భక్తి కథలు

హరివంశం 148

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాళ్ళపై శ్రీకృష్ణుడు విల్లు ఎక్కుపెట్టగానే వాళ్ళు అమిత భయసంత్రస్తులైనారు. పరుగు పరుగున పోయి ఇంద్రుడికి ఈ వార్త చేరవేశారు. ఇంద్రుడికి ఆయన దివ్యమహిమ, త్రైలోక్య రక్షణ తత్పరత్వం బాగా తెలిసి ఉన్నప్పటికీ, ఆ మహాప్రభువు పారిజాత తరువు పెరికి తీసుకొని పోవటానికి మనసు సమాధానపరచుకొన్నప్పటికీ, ఉండబట్టలేక అది తన ఇల్లాలకు అత్యంత ప్రీతిపాత్రమైనది కాబట్టి వదులుకోలేక తన సేనతో వచ్చి ఆయనను అడ్డగించాడు. ఆయనపై వజ్రాయుధం ప్రయోగించాడు. కాని ఆ వజ్రాయుధం స్తంభించిపోయింది.
అపుడు ఇంద్రుడికి అహంకారం అణిగిపోయింది. దుఃఖోద్వేగం కలిగింది. అపరాధ భావం కలత నొందించింది. ఆయనకప్పుడు సాష్టాంగ ప్రమాణం చేశాడు ఇంద్రుడు. తన తప్పు మన్నించవలసిందిగా వేడుకొని మళ్లీ తన వీడు చేరుకున్నాడు అవనత వదనుడై. నరకాసురుణ్ణి సంహరించి మణి పర్వతం దర్శించి అక్కడి దేవ కనె్నలను శ్రీకృష్ణుడు చేపట్టి సంరక్షించే సమయంలోనే ఇంద్రుడు విశ్వకర్మను తన సమక్షానికి పిలిపించుకొని, యుగయుగాలుగా దేవతలను రక్షిస్తున్న, దేవారాతులను నిర్జిస్తున్న పరాంధముడి పట్టణం స్వర్గ సౌందర్యంతో విరాజిల్లాలి, అమరావతికి దీటి వచ్చేట్లు చేయాలి, సౌందర్య సముపేతం కావాలి.
నా పట్ల అభిమానంతో వెంటనే వెళ్లి ద్వారకా నగరాన్ని సకల సంపత్సమృద్ధంగా, శిల్పాభిరామ అసదృశ రమణీయంగా తీర్చిదిద్దాలి అని అర్థించాడు. అపుడు విశ్వకర్మ వెంటనే వెళ్లి ఆ పనిలో నిమగ్నమైనాడు. ఇంద్రుడి అభ్యర్థనను నెరవేర్చాడు. అపుడు విశ్వకర్మ ద్వారకను లోకంలో ఇటువంటి పట్టణం నభూతో నభవిష్యతి అనేట్లుగా సుందర భవనాలు, అందమైన రధ్యలు, వజ్ర వైఢూర్య మణి కనక ప్రభాభాసమాన వేదికలు, కవాట ద్వారాలు శ్రీకృష్ణ మందిరానికి సమకూర్చాడు. రుక్మిణి మొదలైన అష్టమహిషులకు ప్రతి ఒక్కరికీ దివ్య సుందర భవనాలు నిర్మించాడు. వైజయంతం అనే పర్వతాన్ని మేరు పర్వతమంత సౌందర్యంతో క్రీడా పర్వతంగా ద్వారకా నగరానికి సమకూర్చాడు. క్రీడా సరస్సులు నిర్మించాడు. నందన వనంలోని దివ్య తరువులు తెచ్చి నాటాడు. ద్వారకానగరం చుట్టూ గొప్ప ప్రకారం నిర్మింపజేశాడు. ఆ ప్రాకారం చుట్టూ అగడ్తలు సర్వకాల జల ప్రపూర్ణములు రూపొందించాడు.
ద్వారకా నగరం తూర్పున రైవతకం, దక్షిణం వైపు లతాపేష్టనం, పడమట ఉత్తరం వైపు వేణుమంతం అనే పర్వతాలను నెలకొల్పాడు. వీటి వీటికి సమీపంలో చిత్రకం, భార్గవం, పాంచజన్యం, పుష్పకం అనే ఉద్యాన వనాలు సృష్టించాడు. వీటిలో తామరకొలనులు, కలువల సరస్సులు ఎన్నిటినో రూపొందించాడు. ఈ విధంగా ద్వారవతి, అమరావతినే మించిపోయే సౌందర్య విరాజితంగా చేశాడు.
ఇటువంటి ద్వారకా నగరంలో పారిజాత, సత్యభామ సహితుడై దేవదేవుడు ప్రవేశించాడు. గరుత్మంతుడు తన రమణీయ దివ్య భవనం దగ్గర దింపగా ఆయన పాంచజన్యం పూరించాడు. అపుడు అ దివ్య నాదాన్ని విని యాదవులందరూ సముత్సుకులైనారు. మంగళవాద్యాలతో ఆయనను దర్శించటానికి కూడి వచ్చారు.
ఉగ్రసేన వసుదేవ బలదేవులు బంధు బృంద సహితంగా కృష్ణుణ్ణి చూడటానికి ఆయన దివ్య భవనానికి వచ్చారు. అట్లా వచ్చిన వృద్ధులకు, గురులకు వినయ వినమితోత్తమాంగుడై కృష్ణుడు నమస్కరించాడు. సోదరులను, తనయులను కౌగిలించుకుని ఆదరించాడు. తల్లులకు నమస్కరించాడు. పురోహితులను, ఆచార్య వర్గాన్ని వందన పూర్వక కుశల ప్రశ్నలతో గౌరవించాడు.

ఇంకాఉంది

-అక్కిరాజు రమాపతిరావు