రంగారెడ్డి

ప్రతి నియమం మన బంగారు భవిష్యత్తుకే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎల్‌బినగర్, జనవరి 31: రోడ్డు ప్రమాదాలను అదుపు చేయడంలో రవాణా, ట్రాఫిక్, పోలీస్‌శాఖలు ప్రవేశపెట్టే ప్రతి నియమ నిబంధనలు మన జీవితాలు నిండు నూరేళ్లు సాగాలని, బంగారు భవిష్యత్తును పొందడం కోసమేనని రాష్ట్ర హోం, రవాణా శాఖ మంత్రులు నాయినినర్సింహ్మారెడ్డి, పట్నం మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. రాచకొండ పోలీస్ కమీషనరేట్ ఎల్‌బినగర్ డిసిపి తఫ్వీర్ ఇక్బాల్ ఆధ్వర్యంలో సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో మంగళవారం ‘యాక్సిడెంట్ ఫ్రీ డే’ రోడ్డు భద్రతా అవగాహన సదస్సును ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహ్మరెడ్డి, పట్నం మహేందర్‌రెడ్డి, తెలంగాణ డిజిపి అనురాగ్‌శర్మ, రోడ్డు సేఫ్టీ డిజిపి టి.కృష్ణప్రసాద్, రాచకొండ సిపి మహేశ్ మురళీధర్ భగవత్, విశిష్ట అతిథులుగా ప్రముఖ సినీ నటులు కోట శ్రీనివాసరావు, బాబుమోహన్ విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రోడ్డు భద్రత పట్ల నిర్వహించిన పలు ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. అనంతరం మంత్రులు మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయి వారి కుటుంబ సభ్యులను శోకసంద్రంలోకి నెట్టారని అన్నారు. దేశంలో సంవత్సరానికి మొత్తం లక్షా 50వేల రోడ్డు ప్రమాదాలు, తెలంగాణలో 60రోడ్డు ప్రమాదాలు జరిగితే 20మంది దుర్మరణం పాలవుతున్నారని పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ప్రతి ఒక్కరు విధిగా హెల్మెట్ ధరించాలని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని, వేగం అదుపులో ఉంచుకోవాలని, ఫోన్‌లు మాట్లాడుతూ, సీట్ బెల్ట్‌లను పెట్టుకోకుండా వాహనాలు నడపరాదని సూచించారు. రోడ్డు భద్రతలో ఆయా శాఖల నియమ నిబంధనలను ప్రతి ఒక్కరు పాటించాలని, లేని యెడల కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. వాహనాలు నడిపే సమయంలో ఒక్కసారి మీపై ఎన్నో ఆశలు పెట్టుకున్న మీ కుటుంబ సభ్యులను దృష్టిలో పెట్టుకొని నడపాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు సంభవించకుండా ముఖ్యమంత్రి కేసిఆర్ మరిన్ని చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.
రోడ్డు భద్రతా నియమాలు తప్పక పాటించాలి: డిజిపి అనురాగ్‌శర్మ
రోడ్డు ప్రమాదాలను అదుపు చేసేందుకు హోం, రోడ్డు, ట్రాఫిక్ శాఖల నియమ నిబంధనలను ప్రతి ఒక్కరు పాటించాలని తెలంగాణ రాష్ట్ర డిజిపి అనురాగ్‌శర్మ సూచించారు. దేశం, రాష్ట్రాలలో రోడ్డు ప్రమాదాలు భారీగా సంభవిస్తున్నాయని, సరైన ట్రాఫిక్ నియమాలను పాటిస్తే ప్రమాదాలను అరికట్టవచ్చని అన్నారు. రోడ్డు భద్రతా నియమాలను పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అనుభవం లేని డ్రైవర్లు, సిగ్నల్ జంప్, రాంగ్ రూట్, మద్యంసేవించి నడపడం తదితర పొరపాట్లవల్ల రోడ్డు ప్రమాదాలు సంభవిస్తాయని, రోడ్డు ప్రమాదాల నివారణకు యువత నడుంబిగించాలని సూచించారు.
