అమృత వర్షిణి
ఆయన నాకు ఏమవుతారు?
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
గురువుగారు లేకుండా అప్పుడే ఏడాది గడిచింది. ఇంటా బయటా ఏ సమస్య వచ్చినా గురువుగారికి చెప్పుకుంటే తీరిపోతుంది; ఏ చిక్కునైనా ఆయనే విప్పాలి; ముఖ్యమైన ఏ నిర్ణయమైనా ఆయనే చేయాలి; ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఒక ఫోన్ చేస్తే చాలు; అన్నిటికీ ఆయనే ఉన్నారు - అన్న భరోసాతో ఇన్నాళ్లూ ధీమాగా బతికేశాం.
ఆ లగ్జరీ ఇప్పుడు లేదు. ఆ ప్రివిలేజి మరి రాదు.
‘మాకైతే తేడా లేదు; ఆయన లేరన్న లోటే కనిపించటం లేదు; ఇప్పుడూ వెంటే ఉంటున్నారు; తలచుకోగానే బదులిస్తున్నారు; ఇదివరకు లాగే అన్నీ దగ్గరుండి జరిపిస్తున్నారు’ అంటున్నారు గురు పరివారంలోని కొందరు పుణ్యాత్ములు. ఆ మాటలు వింటే అసూయ కలుగుతున్నది. నాకైతే అంత పరిణతిలేదు; అంతటి అదృష్టమూ లేదు. ఆయన లేని లోటు నాకు కొట్టొచ్చినట్టు కనపడుతున్నది. ఆయన్ని నేను చాలా చాలా మిస్సవుతున్నాను. ఈ మాట ఒప్పుకోవడానికి నాకు ఎలాంటి సంకోచమూ లేదు.
ఇంతకీ సద్గురు శివానందమూర్తి గారు ఎవరు? నాకేమవుతారు? ఆయనతో నా అనుబంధం ఎలాంటిది? ఏనాటిది? ఎంతకాలం ఉంటుంది? నాకు తెలియదు. ఆయన దేవుడు అని చాలా మంది భక్తులకు ఉన్న ప్రగాఢ విశ్వాసం నాకు లేదు. ఎందుకంటే ఆయన నాకు తెలియడానికి ముందే నేను దేవుడి ప్రభావంలోకి వచ్చాను. ఇరవయ్యేళ్ల పైగా ఆయన సాన్నిహిత్య భాగ్యం అనుభవించినప్పుడూ ఆయన వేరు; దేవుడు వేరు అనే అనుకున్నాను. అలా అనుకోమనే ఆయన చెప్పేవారు. ఆయనతో మాట్లాడవలసినవి ఆయనతో, దేవుడికి చెప్పుకోవలసినవి దేవుడితో విన్నవించేవాడిని. (ఒక్కోమారు దేవుడిని అతిరహస్యంగా అడిగిన దానికి ఈయన నుంచి జవాబు వస్తే కాస్త తికమక పడేవాడిని.) ఆయన కనుమరుగు అయ్యాకా దేవుడి చానల్ దేవుడి దయవల్ల బాగానే ఉండటంవల్ల దైవికమైన దిగులు అయితే లేదు.
పోనీ - గురువుగారు నిజంగా నాకు గురువుగారా? అలా చెప్పుకునే అర్హత, యోగ్యత నాకు ఉన్నాయా? ఆయన నాకు విద్య నేర్పారా? ఉపదేశం చేశారా? మంత్రం ఇచ్చారా? ఆయనకు నేను శుశ్రూష చేశానా? కనీసం ఆయనను పూర్తిగా నమ్మానా? ఆయన చెప్పినట్టుగా నడిచానా? ఆయన చెప్పినదాన్ని, చేస్తున్నదాన్ని సందేహించటం మానానా? అనుమానాలు, అభ్యంతరాలు, అపనమ్మకాలు లేకుండా ఆయన పలికినదే, ఉపదేశించినదే, ఆదేశించినదే తిరుగులేని సత్యమని, వేదవాక్యమని త్రికరణశుద్ధితో ఏనాడైనా నమ్మానా? శంకలూ, తర్కాలూ కట్టిపెట్టి పరిపూర్ణ విశ్వాసంతో ఆయనకు సరండర్ అయ్యానా?
