భక్తి కథలు

కాశీ ఖండం..62

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దీక్షితుడి నుడులు ఆలించి ఆ సోమిదమ్మ అతడితో ఈ కరణి వచించింది.
‘‘సోమయాజిగారూ! ఇది మధ్యాహ్న సంధ్యా సమయం. ముందు స్నానం ముగించి, సంధ్య వార్చవలసింది. అగ్ని కార్యం నెరవేర్చాలి. శివుడికి పూజలివ్వాలి. పంచ మహాయజ్ఞాలు భక్తితో నిర్వర్తించు. ఈ రోజున పలువురు అతిథులు అన్నార్థులై ఏతెంచి ముంగిట వేచి వున్నారు. పచనం కావించిన వంటకాలు, శాకపాకాలు చల్లారిపోతే రుచులు తప్పుతాయి. మీ ఉంగరాన్ని బహుపదిలంగా భోషాణంలోని బరిణలో వుంచి దాచిపెట్టాను. ఆ మందసాన్ని తెరిచి వెదకి తేవడానికి నాకిప్పుడు తీరిక చిక్కదు. చేతినిండా పని వుంది. భోవజనానంతరం తీరికగా శోధించి తెచ్చి ఇస్తాను’’. అంత యజ్ఞదత్తుడు అణపరాని ఆగ్రహవేశంతో సంభ్రమిస్తూ వెంటనే సోమిదమ్మతో ఈ రీతి వాకొన్నాడు.
‘‘ఔనె! మంచి కొడుకుని కన్న తల్లీ! నువ్వు చెప్పింది నిక్కమేనా? ఔనే సాధ్వీ! నిజమా? ఔనె సత్యభాషిణీ! అనృతం కాదా?
ఒక్కనాడైనా వేదం అధ్యయనించడానికి కొడుకు పోకున్నా వేదం చెప్పుకోడానికి వెళ్లాడని చెప్పటం నీకు పోలుతుందా? తెల్లవారు జామున మేల్కాంచి స్నానం ఆడకున్నా తీర్థం ఆడినాడని వచించడం నీకు తగి వుందా?
సమయం మించిపోకుండా సంధ్య వార్వకుండా వున్నా సంధ్యావందనం ముగించాడని వాకొనడం నీకు పాడియేనా? తరి తప్పకుండా అగ్నిహోత్రం వేల్పకున్నా వేలిమి చేసినాడని పలకడం నీ తెలివియా? ఇన్ని కల్లలాడావు. నీకు ఫలమేమి కలిగింది? నేను కన్నకొడుకుని జాగరూకతతో చూసుకోక భ్రష్టుడిని చేసుకొన్నాను. చెట్టంత కొడుకు చెడి చెటాకులయాడు. ఇంక చెప్పవలసింది ఏముంది?
ఇంటిలో దాచిపెట్టిన మంజిష్ఠ ఎక్కడికిపోయిందో కదా! పెద్ద పండుగనాడైనా ధరించలేకపోయేవాడిని. దోసపండు ఆకారంలో వున్న బంగారు పాత్ర కోమటి యింట తాకట్టుపడకుండా వుందా? మణులతో క్రుచ్చబడ్డ దారాలతోడి పసిడి వడ్డాణం ఏ వారాంగన కటిని ఎక్కి కూర్చున్నదో కదా! చంద్రకాంత మణి ఖచితం అన దీపకంబం ఆకారం కల రత్నసాలభంజిక ఎక్కడికి సాగిపోయిందో కదా! రత్నం పొదిగిన హంసతూలికా తల్పం ఎవరింట వున్నదో కదా? ఓసి నిర్భాగ్యురాలా! నువ్వూ నీ ఏకైక పుత్రుడూ కలిసి ఇంటిని ఊచమెట్టుగా పాడు పరిచి విడిచావు కదే!
నా వంశానికి విషం అయిన కొడుకు చచ్చిపోయాడు. ఇంక చాలు. నువ్వులు, దర్భలు, జలమున్ను తీసుకొనిరా! వాడికి శాస్తవ్రిధిని తర్పణాలు విడుస్తాను.
కుపుత్రుణ్ణి కలిగి వుండటం కంటే అపుత్రకుడు అయి వుండడం మేలు. కులపాంసనుడైన ఈ గుణనిధిని ఒక్కడినీ విడిచిపెట్టి కులాన్ని రక్షించుకోవడం నీతి కదా! అని పలికి క్రోధావేశంతో పెదవులు అదిరిపడుతూ వుండగా చెక్కిళ్లు చిట్లిపడుతూ వుండగా, బొమ ముడి నొసట ముడిపడుతూ వుండగా, కడ కన్నులు జేవురించుతూ వుండగా కోపపడుతూ అగ్నికార్యం తీర్చి తన పంతము పట్టుదల నెరవేర కొన్నినాళ్లు గడచిపోయిన వెనుక ఒక సదాచార శ్రోత్రియుడి కుమార్తెను వివాహమాడి ఆ యజ్ఞదత్తుడు గృహస్థ ధర్మాన్ని నిర్వర్తించుకొనసాగాడు. అంతకుముందే గుణనిధి జనకుడి ఆగ్రహాన్ని గురించి తెలిసికొని ఇంటికి పోవ మనస్కరించక మర్కెడికైనా ఏగుట మంచిదని నిశ్చయించుకొని ఆత్మగతంగా ఈ గతిని వితర్కించుకోసాగాడు.
‘‘ఏమి చేస్తాను? ఎక్కడికి వెడతాను? చేతిలో సొమ్ము నిప్పచ్చరం. విద్యయూ హుళక్కి. ఒకరికింత పెట్ట నేర్చిన నా చేయి బిచ్చం ఎత్తడం ఏ విధంగా నేరుస్తుంది? ఇకమీద ఏమి జరుగనుందో దైవానికో ఎరుక! ఏ చోటనయినా ఏ విధమయిన భయానికీ అగ్గంకాని విద్యాధనమే నరుడికి నిక్కమైన విత్తం.

-ఇంకా ఉంది

శ్రీపాద కృష్ణమూర్తి