మెయిన్ ఫీచర్
అనుకరణ ఓ అందమైన శిల్పకళ!
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
సృజనకారులంతా కాపీరాయుళ్ళంటే ఉలిక్కిపడతారు. అదే అనుకరణ శిల్పులంటే మురిసిపోతారు. ఇంతకూ అనుకరణకూ కాపీ కొట్టడానికి ఏమైనా తేడా ఉందా? అంటే మక్కికిమక్కి అనుకరిస్తే దాన్ని కాపీ కొట్టడమనీ.. అక్కడింత ఇక్కడింత కాపీకొట్టి తమ సొంత సృజనాత్మకతను కొంత అందులో చేర్చి రచనాశిల్పాన్ని మెరిపిస్తే దానిని అనుకరణ రమణీయతని మురిసిపోతారు. కళలన్నీ అనుకరణ నమూనాలే.. అందులో సృజనకళ చాలా తెలివైన మేధోపరమైన అనుకరణ విద్య. ఆ విద్యలో ఆది కవులనుండి ఆధునిక కవులవరకు ఎవరికెవరూ తీసిపోరు. ఎటొచ్చీ ఈ విషయం తెలియని అమాయక కవులు మాత్రమే తమ ముందుతరం కవులనూ లేక తమ సమకాలీన కవులను గుడ్డిగా ఆరాధిస్తారు. వారి అనుకరణ రహస్యాలను తెలుసుకోలేక అసూయపడుతుంటారు. వారి స్థాయికి తాము చేరుకోలేమని ఆత్మన్యూనతతో బాధపడుతుంటారు. వాస్తవానికి సృజన గొప్పదనం అన్నది ఒక కవి రచనాశిల్పం, భావుకతపై ఆధారపడి ఉంటుంది. లాక్షణికులు చెప్పిన ప్రతిభ వ్యుత్పత్తి అభ్యాసాలు ఎన్ని ఉన్నా ఆయా రచయితలు ఆయా కాలాలలో అనుకరించిన శిల్పసంబంధిత అనుకరణ శక్తి, అధ్యయనశక్తి, అనుభూతి తీవ్రతలనుబట్టే వారి రచనలు గొప్పవిగా రాణించడం గుర్తింపు తేవడం జరుగుతుంది. ఇంకా స్పష్టంగా అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పుకోవాలంటే అనుకరణ చూచిరాత లాంటిది. అంటే కాపీ కొట్టడమన్నమాట. ఈ మాట కాస్త కటువుగా ఉన్నా.. కొందరికి జీర్ణం కాకపోయినా.. ఇది నిజం. కాపీ కొట్టడం ఓ గొప్ప కళ. ఆ కళలో ఆరితేరిన కవులు రచయితలూ ప్రపంచవ్యాప్తంగా ఎందరో ఉన్నారు. వీరంతా తమలో ఉన్న సృజనశక్తి (creativity power) కన్నా అనుకరణశక్తి (imitation power) వల్లనే గొప్ప కవులుగా చెలామణి అయ్యారు. ముఖ్యంగా వీరంతా వస్తువునుగాక శిల్పాన్ని కాపీగొట్టి, ఆ శిల్పానికి నగిషీలు చెక్కి సరికొత్త శిల్పంగా మెరిపించి సాహితీప్రియులను మురిపించారు. వేదకవుల అనుష్టుప్ ఛందస్సునుండి ఆధునిక కవుల వచన శిల్పంవరకు రూపపరంగా పరిశీలిస్తే అంతా అనుకరణ సృజన కళాకౌశలమేనని స్పష్టంగా తేలిపోతుంది. అయితే దీనికి లోతైన అధ్యయనం అవసరం. షేక్స్‌పియర్ సానెట్స్ ఎంతో ప్రాచుర్యం పొందాయి. అందుకే అభ్యుదయ కవి ఆడెన్ పాత ఆంగ్లో-సాక్జన్ మీటర్లనీ సానెట్ పద్య రూపాన్నీ ఎక్కువగా ఉపయోగించాడు. అంటే అది కాపీకొట్టడమేగా? అలాగే వాల్మీకి రామాయణంలోని వర్ణనలు ఆ తర్వాత వచ్చిన కాళిదాసు, మేఘుడు, భారవి మొదలైన కవులు కావ్యాల వర్ణనలకు సంబంధించిన శిల్పవిన్యాసాల వర్ణణా నైపుణ్యాలన్నీ సరికొత్త అనుకరణ రూపాలేనంటే ఎవరైనా కాదనగలరా? నన్నయ అక్షర రమ్యతను తిక్కన అనుసరించినా ఎక్కువగా నాటకీయతను ప్రవేశపెట్టి పద్యశిల్పంలో మార్పులుచేయటంవల్ల తిక్కనశైలి నాటకీయతగా ముద్రపడింది. అలాగే ఎర్రన వర్ణనా నైపుణ్యం