఇటుక బట్టీలో ఒరిస్సా రాష్ట్రం బానాజీ జిల్లా షికిలి గ్రామానికి చెందిన మాజద్‌కుమార్, పద్మ కార్మికులుగా పనిచేస్తున్నారు. వారి కుమార్తె నందిని (03) సోమవారం రోజున తల్లిదండ్రులు పనులలో నిమగ్నమయి ఉండగా ఇటుక తయారీకి ఉపయోగించే మట్టిని త్రవ్విన గోతిలో ఆడుకుంటూ వెళ్ళి పడిపోయి మృతి చెందింది. దీనిని గ్రహించిన యాజమాన్యం మాజద్‌కుమార్, పద్మలను భయపెట్టి చిన్నారికి అక్కడే అంత్యక్రియలు జరిపించారు. తదనంతరం యాజమాన్యంపై చిన్నారి తల్లిదండ్రులు యాచారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది. యాచారం సిఐ మదన్మోహన్‌రెడ్డి, ఎస్సై రవీందర్, శివకుమార్, ఎఎస్‌ఐ జగన్మోహన్‌రెడ్డి మంగళవారం సంఘటనాస్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.

సాంకేతిక పరికరాలతో ప్రమాదాల నివారణ
వికారాబాద్, జనవరి 19: రాష్ట్రంలోని జాతీయ రహదారుల్లో ప్రమాదాల నివారణకు సాంకేతిక పరికరాలను వినియోగిస్తున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి డాక్టర్ పి.మహేందర్‌రెడ్డి వెల్లడించారు. మంగళవారం స్థానిక సత్యభారతి ఫంక్షన్‌హాలులో ఏర్పాటుచేసిన జిల్లా పోలీసుశాఖ రోడ్డు భద్రతా వారోత్సవాల ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి ఏటా రోడ్డు ప్రమాదాల్లో ఎనిమిది వేలమంది ప్రాణాలు కోల్పోతున్నారని చెప్పారు. రోడ్డు ప్రమాదాల్లో 75 శాతం గాయాలతో మృత్యువాత పడుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలోని 10 జాతీయ రహదారులపై 71 చోట్ల ప్రమాద స్థలాలుగా గుర్తించబడ్డాయని తెలిపారు. ఈప్రాంతాల్లో ప్రమాదాల నివారణకు వాహనదారులకు అవగాహన కలిగించడంతో పాటు హెచ్చరిక సూచిక బోర్డులను ఏర్పాటు చేయిస్తామని అన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రభుత్వంతో పాటు వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. ద్విచక్రవాహనదారులు హెల్మెట్, కార్లు నడిపేవారు సీట్ బెల్ట్ తప్పక వాడాలని స్పష్టం చేశారు. మద్యం సేవించి వాహనాలు నడపకుండా జాగ్రత్తలు పాటించాలని వివరించారు. రోడ్డు ప్రమాద విషయాలను ఎప్పటికపుడు పర్యవేక్షించేందుకు జిల్లాలో రోడ్డు భద్రత కమిటీలను వేశామని చెప్పారు. జిల్లా ఎస్పీ రమారాజేశ్వరి మాట్లాడుతూ రోడ్డు భద్రత పట్ల ప్రజల్లో సంపూర్ణ అవగాహన కల్పించడమే పోలీసుల లక్ష్యమని అన్నారు. అంతకు ముందు నిర్వహించిన రోడ్డు భద్రత ర్యాలీని మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో వికారాబాద్ ఎమ్మెల్యే బి.సంజీవరావు, మున్సిపల్ చైర్మన్, వైస్‌చైర్మన్‌లు వి.సత్యనారాయణ, హెచ్.సురేష్, ఎంపిపి ఎస్.్భగ్యలక్ష్మి, జడ్పిటిసి ముత్తహర్‌షరీఫ్, జిల్లా అదనపు ఎస్పీ ఎన్.వెంకటస్వామి, డిఎస్పీ టి.స్వామి, వికారాబాద్ సిఐ జి.రవి, వివిధ కళాశాలల విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు.