డైలీ సీరియల్

యమహాపురి 65

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాస్త అర్థమయ్యేలా చెప్పండి’’ అన్నాడు యోగి.
ప్రభ కళ్ళు మళ్లీ మరిశాయి. ‘‘ఎక్కడికెడుతున్నావని నేనడిగాను మా అక్కని. ఊరెడుతున్నానంది. ఏ ఊరన్నాను. చెప్పనంది. ఎప్పుడొస్తావన్నాను. చెప్పనంది. ఎవరైనా నీకోసమొస్తే ఏం చెప్పాలన్నాను. తోచింది చెప్పమంది. మొబైల్ కూడా ఇక్కడే వదిలింది. ‘అదేమంటే ననె్నవరూ డిస్టర్బ్ చెయ్యకుండా’ అంది. మీరే చెప్పండి. అక్క నాకైమైనా చెప్పినట్లా, చెప్పనట్లా?’’ అందామె.
యోగి నవ్వి, ‘‘మీరు టూ ఇంటెలిజెంటనుకున్నాను. కానీ నేననుకున్నంత కాదు. ఆమె ప్రయాణం వెనుక ఇంత రహస్యముంటే- మీ తెలివంతా ఉపయోగించి తెలుసుకోలేకపోయారా?’’ అన్నాడు.
ప్రభ ఓ క్షణం ఆగి, ‘‘నాలో కుతూహలం పుట్టిందంటే నేనంత సులభంగా వదలను. కానీ అన్నీ అందరికీ చెప్పకూడదు కదా!’’ అంది.
యోగి మనసులో కుతూహలం పుట్టింది. ఉష ప్రయాణం గురించి ఈమె నిజంగా ఏమైనా తెలుసుకుందా?
‘‘నాకు తెలుసు. మీ అక్క ప్రయాణం గురించి మీకేం తెలియదు. అందుకని ఇలా కప్పదాటు వేస్తున్నారు’’ అంటూ చీకట్లో ఓ రాయి వేశాడు.
‘‘అమ్మో- అర్థమైంది. నా నుంచి ఆ రహస్యం తెలుసుకుందుకు మీరిలా తెలివిగా నన్ను రెచ్చగొడుతున్నారు’’ అంది ప్రభ వెంటనే.
‘‘ఓ మహా రచయిత్రికి ఐడియాలిచ్చే మీరెక్కడ? ఆమెను ఉపన్యాసానికి ఆహ్వానించడానికొచ్చిన నేనెక్కడ? మీ నుంచి మీకిష్టం లేని రహస్యం చెప్పించడం నా వల్ల కాదు. కానీ మిమ్మల్నింతలా నొక్కించడానికి నాకో చిన్న కారణముంది. మీ అక్క ప్రయాణం గురించి మీకేదో తెలిసింది. అది రహస్యం అంటున్నారు. ఆమె ఆడది. ఇంకా పెళ్లి కాలేదు. నా ఆలోచనలు పరిపరివిధాల పోయి తప్పుగా అర్థం చేసుకునే అవకాశముంది. అందుకని?’’ అని ఈసారి నేరుగా అదీ వెలుతురులో- బాణమే వేశాడు.
ప్రభ తడబడింది. ‘‘అబ్బే- రహస్యమంటే అలాంటిదేం కాదు. తనిలా బయల్దేరిందా- ఆ వెంటనే నేనూ బయల్దేరి తనకి తెలియకుండా ఫాలో అయ్యాను. తనని నేను ఫాలో ఔతానన్న అనుమానమే లేదేమో- అక్క ఎక్కడా వెనక్కి తిరిగి చూడను కూడా లేదు. అలా వెళ్లి సందు మొగలో బస్‌స్టాప్ దగ్గిర ఆగింది. కాసేపటికి అక్కడికి ఓ వోల్వో బస్ వచ్చింది. అక్క ఒక్కతే అందులో ఎక్కింది. వెంటనే బస్సు వెళ్లిపోయింది’’ అంది.
‘‘మరా బస్సు నెంబరుగానీ, అదెక్కడికెడుతుందోగానీ మీరు తెలుసుకోలేదా?’’ అన్నాడు యోగి.
‘‘నేను వదుల్తానా- పరుగున బస్‌స్టాపుకి వెళ్లాను. అప్పటికే బస్సు కదిలింది. వెనకాల ఏమీ వ్రాసి లేదు. నంబరు చూసి గుర్తుపెట్టుకున్నాను. బస్సు వెళ్లిపోతుంటే- అక్కడున్నవారిని ఆ బస్సు వివరాలడిగాను. ‘అది సిటీ బస్సూ కాదు, రూట్ బస్సూ కాదు. ఎవరో ఒకామెను ఎక్కించుకుని వెళ్లిపోయిందంతే!’’ అంది అక్కడున్న ఒకామె. ఇంటికొచ్చేశాను. నంబరు కాగితంమీద రాసుకున్నాను’’ అంది ప్రభ.