నన్నయ అక్షర రమ్యత నుండి కొంతలోకొంత అనుకరించినదే కదా? అలాగే ప్రబంధకవులు పెద్దన, భట్టుమూర్తి, రామలింగడు, మల్లన మొదలైనవారు శిల్పంలో చూపిన ప్రతిభవల్లనే గొప్ప కవులుగా చెలామణి అయ్యారు. అయితే వీరంతా పద్యశిల్పంలో తమ పూర్వీకులను అనుకరిస్తూనే తమదైన శిల్పకళా నైపుణ్యాలు ప్రదర్శించారు. అంటే వీరంతా శబ్దసంవిధానంలో అర్థసంవిధానంలో రస సంధానక్రమంలో ఏవో కొన్ని మార్పులుచేసి వుండవచ్చు. అంతేగాని తమ పూర్వకవుల కవిత్వాన్ని చదవకుండా అందులోని పద్య శిల్ప భంగిమలనో, కథా కథన రీతులనో, వర్ణణాలంకార రూపాలనో కొన్ని రస స్వరూపాలనో ప్రత్యక్షంగానో పరోక్షంగానో అనుకరించకుండా రచనలు చేసి ఉంటారా? అంటే లేదనే సమాధానం చెప్పుకోవాలి. అలాగే ప్రబంధ కవుల అష్టాదశ వర్ణనలు అంతకు ముందులేవా? అంటే ఉన్నాయి. కానీ వీరు ప్రబంధమంటే ఒక ప్రకృష్ఠబంధంగా ఉండాలని కొన్ని నియమాలు పాటించారు. అనుసరించారు. వాటిని తమ పూర్వ కవులనుండి అనుకరించారు. అంతే కాని అవన్నీ వీరి స్వకపోల కల్పణలు కాదు. అలాగే 19వ శతాబ్దంలో గురజాడ, రాయప్రోలు ఆంగ్లకవిత్వాన్నుండి పాశ్చాత్య సిద్ధాంతాలనుండి భావాలను అనుభవాలను కొత్త సాహిత్య ప్రక్రియలను కవితాశిల్పాలను అనుకరించారు. అనుసరించారు. ఆ క్రమంలో తమ రచనలకు క్రొమ్మెరుంగులు దిద్దారు. దిద్దుబాటులు సర్దుబాటులు చేసుకున్నారు. తెలుగు సాహితీ కళామతల్లి మెడలో ముత్యాల సరాలు వేసి మురిసిపోయారు. తెలుగు పద్యాల పందిళ్లపై స్నేహలతలు పూయించారు.. ప్లేటో ప్లాటానిక్ లవ్ రాయప్రోలు అమలిన శృంగార రచనలకు ప్రేరణా?. అనుకరణా? అంటే ప్రేరణారూపంలో ఉన్న అనుకరణే కదా? లేకుంటే అప్పటివరకు ప్రబంధ కవుల్లో ఉన్న పైత్యరసాంధత్వం రాయప్రోలులో ఎందుకు అదృశ్యమవుతుంది? ఇంగ్లాండు కవుల రచనా శిల్పం, దేశభక్తిగీతాల ప్రభావం రాయప్రోలుపై లేదనగలమా? పాశ్చాత్య దేశాల ఫార్స్ ప్రభావం గురజాడ కన్యాశుల్కం, వీరేశలింగం బ్రాహ్మవివాహం లాంటి ప్రహసనాలకు మూలంకాదా? భావకవులకన్నా వందేళ్ళముందే ఇంగ్లాండులో రొమాంటిసిజం నీడల్లో వర్ధిల్లిన వర్డ్స్ వర్త్, కూల్‌రిడ్జ్, బ్లేక్, షెల్లీ, కీట్స్‌ల కవితారీతులను, శిల్ప శోయగాలను మన భావకవులు అనుకరించలేదా? ఇక్కడ అనుకరణ అంటే మక్కిమక్కి కాపీకొట్టడం కాదు. శైలిలో లేదా శిల్పంలో మార్పులన్నీ ఆయా కాలాల్లో ఒకేసారి జరిగినవి కావు.. అంతకుముందు కవుల కవితా శిల్పాలనుండి అనుకరించిన రూపాలకు నగిషీలు చెక్కినవే అన్న సత్యాన్ని మనం అంగీకరించాలి. అనుకరణ కవులు కొంతవరకు సొంత సృజనాత్మకతను జోడించినంత మాత్రాన గొప్ప కవులు ఎలా అవుతారు? స్రష్టకన్నా సృష్టి గొప్పదంటాడు ఇస్మాయిల్. పూర్వకవుల కవితారూపాలను శైలీ విన్యాసాలను అనుకరిస్తూ సరికొత్త కవితా నిర్మాణ పద్ధతులను మనవాళ్లు నిర్మించుకున్నారు. ఇందులో గొప్పతనం ఏమైనా ఉంటే వాళ్ల భావనాబలం లేదా సరికొత్త ప్రతీకలు సృష్టించుకోవడమే.
