డైలీ సీరియల్

యమహాపురి -27

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వసంత ఇబ్బందిగా గుమ్మంకేసే చూస్తోంది- పిల్లలొస్తారేమోనని. అతణ్ణి విదిలించబోయేందుకు ప్రయత్నం చేస్తూ ‘‘ఈ పోలీసోణ్ణి అదుపు చేసే శక్తి నాకు లేదు. దేవుడా- నువ్వే ఏదో చెయ్యి’’ అంది పతిదేవుడు వినేలా.
‘‘శాస్త్రం చెబుతోంది. నేనే దేవుణ్ణని. నాకు చెప్పావుగా- నేను చెయ్యదల్చుకున్నది చేస్తానులే’’ అంటూ అతడామె పెదవులపై తన పెదవులానించబోయాడు.
సరిగ్గా అప్పుడే కాలింగ్ బెల్ మ్రోగింది.
***
భయంకర్‌గా పేరు పడ్డ శ్రీకర్ ఎలా వుంటాడోనని గుమ్మం వైపే కుతూహలంగా చూస్తున్నాడు యోగి.
ఉన్నట్లుండి తలుపులు తెరచుకున్నాయి. అందమైన యువకుడు కనిపించాడు.
‘‘నా పేరు యోగి. ఇన్స్‌పెక్టర్ శ్రీకర్‌గారిని కలుసుకుందుకు వచ్చాను...’’ అన్నాడు యోగి.
‘‘చాలా సంతోషం. నేనే శ్రీకర్. అతడి ముఖంలో సంతోషం ఏమాత్రం లేదు.
యోగి అతణ్ణి పరిశీలనగా చూశాడు, ‘‘ఇంత బాగున్నాడు. ఇతగాడికి భయంకర్ అన్న పేరు ఏ మాత్రం నప్పదు. సినిమా హీరోలా ఉన్నాడు’’ అనుకున్నాడు.
‘‘పేరు చెప్పారు. సంతోషం. మీకు నాతో ఏం పనో తెలుసుకోచ్చా?’’ అన్నాడు శ్రీకర్.
‘‘నేను మీ అభిమానిని సార్’’ అన్నాడు యోగి చప్పున.
శ్రీకర్ అదోలా చూసి ‘‘సారీ! అభిమానుల్ని ఇంటి వద్ద కలుసుకునే అలవాటు నాకు లేదు’’ అన్నాడు.
‘‘ఇంటి దగ్గిర కాకుండా మిమ్మలెక్కడ కలుసుకునేది సార్! స్టేషన్లో కలుద్దామంటే- మీరేమో సిన్సియర్ ఆఫీసర్. ఆఫీసులో ఆఫీసు పని తప్ప మరో పనికి అటెండ్ కారు. పోనీ ఆఫీసు పనిమీదే కలుద్దామంటే- నా దగ్గిర ఫిర్యాదులేం లేవు’’ అన్నాడు యోగి.
‘‘ఇంటికొచ్చి నన్ను కలుసుకుని ఏం చేద్దామని? నా బయోడేటా కావాలా? నాతో కలిసి ఓ ఫొటో దిగాలా? నేనో ఆటోగ్రాఫ్ ఇవ్వాలా?’’ అన్నాడు శ్రీకర్- తొందరగా అతణ్ణి వదుల్చుకోవాలని.
‘‘ఇంటికెళ్లి పలకరించి, బయోడేటాలూ, ఫొటోలూ, ఆటోగ్రాఫులూ తీసుకునే టైపు కాదు సార్- నా అభిమానం!
మీకు కొన్ని విషయాలు చెప్పాలని వచ్చాను’’ అన్నాడు యోగి.
‘‘ప్రస్తుతం బిజీగా ఉన్నాను. ఇంకోసారి రాగలరా?’’ అన్నాడు శ్రీకర్ చప్పున.
‘‘నేను మాట్లాడేవి మీ ప్రొఫెషన్‌కి సంబంధించినవి సార్!’’ అన్నాడు యోగి అభ్యర్థనగా.
‘‘ఐతే- ఇంకేం? మనం స్టేషన్లోనే మాట్లాడుకోవచ్చు. రేపు ఉదయం సరిగ్గా పది గంటలకి...’’
‘‘సార్! నేను వెతుక్కుంటూ మీ ఇంటికొచ్చినందుకు నాకు పదంటే పది నిముషాలివ్వండి సార్!’’
శ్రీకర్ ముఖంలో కొద్దిగా చిరాకు. ‘‘ప్రస్తుతం నేనున్న పరిస్థితి మీకు చెప్పినా అర్థం కాదు. మీరడిగిన ఆ పది నిముషాలూ రేపు స్టేషన్లో ఇస్తాను. ప్లీజ్’’ అంటూ తలుపు మీద చెయ్యి వేశాడు శ్రీకర్.
‘‘ప్లీజ్ సార్! రేపటికీ, ఇప్పటికీ పెద్ద తేడా ఏముంది- ఒక్క పది నిముషాలు, ఇప్పుడే సార్!’’
