భక్తి కథలు

హరివంశం - 64

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అపుడు ఇంద్రుడు సర్వలోకేశుడి అనుగ్రహం సంపాదించుకోవటానికి ఆయననిట్లా స్తుతించాడు.
సకల వేదాలు, సమస్త యజ్ఞాలు నీవే అని తెలిసీ, యోగీశ్వరేశ్వరుడవని తెలిసీ, ప్రణవ స్వరూపుడివనీ, పరమాత్మవనీ, ఆత్మజ్ఞాన ఫలప్రదుడవనీ తెలిసి కూడా నీ మాయ తెలియలేక గోపాలుడవని భ్రమ చెందాను. విశ్వజన్మ స్థితి విలయములకు నీవే కర్తవు. ఆశ్రీత మిత్రుడవు. పద్మనేత్రుడవు నీవు.
నీవు గోపాలుడివి కదా అని అహంకారంతో విర్రవీగాను. అందువల్ల నిన్ను బాధించాను. నీ గోవులను సంక్షోభింపజేశాను. విలయకాల జలధరాలను నీ మీదికి తోలాను. అందువల్ల నీవు రోషించటం న్యాయమే. నీవే అఖిల నియామకుడివి. నిన్ను కట్టడి చేసేవారెవరైనా ఉంటారా? నాకీ పదవిని అనుగ్రహించినవాడిని నీవే కదా! నన్ను ఎన్నో ప్రమాదాల నుంచి కాచి ప్రోచి రక్షించినవాడివి నీవే కదా!
ఎందుకో ఒకందుకు నావల్ల ఈ తప్పు జరిగింది. దాసుడి తప్పు ప్రభువు సైరించకపోతే మరి ఎవరు క్షమిస్తారు? కందుక కేళిలాగా నీవు కొండనెత్తటంవల్ల నీ వైష్ణవ తేజం లోకానికి వెల్లడి అయింది. సృష్టికర్త కూడా నిన్ను నుతించటానికి సమర్థుడు కాడు. మరి నేనెట్లా వినుతించగలను నిన్ను. నదులన్నింటికీ సముద్రమే గమ్యం.
పర్వతాల కన్నిటికి మేటి హిమాలయం. విహగ కులానికంతటికీ అధీశ్వరుడు సుపర్ణుడు. దేవతలందరకూ ప్రభువువు నీవు. జలములపై భూమి, భూమిమీద మానవులు, ఆపైన మేఘ మండలం, ఆపైన ఆదిత్యుడు, ఆపైన దేవలోకమనే స్వర్గం, ఈ స్వర్గానికి పాలకుడిగా నీవు నన్ను నియమించావు. నాకలోకంపైన బ్రహ్మలోకం. ఆపైన గోలోకం. ఆ లోకంలో విహరించేవి గోవులు. అటువంటి గోవులను గోవర్థనగిరి ఎత్తి నీవు కాపాడావు. ఆ గోవులు నీ ఆత్మస్వరూపాలు. వాటిని నీవు కాని మరెవరు పోషించగలరు? సంరక్షించగలరు? వాటికోసం నీవు గోవర్థనగిరిని ఎత్తావు. గోలోకంలో ఉన్న గోవులు చతుర్ముఖుడి ద్వారా నన్ను నీ సమక్షానికి పంపించాయి. వాటి సంతోషాన్ని, నీ మహిమను కొనియాడవలసిందిగా ఆదేశించాయి. ఈ పనుపుతోపాటు నీ పట్ల నేను చేసిన అపరాధాన్ని కూడా పోగొట్టుకోవటానికి నిన్ను ఆశ్రయించటానికి వచ్చానిప్పుడు.
అదితి కశ్యపులు మన తల్లిదండ్రులు. నేను నీ సోదరుడిని. అందుకని నిన్ను ఉపేంద్రుడని కీర్తిస్తారు దేవతలు. గోవులు తమ మాటగా నీకు ఇట్లా విన్నవించవలసిందిగా కోరాయి.
మా సంతానం లోకాలకు పాడి పంటలు ఇవ్వటంవల్లనే ప్రజలు జీవిస్తున్నారు. భూములను దున్ని పంటలు పండించేది కూడా మేమే. అటువంటి మమ్ములను ఆపదల నుంచి కాపాడావు. కాబట్టి నిన్ను మేముల మా గో సంతతి కంతా అధిదైవంగా, సర్వరక్షకుడిగా అభిషేకించటానికి ఇంద్రుణ్ణి నీ దగ్గరకు పంపుతున్నాము అని ఆ గోవులు నన్ను అనుశాసించాయి. అభిషేక ద్రవ్యాలన్నీ సిద్ధం చేసుకొని వచ్చాను అని కాంచన కలశాలతో మంత్ర జలాలతో ‘గోపతిత్వానికి’ కృష్ణుణ్ణి అభిషేకించాడు ఇంద్రుడు.
అమరకోటికంతటికీ ఇంద్రుడివే అయిన నీవు గోవులకు ఇప్పుడు ఇంద్రుడివైనావు. గోకులాలన్నింటికీ ప్రభువువు కాబట్టి ఇప్పటి నుంచి నీవు గోవిందుడివైనావు. ఇప్పటినుంచీ ఆషాఢమాసం నుంచి మొదలయ్యే నాలుగు మాసాలలో రెండు మాసాలు నావి. తక్కిన రెండు నెలలు నీవి. ఈ రెండు నెలలు జనులు నిన్ను ఆరాధిస్తారు. ఉపేంద్రుడివని అమరులు అర్చిస్తారు. వర్షాగమ సమయం కావటంతో నీవు సుఖసుప్తుడవవుతావు. కార్తికమాసం రాగానే మళ్లీ మేలుకొంటావు.

ఇంకాఉంది

-అక్కిరాజు రమాపతిరావు