భక్తి కథలు

కాశీ ఖండం.. 94

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాపాలను భక్షించడంవల్ల పాప భక్షకుడున్ను, కలుష మర్థనుడై ఆమర్దకుడున్ను, కాలాన్ని శాసించడంవల్ల కాలనాథుడున్ను, పాపాలకు భయంకరుడు కనుక భైరవుండున్ను అయి ఆ దేవుడు తన్ను భజించే నరులకు ఆరు మాసాల వ్యవధిలో సిద్ధిని కలిగిస్తాడు.
కుంభసంభవా! పాప హృదయులకి భీకరుడైన భైరవస్వామి ఆ కాశీ క్షేత్రానికి పెద్ద తలారి. కాశీ అయిదు క్రోసుల మేరనీ శ్రద్ద్ధానుడై అతడు చేటు రాకుండా కావలి కాస్తూ వుంటాడు
షణ్ముఖుడు చెప్పినది విని అగస్తి వౌని ‘‘శరవణ భవా! హరికేశుడు అనే పేరున్ను యక్షుడు ఒకడు మహాదేవుడికి ప్రేమప్రదం అయిన వారణాసీ నగరంలో ప్రమథ గణానికి దండనాయకుడయి వుంటాడని విని వున్నాను. అతడి చరిత్ర వినగోరుతున్నాను. చెప్పవలసింది అని వేడగా శరజన్ముడు ఆ అగస్త్య మహాముని చంద్రుడితో ఈ గతి చెప్పసాగాడు.
హరి కేశ చరిత్ర
గంధమాదన పర్వతంమీద రత్న భద్ర నామధేయుడైన యక్షుడు ఒకడు వున్నాడు. గొప్ప కీర్తిని ఆర్జించిన పూర్ణ్భద్రుడు అతడి తనయుడు. అతని పత్ని మదగజయాన కనకమండన. ఆ కనకమండన సుతుడు హరికేశుడు.
ఆ హరికేశుడు ఆనందకానన క్షేత్రంలో కాశిలో తపస్సు సల్పసాగాడు. తపస్సు సల్పుతూ వుండగా అతడి శరీరాన్ని ముంచివేసి పుట్టమొలింది. పొదరిండ్లు పెరిగిపోయాయి. అభవుడు ఉమతో కూడి విహారార్థం విచ్చేసి దయపుట్టి దండనాథుడి పదవిని వరంగా ఇచ్చాడు. ఆ హరికేశుడు కాశీ వలయానికి రక్షకుడై అధికారం చెల్లుబడి కాగా అక్కడ వాసం వుంటాడు.
దండనాయకుడైన ఆ హరికేశుడు తన హస్తంతో వెండి కట్టులు కూర్చిన దండాన్ని ధరిస్తాడు. అతడు వారాణాసీపురం ప్రాకార గోపుర పరిసర ప్రదేశంలో నివసిస్తాడు. అతడు కాల్చిన ఇత్తడి వంటి వనె్నకల ఎర్రని జడలు ధరిస్తాడు. అతడు నిరంతరం రుద్రాక్షమాలలు, విభూతి త్రిపుండ్ర రేఖలు అలంకరించుకొని వుంటాడు. సజ్జనులకి సామ్యరూపంతో కనవస్తాడు. పాపాత్ములకి భీకర స్వరూపాన్ని ధరిస్తాడు. పచ్చని కన్నులు కలవాడు. మెడ బెణకేటంత ఎత్తుగా తలయెత్తి చూడవలసిన సుదీర్ఘ విగ్రహుడు. పరమ శివుడికి ప్రీతిపాత్రుడైన ప్రమథుడు ఆ దండపాణి!
అని దండపాణి అయిన హరికేశుడి చరిత్రని దేవసేనాని వినిపించగా అగస్త్య రుషీశ్వరుడు సంతసించాడు. పిమ్మట జ్ఞాన వాపికా తీర్థ మహాత్మ్యం విన కోరిక పుట్టింది. తెలుపవా? అని అడుగ కుమారస్వామి నుడువసాగాడు.
జ్ఞానవాపికా తీర్థ మహాత్మ్యము
ఒక్కొక్క పాదాఘాతంతో అతల వితల కుతలాదులైన సప్తపాతాళ లోకాలతో కూడ భూమికటాహం ఉర్రూతలూగిపోయే విధంగాను, నిక్కపొడుచుకొన్న జటాసమూహాలు చెదరిపడుతూ బ్రహ్మాండం పైభాగాన్ని చెంపపెట్టు పెట్టేరీతిగాను, గడియల్ని పోలిన భుజస్తంభముల భ్రమణంవల్ల దిక్చక్ర మండలం తెగి నేల కూలు క్రియను, పెన్నిట్టూర్పుల వాయు ఘట్టన చేత పర్వతాలు పెల్లగిలిపడే భంగిని, డమరుకడాన్నినాదాల చేత చతుస్సముద్రాలు సంక్షోభం చెందే కరణిని, ప్రళయకాలంలో మహాకాల భైరవుడు కాళరాత్రి అనే శక్తి దేవత వక్షం గగుర్పాటు పొందే వడువున ఆరభటీ వృత్తితో తాండవ నాట్యం చేశాడు.
శివుడు పైన వర్ణించిన రీతిగా తాండవం ఆడి ఆడి డస్సిపోయాడు. దప్పిక కలిగింది. క్రోలడానికి జలము కోసం వెదకివెదకి వేసారసాగారు.

-ఇంకా ఉంది