భక్తి కథలు

కాశీ ఖండం..39

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మరల ప్రయాగకి అరుగుతాడు. మణికర్ణికా తీర్థంలో స్నానమాడుతాడు. మరల మణికర్ణికా తీర్థంలో మునుగుతాడు. కింకరులవుతూన్న ఇంద్రాది బృందారకుల కిరీట ఖచిత నూత్న రత్న రుచిధారల ఆశే్లషంవల్ల శబల వర్ణం కలవి అవుతున్న పాదపద్ముడు అయిన శంకరుడు ప్రాణులకు ప్రణవ మంత్రరాజాన్ని కుడి చెవిలో కాశీకాక్షేత్రమందు ఉపదేశిస్తాడు.
చెవి దగ్గరగా చేరి ఏకాంతంగా సదాశివుడు జీవుడికి ఎల్లవేళల ముక్తి చింతామణి అయిన ప్రణవ మంత్రాన్ని ఉపదేశిస్తాడు కనుక గంగాతీరంలోని ఆ మహాతీర్థం ‘మణికర్ణిక’ అని ప్రఖ్యాతి చెందింది.
తరులతాది ఉద్భిజ్జాలు, ద్విపాత్తులు చతుష్పాత్తులు అయిన జరాయుజాలు, పేలు మున్నగు స్వేదజాలు, పక్షులు, పాములు అయిన అండజాలు- ఈ చతుర్విధ ప్రాణులున్ను ఆ కాశీలో మరణించి ఆ క్షేత్ర మహిమ ఎట్టిదో కాని అబ్బురం గొల్పుతూ నీలగ్రీవాలతో శివులై జనిస్తాయి. ప్రాణావసాన సమయంలో కాశీక్షేత్రములో ఎడమకు ఒత్తిగిల్లి కుడి చెవి మీదు అయేటట్లు ప్రాణాలు కోల్పోయే దోమపిల్లకి సైతం శివుడు ప్రణవ మంత్రాన్ని ఉపదేశించడం కాంచి అమరులు తమ జన్మలు వ్యర్థములని సిగ్గుపడుతూ వుంటారు.
కటకటా! కాశీ పవిత్ర క్షేత్రంలో ఒకానొక విధమైన నిద్దురలో కన్ను మూసి అంతలోనే మరల కన్ను తెరిచి తమ మనస్సంపుటంలో ఆడు తెరగు, మగ పోడిమి కల జంతువులు కుడి భాగాన్ని చూసి చోద్యం పొందుతాయి. ఎడమ వంక కని అచ్చెరువును వహిస్తాయి.
ఆ శివశర్మ ఈ పుడమిలో యింకా కైవల్య కారణాలు అయిన తీర్థములు అనేకం వుంటాయి అని భావించి అమృత క్షేత్రం కాశిని, బ్రహ్మక్షేత్రం ప్రయాగని వదలిపెట్టి దూర ప్రాంతాలకి పోవాలని తలపోశాడు. అది ఆ శివశర్మ తప్పు అని చెప్పవీలు కాదు.
బహుశాస్త్ర జ్ఞానం చిత్తానికి ఏకాగ్రతని కలుగనియ్యదు. శాస్త్రాలు నిశ్చయజ్ఞానాన్ని నిలవనివ్వడానికి మారుగా అన్యోన్య విరుద్ధ విషయాలని కలుగజేసి నిశ్చలత్వాన్ని పాడుచేస్తాయి. కనుక బుద్ధి విషయంలో పాడైన శాస్త్రార్థాలుగా తోస్తాయి సుమా!
ఆ శివశర్మ ఆనంద కాననం అయిన కాశీక్షేత్రపు పుణ్యాతిశయమంతా ఎరుగడా ఏమిటి? స్వర్గలోక ఆరోహణానికి నిచ్చెన అయిన గంగానది నిత్య మహిమని తెలియడా ఏమిటి? శివశర్మ సూక్ష్మదృష్టితో మణికర్ణికా తీర్థ మహిమని వితర్కించడా ఏమి? వేదాలలోను, పురాణాల్లోను, ఇతిహాహాల్లోను విశే్వశ్వరస్వామి పారమ్యాన్ని అరయడా ఏమి?
పలు విధాలైన అన్య ప్రమాణాలను అనుసరించడంవల్ల జలము మెట్ట ప్రాంతం నుంచి పల్లపు భూమికి ప్రవహించే విధంగా ఆ శివశర్మ కాశీ పవిత్ర క్షేత్రం వదలి అన్య తీర్థ సందర్శనానికి బయలువెడతాడు.
ఆ రీతిగా కొన్ని పయనాలు చేసిన పిమ్మట శృంగారానికి ఆశ్రయ స్థలం అయిన ఏ నగరంలో నీలకంఠుడు ఉంటాడో, యుగయుగంలోను ఏ నగరం పేరు ఆ వృత్తి పొందుతుందో, ఏ పురంలో జానెడు జానెడు చోటుకి శివలింగాలు కోటానుకోట్లు ప్రకాశిస్తాయో, ప్రళయకాల సమయాల్లో కూడా మిన్నంటే మున్నీటి వెల్లువలో ఏ పురం మునిగిపోదో, అటువంటి మహిమలు కల ఉజ్జయినీ నగరానికి ఏతెంచి కాళికని దర్శించాడు.
మహాకాళేశ్వరుణ్ణి కొలిచి ఆ తావున అఖిల ముక్తులకు నిలయం కనుక- హఠయోగ రాజయోగాలు అభ్యసిస్తూ వసించాడు. పాతాళలోక మండలంలో పరమశివుడు హాటకేశ్వర లింగరూపంలోను, మర్త్యలోక వలయంలో మహాకాళేశ్వర లింగ రూపంలోను, స్వర్గలోక వలయంలో తారకేశ్వర లింగ రూపంలోను వెలసి వున్నాడు.

-ఇంకా ఉంది

-శ్రీపాద కృష్ణమూర్తి