అన్నిటికీ సమాధానం ఒక్కటే: లేదు... లేదు... లేదు.
బహుశా అందువల్లే ఆయనతో సిసలైన గురు - శిష్య సంబంధానికి నేను నోచుకోలేకపోయాను. ఆధ్యాత్మిక మార్గంలో ఆయన దగ్గరుండి, అన్నీ కనిపెట్టి, చేయిపట్టుకుని ముందుకు నడిపించిన లెక్కకు అందని ఎందరో శిష్యుల కోవలో నేను చేరలేకపోయాను.
దశాబ్దాల తరబడి గంటలకు గంటలు ఆయనతో లోకంలోని, లోకం వెలుపలి ఎన్నో విషయాలు ఆత్మీయంగా ముచ్చటించగలిగాను. కనుక నాకు ఆత్మీయుడా? ఎల్లప్పుడూ వారి కుటుంబంలో ఒకరిగానే నన్ను, నా కుటుంబాన్ని చూశారు కనుక... వారి కుటుంబ సభ్యులతో సమానంగా ఆదరించి, పెట్టుపోతల మర్యాదలూ చేశారు కాబట్టి ఆయన నాకు ఆప్తబంధువా? నాకు తండ్రిలేని లోటును తీర్చి, అచ్చం కన్నతండ్రిలాగే మా బాగోగులు చూసి... పిల్లల చదువుల నుంచి ఉద్యోగాల వరకూ, ఆరోగ్య సమస్యల నుంచి వ్యక్తిగత కష్టసుఖాల వరకూ ప్రతిదీ గమనించి... ఎప్పటికప్పుడు కౌన్సిలింగు చేసి... కర్తవ్యం నిర్దేశించి... అవసరమైనప్పుడు మందలించి, విసుక్కుని, చిరాకుపడి, కనుచూపుతోనే భయపెట్టి, దారి చూపించి... భారమంతా తనపై వేసుకుని మా అందరినీ నిశ్చింతగా నడిపించారు కనుక ఆయన నాకు తండ్రా? పిల్లలు ఏ చదువు చదవాలి, ఎవరిని పెళ్లి చేసుకోవాలి, పెళ్లి ఎప్పుడు చేయాలి, ఆ పెళ్లి విందులో మెనూ ఏమిటి, కార్యక్రమం ఎలా ఉండాలి... వగైరా నిర్ణయాలన్నీ తానే చేసి, ప్రతిదీ దివ్యంగా జరిపించారు కాబట్టి మా ఇంటి పెద్దా? ఇంట్లో ఎవరికైన జబ్బు చేసి బెంబేలు పడితే తాను ఎక్కడున్నా ఫోన్ చేసీ చెయ్యగానే అందుబాటులోకి వచ్చి, అభయమిచ్చి, జబ్బేమిటో, చికిత్స ఏమిటో డాక్టర్ల కంటే బాగా వివరించి, మాటిమాటికీ తానే ఫోన్ చేయించి కుశలం కనుక్కుంటూ, చేయి పట్టుకుని మృత్యుముఖం నుంచి వెనక్కి తీసుకువచ్చిన సందర్భాలను బట్టి ఆయన మా రక్షకుడా? ఇలవేల్పా?
కొంచెం... కొంచెం... మొత్తానికి అన్నీ! ఆయనే అన్నీ.