శ్రీకర్ నొసలు చిట్లించాడు. ‘‘తేడా రేపటికి, ఇప్పటికీ కాదు- స్టేషనుకీ, ఇంటికీ! అక్కడైతే సాఫ్ట్ వాచీ పెట్టి పది నిముషాలవగానే టైమైపోయిందని చెప్పి పంపేయగలను. ఇంటికొచ్చిన మనిషితో అలా చెయ్యడం సంస్కారం అనిపించుకోదు’’ అన్నాడు కటువుగా.
‘‘మీ సంస్కారం గురించి నాకు తెలుసు సార్! నేను దాన్ని దుర్వినియోగం చేసుకోను’’ అంటూ యోగి తన చొక్కా జేబులోంచీ మొబైల్ బయటకు తీశాడు. దాన్ని శ్రీకర్‌కి చూపించి, ‘‘దీనికి టైమర్ ఉంది సార్! మీతో మాటలు మొదలుపెట్టగానే, టైమర్ ఆన్ చేస్తాను. సరిగ్గా పది నిముషాలకు అది పెద్దగా కూస్తుంది. అప్పుడు వాక్యం కాదు, పదం కాదు, అక్షరం మధ్యలో ఉన్నా సరే ఆపేసి వెళ్లిపోతాను. అఫ్‌కోర్స్- మీరుండమంటే ఉంటానునుకోండి’’ అన్నాడు.
అప్పుడతడి ముఖంలో శ్రీకర్ తనని ఉండమంటాడన్న నమ్మకం కనిపించింది.
ఏమనుకున్నాడో శ్రీకర్ పక్కకు తప్పుకుని, ‘‘లోపలకు రండి’’ అన్నాడు. ఇద్దరూ లోపలకు వెళ్ళారు. అక్కడున్న సోఫాలో ఎదురెదురుగా కూర్చున్నారు. వాళ్లిలా కూర్చోగానే అలా మంచినీళ్ల గ్లాసులతో వచ్చింది వసంత.
‘‘్థంక్స్’’ అంటూ యోగి ఓ గ్లాసందుకుని మంచినీళ్లు త్రాగి- గ్లాసు టీపాయ్‌మీద పెట్టాడు.
‘‘్థంక్స్- నేనే మీకు చెప్పాలి. మంచి సమయంలో వచ్చారు’’ అంది వసంత.
యోగికి అర్థం కాలేదు. ఆమె వంక అయోమయంగా చూశాడు.
శ్రీకర్‌కి అర్థమైంది. ఆమె ఇంకా ఏమంటుందోనని కంగారుగా చూశాడామెని.
‘‘పిల్లల చేత హోంవర్క్ చేయించాలి. అర్జంటు. మావారికి అన్నీ మూడ్స్. కథ చెప్పే మూడొస్తే- హోంవర్క్ పక్కన పెట్టేస్తారు. తర్వాతేడుస్తారు కానీ, పిల్లలకీ అప్పటికదే బాగుంటుంది. అలాంటి సమయంలో మీరొచ్చారు. పిల్లల్ని మావారి కథనుంచి హోంవర్క్ వైపు తిప్పే ఛాన్స్ నాకిచ్చారు’’ అంది వసంత.
శ్రీకర్ తేలికగా నిట్టూర్చాడు.
వసంత అక్కడితో ఆగలేదు. ‘‘హోంవర్క్ పని కనీసం అరగంట పడుతుంది. మీరు పది నిముషాలే అని నియమం పెట్టుకోకండి. ఎంతసేపైనా మాట్లాడొచ్చు’’ అందామె యోగితో.
తనకీ, యోగికీ గుమ్మం దగ్గిర జరిగిన సంభాషణంతా ఆమె విన్నదని శ్రీకర్‌కి అర్థమైంది. ఆమె యోగికి చెప్పిన మాటలు కూడా తనని ఉద్దేశించి అన్నవేననీ గ్రహించాడు. వసంత లోపలకు వెళ్లిపోయింది.
‘‘ఇప్పుడు చెప్పండి- నాతో ఏం మాట్లాడాలో!’’ అన్నాడు శ్రీకర్.
యోగి తన సెల్‌లో టైమర్‌ని పది నిముషాలకి సెట్ చేసి స్టార్ట్ చేసి టీపాయ్‌మీద పెట్టాడు. మొబైల్ సైజు పెద్దది. అంకెలు చాలా పెద్దవిగా కనబడుతున్నాయి.
‘‘నేనిప్పుడు చెప్పబోయేవి మూడు డిఫరెంట్ టాపిక్స్ సార్! మూడింటికీ లింకుంది. ముందుగా లతిక గురించి చెబుతాను. నాకున్న టైం చాలా తక్కువ కాబట్టి వీలైనంత క్లుప్తంగా చెబుతాను’’ అన్నాడు.
‘‘ఊ’’ అన్నాడు శ్రీకర్. అతడి కళ్లలో ఆసక్తి లేదు. గొంతులో కుతూహలం ధ్వనించలేదు.
లతిక అందంగా ఉంటుంది. వయసు ఇరవై. చదువు కాస్త ఆలస్యమైంది. ప్రస్తుతం ఈ ఊళ్ళోనే హాస్టల్లో వుంటూ ఇంటర్ ఫైనలియర్ చదువుతోంది.

ఇంకా ఉంది

వసుంధర