భక్తి కథలు

కాశీ ఖండం.. 68

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాశీపుణ్యక్షేత్రంలో వున్న కుబేరేశ్వర లింగాన్ని సందర్శించిన మానవ శేఖరుడు ధనవంతుడు మేథాశాలి, విద్యావంతుడు అవుతాడు. సత్సాంతానం కలవాడు అవుతాడు. సోదర సౌభాగ్యం కలిగి వుంటాడు. ఉత్తమ కాంతావంతుడు అవుతాడు. సమానులలో ఉత్తమ శ్లోకుడని వాసి గాంచినవాడు అవుతాడు.
శ్రీవిశే్వశ్వర శ్రీమన్మహాదేవర కుడిప్రక్క కుబేరేశ్వర స్థానం వున్నది. ఆ స్థానంలో నెలకొన్న కుబేరేశ్వరుడిని అర్చించి పుణ్యులకు అణిమ గరిమ, మహిమ ఇత్యాది అష్టసిద్ధులు సిద్ధిస్తాయి అని ఆ యాజ్ఞదత్తి అభీప్సితార్థం ప్రసాదించి మహాదేవుడు దేవీ సహితుడై విశే్వశ్వర లింగం లోపల ప్రవేశించాడు. ఈ రీతిగా కపర్దితో నెయ్యం పడసి ఆ కుబేరుడు ఇంద్ర బ్రహ్మ విష్ణు ప్రముఖ దేవతా కిరీట తటవలయిత మందార మాలలోని మకరందధారలచేత కడుగుబడ్డ చరణాలు కలవాడున్ను, మందర గిరి పేరి కవ్వం చేత త్రచ్చబడిన పాలమున్నీటి నట్టనడుమ నుంచి వెల్వడిన కాల కూట విషాన్ని చుళికించడంవల్ల నల్లవారిన కంఠమూలంవల్లనే అప్రకటితం అయిన లోక రక్షణ కళారంభుడున్ను, పార్వతీ పనస్తనయుగమధ్య భాగ లిఖిత మకరికా పత్ర ముద్రత వక్షస్స్థలుడున్ను, పశ్యల్లలాటుడున్ను (చూసే నొసట కలవాడు) చంద్రకళా మల్లికాముకుళానతంసుడున్ను ధరణీ పాంశుజాలంతో పారాడు వయస్సు నాడు పరిచితమైన బాల్య స్నేహానుబంధంతో సేవిస్తూ వుండు. ఇది కుబేర లోక స్వరూపం. ఈ ఆఖ్యానం కలికాల జనిత సకల దురితహారం. ఇటుపయిన ఈశాన లోక స్వరూపం వివరిస్తాను. ఆకర్ణించవలసింది.
ఈశాన లోక వృత్తాంతము
మహీదివిజోత్తమా! శివశర్మా! అలకాపురికి ఆవల మహోదయం అనే పురం వుంది. ఆ పురం ఈశానదేవుడి రాజధాని. ఆ మహోదయ పట్టణంలో అజైకపాదుడు మొదలుగా వున్న ఏకాదశ రుద్రులు ప్రమథులు వుంటారు. వీరందరున్ను నొసలి కన్నులవారు. చంద్రకళావతంతసులు. డమరుకం, ఖట్వాంగం (మంచంకోడుని పోలిన ఆయుధం) డాళ్లు తాల్చిన వాళ్లే అందరున్నూ. అందరూ గజ చర్మాంబరధారులే. అందరికిన్ని నీలగ్రీవాలే. అందరూ వృషభవాహనులే. అందరున్ను నాగాభరణులే. అందరున్ను తెల్లని ఒడలివాళ్లే. అందరున్ను అగ్నితప్తమైన ఇత్తడివలె పాటల జటాజూటాలే. విప్రోత్తమా! ఈశాన దిశలో ఏకాదశ రుద్రుల్ని, పారిషదులైన ప్రమథుల్ని తేరిపారి జూడు. వీరు అందరూ ఆనందకాననంలో ఈశాన దేవుడి పవిత్ర లింగం ప్రతిష్ఠించి ఆరాధించారు. ఆ దేవుడి మహాప్రసాదంవల్ల ఈశాన దిశలో శాశ్వత సుఖాన్ని, అణిమాది అష్టసిద్ధుల్ని పడసి వున్నవాళ్లు.
కాశీక్షేత్రంలో ఈశానలింగ స్వరూపుడైన శంకరుణ్ణి పూజించి మానవులు మనోరథ సిద్ధిని పొందుతాడు. ఈ కాశీ నగరం అష్టదిక్పాలకులకి, మనోవాంఛా దీప్తిరూప సంకల్పాలకి కల్పతరువు! అని తెలుప- అనంతరం కొంత దవ్వు అరిగి శివశర్మ ఆ విష్ణ్భుటులతో ఈ కరణి పలికాడు.
‘‘సకలేంద్రియాలకి చొక్కుపొడులు- సమ్మోహనం కల్గించేవి. శృంగార రసాన్ని ఉజ్జీవింపచేసేవి. మన్మథ బాహుజయ సంపాదితాలైన కీర్తి సంపదలు. చక్రవాక దంపతులకి ఊక నిప్పు సెగలు. బ్రహ్మాండపుర వీధిని వ్రేలాడకట్టిన రత్న తోరణాలు. యామినీవశితా కర్పూర హారవల్లికలు. ఆకాశ పద్మసరసీ నళినీ బిసాంకురాలు, తెలి తొవ తోటలకి కూరు నిచ్చెలులూ అయిన నిండు వెనె్నలలు సాంద్రంగా గరళగ్రీవుడి అట్టహాస గర్వరేఖతో విష్ణుమూర్తి నాభి పద్మ నవశోభతో కాస్తున్నాయి.

-ఇంకా ఉంది

శ్రీపాద కృష్ణమూర్తి