ప్రభవ లాంటి పద్యకావ్యాలు రాసిన శ్రీశ్రీలాంటి కవులు హఠాత్తుగా మహాప్రస్థానంలాంటి కొత్త శైలీవిన్యాసాల గేయాలు రాయడానికి ఎందుకు ముందుకొచ్చారు? ఆయన కవిత్వంలోకి అంతటి ధారాశుద్ధి ఎక్కడినుండి హఠాత్తుగా ఊడిపడింది? ఎవరినీ అనుకరించకుండా ఆయన మహాప్రస్థాన గీతాలు రాశాడా? ఫ్రెంచి సర్రియలిస్టు కవులు ఎల్వార్, అరగా, అపొలిసేర్‌లు, ఇంగ్లీష్ నుండి స్విన్‌బర్న్‌ల నుండి పద రసాయన శాస్త్రాన్ని శ్రీశ్రీ వంటబట్టించుకోలేదా? మార్క్సిస్టు ప్రభావం ఆతని కవిత్వంలోకి ఆడెన్, లూయిస్, స్పెండర్, మెక్‌నీస్ ద్వారా ప్రసరించలేదా? ఆయన ఫ్రెంచి కవుల రచనలను అనుకరించలేదా? అంటే వీటన్నింటినీ అవుననే ఆయన అభిమానులు అంగీకరిస్తారు. అయితే శ్రీశ్రీ మహాకవి కాదని ఆయన వర్గకవి అని హనుమారెడ్డి లాంటి కవులు అంటే మండిపడతారు. మన తెలుగు సాహిత్య అభిమానుల్లో వ్యక్తిపూజ ఎక్కువ. కవులను, రచయితలను ఊరకే పొగడాలేగాని ఏమాత్రం విమర్శించకూడదు. ఇక రష్యా చైనా కవులను విప్లవకవులు, నామ్దేవ్ దాసల్ లాంటి మహారాష్ట్ర దళిత పాంథర్ కవుల కవితలను భారతీయ దళిత కవులు అనుకరించారు. చాలామంది కవులు కవయిత్రులు ఇతర రాష్ట్రాల లేక దేశాల కవుల కవితాశిల్పాలను అవసరమైనచోట వారికి తెలియకుండానే అనుకరించి ఉంటారన్నది నిర్వివాదాంశం. కవిత్వంలో పద చిత్రాల ప్రాముఖ్యాన్ని 20వ శతాబ్దంలోని కవులు మాత్రమే గుర్తించారని చాలామంది అనుకుంటారు. కాని ప్రాచీన చీనా కవులు మూడువేల ఏళ్ళక్రితమే గుర్తించారని, వారిని వారి కవిత్వాన్ని అనుకరించిన వారంతా ఈ శతాబ్దంలో గొప్ప కవులుగా చెలామణి అయ్యారన్న పచ్చి నిజం చాలామంది సాహితీప్రియులకే కాదు సాహితీవేత్తలకు తెలియకపోవడం విడ్డూరం. అందుకు ప్రధాన కారణం సరియైన పరిశోధనలు జరగకపోవడమే. వేల్చేరు నారాయణరావ్ అన్నట్టు తెలుగు రాష్ట్రాల యూనివర్సిటీలలోని తెలుగుశాఖలు దాదాపుగా నిర్వీర్యమైపోయాయి.
అనుకరణకు, అనుసృజనకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని సృజనకారులు గుర్తించాల్సిన అవసరం ఉంది. అలాగే ఒక కవి రచనను కులం మతం వర్గం ప్రాంతం ప్రాతిపదికగా కాకుండా ఆతని అనుకరణశక్తిని, అనుసృజనశక్తిని, సృజనాత్మక ప్రతిభను, అధునాతన భావజాలాన్ని గుండె ఆర్ద్రత, భావనాబలం, అతి నవ్యప్రతీకల వాడకాన్నిబట్టి అంచనావేయడం అసలైన కవిత్వ విమర్శ అనిపించుకుంటుంది. వ్యక్తి ఆరాధన పక్కనపెట్టి సత్యనిష్ట కలిగిన విమర్శలను స్వాగతించాలి. వాటిని పరిశీలించాలి. అలా... గత సాహిత్య సృజనకారుల అనుకరణ కళాకృతుల శిల్పరహస్యాలను తెలుసుకోవాలి. తమ రచనా శిల్పాలకు మెరుగులు దిద్దుకోవాలి. అప్పుడే సాహితీ క్షేత్రం విరగబూసిన శిల్పకళా కావ్యసుమాల సౌరభాలతో కళకళలాడుతుంది.
*