కన్నవారి కడుపుకోత
గుర్తించాలి: కోట శ్రీనివాసరావు
జీవితంలో ఎన్నో కష్టాలు పడుతూ మిమ్మల్ని కని పెంచే కన్న తల్లిదండ్రుల కడుపు కోతను ప్రతి ఒక్క యువకుడు, పిల్లలు గుర్తించాలని ప్రముఖ సినీ నటుడు కోట శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. కన్నవారు తమ కొడుకు ఎంతో ప్రయోజకుడు కావాలని, తనకు తాను దర్జాగా బ్రతకాలని కన్నకొడుకు విజయం కోసం ఆరు కాలం శ్రమిస్తే అర్థంతరంగా రోడ్డు ప్రమాదంలో మరణిస్తే కన్నవారికి ఎంత బాధగా ఉంటుందో తెలుసుకోవాలని అన్నారు. తన కుమారుడు రోడ్డు ప్రమాదంలోనే మరణించాడని, ఎన్ని ఉన్నా కన్న కొడుకు లేడన్న బాధ జీవితాంతం బాధపెడుతూనే ఉంటుందని ఆయన కన్నీటి పర్యంతమయ్యాడు. ప్రభుత్వాలు, వివిధ శాఖలు ప్రవేశపెట్టే ప్రతి నియమంను పాటించి నిండు జీవితాన్ని గడపాలని సూచించారు. హెల్మెట్లు, సీట్ బెల్ట్‌లు లేకుండా, సెల్‌ఫోన్‌లో సంభాషిస్తూ, రాంగ్‌రూట్‌లో వెళ్లి వాహనాలను నడపరాదని ముఖ్యంగా మద్యం సేవించి వాహనాలు నడపరాదని సూచించారు.
ఎంత నవ్వించానో..
అంత దుఃఖిస్తున్నా: బాబుమోహన్
జీవితంలో సహనటులు కోట శ్రీనివాస్‌రావు, బ్రహ్మానందం తదితరులతో కలిసి తెలుగు ప్రేక్షకులను ఎంత నవ్వించానో ఇప్పుడు కొడుకు రోడ్డు ప్రమాదంలో మరణించాడన్న బాధతో అంతగా దుఃఖిస్తున్నానని ప్రముఖ నటుడు, ఎమ్మెల్యే బాబుమోహన్ కంటపడి పెట్టారు. తాను 3వ తరగతి చదువుతున్నప్పుడే తన తల్లిని కోల్పోయానని, తల్లిని కోల్పోయిన తనను చేరదీసేవారు లేక తండ్రి హాస్టల్‌లో వేశాడని అన్నారు. ఆది నుండే ఉత్తమ విద్యార్థిగా ఉన్న తాను తల్లిని కోల్పోయానన్న బాధ ఉన్నప్పటికీ జీవితంలో ఎదగాలన్న తపనతో ఏమాత్రం ఏకాగ్రత కోల్పోకుండా పాఠశాలలు, కళాశాలల్లో కష్టపడి చదివానని అన్నారు. 120మంది రెవెన్యూ డిపార్ట్‌మెంట్ ఉద్యోగం కొరకు పోటీ పడగా అందులో 18మందిని ఎంపిక చేశారని, అందులో తాను కూడా ఒకడినని చెప్పారు. ఆ తర్వాత నటనపై ఇష్టంతో సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఎంతో కష్టపడి మంచి నటుడిని అయ్యానని ఆ తర్వాత 3సార్లు ఎమ్మెల్యే, క్యాబినేట్ మంత్రిగా పనిచేశానని, కృషి ఉంటే మనుషులు ఋషులవుతారని అన్నారు. రోడ్డు భద్రతా నియమాలు పాటించి నిండు జీవితాన్ని గడుపుతూ మిమ్మల్ని, మిమ్ము కన్నవారికి సంతోషాన్ని అందివ్వాలని సూచించారు.
