సుమధుర రామాయణం

సుమధుర రామాయణం.. (యుద్ధకాండ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

748. తమరి యాజ్ఞతో ప్రారంభవౌను యాత్ర!’’
యని హనుమ బల్కగ నిరుపమాన దివ్య
తేజవంతుడు శౌర్య పరాక్రముండు
రామభద్రుడు సఖుడు సుగ్రీవు జూచి

యుద్ధకాండము

749. ‘‘మిత్రమా! వానరేశ్వర! మింటి మధ్య
మునకు జేరెను మా వంశకర్త సూర్యు
డానతీయము సేనకు జయ ముహూర్త
మిదియె నదరెనా దక్షిణ నేత్ర మనఘ!’’

750. రామచంద్రుని మాటలు రవిజు నోట
నాజ్ఞలయ్యె వానర వీరులద్రులతరు
శాఖలందుండి దిగి రసంఖ్యాకములుగ
పయనమునకు సన్నద్ధులై బలము మెరయ

751. నీతి కోవిదుడును ధర్మ విగ్రహుండు
రామభద్రుడు వానరాజు జూచి
లక్ష సేనతో నీలుడు నడచు ముందు
మార్గము సుగమ మొనరించు కొనుచు నతడు

752.వేల సేనతో వెనుక భాగమున నుంద్రు
పర్వతాకారులు గజ గవయ గవాక్షు
లేపున వృషభములలో నాబోతుల వలె
నర్క ఋషభులు రక్షింత్రు పార్శ్వములను

753. సేన కాయమున కుదర స్థానమందు
హనుమ నేను నీవును లక్ష్మణుండు జాంబ
వంత యంగద గంధామాదన సుషేణ
శతవలులు నిల్తుమని నిర్ణయించె విభుడు

754.లక్ష్మణ సుగ్రీవు లిరువైపులందు నిలచి
దారి జూపగ రాఘవేంద్రుండు విజయ
యాత్ర కడుగు ముందుకు వేసె హర్షనాద
ములు దిశలునిండ సేనవాహినులు గదలె

755.మదపు టేనుగులవలె బలిష్టులైన
వానరేశులు రామ లక్ష్మణుల ననుస
రించి నడువగ గగన మధ్యమున వెల్గు
సూర్య చంద్రుల వలె నుండ్రి దాశరథులు

756. లక్ష్మణుం ‘‘డగ్రజా! గాలి సేనకెంతో
హయిగొల్పుచు చల్లగ వీచుచుండె
మృగ చయమ్ములు నంజమ్ములను మనకు
శుభము సూచించుచు ధ్వనుల్ జేసె వినుమ

757.దిక్కులు ప్రసన్నతతోడ నిండి యుండె
నిర్మలమ్ముగ నింగి మార్తాండు డదిగొ
వెల్గుచున్నాడు, సప్తర్షి మండలమ్ము
గానవచ్చెను దివ్యవౌ కాంతి తోడ

758. మన పితామహుడు త్రిశంకువు ప్రకాశ
మానుడై విరాజిల్లుచు నున్నవాడు
శుభము సూచించుచుమన విశాఖ తార
నిర్మలముగా ప్రకాశించె దీప్తి తోడ

759.రాక్షసుల తారమూల ధూమావృతముగ
నున్న దిది శత్రునాశన సూచకమ్ము
రావంని జంపి భూమిజన్ గలసికొందు’’
వంచు నుత్సహముగ బల్కె లక్ష్మణుండు

760. నేల ఈనిన విధముగా నేగు సేన
పాత తాడనముల రేగు ధూళి మేఘ
మండలిని గప్పె వీరుల సింహనాద
ముల భుజాస్వాలనమ్ముల నదరె వనము

761. యవ్వనంబున గల బల వీర దర్ప
శక్తుల ప్రదర్శింపుచు కీశపతులు
రావణుంజంపి జనకజన్ దెత్తు మనుచు
దడయక నమితోత్సాహముతోడ జనిరి

762.రామచంద్రుని యాజ్ఞానుసార మడవి
మార్గమున నడచుచు జనావాసములకు
జనక వానర వీరులు జేరుకొనిరి
మధుర ఫలవృక్ష భరితవౌ సహ్యగిరిని

763.వివిధ జాతుల ఫల పుష్ప వృక్షములను
శీతల జల తటాకముల నలరారు
సహ్యగిరిపైని విహరించి హరివరేణ్యు
లచటమలయమారుతములు హాయిగొల్ప

764.మధుర ఫలములు భక్షించి ముదముతోడ
తేనెలుంద్రావి కిలకిలా రావములను
పూలకొమ్మలపై నూగి కొంత తడవు
యాత్ర సాగించి కనిరి మహేంద్ర గిరిని

*

టంగుటూరి మహాలక్ష్మి