భక్తి కథలు

కాశీ ఖండం.. 79

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంత అక్కడ శనైశ్చరుడు కాశీ నగరానికి వెడలి, లింగ ప్రతిష్ఠ కావించాడు. ఆ శనైశ్చరేశ్వరుడు విశే్వశ్వర దేవుడికి దక్షణం వైపున శుక్రేశ్వరుడికి ఉత్తరంగా ప్రతిష్ఠితుడయి సేవించు భక్తులకి భోగం మోక్షం ప్రసాదిస్తాడు. శనైశ్చరుడికి ఈ లోకం శనైశ్చరేశ్వర లింగం ప్రసాదం. ఇది శనైశ్చర లోక వృత్తాంతము.
సప్తర్షి లోక వృత్తాంతం
అగ్ని సమానమైన తేజం కలవాడా! సకల విద్యా విశారదా! మహీసుర వర్యా! ఇదె పరికించు సప్తర్షి లోకం, సమసె్తైశ్వర్యాలు కలిగిస్తుంది.
మరీచి, అత్రి, పులస్త్యుడు, పులహుడు, క్రతువు, అంగిరసుడు, వసిష్ఠుడు- వీరు ఏడుగురున్ను బ్రహ్మ మానసపుత్రులు. మరీచి ధర్మపత్ని సంభూతి. అత్రి మహాముని సతి మహాతివ్రత అనసూయ. పులస్త్యుడి సతి క్షమ.
పులహుడి గృహిణి ప్రీతి. క్రతువు భార్య సన్నతి, అంగిరసుడి దేవేరి స్మృతి. ఊర్జ వసిష్ఠ మహర్షి భార్య. ఈ పత్నులందు ఆ మునులు నానారూప ప్రజల్ని సృజించారు. బ్రహ్మదేవుడి ఆదేశంవల్ల కాశీ క్షేత్రంలో తపస్సులు కావించి, మరీచి, అత్రి- ఆది శివలింగాలని ప్రతిష్ఠించారు. సంభూతి, అనసూయాది సాధ్వులునున్న తమ పేర లింగ ప్రతిష్ఠలు ఒనర్చారు. ఆ శివలింగ ప్రసాదం చేత లబ్ధమైన ఆ సపర్తర్షిలోకంలో సప్త మహామునులు పరమ సుఖం అనుభవిస్తున్నారు. ఇది సప్తర్షి లోక వృత్తాంతం. ఈ లోకానికి ఊర్ధ్వభాగంలో ధ్రువపదం వుంది.

ధ్రువపద వర్ణనము
ముజ్జగాకారమైన మంటపానికి స్తంభ పరిపూర్ణత్వం ఆకాశలక్ష్మికి స్వర్ణకంఠాభరణము. బ్రహ్మాండం అనే మొగలి చెట్టుకి పూసిన పువ్వు. మందాకినీ తరంగిణికి క్రౌంచపక్షి. బలి చక్రవర్తిని శిక్షించిన త్రివిక్రముడి చరణాంగుష్ఠ నఖం. నక్షత్ర సమూహాన్ని తూచే త్రాసు కోల. బ్రహ్మలోక ద్వారానికి అమర్చిన దంతపు తలుపు. గ్రహబృంద అనే ఆవుల మందకి విశ్రామ వేదిక. తారకాపూర్ణమైన మకరాకారాన్ని తాల్చి శయనించిన ఆదినారాయణుడి పుచ్ఛ యొక్క చివరి భాగాన్ని పలు కల్ప పరంపరలు జరిగిపోతున్నా నిరపాయ స్థితి కల ధ్రువపదాన్ని శివశర్మా! అచంచల దృష్టితో పరికించు. ఈ ధ్రువుడి లోక వృత్తాంతాన్ని ఆకర్ణించు.
‘‘ఓ బ్రహ్మవంశభూషణా! స్వాయంభువ మనువు అనే రాజుకి ఉత్తానపాదుడు జన్మించాడు. ఆ ఉత్తాన పాదుడికి జలజ నయనలు ఇర్వురు గృహిణులు. ఒక సతి సురిచి. రెండవ పత్ని సునీతి. సురుచికి ఉత్తముడు అనే నందనుడు ఉదయించాడు.
సునీతికి ధ్రువుడు పుట్టాడు. వారి తండ్రి ఉత్తానపాదుడు ధ్రువుణ్ణి కంటె ఉత్తముణ్ణి మన్నిస్తూ వుండేవాడు. ఈ విధంగా రోజులు గడుస్తూ వుండగా ఒకనాడు పేరోలగమున్న తరిని సురిచి కొడుకు ఉత్తముడు తండ్రి తొడ మీద కూర్చున్నాడు. సురిచి కుమారుడు ధ్రువుడున్ను సభకి ఏతెంచి, ఉత్తముడు కూర్చున్న తొడపైనే ఎక్కబోగా సురుచి వారించింది. అది ఉత్తానపాద రాజు చూస్తూ మిన్నకున్నాడు.
అప్పుడు ధ్రువుడు మరలి అంతఃపురానికి అరిగి జరిగిన వృత్తాంతం అంతా తన తల్లికి ఎరిగించాడు. కాని పిన్న వయసువాడైనా ఉత్తమ క్షత్రియుడికి సహజం అయిన తేజో విశేషంవల్ల ఆ పరాభవాన్ని సైపలేకపోయాడు. తల్లి అనుమతి కైకొని తపస్సు సల్పడం కోసం తపోవనానికి బయలుదేరాడు. మార్గమధ్యంలో యాదృచ్ఛికంగా సప్త మహర్షుల్ని కని సముచిత రీతిని తన పరిభవం వారికి ఎరిగించాడు. ఆ మహర్షులు ధ్రువుడికి ద్వాదశాక్షర మంత్రం ఉపదేశించారు.

-ఇంకా ఉంది

-శ్రీపాద కృష్ణమూర్తి