అనంతరం మహేశ్వరం ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, రోడ్ సేఫ్టీ డిజిపి టి.కృష్ణప్రసాద్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రవేశపెట్టే ప్రతి నియమాన్ని విధిగా ప్రతి ఒక్కరు పాటించాలని సూచించారు.
మా బాధ మరే
కుటుంబానికి రావద్దు:బాధితులు
రోడ్డు ప్రమాదంలో అర్థాంతరంగా జీవితాన్ని చాలించి జీవితాంతం మాకు తీరని బాధను మిగిల్చారని, మా బాధ మరే కుటుంబానికి రావద్దని రోడ్డు ప్రమాదంలో మరణించిన వారి తల్లిదండ్రులు, భార్యలు కన్నీటి పర్యంతమయ్యారు. నా కొడుకు ఉన్నాడన్న ధీమాతో వాడిని చదివించి ఉన్నతుడిగా తీర్చిదిద్దాలని కష్టపడుతున్న సమయంలో రోడ్డు ప్రమాదంలో మరణించడం తీరని దుఃఖంగా నిలిచిపోయిందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. భర్త ఉన్నాడన్న ధైర్యంతో జీవనం సాగిస్తున్న సమయంలో అర్ధాంతరంగా రోడ్డు ప్రమాదంలో మరణించడంతో తాము తమ పిల్లలు ఏకాకులం అయ్యామని మరణించిన వారి భార్యలు బోరున విలపించారు. రోడ్డు భద్రతా నియమాలను ప్రతి ఒక్కరు తప్పకుండా పాటించి మీరే అని నమ్ముకున్నవారికి అండగా నిలవాలని, మేము పడుతున్న బాధలు మరే కుటుంబం పడకూడదని వారు బాధను వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ‘యాక్సిడెంట్ ఫ్రీ డే’ వాల్ పోస్టర్‌ను అతిథులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాచకొండ జాయింట్ సిపి టివి శశిధర్‌రెడ్డి, రెహమాన్, ఎసిపిలు వేణుగోపాల్‌రావు, వి.రవీందర్‌రెడ్డి, మల్లారెడ్డి, ట్రాఫిక్ ఎసిపిలు శ్యాంసుందర్‌రెడ్డి, శ్రీ్ధర్, కార్పొరేటర్ పి.అనితారెడ్డి, ఇన్‌స్పెక్టర్లు కాశీరెడ్డి, లింగయ్య, గురురాఘవేంద్ర, లక్ష్మీరంగ, మురళీకృష్ణ, ఎన్‌ఎన్‌ఎస్‌వి వెంకటేశ్వర్లు, కృష్ణకిశోర్, పి.లక్ష్మీకాంతారెడ్డి, రోడ్డు ప్రమాదంలో తమ పిల్లలు, భర్తలను కోల్పోయిన బాధితులు, వివిధ కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు.

కీసరగుట్ట జాతరకు సమన్వయం ఏదీ?
కీసర, జనవరి 31:కీసరగుట్ట మహాశివరాత్రి జాతర సమావేశానికి అన్ని రాజకీయ పార్టీలను ఆహ్వానించకపోవటం పట్ల కీసర మండల టిడిపి అధ్యక్షుడు సుంకరి వెంకటేశ్ ఆవేదన వ్యక్తం చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం కీసరగుట్ట మహాశివరాత్రి జాతర సమావేశాలకు అన్ని రాజకీయ పార్టీలను ఆహ్వానించేవారని అన్నారు. టిఆర్‌ఎస్ పాలనలో ఇతర రాజకీయ పార్టీలను అగౌరవపరిచే విధంగా జిల్లా కలెక్టర్ ఎంవి రెడ్డి, ఆలయ ఇఓ వెంకటేశ్, వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చేసేందుకు అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలు తీసుకుంటే భక్తులకు మరింత సేవ చేసిన వారవౌతామని అన్నారు. రెండోసారి జరిగే సమీక్షా సమావేశానికైనా అన్ని రాజకీయ పార్టీలకు సమాచారం ఇవ్వాలని కోరారు.