ఇక అక్కణ్ణించి లభించే అదనపు సమాచారమేమీ లేదనుకున్న యోగి- ‘‘ఆ బస్సు నెంబరు చెప్పగలరా? ఆ నెంబరు సాయంతో ఉషగారిని పట్టుకుంటే- ఆ క్రెడిట్ పూర్తిగా మీదే ఔతుంది’’ అన్నాడు.
‘‘బస్సు నెంబరివ్వడానికి - ఇస్తాను. కానీ మీకు అక్క ఆచూకీ తెలిస్తే, నా పేరు చెప్పకూడదు’’ అంది ప్రభ.
యోగి ఆ బస్సు నెంబరు తీసుకుని ఆమెనుంచి సెలవు తీసుకున్నాడు. అతడి మొబైల్ నెంబరు అడగాలని ఆమెకు తట్టినట్లు లేదు..
****
‘‘వెరీ గుడ్ వర్క్!’’ అన్నాడు శ్రీకర్ యోగి భుజం తట్టి.
‘‘నాకు మాత్రం అంతా అయోమయంగా వుంది సార్! స్వామి దీవెన పొందిన ఆ ముగ్గురూ ఒకరికి తెలియకుండా ఒకరు ఒకే రోజున ఒకే విధంగా ప్రయాణం కావడమేమిటో- ఎంత ఆలోచించినా నాకు అంతుపట్టడం లేదు’’ అన్నాడు యోగి.
‘‘అది సరే! ప్రస్తుతం లతిక ఇక్కడే ఉందా?’’ అన్నాడు శ్రీకర్ మాట మార్చుతూ.
‘‘ఇక్కడే ఉంది సార్! ఏం అలా అడిగారు?’’ అన్నాడు యోగి.
‘‘ఒకసారి నరకపురి వెడుతుందేమో అడుగు’’ అన్నాడు శ్రీకర్.
‘‘ఇప్పట్లో తనకి వెళ్లే ఉద్దేశ్యం లేదు సార్! కానీ తనిప్పుడు నరకపురి వెళ్లడం ఎందుకు సార్?’’
‘‘తనతో నన్ను తీసుకెడుతుందేమోనని’’ అన్నాడు శ్రీకర్.
‘‘అమ్మో! తనకి చాలా భయం సార్! ననే్న రావద్దంది’’ అన్నాడు యోగి.
‘‘్భయమెందుకు? ఆ ఊరివాళ్ళు బయటివాళ్ళని తమతో తీసుకెళ్లొచ్చుగా’’ అన్నాడు శ్రీకర్.
‘‘అదంత సులభం కాదుట సార్! ఊళ్లోకెళ్లాలంటే చెక్‌పోస్టు దాటాలి కదా! అక్కడ అప్పన్నని ఒకడున్నాట్ట. వాడు అఖండుడట సార్! వాడో పట్టాన ఎవర్నీ నమ్మడట. వాడొప్పుకుంటేనే బయటి వాళ్ళు ఊళ్ళోకెళ్లేది! ఒకవేళ వాణ్ణెలాగో అలా ఒప్పించి ఊళ్ళోకెళ్లినా- ఆ తర్వాత ఏ మాత్రం తేడా వచ్చినా వెళ్లినవాడి పత్తా ఉండదట. తీసుకెళ్లినవారికేమో నరకం చూపిస్తారుట...’’ అన్నాడు యోగి.
‘‘ఐతే నీ ప్రేమకథ అంతేసంగతులన్నమాట!’’ నిట్టూర్చాడు శ్రీకర్.
‘‘లేదు సార్! నా ప్రేమకి జగదానందస్వామి దీవెన ఉంది’’ నమ్మకంగా అన్నాడు యోగి.
‘‘ఆయన నీ ప్రేమని కాదు. నిన్ను దీవించాడు. లేకుంటే- వేదికమీదకి ఆరుగుర్ని పిలిచినవాడు ఏడో మనిషిగా నీ లతికనీ పిలిచుండేవాడుగా. మీ ఇద్దర్నీ జంటగా దీవించేవాడుగా’’ అన్నాడు శ్రీకర్.
‘‘నన్ను దీవిస్తే లతికనీ దీవించినట్లే సార్! ఆయన దీవెనమీద నాకు అపారమైన నమ్మకం సార్! ఎందుకంటే అది నన్ను మీ దగ్గరికి పంపింది’’ అన్నాడు యోగి.
‘‘ఇలాంటప్పుడు నువ్వాధాపడాల్సింది నాలాంటివాళ్లమీద కాదు. అదృష్టంమీద! నీకు తెలుసుగా- పగలూ రాత్రీ కొట్టుకు చచ్చినా రాని ఆలోచన- ఓ ఆపిల్‌మీద పడగానే వచ్చి - భూమ్యాకర్షణ శక్తిని కనిపెట్టాడు న్యూటన్. బుర్ర బద్దలు కొట్టుకున్నా తట్టని ఈక్వేషన్- కాంతి వేగం స్థిరంగా మారకుండా ఉంటుందని మనసుకి అనిపించటంతో స్ఫురించింది ఐన్‌స్టీనుకి.

ఇంకా ఉంది

వసుంధర