భక్తి కథలు

స్వామియే శరణం అయ్యప్పా -18

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘లేదు దేవీ! నేను చూసినప్పుడే ఆ హారం మెడలో వుండింది! భగవద్దత్తంగా భావిచుకుందాము! ఆస్థాన పురోహితులను రప్పించి నామకరణం, పుట్టిన దిన మహోత్సవాలను జరిపించవలసి వుంది ఎవరక్కడ?’’ అంటూ పరిచారికలను పంపి రాజపురోహితులను పిలిపించాడు రాజశేఖరుడు!
‘‘మహారాజా! ఈ పసివాడు కారణ జన్ముడు! మీ దంపతుల మీద కరుణతో హరిహరుల అనుగ్రహం ఈ పసివాడి రూపంలో మీకు లభించింది! ఈ పసివానివల్ల మీకు ఆచంద్ర తారార్కమైన కీర్తిప్రతిష్ఠలు చేకూరుతాయి. మన రాజ్యంలో కూడా సుఖశాంతులు నెలకొంటాయి! ప్రజలు సర్వశుభాలు పొంది ఆనందంగా జీవించగలరు!’’ అంటూ పురోహితులు చెప్పిన విషయాలు మరింత ఆనందాన్ని కలిగించాయి.. రాజదంపతులకు!
‘‘మా పుత్రుడికి తగిన పేరును, జన్మ తిథి నక్షత్రాలను మీరే గురించి చెప్పండి!’’ అని అడగటంతో పసివాడు లభించిన సమయం మొదలైనవి గుణించారు పురోహితులు.
‘‘మహారాజా! మీకు లభించిన సమయాన్ని బట్టి అత్యంత శుభసమయంలో బాలుని ఆవిర్భావం జరిగి వుంటుంది, ఉత్తరా నక్షత్ర శుభ ఘడియలలో! ఈవేళ ఫాల్గుణ శుక్ల పక్ష పంచమి, ఉత్తరా నక్షత్ర యుక్త శుభయోగంని జన్మదిన, జన్మ నక్షత్రాలుగా గణించాలి! ఇక కంఠంలో మణిహారంతో మీకు లభించాడు గనుక మణికంఠుడనే నామం ఈ బాలునికి అన్ని విధాలా తగినది!’’ అని చెప్పారు!
‘‘మణికంఠుడు! చాలా బాగుంది పేరు! ఇకపై మా పుత్రుడు మణికంఠుడని పిలవబడతాడు! ప్రజాలారా! ఇడుగో మీ యువరాజు! కన్నుల కరువు తీరా దర్శించుకోండి మీ భావి మహారాజును’’ అంటూ చూడవచ్చిన ప్రజలకు పసివాడిని చూపించి అందరి సమక్షంలో మణికంఠుడని నామకరణం చేశాడు రాజశేఖరుడు పసివాడికి!
‘‘యువరాజు మణికంఠునికి జయము! జయము!’’ చూడవచ్చిన పందల రాజ్య ప్రజలందరూ ఉత్సాహంగా జయజయధ్వానాలు చేశారు! రాజ్యమంతటా పుత్రోత్సవ వేడుకలు జరిపారు!
మణికంఠుడు వచ్చిన వేళా విశేషంవల్ల కొద్దికాలంలో పాడి పంటలతో తులతూగసాగింది పందల రాజ్యం! ఈతిబాధలు లేవు. అన్నిటికన్నా ఆనందకరమైన విషయం మణికంఠుడు వచ్చిన కొద్దికాలానికే రాణి గర్భవతియై సకాలంలో పుత్రునికి జన్మనిచ్చింది! రాజదంపతుల చిరకాల వాంచితం ఈడేరింది! కానీ మణికంఠునిపై వాళ్ల ప్రేమ, వాత్సల్యం తగ్గలేదు సరికదా మరింత ఎక్కువైనాయి! ఇద్దరి పుత్రుల బాల్య చేష్టలు చూస్తూ ఆనందంగా గడపసాగారు!
***
మణికంఠుని
గురుకుల వాసం
కాలం వేగంగా గడుస్తున్నది! మణికంఠుడు దిన దిన ప్రవర్థమానుడౌతున్నాడు! అక్షరాభ్యాసం, ఉపనయన సంస్కారం జరిపి విద్యాభ్యాసం కోసం గురుకులానికి పంపించాడు రాజు!
ఏక సంథాగ్రాహి అయిన మణికంఠుడు వేదాలు, శాస్త్రాలు కొద్దికాలంలోనే అభ్యసించి అందరికీ ఆశ్చర్యం కలిగించాడు! వాటితోబాటు క్షత్రియోచితాలైన విలువిద్య, కత్తిసాము, గుఱ్ఱపుస్వారి, మల్లయుద్ధం, శస్త్రాస్త్ర ఉపయోగ ఉపసంహరాలు గురుకులంలోనే వుంటూ నేర్చుకున్నాడు!
కొద్దికాలంలోనే విద్యాభ్యాసం పూర్తయింది
‘‘మణికంఠా! ఎంతో త్వరగా అన్ని విద్యలలో ప్రవీణుడివైన నిన్ను చూస్తుంటే ఆనందం కలుగుతున్నది! ప్రయోజకుడైన శిష్యుని చూసుకుని గురువు హృదయం తృప్తితో నిండిపోతుంది! రాజకుమారుడివైనా ఇక్కడ ఇతరులతో అరమరికలు లేకుండా గడిపాడవు! సామాన్యుడిలా సేవలు చేశావు! అందరికీ ఆదర్శప్రాయంగా గడిపావు! తిరిగి వెళ్లాక నీ ప్రజలను ధర్మంగా పాలిస్తూ సత్యవంతుడివై జీవించు’’ అంటూ బోధించి ఆశర్వదించాడు గురువు విద్యారణ్యుడు!
-ఇంకా ఉంది

-డా. టి. కళ్యాణీ సచ్చిదానందం