ఏదైనా అవునంటే ఔను. కాదంటే కాదు. సాధారణ లోక వ్యవహారం ప్రకారం ఆయన నాకు గురువా - అంటే కాదు! కాని - తన గురించి కొనే్నళ్లుగా వింటూ కూడా, అవకాశమున్నా చూడనిచ్చగించక... ఈ గురువులు నా ఒంటికి పడరని చెప్పి ఎవాయిడ్ చేస్తూ వచ్చిన నన్ను 23 ఏళ్ల కిందట తానే తన దగ్గరికి రప్పించుకుని... తప్పించుకు పోదామనుకున్నా పోనివ్వక తన దగ్గరే కూలేసి... ఉబుసుపోక కబుర్లు చెబుతున్నట్టే ఎన్నో రోజులు ఎన్నో గంటల తరబడి సంభాషించి... మనసుకు హత్తుకునేలా ధర్మం గురించి, దైవం గురించి ఎరుక పరిచి... నాకు తెలియకుండానే నన్ను ధర్మ మార్గానికి మరలించి... మళ్లీ ఆయన దగ్గరికి ఆ విషయాల గురించి పోవలసిన అవసరం రానంతగా సందేహ నివృత్తి కావించి... ఇన్ని గ్రంథాలు నా చేత, నా ద్వారా వెలువరింపజేసిన దేశికుడు, మార్గదర్శి నాకు గురువు కాక మరెవరు? దేని గురించి ఎన్ని ప్రశ్నలు వేసి, ఎంతలా ఇబ్బంది పెట్టినా నొచ్చుకోక, ఇష్టంగా ఓపికగా వివరంగా జవాబులు చెప్పిన మహానుభావుడిని మించిన గురువెవరు?
అలాగే ఆయన దేవుడు అంటే నేను నమ్మను. కాని జాగేశ్వర్‌లో (?) అర్ధరాత్రి గుడి పూజారికి శివుడిలా సాక్షాత్కరించిన వాడు... కురుక్షేత్రంలో గీతాబోధ జరిగిన చోట నిలబడి ‘ఇక్కడే అంతా చెప్పాను’ అని పలికినవాడు... అయోధ్య శిథిలాల ఎదుట గోడకు చేరగిలబడి ‘ఆరు వేల ఏళ్లుగా చూస్తున్నా’ అని నాతో నిర్వేదంగా అన్నవాడు దేవుడో, దేవ సమానుడో, కనీసం దైవాంశ సంభూతుడో కాడా? అత్యంత సన్నిహితులైన అంతేవాసులకు కలిగిన ఎన్నో దివ్యానుభవాలను వింటే ఆయన సాక్షాత్తూ శివుడే అన్న అభిప్రాయం కలగదా?
గురువుగారు ఉన్నంతకాలమూ కాలండర్ ఆయన చుట్టూనే తిరిగేది. ఫిబ్రవరి వరంగల్‌లో మహాశివరాత్రి మొదలుకుని డిసెంబరులో బర్త్‌డే ఫంక్షన్, ఆ వెంటనే అవార్డుల వేడుక వరకూ ఎన్నో ఉత్సవాలు. ఆనంద వనం, విశాఖపట్నం, వరంగల్, బలుసుపాడు, హైదరాబాదు టివోలీ గార్డెన్ల చుట్టూ తిరగడంతో సంవత్సరమంతా సంబరంగా గడిచిపోయేది. గురువుగారు ఎక్కడున్నారు, ఎప్పుడొస్తున్నారు, ఎన్నాళ్లుంటారు అని అడుగుతూ, రహస్య పాదపూజల కూపీలు లాగుతూ, దర్శనం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తూండటం మరపురాని నోష్టాల్జిక్ అనుభవం.
ఇప్పుడు ఆయన లేరు. ఆయన సమాధి మందిరం ఉంది. ఆయన స్వయంగా కట్టించిన మహాలక్ష్మి ఆలయం ఉంది. ఆయనే నడయాడిన గురుధామాలున్నాయి. ఆయన పాదస్పర్శతో పునీతమైన ఆనందవనం ఉంది. ఆయన స్థాపించిన సంస్థలు, వాటికి ఆయన దిద్దిన ఒరవడులు, నిర్దేశించిన విధివిధానాలు ఉన్నాయి. వాటిలోనే ఆయనను చూసుకోవాలి మరి! ఇబ్బందే. కాని తప్పదు.
*