భక్తి కథలు

హరివంశం- 76

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రకృతి అంతా రాగరంజితమైంది. కృష్ణుడు గోవులను తోలుకొని పల్లె చేరాడు. ఇక నేను కూడా అస్త్రాది చేరుతాను అని ఉల్లసించాడు సూర్యుడు. ఆకాశమంతా ఎర్రబడింది కేశి మహాసురుడి మృత శరీరంలా. తమ కులం పెద్దను భీకరంగా వధించాడనే క్రోధంతో నిశాచర గణం పరిగెత్తివచ్చినట్లు నాలుగు దెసలా చీకట్లు ఆవరించాయి.
ఆదిత్యుడు పరాద్రి చేరిన తర్వాత చీకటి వ్రేపల్లెను ఎక్కడ చీకాకు పరుస్తుందో అన్నట్లుగా ఇంతలో పూర్ణచంద్రుడు తూర్పున ఉదయించాడు. ఆకాశంలో తళతళలాడే చుక్కలలాగా భూమిపై సరోవరాలలో తెల్ల కలువలు సమృద్ధిగా వికసించాయి చంద్రుడికి స్వాగతం పలుకుతున్నట్లు.
సాయంకాలం చంద్రోదయం, పాలు కుడవటానికి విడిచిన దూడలు, వాటి ప్రేమోత్సాహ పరశవ సూచకమైన అరుపులు, తల్లి ధేనువుల అంబారవాలు, దూడల ప్రతిస్పందనలు, గోపాలురు గోవులను, గోవత్సాలను పేరులు పిలుస్తు ముద్దుసేయటం, ఎక్కడ చూసినా పాలు పితుకుతున్న చప్పుళ్ళు, క్షీరధారలు జుంజురులు, తల్లి దగ్గర పాలు తాగిన దూడల చెంగనాలు, నందగోపుడి ఆలమందలలో ఎక్కడ చూసినా సందడి అందగించింది.
అపుడు అక్రూరుడు వ్రేపల్లెలో ప్రవేశించాడు. కొంత దూరంలోనే రథం దిగాడు. ఆయన పదడుగులు వేశాడో లేదో ఆయనకు కృష్ణుడు, బలరాముడు ఆ వెనె్నలలో పరమ మోహన మూర్తులుగా కనపడ్డారు. అక్రూరుడికి మధుర భక్తితో ఒళ్ళు పులకరించింది. కంటి వెంట ఆనంద బాష్పాలు ఉప్పతిల్లాయి. పరశించాడు. ఈయన శ్రీమన్నారాయణుడు, ఈ బలరాముడు అనంతుడు, దేవకార్యార్థం ఇలలో అవతరించారు. ఈయనను దర్శించటంతో నా పుట్టువు సఫలమైంది. ఇది నా జన్మ జన్మల సుకృతం. ఇపుడీ కృష్ణుడు నవ వ్వన జగన్మోహనాకారడు. ఈయన పసితనం, ఈయన బాల్యం, ఈయన కౌమారం దర్శించిన ఈ వ్రేపల్లె వాసులు ఎంత ధన్యాత్ములో కదా! ఈయన ఈ పల్లెవాసుల కళ్ళ ముందు పెరిగాడు, పెద్దవాడైనాడు.
ఇపుడు నేనేం చేయాలి? కృష్ణయ్యా! నల్లనయ్య! నా పాలి దైవమా! అని గాఢంగా కౌగిలించుకోవాలా? లేక సాష్టాంగ ప్రణామం చేసి స్వాత్మార్పణం చేసుకోవాలా? నాకు తోచటంలేదు. నా మనసు మనసులో లేదు. ఈయన గోపికా నయన చకోర చంద్రుడు. శ్రీవత్సవక్షుడు. పరమ సుందర భుజుడు. త్రైలోక్య శరణ్యుడు, దేవతలు ఈయన చరణ ద్వంద్వానికి తమ తలలు మోపి నమస్కరిస్తారు. శ్రీకృష్ణుడు దురాత్ముడైన కంసుణ్ణి వధించి ఉగ్రసేనుడికి పట్టం కడతాడు. లోకంలోని రాజులందరూ కృష్ణుడికి వశులై ఉంటారు. యాదవ వంశానికి వృధివిలో గొప్ప కీర్తి లభిస్తుంది. ఈ విషయాలన్నీ పెద్దలు చెప్పగా నేను విన్నాను అని అక్రూరుడు ప్రమోద మానసుడై తన కుల గోత్ర నామాలు చెప్పుకుంటూ శ్రీకృష్ణుడికి ప్రణమిల్లాడు.
కృష్ణుడాయనను లేవనెత్తి గాఢంగా కౌగిలించుకున్నాడు. తన ఇంటికి తీసుకొని వెళ్లి అక్రూరుడి పధిశ్రమ నివారకమైన సపర్యలు చేశాడు. తన అభ్యంతర మందిరంలోకి తీసుకొనిపోయి అక్రూరుణ్ణి ఆదరించాడు. ఇక ఆలస్యమెందుకని అక్రూరుడు, నందగోపుణ్ణి, ముఖ్యులైన ఇతర పెద్దలను పిలిపించాడు.
కంసుడు ధనుఃపూజామహోత్సవం తలపెట్టాడనీ, దానినొక యజ్ఞంలాగా నిర్వహింపజేస్తున్నాడనీ, ఆ సందర్భంగా మిమ్ముల్ని సాదరంగా ఆహ్వానిస్తున్నట్లు తనను చెప్పమన్నాడనీ, ఈ యాగంలో గొప్ప సంతర్పణం, ఆమెత(విందుభోజనం)గా బంధు మిత్రులనుసమస్త మధురాపర జనులను తనియింపజేస్తాడనీ, కాబట్టి ఆలస్యం లేకుండా వెంటనే బయలుదేరవలసిందిగా చెప్పాడు అక్రూరుడు.

- ఇంకా ఉంది

-అక్కిరాజు రమాపతిరావు