భక్తి కథలు

కాశీ ఖండం..19

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ సాధ్వి చితిలో ఉరికి తదగ్ని శిఖలనుంచి వెల్వడి కలుషాత్ముడైన పతి వెను వెంటనే ఏతెంచుచుండగా భీతచిత్తులై యమభటులు దవ్వుగా తొలగిపోతారు. ఈషణ్మాత్రమూ భీతిల్లిక చితాగ్ని నురికిన పతివ్రత శరీరంలో రోమకూపాలు ఎన్ని వున్నవో అన్ని దివ్య సంవత్సరాలు భర్తతో కలిసి స్వర్గలోకంలో సంతోషాన్ని అనుభవిస్తుంది. పతివ్రత తండ్రి వంశంలో ఏడు తరాలవారికి, తల్లి వంశంలో ఏడు తరాలవారికి, భర్త వంశంలోని ఏడు తరాలవారికి శాశ్వత నాకలోక నివాస సౌఖ్యం కలిగిస్తుంది అని వచించి దేవగురుడు బృహస్పతి లోపాముద్రను కనుగొని ‘దేవీ!’ ప్రసక్తానుప్రసక్తంగా కొన్ని స్ర్తి ధర్మాలని పేర్కొన్నాను. నువ్వు మహాపతివ్రతవి. నినువంటి పుణ్యవతులు వున్నారు కనుకనే ఈ వసుంధర సుస్థిరంగా నిలచి వుంది. నీకిదే నమస్కారం. మేము వచ్చిన కార్యానికి నువ్వు ఆనుకూల్యం వహించి, నిర్మల కరుణ సంపద వెలయగా లోకహిత నిర్వాహకుడైన నీ వల్లభుని ప్రార్థించవలసింది’’ అని అగస్తి మహర్షిని కాంచి, ప్రణామం కావించి దేవ గురువైన బృహస్పతి ఈ గతి వాకొన్నాడు.
బృహస్పతి అగస్త్యుడితో తను వచ్చిన కార్యము తెల్పుట
ఓ సత్వగుణ సంపన్నా! నువ్వు ప్రణవమైన ఓంకారానివి. ఈ సుమగాత్రి అయిన లోపాముద్ర వేదవిద్య. ఈశ్వరభక్తినిలయా! నువ్వు తపస్సువి. ఈ పూర్ణ శశివదన శాంతి. వాతాపిగర్వభంజనా! నువ్వు ఫలానివి. ఈ చందన గంధి సత్క్రియ. జగద్ధిత ప్రవర్తకా! నువ్వు సూర్యభగవానుడివి. ఈ లోపాముద్రాదేవి చైతన్యలక్ష్మి. నీలో బ్రహ్మతేజం ప్రజ్వలిస్తున్నది. ఈ లోపాముద్రలో పాతివ్రత్య తేజం ప్రకాశిస్తున్నది. ఈ మా అందరికిని ఈ అభయ తేజాలు మహాభ్యుదయాన్ని ఒనగూరుస్తాయి. మహామునీ ఇడుగో ఇతడు ఇంద్రుడు. ఇతడు అగ్నిదేవుడు. ఈతడు యమధర్మరాజు. ఇతడు వరుణదేవుడు. ఈ కనవచ్చువాడు వాయువు. వీడు కిన్నర పతి కుబేరుడు. ఓ లోకవంద్యా! వీడు ఈశ్వరుడు, ఇతడు నిరృతి- ఇరుగో వీరు అందరు మునీంద్రులు. వీరే మరుత్తులు, సిద్ధులు. సాధ్యులు. కిన్నరులు, కింపురుషులు, విద్యాధరులు, గంధర్వులు. మేము ఏతెంచిన కార్యాన్ని అవధరించు.
వింధ్యం అనే పర్వతం నిర్జర నివాస స్థలం అయిన మేరు మహీధరంతో స్పర్థ పూని బ్రహ్మాండ కర్పరాన్ని తన శిఖర సమూహంతో ఘట్టించుతూ రవి రథాన్ని నిరోధించింది. నక్షత్ర గ్రహ మండలాన్ని చెల్లాచెదరు కావించింది. సప్తవాయువుల్ని బంధించి శింశుమార రూపంతో నింగిని శయనించి వున్న విష్ణుదేవుణ్ణి ఒరసికొని, ధ్రువుణ్ణి దాటి, మందాకినిని ఆలింగనం చేసుకొని, మహాలింగరూపుడయిన పరమ శివుడిని- త్రివిక్రమరూప ధారి విష్ణువుని అనుకరించి వుంది. తృతి, నిమేషం, కాష్ఠ, కళ, ముహూర్తం, అహోరాత్రం, పక్షం, మాసం, ఋతువు, సంవత్సరం, యుగం, యుగసంధ్య, సంధ్యాంశం, మన్వంతరం, కల్పం, మహాకల్పాది భేదాలతో పదార్థాలకి పరిమితిని నిర్ణయించే కాలది ఉపాధుల్ని సమయించి, తనయందు తానే నెలకొని వున్న సచ్చిదానంద మూర్తి కన్నా అన్యంకాని పరమ శివుడిని తప్పించి ఇతరుల్ని పరిమితి బద్ధులను చేస్తూ వుంటుంది. అటువంటి కాలానికి సూర్యగమనమే ఆధారం. ఆ రవి నేడు వింధ్యాచల పార్శ్వాన చిక్కుపడి సముద్రపు ఇసక మేటలో అడ్డగింపబడ్డ నౌక మాదిరిగా మునువెనుకలకి మరలడానికి చాలకున్నాడు. ప్రాహ్ణము, అపరాహ్ణము, మధ్యహ్నాది కాలాంశాలు గత్తరలో కలవడంవల్ల నిత్యనైమిత్తకాది క్రియాకలాపాలు నిలిచిపోయాయి. ప్రాచ్య పశ్చిమ దేశాలు కొన్ని నిరంతరాంధకార బంధురాలయాయి.

-ఇంకా ఉంది

శ్రీపాద కృష్ణమూర్తి